ముచ్చటైన మూడు పుస్తకాలు
పరిచయం : భావరాజు పద్మిని
చిన్నప్పుడు మనం ఎన్ని ఆటలు ఆడుకున్నామో కదా! అట్లతద్దినాడు చద్దన్నం తిని ఉయ్యాలలూగే ఆటల దగ్గర్నుంచి, ఎండలో ఆటలు, నీడలో ఆటలు, నీళ్ళలో ఆటలు, వానలో ఆటలు, చలిలో చలిమంటల దగ్గర ఆటలు, వెన్నెల్లో ఆటలు, కూర్చునే ఆటలు, నడుస్తూ ఆటలు, కుంటుతూ ఆటలు, పరిగెడుతూ ఆటలు... ఇలా ఒకటా రెండా? కదిలితే ఆట, మెదిలితే ఆట. కాలవగట్లూ, మైదానాలు, ఉద్యానవనాలు, ఇంటి వసారాలు ఈ ఆటలకు వేదిక అయ్యేవి. అలా ఆటలు ఎక్కువ ఆడడం వల్ల, చదువు భారం తెలిసేది కాదు, శరీర దారుడ్యం కూడా పెరిగేది. ఆ ఆటలన్నీ మన దేహానికి, మెదడుకీ కూడా పదును పెట్టేవే ! చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి మనిషిలో పదిలంగా ఉంటాయట ! ఆ మాటకొస్తే, ఎదిగిన మనసులో బాల్యం ఎక్కడో పదిలంగా దాగే ఉంటుందట !
మరిప్పుడో ...తరం మారింది, కాలం మారింది. విశాలమైన ముంగిలి, పెరడు, మండువా లోగిలి ఇళ్ళు, భవంతులు మాయం అయిపోయి, వాటి స్థానంలో అపార్ట్మెంట్ లు మొలిచాయి. అడుగూ, అడుగూ లెక్కేసుకుని, ఇళ్ళు కొనుక్కుంటున్న కాలంలో, మనిషికే మనిషి అడ్డం అయిపోయాడు. ఇల్లు, కారు వంటివి సమకూర్చుకునే పరుగులో తనకు తనే దొరకనంత దూరం అయిపోయాడు. ఇక అటువంటిది ఆడుకునేందుకు నాలుగు అడుగుల జాగా ఎక్కడుంది? పిల్లల్ని పట్టించుకుని, వారికి తాము ఆడుకున్న ఆటల్ని గురించి చెప్పేందుకు తల్లిదండ్రులకు తీరిక ఎక్కడుంది? అందుకే ఇప్పటి పిల్లలు టీవీలు, గాడ్జెట్లు, మొబైల్స్, వీటికి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. వీటితోనే ఉంటూ మనుషుల్లో కలవడానికి ఇబ్బంది పడుతున్నారు.
అందుకే ప్రస్తుత పరిస్థితిలో తల్లిదండ్రులకు తాము మర్చిపోయిన ఆటల్ని గుర్తుచేసి, మళ్ళీ వారి బాల్యాన్ని తిరిగి ఇవ్వడానికి, పిల్లలకు కాలపు వేగంలో మరుగునపడిన పాత ఆటల్ని గురించి చెప్పి, వారిలో ఆసక్తిని కలిగించడానికి సమిష్టిగా ముందుకు వచ్చారు - కందుకూరి రాము గారు, డా. జాస్తి శివరామకృష్ణ గారు. వీరు ప్రచురించిన పుస్తకమే "చిన్ననాటి ఆటలు - జ్ఞాపకాల మూటలు. " ఈ పుస్తకంలోని ఆటలకు చిత్రకారులు శ్రీ దుండ్రపెల్లి బాబు గారు చూడగానే ఆకట్టుకునేలా చక్కటి చిత్రాలను అందించారు.
మొదటి ముద్రణలో ముద్రించిన పుస్తకాలు అన్నీ అమ్ముడైపోవడంతో ఈ పుస్తకాన్ని రెండవసారి ముద్రించి, సెప్టెంబర్ 21, 2016 న విజయవాడలో జరిగిన సభలో పలువురి ప్రముఖుల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. మొదటి ముద్రణలో దొర్లిన తప్పులను సరిదిద్ది, రెండవ ముద్రణలో ముఖచిత్రం సరికొత్తగా మళ్ళీ చేయించారు. అలాగే ప్రతి పేజీనీ మరింత అందంగా లే అవుట్ మార్చారు . బైండింగ్ విషయంలో కూడా మొదటిముద్రణలో జరిగిన పొరపాటును సరిదిద్దారు. అలాగే తెలుగు పుస్తకాలను 'క్రౌడ్ ఫండింగ్' ద్వారా ముద్రించారు . ప్రతి పాఠశాలలో ఈ పుస్తకాలను అందించాలనేది వీరి ఆశయం.
అయితే రెండవ ముద్రణలో ఈ పుస్తకానికి ఇంగ్లీష్ ప్రతిని "Let's play" పేరుతో ప్రచురించి ఆవిష్కరించారు. ఇంగ్లీష్ స్తకాలకు SILK (USA) సంస్థ ఆర్ధిక సహాయం అందించింది. దీనితో తెలుగు చదవడం రాని విదేశీ బాలలకు కూడా ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది. రంగులు వెయ్యడం పట్ల పిల్లలు అందరికీ ఆసక్తి ఉంటుంది కనుక, ఇదే సభలో 'Let's play and color' పేరుతో మరొక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. చక్కటి ఈ మూడు పుస్తకాలను మీ పిల్లలకు, బంధుమిత్రుల పిల్లలకు బహుమతిగా అందించాలని అనుకుంటున్నారా ? అయితే పుస్తకాలు దొరికే చోటు, ఇతర వివరాలు :
పుస్తకాల పేర్లు : చిన్ననాటి ఆటలు - జ్ఞాపకాల మూటలు (తెలుగు)
Let's play (ఇంగ్లీష్ )
ఆడుకుందాం, రంగులు వేద్దాం (తెలుగు),
Let's play and color (ఇంగ్లీష్ )
వెల: Let's play -300, చిన్ననాటి ఆటలు - జ్ఞాపకాల మూటలు - 200 మరియు రంగులు వేద్దాం(Let's play and color) 100
పుస్తకాలు దొరికే చోటు :
No comments:
Post a Comment