అన్నమయ్య దశావతార కీర్తనలు - వివరణ– 05 వభాగము (12-09-2016)
ఇంతకోపగలనా
డా. తాడేపల్లి పతంజలి
మంతనాలు చాలుఁ జాలు మాయలు నీ విద్య
చ.1: మూలఁ బుడిసెడునీట మునిఁగేది నీ విద్య
తాలిమి వీఁపు గానరా దాఁగేది నీ విద్య
జోలి దవ్వి యెడలేని సూకరాలు నీ విద్య
పాలఁసుడవై మానుపడేది నీవిద్య
చ.2: కొంకక వేలు వె ట్టిమ్ముగొనేది నీ విద్య
జంకెతో సారెకుఁ బగ చాటేది నీ విద్య
తెంకిబెండ్లు ముంచి గుండ్లు దేలించేది నీ విద్య
వంక లొత్తి యాఁటదాని వంచేదే నీ విద్య
చ.3: బుద్దుల పరియాచకాల బూతు లల్లా నీ విద్య
బద్దుల ఱాతిగుఱ్ఱాలఁబరపేది నీ విద్య
అద్దివో శ్రీవేంకటేశ అన్నిటాను నన్నుఁ గూడి
ముద్దుల న న్నురమున మోఁచేది నీ విద్య (పెదతిరుమలాచార్యులు రేకు: 46-2 బౌళి సం: 17-273)
తాత్పర్యము
పల్లవి:
ఇంత సన్నిహితంగా నీతో మెలగాను- అటువంటప్పుడునువ్వు ఇంతచేస్తే నేను సహించగలనా?
ఇప్పుడు మంతనాలు మొదలుపెడుతున్నావా? (మంతనాలు=ఏదైనా ఒప్పందం లేదా అవగాహన కుదుర్చుకునే ఉద్దేశ్యంతో సంబంధిత వ్యక్తులతో -కొంత మేరకు రహస్యంగా- జరిపే చర్చలు; రహస్య సమాలోచనలు talks, parleys) ఇక నీ మాయలు చాలు చాలు..
చ.1: పుడిసెడు (=కుదియపట్టిన చేరలో సగము పరిమాణము గలది)నీటిలో మునిగే విద్య నీది.(01. మత్స్యావతారము)
తాలిమితో (=క్షమ, ధైర్యముతో ) వీపు కనబడేటట్లు దాక్కొని ముడుచుకుపోయే విద్య నీది (ధైర్యము లేనివాడివని నాయిక వెక్కిరింత) .(02. కూర్మావతారము)
జోలిదవ్వి(= కథలను తవ్వి )ఏ మాత్రము అడ్డంకిలేని సూకరాలు(=సుకుమారతలు) చూపించేది నీ విద్య.(03. వరాహావతారము)
పాలసునిగా(=మూర్ఖునిగా) మానుపడేది (=మొద్దుబారించేది) నీ విద్య. ( హిరణ్య కశిపుడు నరసింహుని చూసినప్పుడు ఏం చేయాలో తోచని మూర్ఖుడయ్యాడని భావం) (04. నరసింహావతారము)
చ.2:
కొంకక (=సంకోచింపక, భయపడక) వేలువెట్టి(= వేలును నారిపై పెట్టి. సంబంధములేని విషయాలలో దూరి) ఇమ్ముకొన్నది(=ప్రాప్తిని పొందినది )నీ విద్య.
శివధనుస్సు రామునికి సంబంధంలేనిది. ఆ విషయంలో రాముడు తలదూర్చి సీతమ్మను పొందాడని భావం.(05. రామావతారము)
జంకెతో (= బెదిరింపు)సారెకు(= మాటి మాటికి) పగను ప్రకటించినది నీ విద్య.
పరశురాముడు జమదగ్ని కొడుకు. తల్లి రేణుక. తన తండ్రిని కార్తవీర్యార్జునుని పుత్రులు హోమపశువుకొఱకు చంపిన విషయం తెలుసుకొని వారిపై కోపించాడు. భూమిలో రాజు అనేవాడు లేకుండా చేయాలనుకొని 21 సార్లు రాజులమీద దండెత్తి గర్భములో పిండాలతో సహ సంహరించాడు. దీనిని పగ ప్రకటించాడని పెద తిరుమలయ్య వర్ణించాడు.(06. పరశురామావతారము)
తెంకిబెండ్లు ముంచి(= పొడుగ్గా ఉండే సన్నని బెండ్లను ముంచి) లావాటి గుండ్లను తేలించేది నీ విద్య. బలిచక్రవర్తి యొక్క పొడుగ్గా ఉండే శిరస్సును ముంచి, లోకాలను తేల్చావయ్యా !(07. వామనావతారము)
వంక లొత్తి(=వంకలుదిద్ది) ఆటదానిని(=ఆడదానిని) వంచేదే నీ విద్య.
(కుబ్జ అనే స్త్రీ వంకలుదిద్దిన కృష్ణ ప్రస్తావన కవి చేసాడు)(8.కృష్ణావతారము)
చ.3: బుద్దుల (=బుద్ధిని ఉపయోగించి) పరియాచకాల(= ఎగతాళులతో) బూతు లల్లా (=కుచ్చితపు మాటలు అల్లినది ) కావాలని బుద్ధిని ఉపయోగించి ఎగతాళులతో కుచ్చితపు మాటలు అల్లిన విద్య నీది. కామపీడితులైన త్రిపురకాంతలతో బుద్ధుడు చేసిన చేష్టలను కవి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. (09. బుద్ధావతారము)
బద్దుల (బంధింపబడిన) ఱాతిగుఱ్ఱాలతో పరపేది (విరివి కలది) నీ విద్య. (10. కల్క్యావతారము)
అద్దివో(= అదికదా !) శ్రీవేంకటేశ! అన్నిరకాలుగా నన్నుకలిసి -ముద్దులతో అలసిపోయిన నన్ను వక్షస్థలమున మోచే విద్య నీదే కదా !
*****
No comments:
Post a Comment