పోటీతత్వం
బి.వి.సత్యనాగేష్
నేటి ఆధునిక యుగం ఒక పోటీ ప్రపంచం. పోటీలో వున్నవాడే ప్రగతిని సాధిస్తాడు. పోటీలో లేకపోతే వున్న చోటులో కూడా వుండే అవకాశం లేదు. ఉదాహరణకు సైకిల్ తొక్కుతూ వున్నపుడు ముందుకు పోతూవుంటాం. తొక్కడం ఆపితే ఎటో ఒక ప్రక్కకు పడిపోతాం. అలాగే ట్రెడ్ మిల్ కదిలేటపుడు దానితో పాటు మనం పరిగెట్టాలి. అలా పరుగుపెట్టని పక్షంలో క్రిందకి పడిపోవటం ఖాయం. అంతే కాకుండా ట్రెడ్ మిల్ కదిలే దిశకు వ్యతిరేకదిశలో పరుగులెడితేనే మనం క్షేమంగా ఉండగలం.
గాలిపటం పైపైకి ఎగరాలంటే ఎదురొచ్చే గాలిని ‘డీ’ కోవాలి. దారాన్ని లాగినపుడు గాలిపటం గాలిని ఎదుర్కొంటూ పైపైకి వెళ్తుంది. జీవితం కూడా అంతే. పోటీలో వుండే వ్యక్తి నిరంతరం కృషి చేస్తూనే వుండాలి. పోటీ ప్రపంచంలో కొంచెం సమయం విశ్రమించినా మన పోటీదారులు ముందుకు దూసుకెళ్ళే అవకాశం మిన్నగా వుంటుంది. అంతేకాదు తారాస్థాయికి ఎదిగినవారు కూడా నిరంతరం కృషి చేస్తూనే వుంటారు. అలా చెయ్యకపోతే వారి కంటే తక్కువ స్థాయిలో వున్నవారు వారి స్థాయికి ఆక్రమించుకునే అవకాశం వుంది. ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న క్రికెట్ వీరులు కూడా ప్రతీ రోజూ ఒళ్లు వంచి సాధన చేస్తూ వుంటారు. వారు సంపాదించుకున్న పేరును నిలబెట్టుకోవడానికి మరింత కృషి చేస్తూనే వుంటారు. అందువల్ల ఏ రంగానికి చెందిన వ్యక్తులైనా, పోటీ పరీక్షలు రాసేవారు, విధ్యార్థులైనా నిరంతరం పోటీ పడుతూనే వుండాలి. సాధన చేస్తూనే వుండాలి.
చూసే విధానం (PERCEPTION):పోటీ మనకు ఏ విధంగా గోచరిస్తుందనే విషయం చాలా ముఖ్యమైనది. పోటీని ఒక భయంకరమైన పరిస్థితిలా కాకుండా క్లిష్టంగా వున్న ఒక అవకాశం లా తీసుకోవాలి “NO PAIN – NO GAIN” అని వింటూనే వింటాం. అందువల్ల పరిస్థితిని సవాలు (ఛాలెంజ్) గా తీసుకుంటే చక్కటి అనుభవం, జ్ఞానాభివృద్ధి తద్వారా సామర్ధ్యం పెరుగుతాయి.
పోటీ ద్వారా ప్రగతి: టెలికాం,బ్యాంకింగ్ రంగంలో అనేక కంపెనీలు పోటీదారులుగా ప్రవేశించిన తర్వాత ప్రభుత్వరంగ సంస్థలుగా వున్న టెలికాం, బ్యాంకింగ్ సంస్థలు వాటి సేవలను ఎన్నో రెట్లు మెరుగు పరచుకున్నాయి. మెరుగైన సేవలు, 24 గంటల బ్యాంకింగ్, ఎ.టి.ఎమ్ లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి ఎన్నో సదుపాయాలను చూస్తున్నాం. పోటీపడని సంస్థలు పురోగతి లేక మూతపడినవెన్నో వున్నాయి. మనిషి విషయం కూడా అంతే!
గతం నాస్తికాదు: అదొక గొప్ప అనుభవాలు ఆస్థి. గతంలో అనేక రకాల అపజయాల నెదుర్కొని విజయం సాధించిన వారెందరో వున్నారు. ౩౦ సంవత్సరాలు వరుసగా అపజయాలను, నష్టాలను రుచి చూసిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహం లింకన్, వందల ప్రయోగాలలో విఫలమైన తర్వాత ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్, గతంలో ఓడిపోయినా తిరిగి ఎన్నికలలో విజయాలు సాధించిన రాజకీయనాయకులు, గతంలో అపజయం పొందినా తిరిగి విజయాలు సాధిస్తున్న సైంటిస్ట్ లు, డాక్టర్లు, నటీనటులు, వ్యాపారస్థులు,లాయర్లు, ఆటగాళ్ళు...ఇలా ఎంతో మంది మనకు కన్పిస్తూనే వున్నారు. పోటీతత్వం పొంచుకోడానికి వారే మంకు స్ఫూర్తి.
విశ్లేషణతో ప్రగతి:
- మన సామర్ధ్యాలు, బలహీనతలు,అవకాశాలు, అడ్డంకులను అంచనావేసి విశ్లేషణ చేసుకోవాలి. దీనినే SWOT ఎనాలిసిస్ అంటారు.
- మనకున్న సమస్యలేంటి? వాటిని అధిగమించటము ఎలా అనే విషయం పై దృష్టి పెట్టాలి.
- ప్రగతికోసం పోటీతత్వంపై సానుకూలంగా ఆలోచించే తీరును అలవాటు చేసుకోవాలి.
- జ్ఞానాన్ని పెంచుకంటూ పోటీప్రపంచంలో వేగంగా పయనిస్తున్నామా అని ప్రశ్నించుకుని విశ్లేషించుకోవాలి.
- విలువైన సమయాన్ని సద్వినియోగ పరచుకోవాలి. పోటీ ప్రపంచంలో పోటీదారులతో పోటీ పడటం విషయంలో సమయం అనేదే చాలా ముఖ్యమైనది.
- లక్ష్యాన్ని పెద్దదిగా ఊహించుకోగలగాలి. ఊహలో దారిద్ర్యం ఉండకూడదు. ఊహకు ఎవరి అనుమతి అవసరం లేదు కూడా!
- ప్రతికూల ఆలోచనా సరళికి స్వస్తి చెప్పాలి.పోటీ ప్రపంచంలో ప్రతికూల ఆలోచనా సరళి ప్రగతికి ఆటంకంగా మారుతుంది. కనుక స్వస్తి చెప్పాల్సిందే.
- ఓడిపోతామనే భయాన్ని వదిలిపెట్టాలి.
- పోటీప్రపంచంలో లక్ష్యంపై ప్రగాఢ వాంఛ (BURNING DESIRE)ను తగ్గకుండా వుంచుకోడానికి నిత్యం మనసును ఉత్తేజపరచుకుంటూ వుండాలి. కాగాదాలోని జ్వాల ఆరిపోకుండా ఉండాలంటే చమురును వేస్తూనే వుండాలి. అలాగే పోటీతత్వం నీరుకారిపోకుండా ఉత్తేజ పరచుకుంటూ వుండాలి.
- పోటీప్రపంచంలో మనం సాధించిన ప్రగతిని మన అభినందించుకుంటూ మరింత ఉత్సాహంతో ప్రేరణ పొందాలి.
పై పది విషయాలపై దృష్టిని కేంద్రీకరించి పోటీ ప్రపంచంలోని పోటీని ఒక అవకాశంగా తీసుకుని కసితో కృషి చేస్తే ఫలితం సాధ్యమౌతుంది. పోటీయే ప్రగతికి నాంది. కనుక పోటీతత్వాన్ని పెంచు కుంటేనే ఈ పోటీప్రపంచంలో మన ఉనికిని తెలియజేయగలం.
***
No comments:
Post a Comment