నీకు నేనున్నా - 2 - అచ్చంగా తెలుగు

నీకు నేనున్నా - 2 

అంగులూరి అంజనీదేవి

anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com


(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు  మనోహర్. అతని అక్క  కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఇక చదవండి.)
మధురిమకు బావంటే గౌరవం, భక్తిభావం వున్నాయి. మంచినీళ్ళు ఇస్తూ రంగారావుని పలకరించింది మధురిమ.
వనంతమ్మ కొద్దిసేపట్లో పనంతా ముగించుకాని తీరిగా ఒకచోట కూలబడింది. మరోపక్కబాబుని ఆడిస్తూ కూర్చుంది మధురిమ. ఆడుకుంటున్న బాబును ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని తన దగ్గర కూర్చో బెట్టుకున్నాడు రంగారావు.
రంగారావు వసంతమ్మ పెద్దకూతురు భర్త.
రంగారావుకి భార్యంటే ప్రాణం.ఆ భార్య చనిపోవటంతో మతిపోయిన వాడిలా తయారయ్యాడు. ఆ దిగులు నుండి కోలుకోవటానికి కొంతకాలం పట్టింది రంగారావుకి. అల్లుడ్ని ఆ స్థితిలో చూసి, చలించిపోయిన వనంతమ్మ బాబుని తన దగ్గరే ఉంచుకొని పెంచుకుంటోంది.
భార్య కన్నుమూసే చివరి క్షణాల్లో కోరిన ఒకే ఒక్క కోరిక తన చెల్లెలు మధురిమ పెళ్ళి  చెయ్యమని. మధురిమ పెళ్ళి చెయ్యటం తమ బాధ్యత అని భార్యకి ఆరోజే మనస్పూర్తిగా మాటిచ్చాడు. అందుకే భార్య లేకపోయినా అత్తగారిల్లు మరచిపోలేదు రంగారావు.
 రంగారావుకి వాళ్ల బాబాయ్ ఈమధ్యనే రెండో పెళ్ళి జరిపించారు. తగినంత టైం లేక ఎవరిని పిలవలేదు. శ్యామల చాలా మంచిమనిషి రంగారావుని (పేమగా మానుకుంటోంది.
"నాకు ఫ్యాక్టరీ వదిలి రావాలంటే వీలు దొరకటంలేదు అత్తయ్య గారు!మిమ్మల్ని బాబును చూసి రమ్మని శ్యామల ఒకటే గోలచేసి పంపింది. మధురిమ తన సొంత చెల్లలితో సమానమని, త్వరగా పెళ్ళి  చేసే ఏర్పాటు చెయ్యమని తొందర పెడ్తోంది. ఎలాగూమధురిమ పెళ్ళి బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను సరే అన్నాను. నా మాట ఏదికూడా కాదనడు శ్యామల. అది నా అదృష్టం. మీకు తెలియకుండా శ్యామలను పెళ్ళి చేసుకున్నందుకు ఏమీ అనుకోకండి అత్తయ్యగారు!” అన్నాడు రంగారావు.
కూతురు లేకపోయినా అల్లుడు తన కుటుంబానికి కొండంత అండగా వున్నందుకు సంబరపడింది వసంతమ్మ.
"ఇంతగా చెప్పాలా బాబు! అనుకోవటానికి ఏముంది ఇందులో. పోయినవాళ్ళు ఎలాగూ రారు.వుండే వాళ్ళయినా సంతోషంగా ఉండాలిగా నీకు మాత్రం ఏం వయసుంది? అమ్మాయి పోయిన వెంటనే నేనుకూడా నీకు పెళ్ళి చేసుకోమనే చెప్పాను. కానీ అప్పట్లో నీ మనసు పెళ్ళికి అంగీకరించలేదు. పోన్లే ఇప్పటికైనా పెళ్ళి చేసుకున్నావ్!  దానికి సంతోషంగా వుంది" అంది వసంతమ్మ.
"ఇంకో విషయం అత్తయ్యగారు! మన మధురిమకు ఓ సంబంధం చూశాను. అబ్బాయి ఎం.ఏ చదవాలని యూనివర్శిటీలో చేరాడు. కానీ ఈ మధ్యన సబ్ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాడట. అయిదవ తేదీనాడు అమ్మాయిని చూడటానికి వస్తామన్నారు. అన్ని ఏర్పాటు చేసిపెట్టండి ఆరోజు నేను, శ్యామల వస్తాము" అన్నాడు రంగారావు.
"అప్పడే మధురిమ పెళ్ళికేం తొందర బాబూ! కనీసం డిగ్రీ అయినా పూర్తిచేయందే" అంది వసంతమ్మ
"డిగ్రీదేముంది లెండి తర్వాతైనా చేసుకోవచ్చు ముందు పెళ్లి కానీయండి! ఈ సంబంధం మంచిది. ఇలాంటి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు ఇప్పడు మనం తొందరపడటం మంచిది" అన్నాడు రంగారావు.
 ఆలోచిస్తూ తలవంచుకొంది వసంతమ్మ
"మీరంతగా ఆలోచించాల్సిందేంలేదు అత్తయ్యగారు! మధురిమ బాధ్యత తీరితే మీక్కూడా ప్రశాంతత దొరుకుతుంది. ఆ తర్వాత మీరిక్కడ వుండవలసిన అవసరం కూడా వుండదు. శ్యామలను మీ పెద్ద కూతురులా భావించి మీరు నా దగ్గరే ఉండొచ్చు. బాబుకి కూడా మీ అవసరం చాలా వుంది" అన్నాడు బాబు తలను ప్రేమగా నిమురుతూ.
రంగారావు చెప్పింది సబబుగానే అన్పించింది వసంతమ్మకి
కూతురికి పెళ్ళి చెయ్యాలని ఏ తల్లికైనా వుంటుంది.
“సరే నీ ఇష్టం బాబు!” అంది వసంతమ్మ వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదన్నదే ఆమె ఆలోచన కూడా.
పక్కనే వుంది, పెద్దవాళ్ళ మాటలు వింటున్న మధురిమలో ఏ భావమూ స్పష్టంగా లేదు.
            చదువుకుంటే మంచిదే. భవిష్యత్తు బావుంటుంది. పెళ్లయినా మంచిదే తల్లికి బాధ తప్పుతుంది. బాధ్యత తీరుతుంది. ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి దేని గురించీ అంతగా ఆలోచించవలసిన అవసరం లేదనిపించింది మధురిమకి.
రంగారావు పెళ్ళికొడుకు గురించి వివరాలు చెబుతుంటే ఆసక్తిగా వింటూ కూర్చుంది వసంతమ్మ.
******
ఫస్ట్ బెల్ ఇంకా కొట్టలేదు. కాలేజీకి ముందుగా వన మధురిమ, సుజాతలు కాలేజీ వాయిటింగ్ రూమ్ లో కూర్చున్నారు.
“ఇంగ్లీషు నాకు కొంచెం కష్టంగా వుంది సుజా!" అంటూ ముందుగా మాట్లాడింది మధురిమ.
“అందులో అంత టఫ్ ఏం అన్పించలేదే. నాకైతే ఈజీగానే ఉంది. అక్కడక్కడా అర్థం కాకపోతే నేను మా అన్నయ్యతో చెప్పించుకుంటాను" అంది సుజాత.
“నాకా అవకాశం లేదు సుజా! క్లాసులో వినటం తప్ప ఇంటికెళ్తే చెప్పేవాళ్ళెవరూ  లేరు” అంది బాధగా.
"ఎందుకులేరూ! మీ ఇంట్లో అద్దెకుండే ఆ మనోహర్ వున్నాడుగా.అడిగి చెప్పించుకో ".
మనోహర్తో డౌట్స్ అడిగి చెప్పించుకునేంత పరిచయం లేదు నాకు”
"నిజంగా లేదా?మరి మా అన్నయ్య తెలుసా?"
"అసలు మీ అన్నయ్య ఎవరో నాకు తెలియదు"
"అబ్బో ఏమో అనుకున్నా నీ దగ్గర దాచుకోదగ్గ విషయాల చాలా వున్నాయి. అలాగే దాచుకో...దాచుకో అంది సుజాత.
సుజాత ఏమంటున్నదో మధురిమకు అర్ధం కాలేదు.
మధురిమ బాగా నటిస్తుందని సుజాతకి అర్థమైంది.
ముసుగులోని గుద్దులాట ఎందుకు గానీ, నేనొకటి అడుగుతాను చెబుతారా మధూ?"
“అడుగు సుజా! చెబుతాను”
"మనోహరెలా వుంటాడు?బావుంటాడా? నీకు బాగా నచ్చాడా? చెప్పు.మధూ? నాదగ్గర దాపరికం దేనికి? నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేసేవాళ్లలో నేనే మొదటి దాన్ని కదా! నీకు తెలుసుగా, వేరే చెప్పాలా?" అంది సుజాత.
"నువ్వేమంటున్నావో నాకర్థం కావట్లేదు సుజా!" అంది ఎలాంటి తడబాటు లేకుండా మధురిమ.
మధురిమ ముఖం చూస్తుంటే సుజాతకి ఎలాంటి అనుమానం రాలేదు. తనే పొరబడ్డుతున్నానేమో అనుకుంది.
“చూడు మధూ! మీ ఇంట్లో అద్దెకి ఎవరెవరుంటున్నారో చెప్పనా?"
"చెప్ప?"
"మనోహర్! కృష్ణ! హరి!ఉంటున్నారు. హరి మా అన్నయ్య. మా అన్నయ్యకి మా ఇంట్లో చదువుకోటానికి డిస్టబెన్స్ గా వుంటుందని రోజూ మనోహర్ వాళ్ల దగ్గరే వుంటాడు. మా అన్నయ్య నీకు తెలియకపోయినా మా అన్నయ్యకి నువ్వు బాగా తెలుసు" అంది సుజాత.
మధురిమ ఏదో మాట్లాడబోయింది. కానీ మాట్లాడలేదు.
అమ్మాయిలు మొత్తం వెయిటింగ్ రూం నిండారు.
థర్డ్ బెల్ కొట్టారు.
ఎవరి క్లాసుకి వాళ్లు వెళ్లిపోయారు.
ఇంకొందరు మాత్రమే మిగిలారు.
అంతలో సుజాత ఫ్రెండ్ వచ్చింది.
"సుజా! ఈ పూట అవర్సన్నీ లీజర్ ఇంటికెళ్లిపోదాం అంది సుజాత ఫ్రెండ్.
"ఇప్పుడే ఇంటికెందుకే బోర్, ఏదైనా పిక్చర్ కెల్దాం"
"ఏమున్నాయి పిక్చర్స్ మనం చూడదగినవి"
"బాబి వుంది. విశ్వనాద్ వుంది. రెండూ హిందీ పిక్చర్చే బాబి చాలా ఉందట. బాబి చాలా బాగుందట. బాబి కెల్దాం. అమితాబచ్చన్ని చూడొచ్చు" అంది ఒకమ్మాయి.
ఆ అమ్మాయికి అమితాబచ్చన్ అంటే చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే అమితాబచ్చన్ లాంటి అబ్బాయినే చేసుకోవాలని వుంది.
"నాక్కూడా బాబి ఫిలిం చూడాలని ఉంది. కాని ఇలా సినిమాలకి వెళ్ళటం మా అన్నయ్యకి నచ్చదు. అడిగితే ఏమంటాడో" అంది సుజాత.
అడిగి చూడు సుజాత!మీ అన్నయ్య కాదనరు. తప్పక పంపిస్తారు.ఏదైనా నువ్వ అడిగేదాన్ని బట్టి వుంటుంది.
" అడిగితే ఏమంటాడో?" తనలో తనే నసిగింది సుజాత.
"అడిగి చూడు! మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా?"
“సరే!అడుగుతాను.మీరంతా మా ఇంటికి రండి! మా అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసికొని మీతో కలసి సినిమాకి వస్తాఅంది సుజాత.
“ఓ.కే.”అంటూ అంతా సుజాతతో బయలుదేరారు.
మధురిమ కొంత దూరం సుజాత వాళ్లతో కలిసి నడిచింది.తన ఇల్లురాగానే వెళ్లిపోయింది. మధురిమను ఎప్పడైనా వాళ్లు సినిమాకు రమ్మని పిలవరు. కారణం మధురమకు ఇంట్లో బాబు పని వుంటుంచని వాళ్లకి తెలుసు.
ఫ్రెండ్స్ మొత్తం సుజాత ఇంటికి వెళ్లారు. అందరిని ముందు హాల్లో కూర్చోబెట్టి లోపలకెళ్లింది సుజాత.
"ఏమ్మా! సుజా! అప్పుడే వచ్చావు?" సుజాతను చూడగానే ప్రశ్నించాడు హరి. హరి కాలేజీకి వెళ్లలేదు. మనోహర్ వాళ్ల రూంకి కూడా వెళ్లలేదు. తమ్ముళ్లు క్యారమ్స్ ఆడుతుంటే చూస్తూ కూర్చున్నాడు.
"ఈ రోజు కొంతమంది లెక్చరర్స్ సెలవుపెట్టారన్నయ్యా!" అంటూ ఋక్స్ టేబుల్ పై పెట్టి, అన్నయ్యను పక్కకి పిలిచింది సుజాత.
నీదంతా ఒట్టి అపోహ అన్నయ్యా! మనోహర్తో మధురిమకు పెద్దగా పరిచయం లేదు. ఇంతకుముందే అడిగి చూశాను. ఏదైనా అలాంటిది వంటే నాతో తప్పకుండా చెబుతుంది. అలాంటిదేం లేదన్నాయ్యా" అంది సుజాత.
 "లేదన్నాయ్యా లేదన్నయ్యా అని నువ్వనాలుగు సార్లు అన్నంత మాత్రాన వారిద్దరి మధ్యన ఏం లేకుండా పోతుందా?" అంటూ కోపంగా చూశాడు హరి.మధురిమ మాట ఎత్తగానే లోపలెక్కడో దాగివున్న ఆవేశం తన్నుకొచ్చింది. అదే ఊరు అయివుండి కూడా తనని కాదని ప్రక్క ఊరి మనోహర్తో చేయి కలిపిందని కసిగా వుంది. అదీకాక హైస్కూలు చదువులప్పటినుండి మధురిమంటే హరికి కోరిక ఉంది. కానీ హరి ఉనికిని ఎప్పడూ పట్టించుకోదు మధురిమ.
"నువ్వ అనవసరంగా ఆవేశపడకన్నయ్యా! నాకు చిన్నప్పటి నుండి మధురిమ మనస్తత్వం ఎలాంటిదో బాగా తెలుసు. నాకెందుకో నీ మాటల మీద నమ్మకం కలగట్లేదు" అంది సుజాత.
"సరే! నమ్మకు నన్నొదిలెయ్! మరి మీ ఫ్రెండ్స్ చెబితే నమ్ముతావా?" అన్నాడు హరి, ఏ రూట్లో వెళితే సుజాతను నమ్మించవచ్చో హరికి తెలుసు.
"మా (ఫెండ్స్ కి కూడా తెలుసా?" అశ్చర్యపోతూ అడిగింది.
"మీ (ఫెండ్స్ కి ఏం ఖర్మ ఊరంతా తెలుసు. తెలిసినా తెలియనట్లే వుంటున్నారు. కావాలంటే అడిగిచూడు. ఇలాంటివి ఎక్కువరోజులు దాగవు" అన్నాడు హరి. ఎక్కడ నిప్పపెడితే బలంగా రాజకుంటుందో బాగా తెలుసు హరికి. అదేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ సుజాతలో ఎక్కువైంది.
వెంటనే హాల్లో వున్న ఫ్రెండ్స్ దగ్గరకెళ్లింది సుజాత.
"ఏమిటే సుజా! మమ్మల్ని ఇక్కడ వదిలి మరచిపోయినట్లున్నావ్! ఎప్పుడైనా కాఫీ ఇచ్చేదానివి. అదికూడా లేదిప్పుడు" అంటూ జోక్ చేశారు సుజాత రావటం ఆలస్యం అయ్యేసరికి ఫ్రెండుంతా.
"అమ్మ మన కోసం లోపల కాఫీ కలుపుతోంది. కాఫీ త్రాగి సినిమాకెళాం. ఈలోపల మిమ్మల్ని ఓ విషయం అడుగుతాను చెప్పండి!" అంటూ వాళ్ల దగ్గరకూర్చుంది సుజాత.
"ఏమిటా విషయం?తెలిసుంటే చెబుతాం. అడుగు" అంటూ అంతా ఒకేసారి అన్నారు ఫ్రెండ్స్.
“తెలిసినా తెలియనట్లే నటిస్తున్నారు చాలామంది మీరు కూడా అలాగే చేస్తారేమో?"
"సందేహాలు పక్కనపెట్టి అడుగుతల్లీ చెబుతాం
"మధురిమ మీద ఓ కంప్లైంట్  వచ్చింది"
కంప్లైట్!మధురిమ మీదనే?”
అవును. మధురిమ మీదనే. మీకెవరికీ ఇంతవరకు తెలియదా.
“తేలియాడి.ఏమిటో చెప్ప! తెలుసుకుంటాం"
"మధురిమ వాళ్ళింట్లో మా అన్నయ్య (ఫెండ్ మనోహర్ అద్దెకి ఉంటున్నాడు. మనోహర్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేని టైంలో మధురిమ మనోహర్ దగ్గరకి వచ్చి వెళ్తుందట" అంది సుజాత వాళ్ల కళ్ళలోకి చూస్తూ.
"నేను నమ్మను మధురిమపై నాకు మంచి అభిప్రాయం వుంది. అంది వాళ్లలో ఒక అమ్మాయి.
"నేను కూడా మొదట్లో నమ్మలేడు. ఇప్పడు నమ్ముతున్నాను. మనోహర్ చాలా బావుంటాడట. అందుకే ఇది ఫ్లాట్ అయ్యింది" అంది సుజాత ఇకపై మీరు కూడా నమ్మండి అన్నట్లు వాళ్ళ వైపు చూసింది.
"నువ్వింకేం ఊహించకు సుజా! మధురిమకు అంత ధైర్యం లేదు అది నా బెంచిమేట్ దాని మనసేంటో నాకుబాగా తెలుసు” అంది ఇంకో అమ్మాయి.
వాళ్ళెవరూ నమ్మకపోవటంతో సుజాతకి షేమ్ గా వుంది.వాళ్ళ నెందుకు అడిగానా అమ్మాయి ముఖం ముడుచుకుపోయింది.
సర్లే! మీరంతా ఏమైనా మధురిమ మనస్సు లోకి ఏమైనా తొంగి చూశారా? అక్కడేముంది క్లియర్ గా తెలియటానికి. ఏ పుట్టలో ఏ పాముందో తెలుసుకోలేనట్లే ఏ మనసులో ఏ మర్మముందో ఎవరూ తెలుసుకోలేరు. కొందరు పైకి ఒక విధంగా వుంది లోపల మరోవిధంగా వుంటారు. అలాంటప్పుడు మధురిమ గురించి తెలుసుకోవటం కష్టమే. సుజాతకు మాత్రం ఏం తెలుసు. ఎవరో అంటే విన్నది. అలాగే తనూ మనతో అంది. మనం కూడా ఇంకొకరితో చెబుతాం. నిజమేంటో అప్పుడు తెలుస్తుంది” అంది సుజాతపై అభిమానం గల అమ్మాయి.
ఇప్పుడు సుజాత ముఖం విద్యుద్దీపంలావెలిగిపోయింది. వల్ల అన్నయ్య హరి పర్మిషన్ తో అంతా కలిసి సినిమాకేల్లారు.
ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది.
వసంతమ్మ ఎదురుచూస్తున్న అయిదవ తారీఖు రానే వచ్చింది. పెళ్ళి చూపుల సందర్భంగా ఇల్లంతానీట్ గా సర్దారు.ఎక్కడ సామాన్లు అక్కడ వుంచి,వున్నంతలోనే అందంగా అలంకరించారు.
ఆరోజు మధురిమ కాలేజీకి వెళ్ళలేదు.
రంగారావు, శ్యామల ముందుగా వచ్చారు.
ఓ గంట తర్వాత పెళ్లికొడుకు రాజారాం, అతని తండ్రి రాఘవయ్య వచ్చారు.
శ్యామలకి మధురిమను చూస్తుంటే తన సొంత చెల్లెలు కంటే ఎక్కువగా అన్పించింది.
మధురిమకి తన చీరెల్లో ఓ కొత్తచీరె తీసి కట్టింది. నీట్ తలదువ్విజడ వేసింది. పూలు పెట్టింది. తన నగలు పెట్టింది. ఎంత సింపుల్ గా  అలంకరించినా అందాల బొమ్మలా కన్పిస్తోంది మధురిమ,
మధురిమను అలంకరిస్తూ, మధురిమ పక్కన తిరుగుతున్న శ్యామలను చూడగానే తన పెద్దకూతురు గుర్తు వచ్చి కళ్లనీళ్లు పెట్టుకొంది వసంతమ్మ.
"అయ్యో! పిన్నీ ఎందుకలా కళ్లనీళ్ళు పెట్టుకుంటున్నారు. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఏంకాదు. మీరలా బాధపడకండి మధురిమకేం? అపరంజి బొమ్మలా వుంది. ఎవ్వరైనా సరే కళ్లకద్దుకొని పెళ్ళి చేసుకుంటారు" అందిశ్యామల.
వసంతమ్మ తన పెద్దకూతుర్నిగుర్తుచేసుకొని బాధపడ్తుందన్న విషయం శ్యామలకి తెలియదు.
కన్నీళ్లు తుడుచుకుంటూ మధరిమవైపు చూసింది వసంతమ్మ. బాబును గుర్తు చేసుకుంటూ తల్లిని అడిగింది మధురిమ.
అటు,ఇటూ చూసిన వసంతమ్మ ఏదో గుర్తొచ్చినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.
“నువ్వేం కంగారు పడకే మధూ! బాబెక్కడికీ పోడు. మనోహర్ దగ్గరే ఆడుకుంటూ వుంటాడు. వాడికీమధ్యన కాడ్ బరీస్ చాక్లెట్లు తినటం బాగా అలవాటు అయింది” అంది వసంతమ్మ.
మనోహర్ పేరు వినగానే ఏం మాట్లాడలేదు మధురిమ,
"ఎవరు పిన్నీ మనోహర్?" అడిగింది శ్యామల
"మన ఇంట్లో అద్దెకుంటాడు శ్యామలా చదువుకుంటున్నాడు మంచి అబ్బాయే మన బాబును బాగా దగ్గరకి తీసుకుంటాడు. చక్కగా మాట్లాడతాడు. పిల్లలంటే ఇష్టం లాగుంది" అంటూఏదోపని మీద వంటింట్లో కెళ్ళిందివసంతమ్మ.
వచ్చినవాళ్ళు  అమ్మాయిని చూడాలని తొందరపెట్టారు. మధురిమను త్వరగా తీసుకురమ్మని ఒకసారొచ్చి భార్యతో చెప్పి వెళ్లాడు రంగారావు.
మధురిమను తీసుకొచ్చి ఓ చాపపై కూర్చోబెట్టింది శ్యామల.
 అక్కడ వాతావరణం సాంప్రదాయబద్ధంగా వుంది.
మధురిమను చూడగానే నచ్చారు. ముఖ్యంగా రాజారాంకి మధురిమ బాగా నచ్చింది.
"నాన్నా అమ్మాయి బాగుంది! వాళ్ల శక్తిని దృష్టిలో పెట్టాకొని కట్నం అడుగు. అది కావాలి, ఇది కావాలి అని డిమాండ్ చేసి ఈ సంబంధం చెడగొట్టకు” అంటూ తండ్రితో చెప్పాడు రాజారాం. తండ్రితత్వం రాజారాంకి తెలుసు. తండ్రి తనను చదివించిందే కట్నం కోసం కానీ మధురిమను చూస్తుంటే అసలుకట్నమే లేకుండా పెళ్ళి చేసుకోవాలని వుంది. అందుకే తండ్రిని పక్కకి పిలిచాడు.
సరే లేరా అమాత్రం నాకు తెలియదా? అదికూడా నువ్వే చెప్పలా? రంగారావుతో ముందే చెప్పాను నీ రేటు ఎంతో. ఆయన అంగీకరించే రమ్మన్నారు. కాకపోతే కాస్త అటో,ఇటో ఉంటుంది. అంతే!”అన్నాడు రాఘవయ్య.
"నారేటెంతో ముందే వాళ్ళతో చెప్పి, నన్ను అమ్మేశావా?ఆశ్చర్యపోతూ అడిగాడు రాజారాం.
“అమ్మకపోతే నీ చదువుకోసం నానా గడ్డితిని చేసిన అప్పంతా ఎలా తీరుతుంది? అందులో అది కూడా  చక్రవడ్డీకి తెచ్చానురా!” అంటూరాజారాంతో యింకేం మాట్లాడకుండా వెళ్ళి రంగారావు పక్కన కూర్చున్నాడు రాఘవయ్య.
రంగారావు,రాఘవయ్య కట్నకానుకల విషయాలు మాట్లాడుకున్నారు. వాళ్ల సంభాషణ సవ్యంగానే సాగింది. కోరినంత కట్నం యివ్వటానికి సిద్దపడ్డాడు రంగారావు. రాఘవయ్య సంతృప్తి చెందాడు.
"ఆయన అంతకన్నా రేటు తగ్గించేలా లేరు అత్తయ్యగారూ! మనం గట్టిగా మాట్లాడితే సంబంధం జారిపోయేలా వుంది. అందుకే ఆయన అడిగినంత ఒప్పకోక తప్పలేదు" అంటూ ఆలోచిస్తూ ఒక ప్రక్కగా కూర్చుని వున్న వసంతమ్మతో అన్నాడు రంగారావు.
"సరేలే బాబు సంబంధం మంచిదని నువ్వే అంటున్నావు. అమాత్రం ఇవ్వకపోతే ఈరోజుల్లో అబ్బాయి ఎలా దొరుకుతాడు. ఈ ఇల్లు అమ్మేస్తాను. మధురిమ పెళ్ళి జరుగుతుంది. ప్రస్తుతం నాకున్న అప్పు సంగతి తర్వాత ఆలోచిస్తాను" అంది వసంతమ్మ తనకు తను ధైర్యం చెప్పుకుంటూ.
"మీరింకేం ఆలోచించకండి! అవన్నీ తర్వాత చూద్దాం" అన్నాడురంగారావు.
"నాన్నా! నువ్వు అలా పడుకొని కొద్దిసేపు  రెస్ట్ తీసుకో. నేనలా బయటకెళ్ళి మా పెండ్స్ ని  కలిసి వస్తాను. చాలా రోజులైంది వాళ్లను కలిసి" అన్నాడు రాజారాం బయటికేల్తూ,వాళ్ళు వెళ్లవలసిన ట్రైన్ కి  యింకా టైం వుంది.
"త్వరగా రా మరి మనకు మళ్ళీ టైం అవుతుంది" అంటూ కొడుక్కి టైం గుర్తుచేస్తూ నడుంవాల్చాడు రాఘవయ్య.
 రామకృష్ణకి బెస్ట్ ఫ్రెండ్ రాజారాం.
 రామకృష్ణను చూడక చాలా రోజులైంది రాజారాం.
రామకృష్ణను చూడాలని వెళ్లిన రాజారాంకి నిరాశే ఎదురైంది. అప్పడే స్నానం చేసి బయటకొచ్చిన హరి రాజారాంని చూసి ఆశ్చర్యపోయాడు.
“ఏమిటోయ్ రాజా అనుకోకుండా వూడిపడ్డావు? ఓ లెటర్ రాస్తే స్టేషన్ కి నేనే వచ్చేవాడిగా అవనులే  చెప్పకుండా వచ్చి రామకృష్ణను సర్ప్రైజ్ చేద్దామనా?" అన్నాడు హరి. హరి కన్నా సీనియర్ రాజారాం.
“కాదురా హరీ అర్జంటుగా రావలసి వచ్చాను. మా నాన్నగారు కూడా
అవునా అంటూ డ్రెస్వేసుకొని, తల దువ్వుకున్నాడు హరి.
"నువ్వు  మా రామకృష్ణ రూమ్ లో ఎప్పుడు చేరావు హరీ?"
"ఈ మధ్యనే చేరాను రాజా!"
"కృష్ణా! నువ్వూ క్లోజ్ (ఫెండ్స్ కదా! ఇన్ని రోజులు వాడి రూంలో కదా నువ్వంటున్నది. మరెందుకిలా రామకృష్ణ రూమ్ లోకి మారావు?"
"అక్కడ మనోహర్ ని ఓరోగ్ వున్నాడులే. వాడికి ఇల్లుగల అమ్మాయితో ప్రేమరోగం అంటుకుంది. ఆ రోగం ముదిరి కంపు కొడుతోంది. అందుకే రూమ్ మారాను. ఇప్పుడు అర్థమైందా? కృష్ణకి నేనెందుకు దూరమయ్యానో"
అర్ధమైందన్నట్లుగా తలవూపాడు రాజారాం.
"నీకు జాబ్ వచ్చిందని విన్నాను ఏంటా జాజ్?" అడిగాడు హరి.
"సబ్ ఇన్స్పెక్టర్గా సెలక్ట్ అయ్యాను. ఇంకా ఆర్డర్స్ రాలేదు" అన్నాడు  "కంగ్రాట్యులేషన్స్ రాజా!" అంటూసంతోషంగా రాజారాంని వాటేసుకున్నాడు హరి.
"ముందు నన్ను వదలరా! ఇంకో శుభవార్త చెబుతాను" నవ్వుతూ అన్నాడు రాజారాం.
"ఏమిటది?" వదిలిపెడూతూ అన్నాడు హరి.
"నేను ఈ ఊరికి అల్లుడిని కాబోతున్నాను"
"ఏమిటీ! ఇది నిజమూ! ఇంతకీ అమ్మాయి ఎవర్రా?" అంటూ సంతోషంగా అడిగాడు హరి.
“కీ.శే. మల్లికార్డునరావు గారి ద్వితీయ పుత్రిక మధురిమ,పెళ్ళి చూపులు కూడా జరిగాయి. అమ్మాయి బావుందిరా!" అన్నాడు రాజారాం, మధురిమ గుర్తు రాగానే వులిక్కిపడ్డాడు హరి.
"ఆ అమ్మాయి ఐతే వద్దురా!" కచ్చితంగా అన్నాడు హరి.
అర్థం కాలేదు రాజారాంకి కట్నం తక్కువని హరి చెల్లెలు సుజాతను వద్దన్నాడు తన తండ్రి. అందుకే హరి ఇలా అంటున్నాడేమో నన్న సందేహం వచ్చిందిరాజారాం కి.
"నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది హరీ! అందుకే పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను" అంతకన్నా కచ్చితంగా చెప్పాడు రాజారాం.
"ఫిజికల్ గా  నచ్చగానే సరిపోదురా! అన్నీ ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి అంతమంచిది కాదు. నేనూ కృష్ణా లేని టైం లో  నా ఫ్రెండ్ మనోహర్ దగ్గరకి వచ్చి వెళ్తుంటుంది. ఏది ఏమైనా ఈ సంబంధం నీకు తగినది మాత్రం కాదు" అంటూ తొలిసారిగా అమృతకలశం లాంటి రాజారాం హృదయంలో విషపు చుక్కలు వేశాడు హరి. అయినా మధురిమ మీద ఆశ  చావలేదు రాజారం కి.
"ఆ అమ్మాయి నిజంగానే మనోహర్ ని ప్రేమించి ఉంటే ఈ పెళ్లి చూపులు జరిగేవి కావు. మనోహరే పెళ్ళి చేసుకుని వుండేవాడు. ఆ అమ్మాయిని నా వరకు రానిచ్చేవాడు కాదు".
"రానివ్వక వాడేం చేస్తాడురా వాడికెప్పుడో వాళ్ల అక్కయ్య కూతురు పద్మతో పెళ్ళినిశ్చయమైంది. ఇది కేవలం ఎంజాయ్మెంట్!"
“ఏమోరా!నాకంతా అయోమయంగా వుంది" అంటూ తలపట్టు కూర్చున్నాడు రాజారాం.”అయోమయంగా వుంటే వచ్చే నష్టం ఏమి లేదు రాజా! ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కష్టాలు పడతావ్!"
తలవంచుకాని, పెదవి కొరుకుతూ, ఆలోచిస్తున్నాడు రాజారాం, హరికి రాజారాం ని చూస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
“ఐతే! పనిచేద్దాం రాజా! నేను నిన్ను మనోహర్ దగ్గరికి తీసికెళ్తాను. నేనే డైరెక్ట్ గా వాడితో మాట్లాడతాను. వాడేం మాట్లాడతాడో విను. ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో. అది నీ ఇష్టం" అన్నాడు హరి.
ఎలాగైనా మధురిమను రాజారాంపెళ్లి చేసుకోకుండా చెయ్యాలని వుంది హరికి. ఇద్దరు కలసి మనోహర్ని కలవాలని బయలుదేరారు. దారిలో కృష్ణ ఎదురయ్యాడు.
“ఏరా కృష్ణా! మనోహర్ ఎక్కడ? రూమ్ లో వున్నాడా? అడిగాడు హరి.
“రూమ్ లో లేడురా! టెంపుల్ కి వెళ్ళాడు. నేను నా ఫ్రెండ్ ని కలవటానికి సికింద్రాబాద్ వెల్తునా” అని హరితో అన్నాడు కృష్ణ. పక్కనే వున్న రాజారాం తో నవ్వుతూ చేయి కలిపి, పలకరించాడు కృష్ణ.
దేవుణ్ణి దర్శించుకొని, మెట్లన్నీ దిగి ఓ చోట కూర్చున్నాడు మనోహర్. మనోహర్కి చాలా ఇష్టమైన స్థలం అది. ఎక్కువసేపు కూర్చోవాలనుకున్నప్పడు అక్కడికి వస్తాడు.ఒక్కోసారి ఏదైనా ఓ బుక్ తెచ్చుకొని, చదువుకుంటూ కూర్చంటాడు.
“హలో...మనోహర్! దైవదర్శనానికి ఒక్కడివే వచ్చావా?" అంటూ మనోహర్కి దగ్గరగా వెళ్లినిలబడ్డారు హరి, రాజారాం.
అవునన్నట్లు తలవూపాడు మనోహర్.
"ఏం! ఒక్కడివే వచ్చావ్? మీ దేవిగారు రాలేదా? ఓహో! మరచి పోయాను. పెళ్ళి చూపులు కదా ఈరోజు. అందుకే వదిలుంటావ్ లేకుంటే మీది వదిలే బంధమా? ఎక్కడ చూసినా మీరేనట కదా! అందరూ అనుకుంటున్నారు" అన్నాడుహరి.
"దేవి ఎవరు?ఏం మాట్లాడుతున్నావ్ హరీ నువ్వ?" హరినే చూస్తూ అన్నాడు మనోహర్.
"ఉన్నదే మాట్లాడుతున్నాను మనోహర్ దేవి అంటే ఎవరోమధురిమకాదు. నీ మధురిమ. అప్పుడప్పుడు మేము రూమ్ లో లేనపుడు నీ దగ్గరికి వచ్చి వెళ్ళే మధురిమ” అని వట్టిపలుకుతూ మనోహర్ వైపు చూస్తూ హరి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మనోహర్ కి వుడికిపోయింది.
హరీ! నువ్వు అదుపు తప్పి మాట్లాడుతున్నావు! నీ హద్దుల్లో నీవుంటే మంచిది” అన్నాడు కోపంగా మనోహర్.
హద్దుల్లో ఉండకుండా అదుపుతప్పింది నువ్వూ! తప్పించు కోవాలని చూస్తున్నది కూడా నువ్వే! ఆ రోజు మీ అన్నయ్య,వదిన వస్స్తున్నారనిఅపద్ధం చెప్పి మమ్మల్నిబయటికి పంపి మధురిమతో వున్నది కూడా నువ్వే ! ఏదైనా దాగేన్తవరకే దాగుతుందిమనోహర్! ఎక్కువైతే వాంతులవుతాయి. అందుకే నటించకు. ఒంటికి మంచిది కాదు" అన్నాడు హరి.
"నటించేవాంటే నాకు అసహ్యం హరీ!అందుకే నేను నటించను. నువ్వు కావాలనే ఇదంతా సృష్టిస్తున్నావ్! మాఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదు" అంటూ గట్టిగా అరిచే చెప్పాడు మనోహర్.
వ్యంగ్యంగా నవ్వాడు హరి. ఆ నవ్వు చూడగానే అసహ్యం వేసింది మనోహర్ కి.
"సంబంధం వుందని ఎవరూ ఒప్పుకోరు. చూసి అర్థం చేసుకోవాలి. ఏం రాజా! వ్యవహారమంతా అర్థమైందా? ఇవ్పటికి కూడా మధురిమనే చేనుకుంటానని అంటావా?" అంటూ రాజారాం వైపు తిరిగాడు హరి.
రాజారాం మాట్లాడలేదు. రాజారాం వైపు చూశాడు మనోహర్ రాజారాం మధురిమను చూడటానికి వచ్చిన పెళ్లికొడుకని మనోహర్కి అర్థమైంది. మధురిమ జీవితంతో హరి అలా ఆడుకోవటాన్ని సహించలేకపోయాడు మనోహర్.
ఆ స్థితిలో హరిని చూస్తుంటే మనోహర్లో ఆవేశం, కోపం తారాస్థాయిని అందుకున్నాయి. సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు మనోహర్ వెంటనే హరి చెంపలు చెళ్లు, చెళ్తుమనిపించాడు. మనోహర్ అలా కొడతాడని వూహించలేదు హరి, మనోహర్ చేతి దెబ్బలు బలంగా తాకటంతో హరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నీళ్లు తిరిగిన కళ్లలో నిప్పలు కురిశాయి.
ఎందుకనో వెంటనే మనోహర్ని కొట్టకుండా ఆగిపోయాడు హరి. ఆ చెంపదెబ్బ మనోహర్ కొట్టింది కాదు. మనోహర్కి మధురిమ పై ఉండే ప్రేమ కొట్టింది. ఆ ప్రేమ ఎంతకాలం నిలుస్తుందో చూడాలి. ఆ ప్రేమైనా చావాలి. లేదా తనైనా చావాలి. అప్పటికి కాని తను ఈ చెంపదెబ్బను మరచిపోలేదు. జీవితం చివరి వరకు పోరాడైనా సరే మధురిమను, మనోహర్లను కలవకుండా చేయాలి. ముఖ్యంగా మధురిమ అంటూ చూడాలి. అనుకుంటూ ఆ చెంపను అలాగే పట్టుకుని శిలాప్రతిమలా నిలబడి వున్న హరివైపు చూశాడు రాజారాం.
“పద వెళ్దాం" అంటూ భుజం తడుతూ అక్కడో క్షణం కూడా నిలబడకుండా ఇంటివైపు దారితీశాడు. రాజారాం.
నువ్వు నాకెంతో మేలు చేశావు హరీ మా నాన్న డబ్బు మనిషి. రంగారవు ఇచ్చే డబ్బుకి ఆశ పది ఇక్కడకి తీసుకొచ్చాడు. కానీ నాకు కావలసింది డబ్బు కాదు. అందుకే మీరు అంగీకరిస్తే నేను మీ సుజాతను పెళ్ళి చేసుకుంటాను. కాదనకండి!” అంటూ హరి  రెండు చేతులు పట్టుకున్నాడు కృతజ్ఞతగా రాజారాం.
"మా నాన్నగారి దగ్గరకొచ్చి అన్ని విషయాలు మాట్లాడండి రాజా! నాదేముంది చిన్నవాడిని" అన్నాడు హరి. రాజారాం తన చెల్లెల్ని అడుగుతున్నందుకు లోలోపల హరికి సంతోషంగా వుంది.
"సరే" అని హరిదగ్గర సెలవు తీసుకొని తండ్రి దగ్గరకెళాడు రాజారాం "నాన్న ఇప్పడు మన ఊరికి బస్ ఉంది బయలుదేరు. లక్షలు తెచ్చినా నెత్తినపోసినా ఈ అమ్మాయి నాకు అక్కర్లేదు".
"అంతలోపలే ఏమైందిరా"
"ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది నాన్న విధిలేక ఈ సంబంధానికి ఒప్పకుంది. మనసు లేని ఈ జీవశ్చవం నాకు వద్దు".
"పెళ్ళి అయితే  అన్నీ సర్దుకుంటాయి నువ్వేం కంగారుపడకు. ఇవన్నీ ఎవరో గిట్టనివాళ్ళు  పుట్టించి వుంటారు. ఇలా పుట్టించి చెప్పటం మామూలే. మారోజుల్లో  అయితే ఇంకా ఎక్కువగా వుండేవి".
మీ రోజుల్లో అయినా, మా రోజుల్లో అయినా. మనసు మనసే నాన్న. బండరాయి  కాదు. చలనం లేకుండా పడివుండటానికి".
"మనసును రాళ్ళతో రప్పలతో పోల్చి సినిమా కబుర్లు చెప్పకు రాజా! ఇది జీవితం!"
సినిమా కబుర్లు కాదు నాన్నా! నిజంగానే మనసుకి స్పందన వుంటుంది. అది ఎప్పటికి చావదు. తను కోరుకున్న మనషి కనిపించి నప్పుడల్లా అది స్పందిస్తూనే వుంటుంది. నేను ఆ అమ్మాయి కోరుకున్నమనిషిని కాదు. నా దగ్గర ఆ అమ్మాయిమనసు స్పందించదు. స్పందన లేని కాపురం నేను చెయ్యలేను" అంటూ తండ్రికి అర్థమయ్యేలా చెప్పాడు రాజారాం.
కాపురం చెయ్యటానికి స్పందన కావాలటారా! నీది మరీ విడ్డూరం కాకుంటే!మగతనం ఉంటే చాలదూ! కాపురాలు చేసేవాళ్ళంతా స్పందించే చేస్తున్నారా? కట్నం ఎవరెక్కువిస్తే వాళ్లను చేనుకుంటున్నారు. హాయిగా వుంటున్నారు" అన్నాడు రాఘవయ్య.
"నీతో వాదన వేస్ట్ నాన్నా! నీకు కావలసింది డబ్బొక్కటే."
"డబ్బు ఒక్కటే కాదురా నేనిక్కడ చూసింది. అమ్మాయి బాగుంది. మన ఇంట్లో తిరిగినా చాలురా, దీపం లేకున్నా వెలుతురున్నట్లే అన్పిస్తుంది" "అంతగా ఆ అమ్మాయి మన ఇంట్లో తిరగాలని నీకుంటే నువ్వ కట్టుకో నాన్నా! నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంతేకాని, నీ మోజుని నాకు అంటగట్టకు నీలాంటి తండ్రులుండబట్టే నాలాంటి కొడుకులు నిర్ధాక్షిణ్యంగా బలైపోతున్నారు. నేను మాత్రం బలికాను. నేను వెళ్తున్నా నువ్వు మెల్లగా రా" అంటూ అక్కడో క్షణం కూడా ఆగకుండా వెళ్లిపోయాడు రాజారాం.
వెళ్లిపోతున్న కొడుకు వైపు చూస్తూ రాయిలా నిలబడ్డాడు రాఘవయ్య "అమ్మా! నేను మా అబ్బాయికి నచ్చచెప్పలేకపోతున్నా మీ అమ్మాయి మనోహరనే అబ్బాయిని ప్రేమించిందట. ఎలా తెలిసిందో వాడీ సంబంధంవద్దు అంటున్నాడు " వసంతమ్మ దగ్గరకెళ్ళి అన్నాడు రాఘవయ్య.
వసంతమ్మ నెత్తిన పిడుగుపడ్డటైంది.
ఏ కబంధ హస్తమో తన బిడ్డ అదృష్టాన్ని చెరిపెయ్యటానికి ప్రయత్నించి ఉంటుంది. ఇప్పడెలా?
“అన్నయ్య గారు! సంగతేమిటో విచారించకుండా అలా వెళ్ళి పోవటం భావ్యం కాదు. నా కూతురు అలాంటి మనిషి కాదు. ఎవరో కక్షతో అలా అన్నారే కాని అదంతా నిజం కాదు" అంటూ ప్రాధేయపడింది వసంతమ్మ.
“చేసుకునేది నేను కాదు కదమ్మా! మావాడు నా మాట వినటం లేదు. అయినా లోకం గొడ్డు పోలేదు. మీ అమ్మాయికి వేరే అబ్బాయిని వెతుక్కోండి!" ఆమె మొర అలకిన్చానంత విసురుగా వెళ్లిపోయాడు రాఘవయ్య.
“భగవంతుడా! ఏమిటి నాకీ పరీక్ష? నా బిడ్డ బ్రతుకులో వసంతం
రావటం నీకు ఇష్టం  లేదా? పరువుగా  బ్రతకనివ్వక మమ్మల్ని ఇలా అప్రతిష్టపాలుచేసి నది బజారులో అమ్ముతున్నావా?” అంటూ రెండు చేతులతో తలబాడుకుంటూ భూరున ఏడుస్తూ కూలబడిపోయింది వసంతమ్మ.
మధురిమ ఆశలు నిరాశలయ్యాయి. రెప్పపాటులో జరిగిన ఈసంఘటనకి దిక్కుతోచనిదానిలా చూస్తూ చలనంలేని విగ్రహంలా వుండిపోయింది.
ఆస్థితిలో మధురిమను చూస్తుంటే శ్యామల గుండెనెవరో పిండినటైంది. అప్యాయంగా మధురిమను దగ్గరకు తీసుకొని ఓదార్పుగా తల నిమరసాగింది.
"అక్కయ్యా" అంటూ శ్యామల గుండెలో తలదాచుకొని పసిపిల్లల ఏడ్చింది మధురిమ.
వూరుకోమధూ! బాధపడకు. ఇది కాకపోతే దీని తాతలాంటి సంబంధ మరొకటి వస్తుంది" అంది శ్యామల మధురిమ కన్నీటిని తుడుసూ వాళ్లలా వెళ్లిపోవటం రంగారావుకి అవమానంగా వుంది.
రంగారావు ఒక ఫ్యాక్టరీలో ఎందరో కార్మికులపై అజమాయిషీ చూపించే ఒక యజమాని. రాజకీయంగా గొప్ప పేరు సంపాయించుకున్న వారిలో తనో సభ్యుడు. దయార్ధహృదయుడు. ధర్మాత్ముడు. పైగా వ్యక్తిత్వం అంటే పడిచచ్చే మనిషి. అందుకే ఈ సంఘటన రంగారావు తలదించుకునేలా చేసింది.
వెంటనే ప్రయాణమయ్యాడు రంగారావు వెళ్లిపోవటానికి సిద్ధమవు తున్న భర్తకు అడ్డువచ్చింది శ్యామల.
ఏమండీ ఎవరో ఏదో అన్నారని మనం కూడా వెళ్లిపోతే మన మధురిమ బ్రతుకు ఏం కావాలి? ఎవరో దుర్మార్డులు అలా కల్పించారే కాని ఆ అమ్మాయికి మనోహర్క్ ఎలాంటి సంబంధం లేదు. నా మాట వినండి. ఈ ఒక్కరోజువుండి పిన్నిగారిని ఓదార్చి వెళదామండీ" అంటూ ప్రాధేయపడింది శ్యామల.
“నీ కాసలు బుర్ర లేదు.బాబును తీసుకొని బయలుదేరు” అంటూ గర్జించిన భర్తను ఎదురించలేక అనుసరించింది శ్యామల.
ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది.
గంపంత దిగులుతో ఆ తల్లీ, దూతుల్లు బిక్కు బిక్కుమంటూ ఉండిపోయారు. బాబు లేకపోవటం వల్ల ఆ యింట్లో ఎంతో వెలితిగా ఉంది.
(సశేషం)
*****

No comments:

Post a Comment

Pages