ఒడిస్సీ లాస్య సుధ - రమణ కుమారి గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

ఒడిస్సీ లాస్య సుధ - రమణ కుమారి గారితో ముఖాముఖి

Share This

ఒడిస్సీ లాస్య సుధ - రమణ కుమారి గారితో ముఖాముఖి 

భావరాజు పద్మిని 


ఆమె అచ్చతెలుగు అమ్మాయి. అయినా తాను పెరిగిన ఒరిస్సా లో అందుబాటులో ఉన్న నాట్యాన్ని నేర్చుకుని, అందులోనే ఎనలేని పేరు ప్రఖ్యాతులు ఆర్జించి, తెలుగువారి కీర్తిని దిగంతాలకు వ్యాపింప చేస్తున్నారు. నాట్యమే నా ఊపిరి, చివరి శ్వాస దాకా నాట్యం చేస్తూనే ఉంటాను, అనే రమణ కుమారి గారితో ప్రత్యేక ముఖాముఖి, మీ కోసం... 
నమస్కారం. మీకు చిన్నప్పటి  నుంచి డాన్స్ అంటే ఆసక్తి ఉండేదా?
నమస్కారం. నా చిన్నప్పుడు ఒక సారి మా పక్కింటి వాళ్ళతో ఒక పెర్ఫార్మన్స్ చూడడానికి వెళ్లాను. ఆ డాన్స్ నాకు చాలా నచ్చింది. అక్కడ డాన్సర్స్ చక్కగా నాట్యం చేస్తుంటే, హాల్ అంతా ప్రేక్షకులు నిండిపోయి ఉన్నారు. ప్రపంచం  మర్చిపోయి, అంతా మౌనంగా, మంత్రముగ్ధుల్లా చూడసాగారు. మామూలుగా అందరికీ సమయం చాలా విలువైనది కదా. కాని, అవన్నీ మర్చిపోయి వాళ్ళందరూ మైమరచి చూస్తుంటే, అప్పుడు నాకు ‘ఒక కళకు ఇంత విలువిస్తారా?’ అనిపించింది. కాని ఎవరికీ చెప్పలేదు. నేను ఇంటికి వచ్చాకా, పక్కింటి వారే మా నాన్నగారిని కలిసారు. ‘తనకి కూడా బాగా ఆసక్తి ఉన్నట్టు ఉంది కదా, నేర్పిస్తే బాగుంటుంది,’ అన్నారు.
మా నాన్నగారి పేరు జి.జానకి రావు గారు , అమ్మ జి. శాంతి కుమారి. మా అమ్మకి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ మధ్యన ‘శాంతినికేతన్’ అని ఒక సీరియల్ వచ్చేది. అందులో అందరూ వెళ్లి, శాంతినికేతన్ లో డాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. అది చూసాకా, మా అమ్మకి ‘మా అమ్మాయికి కూడా ఇలా డాన్స్ నేర్పిస్తే బాగుంటుంది,’ అనిపించింది. అప్పుడు మేము ఒరిస్సా లో ఉన్నాము. తెలుగువాళ్ళు కనుక అమ్మానాన్నలకి నాకు భరతనాట్యం, కూచిపూడి నేర్పించాలని ఉండేది. కాని అక్కడ లేదు. అందుకే ఏదైనా కళే కదా అన్న ఉద్దేశంతో వారు నన్ను ఒడిస్సీ డాన్స్ స్కూల్ లో వేసారు. వారు అలా వివక్ష చూపనందుకు నిజానికి నేను వారికి కృతఙ్ఞతలు చెప్పాలి. నేను ఇష్టంగా నేర్చుకుని, బాగా నాట్యం చేసేదాన్ని. అంతా నన్ను ఇష్టపడేవారు. చాలా మంచి హావభావాలతో నాట్యం చేస్తూ ఉండడంతో, అందరిలో గుర్తింపు లభించింది. మా తల్లిదండ్రులకు నాపై కాస్త నమ్మకం వచ్చింది.
బాగుందండి, మరి నాట్యం నేర్చుకునేందుకు ఇబ్బందులు ఏమీ ఎదురవలేదా ?
నేను 9 వ తరగతిలో ఉండగా మా నాన్నగారు నన్ను పిలిచి, “నాన్నా, డాన్స్ నీకు హాబీ కదా. ఈ ఒకటిరెండేళ్ళు
చదువుమీద ఎక్కువ దృష్టి పెట్టాలి, కనుక డాన్స్ ఆపెసేయ్యి,” అన్నారు. నేను “చదువుకి, డాన్స్ కి సంబంధం ఏముంది నాన్నా ! పరీక్షలు ఉన్నాయని పల్లు తోముకోడం మానేస్తామా, స్నానం చెయ్యడం, తినడం, పడుకోడం మానేస్తున్నామా? డాన్స్ అనేది చదువుకి ప్రతిబంధకమని నేను అనుకోవట్లేదు” అని వాదించాను. మా ఇంట్లో నాపై అరవడం, కోప్పడ్డం ఉండేది కాదు, ఒక ఫ్రెండ్ లా అనునయంగా మాట్లాడేవారు. ఆయన విశాల దృక్పధంతో ఉండేవారు. అప్పుడు ఆయన,”అలాగే, నీకు ఇష్టమైతే, నువ్వు డాన్స్ కొనసాగించవచ్చు, కాని మార్కులు కూడా బాగా రావాలి,” అన్నారు.  ఒక కళను నేర్చుకోవడం, విద్యాభ్యాసం చెయ్యడం అనేవి ఒకటికొకటి దన్నుగా ఉంటూ పరిపూర్ణమైన ప్రగతికి దోహదపడతాయని నా భావన. అసలు కళల్లో కూడా ఒక్క డాన్స్ మాత్రమే సరిపోదు, సంగీతం, సాహిత్యం మొదలైన వాటిపట్ల కూడా అవగాహన ఉంటే, వాటితో మన సృజనను కలిపి, ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
మరి పూర్తిస్థాయిలో నాట్యాన్నే మీ వృత్తిగా ఎలా స్వీకరించారు?
అంటే, అప్పుడు అలా నా చదువు, దానితోపాటు డాన్స్ కొనసాగింది. మళ్ళీ ఎప్పుడూ మా తల్లిదండ్రులు నా నాట్యానికి అడ్డు చెప్పలేదు. కాని, ఎప్పుడైతే ఒక వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చిందో, అప్పుడు వాళ్లకి నేను కూడా ఒక డాక్టరో, ఇంజనీరో, అయితే బాగుంటుందని అనిపించింది. మా ఊరిలో ఉన్న జిల్లా కలెక్టర్ లు, మిగతా వి.ఐ.పి లు మాకు తెలిసినవారే ఉండేవారు. వారంతా ‘తన డాన్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్పించకండి,’ అనేవారు. కాకపొతే మా తల్లిదండ్రులకు నేను డాన్స్ నే వృత్తిగా ఎంచుకోవడం ఇష్టం ఉండేది కాదు. కాని, ఆ సంగతి నాకు ఎప్పుడూ గట్టిగా చెప్పలేదు. నా సంతోషమే వాళ్ళ సంతోషం అనుకుని, మౌనంగా ఉన్నారు.
తర్వాత నేను ఒడిస్సీ నాట్యంలో డిగ్రీ చేసాను. నాతో పాటు నాట్యం నేర్చుకున్న వాళ్ళలో కూడా ఇప్పుడు ఎంతోమంది మానేశారు. కారణాలు అనేకం. ఆ తర్వాత నేను ఒకసారి విజయలక్ష్మి మొహంతి అనే ప్రముఖ నర్తకిని కలిసాను. ఆమె నేను డాన్స్ ను వృత్తిగా స్వీకరించడం వెనుక వెన్నెముక వంటివారు. ప్రతి ఏడాది, మాటల్లో ‘రమణ్ , కళ పట్ల నీకున్న మక్కువను అర్ధం చేసుకోలేని వారిని పెళ్లి చేసుకోవడం అనే పొరపాటు, జీవితంలో చెయ్యకు,’ అని చెప్పేవారు. నాట్యంలో ఆమెకు విశిష్టమైన స్టైల్ ఉన్న, పెళ్ళయ్యాకా ఆమె బలవంతంగా తన నాట్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కాని ఆమె ఆత్మ నాత్యంతోనే ఉండిపోయింది. ఆమె చెప్పినదానికి అనుగుణంగా ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినా నేను మొదట వాళ్ళ ముందు డాన్స్ ను ఉంచేదాన్ని.
నిజానికి మా తల్లిదండ్రులు చాలా సప్పోర్టివ్ గా ఉండేవారు. అందరికీ అటువంటి తల్లిదండ్రులు లభించాలని నా కోరిక. నీకు ఎందులో ఆనందం ఉంటే అదే చెయ్యమనేవారు తప్ప, ఇది మంచిది, ఇలా చెయ్యి అని నన్ను ఎన్నడూ బలవంతపెట్టలేదు. ఎప్పుడైనా ఒక ప్రస్తావన వచ్చినా, నేను వారితో వాదించి, వాళ్ళను ఒప్పించేదాన్ని. నాకు, నా భావాలకు, ఇష్టాలకు వారు అంత ప్రాధాన్యతని ఇచ్చేవారు. నాకు కావలసిన స్వేచ్చ నాకు సంపూర్ణంగా దొరికేది. నేను వారితో ఏదైనా ఓపెన్ గా మాట్లాడేదాన్ని. ఆ “కంఫర్ట్ జోన్ “ ను అందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వాలని నా భావన. అది భవిష్యత్తులో పిల్లలు స్వయంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇలా నాకు వారు ఇచ్చిన స్వేచ్చ నేను అన్ని విధాలా ఎదిగేలా దోహదపడింది.
ఒక ఆర్టిస్ట్ లైఫ్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏవి ఎలా ఉన్నా, సలహాలు, సూచనల పరంగా కాని, శారీరక బాధల పరంగా కాని, ఆర్ధికంగా కాని, నా తల్లిదండ్రులు అన్ని విధాలా నాకు అండగా నిలిచారు. అలాగే నా భర్త ఉప్పల వేణుమాధవ్ గారు కూడా . నాకు ఇప్పుడు ఒక కూతురు ఉంది. నా తల్లిదండ్రుల వద్ద నాకు లభించిన స్వేచ్చ వారి వద్ద కూడా నాకు దొరికింది.
ఆ తర్వాత నేను అలా డాన్స్ ను ప్రోగ్రామ్స్ మొదలుపెట్టి, పుస్తకాలు చదివి, జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా
ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. వారు అప్పుడూ సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నాకు హైదరాబాద్ లో నా స్వంత స్కూల్ ఉంది. టీచింగ్, ప్రోగ్రామ్స్ కోసం ఒరిస్సా కూడా వెళ్లి వస్తూ ఉంటాను.
మీ విద్యాభ్యాసం ఎంతవరకూ కొనసాగింది ?
నేను లా చదివాను. కాని, జడ్జిమెంట్ పరీక్షకు వెళ్ళలేదు. నిజానికి నేను, నా స్నేహితురాలు అన్నింటిలో చాలా మంచి ప్రతిభ కనబరిచే వాళ్లము. అంతా మా పైనే ఆశలు పెట్టుకున్నారు. మర్నాడు జడ్జిమెంట్ పరీక్ష అనగా, నాకు రాత్రి నిద్ర పట్టలేదు. ఒక తీర్పు చెప్పడం అనేది సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. నిజం నీకు తెలిసినా సాక్షాలు లేకపోతే, తప్పనిసరిగా తప్పుడు తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఆ ఆలోచన నన్ను నిద్రపోనివ్వలేదు. దాన్నే నాన్నగారితో చెప్పాను. “నాన్నా, నేను ఈ పరీక్ష పాస్ అయితే, ఒక రోజులో అనేక తీర్పులు చెప్పాల్సి ఉంటుంది. తప్పుడు తీర్పు చెప్పిన రోజున నాకు మనఃశాంతి ఉండదు. నేను ఆనందంగా ఉండాలంటే, ఈ వృత్తిని సీకరించి, తీర్పులు చెప్పకూడదు. ఆయన ‘సరేనమ్మా, నేను ఛాయస్ నీకే వదిలిపెడుతున్నాను. నువ్వే నిర్ణయించుకో’ అన్నారు. తర్వాత నాట్యాన్నే వృత్తిగా స్వీకరించడం జరిగింది.
ఇన్నేళ్ళ నాట్య జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా ?
ప్రతి పెర్ఫార్మన్స్ డాన్సర్ కు ఒక ప్రత్యేకమైన అనుభూతి అని నేను నమ్ముతాను. ప్రక్క వాయిద్యాలు, లైటింగ్, తోటి డాన్సర్ ల బృందం, వేర్వేరు వాతావరణాలు ఇలా ప్రతీదీ డాన్సర్ కు ముఖ్యమే. ఒక్కొక్క ప్రోగ్రాం కి ఎన్ని రోజులు ప్రాక్టిస్ చేసాము అనేది, అది తనకి తృప్తి కలిగించిందా అనేది కూడా ముఖ్యమే. అందుకే మరొక స్థాయికి ఎదగాలంటే, సరికొత్త అనుభూతిని సొంతం చేసుకోవాలి అంటే, ప్రతి దశలో కష్టపడాల్సిందే. అందుకే నేను ప్రతి ప్రదర్శన ప్రత్యేకమైనదే అని, అది నృత్యం చేసేవారికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుందని నేను నమ్ముతాను. అందుకే నేను ఏ ఒక్క ప్రదర్శనను మిస్ కాను.
ఇక బాగా గుర్తుండిపోయిన ప్రదర్శన అంటే, ‘యాహి మాధవ యాహి కేశవ’ అనే గీత గోవింద కావ్యంలోని గేయానికి నేను మర్నాడు నాట్యం చెయ్యాలి. దాంట్లో ‘ఖండిత నాయిక’ ఉంటుంది. ఆమెను నాలో సృష్టించుకోడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. కాని ఎలాగో, దైవం యొక్క ఆశీస్సుల వల్ల, గాయకులు, వయోలిన్ వాయించేవారు, సంగీతకారులు అంతా కలిసి నాకు ఎంత మంచి వాతావరణాన్ని సృష్టించారంటే, స్టేజి మీద నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. నేను నిజంగా ఆ పాత్రలో ఏడ్చేసాను. నిజానికి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా, నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. కాని అదొక ప్రత్యేకమైన అనుభూతి. అటువంటి హావభావాలు సృష్టించడమే నా కల. స్టేజి మీద ఏడుస్తూ, పడిపోతున్నాను, ఏం జరుగుతోందో నాకే తెలియట్లేదు, ఆ ఉద్వేగభరితమైన క్షణాన్ని సృష్టించాను. ఇది కేవలం ఒక డాన్సర్ వల్లనే కాదు, సంగీతకారులు, ఆ వాతావరణం, అన్నీ కలిస్తేనే ఇటువంటి డాన్స్ పుడుతుంది. అటువంటి క్షణాల్ని ఎన్ని పోగుచేసుకుంటే అంత మంచిదని నా భావన.
మీరు సృష్టించిన డాన్స్ బాలే లలో వైవిధ్యభరితమైనవి ఏమిటి ?
గోకులం గురించి నేను చేసిన  బాలే ఒకటి ఉంది. దీని కధ ఏమిటంటే, దేవతలంతా కలిసి, “కృష్ణుడు అన్ని సార్లు అవతారాలు ధరించి భూలోకానికి రావడానికి గల కారణం ఏమిటి?” అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇంత అందమైన దేవలోకాన్ని వదిలి, భూలోకంలో జన్మించడానికి, అక్కడ ఏముందా అని వారు ఆలోచిస్తూ ఉంటారు. అంతా కలిసి నారద మునిని భూలోకానికి పంపుతారు. ఆయన కృష్ణుడు ఎక్కడెక్కడ అయితే అవతారాలు ధరించాడో, ఆయా ప్రాంతాల్ని దర్శిస్తారు. చివరికి ఏం తేల్చుతారంటే, ఇక్కడ ఉండే “అవ్యాజమైన ప్రేమానురాగాల కోసమే పరమాత్మ మళ్ళీ మళ్ళీ అవతారాలు దాల్చుతున్నారు,”అని. నారదముని ఈ విషయాన్ని దేవతలకి చెప్తారు. దశావతారాల్లో ఒక్కో అవతారానికి ఉన్న విశిష్టతలు ఇందులో చూపాము. ఉదాహరణకు కృష్ణావతారంలో ఆయన యశోద, గోపికలు, గోకులం నుంచి పొందిన ప్రేమను చూపాము. దీనికి ఒరియాలో ఒక ప్రొఫెసర్ ఈ స్క్రిప్ట్ ను చక్కగా రాసారు. దానికి నేను డాన్స్ చేసాను. ఇది నేను మర్చిపోలేని బాలే.
మీరు పొందిన ప్రసంశలు/ అవార్డుల గురించి చెప్పండి.
అవార్డులు రెండు రకాలుగా ఉంటాయని నా భావన. కేవలం అవార్డుల కోసమే ప్రదర్శనలు ఇవ్వాలని నేను అనుకోను. అది నా సిద్ధాంతానికి విరుద్ధం. అందుకే చాలావాటిని ఒద్దన్నాను. నాకు ఎక్కడ నాట్యానికి ఆహ్వానం అందినా, అక్కడ నాట్యం చేసాకా, సత్కరించి, అవార్డు ఇస్తారు. అలాంటివి ‘లాస్య సుధ’ అవార్డు, ఒరిస్సా ఫోక్  అసోసియేషన్ వారు ప్రముఖ గాయిని ‘అక్షో మొహంతి’ అవార్డు, ‘రస ఉల్లాసం’ అనే దానికి డా. రమాదేవి గారు అవార్డు ఇచ్చారు. ఈ మధ్యనే ‘సిరిమువ్వ ఆర్ట్స్’ అని వారొక అవార్డు ఇచ్చారు. ఒరిస్సా లో గజేంద్ర కొండా గారు కూడా ఒక అవార్డు ఇచ్చారు. ఇవి మొదటి రకం అవార్డులు. ఇక రెండవది, స్టేజి మీద చేసేందుకు ఒక డాన్సర్ సృష్టించిన ప్రతి కదలిక ఒక అవార్డే. నా చివరి శ్వాస వరకు నేను నాట్యం చెయ్యగలిగితే నేను చివరదాకా నేను సంతోషంగా ఉండగలుగుతాను.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
‘ఆర్ట్ అనేది మనలో పరిపూర్ణమైన మార్పుకు చేసే ఒక ప్రయాణమని’ నేను నమ్ముతాను. బ్రహ్మ నాట్యవేదాన్ని సృష్టించినప్పుడు కూడా, ఆయన డాన్స్ ను ఒక సాధనంగా సృష్టించారు. ప్రస్తుత సమాజ పరిస్థితులకి కూడా డాన్స్ ఒక మంచి మార్పును, ఆలోచనను మేల్కొల్పడానికి ఉపయోగిస్తుంది. అలా సమాజానికి మేలు చేసే బాలే లు సృష్టించాలని నా ఆకాంక్ష.
శ్రీమతి రమణ కుమారి గారు మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని, మనసారా కోరుకుంటోంది - అచ్చంగా తెలుగు. ఆమె డాన్స్ వీడియో లను  క్రింది  లింక్  లో చూడవచ్చు.

No comments:

Post a Comment

Pages