బావయ్య బజ్జీలు - అచ్చంగా తెలుగు

బావయ్య బజ్జీలు

మా బాపట్ల కధలు – 7

భావరాజు పద్మిని


అప్పట్లో మా ఊళ్ళో సాయంత్రం 4 అయ్యిందంటే చాలు, ఊర్లో ఉన్న జనాల్లో ఒకటే ఆత్రం. చిల్లర కొట్లో చిన్నాచితకా జనాలకి అరువు మీద అప్పులిచ్చే కోమటి సుబ్బిశెట్టి ఒళ్ళు యాంత్రికంగా పొట్లాలు కడుతున్నా, కళ్ళు రోడ్డు మీదకే చూసేవి ! ఆ పక్కనే ఉన్న బట్టల కొట్టు సత్యం, ఎదురగా ఉన్న వెంకటేశ్వర స్టీల్ సామాన్ల దుకాణం వాళ్ళందరూ మాటిమాటికీ గడియారం వంక చూసుకుంటున్నారు. ఈసురో మంటూ కూర్చున్న మా బాపట్ల స్పెషల్ బాదంపాలు అమ్మే ‘శివ కూల్ డ్రింక్స్’ లోని కుర్రాళ్ళు, కాసేపాగితే కాళ్ళు పీకేలా నిల్చోవడం తప్ప, కూర్చునే అవకాశం లేకున్నా, బేరాలు పెరుగుతాయని, ఆశగా ఎదురు చూస్తున్నారు. నాలుగు వీధుల కూడలిలో సంపెంగ పూలు అమ్మేందుకు గంపలో వేసుకొచ్చిన రాములయ్యతోబాటే  వచ్చిన పిల్లాడు, ఇప్పటినుంచి అడిగితే నాన్న అప్పటికైనా కొంటాడని, ‘కొను, కొను’ అంటూ ముందునుంచే అతని కాళ్ళు పట్టుకు పీకేస్తున్నాడు. కులమతాల అడ్డుగోడలు బలంగా ఉండే కాలంలో, ఎక్కువ కులం వారు తక్కువ కులం వారింట్లోనుంచి పచ్చి గంగైనా ముట్టని రోజుల్లో, సర్వమత సామరస్యానికి వేదికలా ఉండేది - గడియార స్థంభం కూడలిలో,  శివ కూల్ డ్రింక్స్ కు కాస్త ముందుకు పెట్టే బావయ్య బజ్జీల దుకాణం.
ఒక్కో చేతిలో, ఒక్కో మనిషిలో ఒక్కో రకమైన విద్య పెడతాడట దేవుడు. ఆ విద్య వాళ్ళ తిండికీ, బట్టకీ, జీవికకి పనికొస్తుందని, ఏదీ చేతకాప్పోతే ఈ వెర్రి బిడ్డ ఎలా బ్రతుకుతాడన్న దయతో కాబోలు, దేవుడిలా వరాలిస్తాడు. అలా దేవుడు బావయ్యకు ఇచ్చిన వరమే అమృతహస్తం. మా ఊరి దేవుడు భావన్నారాయణ స్వామిని పిలిచేందుకు నోరుతిరగని పల్లెకారు జనాలు ఆయన్ను ‘బావా, బావదేవుడు, బావదేవర, బావసామి, బావయ్య’ అని మనసారా పిల్చుకోడం అలవాటు. అలా అతనికి పెట్టిన ఊరి దేవుడి పేరే ‘బావయ్య’.
చూస్తుండగానే బావయ్య చెక్కరిక్షా మీద సామాన్లు పెట్టుకుని వచ్చేసాడు. నుదుట ఎర్రటి బొట్టు, మల్లెపువ్వు లాంటి తెల్లటి చొక్కా, నూలుతో వడికిన గళ్ళ లుంగీ, పక్కపాపిడి తీసి, నూనె పట్టించి, తీరుగా ఒక ప్రక్కకు దువ్విన జుట్టు, ఇలా  బావయ్య కట్టు- బొట్టు. అతని మొహంలో ఇదీ అని చెప్పలేని ఒక కళ ఉండేది.  ఒక పెద్ద సత్తు గిన్నె నిండా శనగపిండి, మరో గిన్నెలో మసాలా వడల పిండి,  మరో గిన్నె నిండా పునుకుల కోసం రుబ్బిన మినప్పిండి, అప్పుడే గానుగలో ఆడిన డబ్బాడు పల్లీనూనె (అప్పట్లో సన్ ఫ్లవర్ నూనె లేదు, అంతా నువ్వుల నూనె, పల్లీ నూనె వాడేవారు), చిన్న గ్యాస్ సిలిండర్ వంటి బరువైన వస్తువులను ముందుగా దింపాడు.
టమాటోలతో చేసిన ఒక రకం పచ్చడి, అల్లప్పచ్చడి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయలు, ఉంచిన  చిన్న గంప, ఓ ఇనుప డేగిసా , రెండు పెద్ద చిల్లు గరిటెలు, కత్తిరించిన కాగితం ముక్కలు, విస్తరాకు ముక్కలు ఆ తర్వాత దింపుకుని, ఓ వారగా పెట్టుకున్న బల్ల, ఈగలు వాలకుండా చుట్టూరా పెట్టే అద్దాల తొడుగూ అక్కడ సర్దుకున్నాడు. తనతో వచ్చిన కొడుకు, ఇద్దరు కూతుళ్ళ సాయంతో అన్నీ ఒక తీరుగా సర్దుకున్నాకా, భావన్నారాయణ స్వామి గాలిగోపురం వైపు తిరిగి, దణ్ణం పెట్టుకుని, పొయ్యి వెలిగించాడు. ఇక నలభీమ పాకం కోసం అప్పటిదాకా కాచుక్కూర్చున్న వాళ్ళ నాలుకలు రుచుల కోసం లేచి కూర్చున్నాయి.
ఇంటివద్దే వాము, శనగపిండి పొడి, ఉప్పు, కూరి తెచ్చిన మిరపకాయల్ని శనగపిండిలో ముంచి, నూనెలో వెయ్యటం మొదలు పెట్టగానే, కొలిమి వేడికి కాలిన బంగారపు ముద్ద మిలమిలా మెరిసినట్టు, బంగారం రంగులో బజ్జీలు మెరవసాగాయి. అప్పటికే చుట్టూ గుమిగూడిన జనం మాకంటే మాకంటూ హడావిడి పెట్టసాగారు. అప్పట్లో బజ్జీలకు ప్రత్యేకమైన మిరపకాయలు ఏమీ దొరికేవి కావు. మామూలు మిరపకాయల తోనే వేసేవారు. సరిగ్గా చూపుడు వేలంత ప్రమాణం ఉండే ఆ బజ్జీలు, నోట్లో వేసుకోగానే కరిగిపోయేవి. బావయ్య వేసిచ్చే బజ్జీల మధ్యలో చాకుతో కోసి,  ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి, నిమ్మకాయ పిండి, ఇస్తున్నారు అతని కూతుళ్ళు. పొట్లాలు కట్టి ఇస్తూ, వచ్చిన డబ్బులు అతని చెక్క గల్లా పెట్టెలో వేస్తున్నాడు  అతని కొడుకు. మధ్య మధ్య వాయ వేగుతుంటే, తన పిల్లలకి సహాయ పడసాగాడు బావయ్య. చూస్తుండగానే రెండు మూడు వాయలు వేస్తుండగానే అమ్ముడుపోయాయి.
తర్వాతి వాయ పునుకులు, మసాలా వడలు, పకోడీలు వేసాకా, ఇక మెత్త పకోడీలు వెయ్యటం మొదలుపెట్టాడు బావయ్య. పళ్ళున్న వాళ్ళు నమిలి, గట్టిగా ఉండే పకోడీలు తినగలరు. కాని, పళ్ళు లేని ముసలివాళ్ళు ? వాళ్ళకీ తినాలన్న ఆశ ఉంటుంది కదా ! అందుకు బావయ్య కనిపెట్టిన మార్గమే ఈ మెత్త పకోడీలు. శనగపిండి ఎక్కువ తీసుకుని, దానిలో కర్వేపాకు, తరిగిన ఉల్లిపాయలు, వేసి, ఇవి తయారు చేసేవాడు. నోట్లో నానబెట్టుకుని, చప్పరిస్తూ ఇవి తింటూ మురిసిపోయే వాళ్ళు  మా ఊళ్ళో పెద్దోళ్ళు. వీటికీ మా ఊళ్ళో డిమాండ్ ఎక్కువే. పగలంతా ఇంట్లో పని చేసి, సాయంత్రానికి కావలసిన వస్తువులు సర్ది, సిద్ధం చేసి అలసిపోయిన బావయ్య భార్యకు సాయంకాలం పిల్లలు అటు వెళ్ళాకా కాస్త ఆటవిడుపు. అయినా, అప్పుడప్పుడూ ఆమె కూడా పిల్లలతో అక్కడికి వచ్చేది.
ఇక చట్నీల సంగతి ప్రత్యేకంగా చెప్పుకు తీరాలి. లేత ఆకుపచ్చ రంగులో, కాస్త తీపి, పులుపు, కారం సమపాళ్ళలో కలగలిపినట్టు ఉండే ఆ అల్లప్పచ్చడి ఎలా చేసేవాడో కాని, మహత్తరంగా ఉండేది. అలాగే లేత పసుప్పచ్చ రంగులో, టొమాటోలు, మిరపకాయలు, మగ్గబెట్టి చేసే ఆ టమాటో పచ్చడైతే అమృతం అంటే నమ్మండి. కాగితాన్ని గుండ్రంగా చుట్టి, కత్తిరించిన విస్తారాకు వేసి, అందులో కొన్న వస్తువులకి సరిపడా రెండు చట్నీలు వేసి, ఆకు మడిచి, పైన వాళ్ళు అడిగినవి వేసి, పొట్లం కట్టి ఇచ్చేవాళ్ళు. పక్కపక్కనేసి, పొట్లం కట్టి ఇచ్చిన ఆ రెండు చట్నీలు తింటుంటే ఏది బాగుందో తేల్చి చెప్పడం మహా కష్టం.
ఓ పక్క నోరు మండిపోతున్నా వేడిగా, కారంగా ఉన్న బజ్జీలు తినేసి, ఆ మంట చల్లార్చుకోడానికి పక్కనున్న శివ కూల్ డ్రింక్స్ లో బాదంపాలు తాగేస్తున్నారు జనం. అప్పట్లో మా ఊళ్ళో దొరికే బాదంపాలల్లో చిక్కటి బర్రె పాలల్లో సగం గ్లాసుడు జీడిపప్పే వేసి కలిపేవారు. పక్కనే ఉన్న వేట పాలెం, బాపట్ల పొలిమేరల్లో ఉన్న అనేక చిన్న కుగ్రామాల్లో ఇసుక, నల్ల బంకమట్టి కలగలసిన రేగడి మట్టిలో జీడిమామిడి తోటలు పుష్కలంగా ఉండడం వల్ల, జీడిపప్పు చవగ్గా దొరకడం వల్ల  ఇలా కుదిరేది వాళ్లకి. ఇప్పుడు రెట్లు పెరిగి, నాణ్యత తగ్గింది.
జనాలు బజ్జీలకు ఎగబడుతున్నారని, విపరీతమైన రేట్లు ఎప్పుడూ పెంచలేదు బావయ్య. న్యాయంగా లాభం వేసుకుని, అందరూ అమ్మిన ధరకే అమ్మేవాడు. ఆ రోజులు అలాంటివి, అప్పటి మనుషులు అలాంటి వారు. కష్టపడి, న్యాయంగా వేసుకున్న లాభంతో ఆర్జించిన డబ్బు తోనే తృప్తి పడేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో అవసరాలు ఉండేవి, విలాసాలు కాదు. మామూలుగా బ్రతుకుతూనే తోటివారి కష్టంలో ఆదుకునే విధానం ఉండేది, వాళ్ళ మెప్పు కోసం అంతకంతకూ స్థాయి పెంచుకుంటూ పోయే గృహోపకరణాలు, పరికరాలు, వాహనాలు కావు. ఇప్పుడు మనుషుల్లో స్వార్ధం పెరగడం వల్లే, మనిషికీ మనిషికీ మధ్య దూరాలు పెరుగుతున్నాయి.
బాపట్ల చుట్టుపక్కల ఉండే రేగడి నెలలో కనకాంబరాలు, జాజులు, మల్లెలు వంటి పువ్వులు, మరువం వంటివి బాగా పూసేవి. ఆ తోటల నుంచి గంపలో గుత్తంగా మాట్లాడుకుని, పూలు కోసుకొచ్చిన చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చిన ఆడాళ్ళు, బావయ్య కొట్టుకి కాస్త ఎడంగా గంపలు పెట్టుకు కూర్చున్నారు. అటూ ఇటూ చూస్తూనే వాళ్ళు గబాగబా మాలలు అల్లేస్తున్నారు. ఉత్త మల్లెల, జాజుల మాలలు, కనకాంబరాలు మాత్రమే వేస్తూ అల్లిన దండలు, మరువం, కనకాంబరాలు కలిపి కట్టిన మల్లె, జాజి మాలలు చిటికెలో తయారు అయిపోసాగాయి.
బావయ్య కొట్లో తాము పీకల దాకా తిని, ఇంట్లో వాళ్లకు పొట్లాలు కట్టించుకు వెళ్తున్న మగాళ్ళు, పూజకి, ఇంట్లో ఆడాళ్ళకి పనికొస్తాయని, పూమాలలు కొంటున్నారు. సెంటర్లో ఉన్న పప్పుల కొట్టు శెట్టి , ఒడిలో చంటిపిల్లాడిని వేసుకుని కూర్చున్న ఓ పూలమ్మాయి దగ్గర గీచి గీచి బేరాలాడి, తన  చేత్తోనే మూరెడు పూలు కొలిచి ఇమ్మని, దండ సాగదీసావని, దెబ్బలాడుతూనే పూలు కొంటున్నాడు. తమ కొట్టుకు ఎవరైనా వస్తే పావలా ధర తగ్గించడానికి గిలగిలలాడిపోయే అతను, ఓ పది రూపాయల సంపాదన కోసం పొద్దుట తోటలకు వెళ్లి, సాయంకాలం రోడ్ల మీద కూర్చుని, కాయకష్టం చేసే ఆడాళ్ళ దగ్గర బేరాలు ఆడడం ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు బావయ్య. పూలమ్మితో పాటే వచ్చిన మూడేళ్ళ కూతురు చిట్టి, అప్పటినుంచీ అమ్మను బజ్జీలు కొనిమ్మని ఏడుస్తూనే ఉంది. వచ్చిన డబ్బులు తిండికి పెట్టేస్తే, బొటాబొటిగా వచ్చే డబ్బుతో మళ్ళీ రేపు గడవదని, పూలమ్మి బెంగ. ఇదంతా చూస్తున్న బావయ్య, కాస్త రద్దీ తగ్గగానే చిట్టిని పిల్చి, కావలసినవన్నీ అడిగి ఇచ్చాడు. “చిట్టీ, నీకు కావలసినవి అన్నీ ఊరికే ఇస్తాను. నా దగ్గరకే రా, అమ్మను అడక్కే,” అనగానే, ఆనందంతో మెరిసే కళ్ళతో, అప్పటిదాకా బుగ్గల మీద కారిన కన్నీటి చారలు తుడుచుకుని, వాళ్ళమ్మ అమ్మే బొండుమల్లి పువ్వులా నవ్వింది. అలాగే అటూ ఇటూ పోతున్న బీద పిల్లలకి, గోపురం దగ్గర అడుక్కునే దిక్కులేని వాళ్లకి, మధ్య మధ్య బజ్జీలవీ ఇస్తూనే బేరం చూసుకోసాగాడు బావయ్య. రాత్రి 8 కావొస్తోంది. ఇక ఊరు సద్దుమణుగుతూ ఉండగా మళ్ళీ ఒక చెక్క రిక్షా పిల్చి, తట్టా బుట్టా సర్దుకుని, ఇంటికి బయల్దేరేవాడు బావయ్య. అతని వ్యాపారం అతనికి మాత్రమే కాదు, చుట్టుప్రక్కల పది మంది బ్రతికేందుకు ఆలంబన అయ్యేది.
బాపట్ల వచ్చిన వాళ్ళు భావన్నారాయణ స్వామిని చూడకుండా, బావయ్య బజ్జీలు తినకుండా, బాదంపాలు తాగకుండా వెళ్ళరని అనేవాళ్ళు. బావయ్య బజ్జీలంటే అంత పేరు మరి. రుచితో పాటు శుచీ శుభ్రతకు పెట్టింది పేరు బావయ్య. తన కాళ్ళు, చేతులు ఆడినంతవరకు చాన్నాళ్ళ పాటు బజ్జీలు వేస్తూనే బ్రతికాడు. తన సంపాదన తోనే ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసాడు. మంచితనానికి, న్యాయపు లాభానికి ప్రతీకలా ఉండే బావయ్య ఉన్నట్టుండి ఓ రోజు చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు అదే చోట అతని కొడుకు బజ్జీలు వేసి అమ్మేవాడు. కాని, అతనూ ఓ ప్రమాదంలో చనిపోవడంతో, గాలిగోపురం లేని భావన్నారాయణ స్వామి గుడిలా, గడియారపు స్థంభం కొట్టేసిన మా నాలుగు వీధుల కూడలిలా, ఆ చోటూ వెలవెల పోయింది. ఇప్పుడు మా ఊరి వాళ్ళు అటుగా ఎప్పుడు వెళ్ళినా, ఆ చోటు వంక కాసేపు మౌనంగా చూడ్డం వెళ్ళిపోవడమే!
ఆ తర్వాత ఎంతో మంది మెత్త పకోడీలు, బజ్జీలు వేసేవారు కాని, బావయ్య బజ్జీల లాంటి రుచి ఊళ్ళో ఎక్కడా ఎరగము. మా ఊళ్లోనే ఏమిటి, ఇన్నేళ్ళ నా జీవితంలో నేను ఎన్ని చోట్ల తిరిగానని? ఎంత లోకం చూసానని? బెజావాడ బీసెంట్ రోడ్డులో ఉల్లిపాయ కూరి, నిమ్మకాయ పిండి, పైన కొత్తిమీర జల్లి ఇచ్చే మిర్చి బజ్జీలు సిమ్లా మిర్చీ బజ్జీలు తిన్నాను. హైదరాబాదీ ఫక్కీలో కోటి గోకుల్ చాట్ లో దొరికే లోపల చింతపండు ముద్ద కూరిన మిర్చీ బజ్జీలు తిన్నాను. నర్సాపురం నగలకొట్ల వీధి మొదట్లో బఠానీల మిక్స్చరు కూరి చేసిచ్చే స్పెషల్  మిర్చీ బజ్జీలు తిన్నాను. భారతం మొత్తంలో ఎన్ని ఊళ్లు తిరిగినా, ఎన్ని చోట్ల వెతికినా మళ్ళీ మా బావయ్య బజ్జీలంత రుచిగా ఎక్కడా ఉన్నదీ లేదు, తిన్నది లేదు. అందుకే అనిపిస్తుంది, ‘రుచి వండే చేతిలో లేదు, పెట్టే మనసులో ఉందని !’ కాలం ఎంత మారినా, బావయ్య బజ్జీలు మాత్రం మా బాపట్ల చరిత్రలో చిరకాలం నిలిచిపోయాయి!
***

No comments:

Post a Comment

Pages