నీకేం, నువ్వు అద్వైతానివి! - అచ్చంగా తెలుగు

నీకేం, నువ్వు అద్వైతానివి!

Share This

నీకేం, నువ్వు అద్వైతానివి!

భమిడిపాటి శాంత కుమారి



నీకేం,నువ్వు అద్వైతానివి!

దేనికీ అంటకుండా అన్నిటికీ అతీతంగా ఉంటావు,

కాలేకడుపు, కూలేబ్రతుకు,ఆలిజాలి ,
జననంమరణం అన్నీ మిధ్యే అంటావు,
కనబడేదంతా మిధ్య అంటావు,
కనబడనిది సత్యం అంటావు,
దానిని కనులు చూడలేవని ,
మనసు అనుభవించలేదని అంటావు,
బుద్ధి గ్రహించలేదంటావు,
ఆలోచన అందుకోలేదంటావు.
కానీ,నేను నీలా అనలేను,
ఎందుకంటే నేను ద్వైతాన్నికనుక!
అన్నం పరబ్రహ్మ స్వరూపమని
నమస్కరించమంటాను.
ఆలి,జాలి పరబ్రహ్మ స్వరూపమేనని
మనసును సంస్కరించమంటాను.
ఈ రాక పోకలు అతని లీలలని,
అసమాన హేలలని అంటాను,
ఆణువణువూ,ప్రతిక్షణమూ
అన్నీకూడా అతని స్వరూపమే అంటాను.
ఈ ప్రకృతి అతని పట్టమహిషని,
వారిద్దరూ ఈ సృష్టికి అమ్మనాన్నలని,
అలా తలచి వారిప్రేమ పొందమంటాను,
మంచిచెడులు,పగలురాత్రులు,జనన మరణాలు,
ఇవన్నీ అతని ఆటలంటాను.
నువ్వేమో ఏమీ లేదంటావు,
నేనేమో అంతా ఇదే అంటాను.
కానీ, నేనులేకుండా పోయే రోజోకటి వస్తుందని
నాకూ తెలుసు!
ఐతే,అంతవరకు ఈ అజ్ఞానులు
దారితప్పకుండా చూడటానికి, వారిని కాపాడటానికి,
నేనిలా నీతో వాదించాల్సిందే, నీతో భేదించాల్సిందే,
వీళ్ళని నెమ్మదిగా నీ వైపుకు నడిపించాల్సిందే,
అప్పటికీ కానీ నేను నీలో ఐక్యమవలేను.
***

No comments:

Post a Comment

Pages