ప్రేమతో నీ ఋషి – 19
యనమండ్ర శ్రీనివాస్
( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు.
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి.... కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు స్నిగ్ధ. అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటాడు. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తున్నారు. ఇక చదవండి...)
విమానం దాదాపుగా గమ్యాన్ని చేరుకోనుంది, అలాగే ఋషి ఆలోచనలు కూడా. ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల్ని శాశ్వతంగా తొలగించేందుకు, అప్సరతో తాను సన్నిహితంగా ఉండడం వెనుక ఉన్న కారణాన్ని స్నిగ్ధకు చెప్పాలని అతను నిర్ణయించుకున్నాడు.
స్నిగ్ధ కూడా నిద్ర నుంచి లేచి, కురులు సవరించుకుంది. ఆమె ఋషి వంక చూడలేదు.
ఫ్లైట్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. వారిద్దరూ చెక్ అవుట్ చేసి, ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. ఋషి వారి ‘నేమ్ కార్డు’ ను పట్టుకున్న టాక్సీ డ్రైవర్ ను గుర్తించి, సామాన్లు తీసుకుని, కారులో పెట్టమని, అతన్ని అభ్యర్ధించాడు.
మొదట, స్నిగ్ధ ఋషితో పాటు కారులో వెళ్లేందుకు నిరాకరించింది. కాని, మరోసారి ఆలోచించి, అది కొత్త ప్రదేశం కనుక, అతను పక్కనుంటే మంచిదనుకుని, అతనితో కార్ ఎక్కింది.
“స్నిగ్ధ, నువ్వు ఈ విషయంలో చాలా కలత చెంది ఉన్నావని నాకు తెలుసు. కాని, నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేముందు, కనీసం నాకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాలని నేను భావిస్తున్నాను.” వారిద్దరూ హోటల్ కు వెళ్తూ వెళ్తుండగా ఋషి స్నిగ్దకు నచ్చజెప్పే విషయంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు.
“ఋషి, నేను ప్రశాంతమైన, నిలకడైన మనసుతోనే ఉన్నానని, గత కొన్ని నెలలుగా నా చుట్టూ జరుగుతున్నవన్నీ అర్ధం చేసుకోగల స్థితిలోనే ఉన్నానని అనుకుంటున్నాను. నువ్వు చేసిందాన్నికి ఏదో ఒక కారణాన్ని ఆపాదించి, నన్ను నమ్మించాలని చూడకు. దయుంచి ఇక ఇక్కడితో ఈ సంభాషణ ఆపెయ్యి,” ఈ విషయంపై ఇక మాట్లాడడం ఆమెకు సుతారమూ ఇష్టం లేదు. టాక్సీ ఎంత త్వరగా తమను హోటల్ కు చేరిస్తే అంత మంచిదని ఆమె అనుకుంది.
ముంబై నగరపు సాయంత్రపు ట్రాఫిక్, తనమీదకు రువ్విన సవాలును అధిగమించేందుకు డ్రైవర్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. కాని, దారిలో జరిగిన ఒక ప్రమాదం వల్ల, పూర్తిగా ఆగిపోవడంతో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఆమె టాక్సీలోంచి బయటకు చూస్తూ, అసహనంగా కూర్చుని ఎప్పుడు బయటపడతానా అని ఎదురుచూడసాగింది. ట్రాఫిక్ సిగ్నల్ ఆమెకు దూరంలో ఉంది, అది తరచుగా ఎరుపు-పసుపు-ఆకుపచ్చ రంగులు మారుస్తోంది. కాని సిగ్నల్ కదలిక కంటే, ట్రాఫిక్ కదలిక చాలా నిదానంగా ఉంది.
ఆమె కనుక మామూలు మూడ లో ఉండి ఉంటే, ఋషికి ట్రాఫిక్ లైట్ లు, వాటి రంగుల మీద లెక్చర్ ఇచ్చి ఉండేది. ‘కలర్ బ్లైండ్ నెస్’ – అంటే రంగుల్ని గుర్తించే సామర్ధ్యం లేనివారికి సైతం ఈ ఎరుపు-పసుపు-ఆకుపచ్చ రంగుల్ని గుర్తించడంలో ఏ ఇబ్బంది ఉండదని, అందుకే వీటిని ఎంచుకున్నారని, ఆమెకు బాగా తెలుసు.
ఋషి ఆమె ఆలోచనలను భంగపరుస్తూ, “ స్నిగ్ధ, ప్రస్తుతానికి ఇక్కడితో ఆపేద్దాం, కాని, నేను చెప్పేది నువ్వు వినాలని నేను ఇప్పటికీ నొక్కిచెప్తున్నాను.”
“ఋషి, కమాన్, అది నీ అధీనంలో లేని బలహీన క్షణమని, అందుకే నువ్వు ప్రలోభపడ్డావని, చెప్పడం తప్ప నువ్వు ఇంకేం చెప్తావు ? నిన్ను తిట్టుకున్నంతగా నేను అప్సరను కూడా నిందించను. నువ్వంటే నాకు అసహ్యం వేస్తోంది.” కోపం, చిరాకు, బాధ కలగలిసిన స్వరంతో ఋషి మీద అరిచింది స్నిగ్ధ.
“నీ భావాల్ని అర్ధం చేసుకోగలను స్నిగ్ధ. అప్సర గత కొంతకాలంగా నన్ను లోబరచుకోవాలని చూడడం కూడా నిజమే.” అంటూ ఋషి సంజాయిషీ ఇవ్వబోయాడు.
స్నిగ్ధ అతని మాటలకు అడ్దోస్తూ, “దాన్ని నువ్వూ అంగీకరించావు, ఎందుకంటే, అది ఉచిత ఆహ్వానం కదూ. నువ్వు చేసిన దానికి నువ్వు పశ్చాత్తాప పడుతున్నావా? లేక, నువ్వు సాకులు చెబుతున్నావా? నేనిది నమ్మలేకపోతున్నాను.”
“స్నిగ్ధా, నిజమే నేను అప్సర ఇచ్చిన ఆఫర్ ను అంగీకరించాను, కాని నేను కేవలం విశ్వామిత్ర పెయింటింగ్ చూసేందుకే అక్కడికి వెళ్లాను.” అన్నాడు ఋషి.
“విశ్వామిత్రా? విశ్వామిత్ర పెయింటింగా ? ఓహ్, ఎంత యాధృచ్చికమో చూసావా ఋషీ ! నీలాగే బలహీనమైన హృదయం కల విశ్వామిత్రుడిపై నువ్విదంతా మోపాలని చూస్తున్నావా? కమాన్ ఋషి, నోరు మూసుకో, ఇంకేం మాట్లాడకు,” అతని కారణాలు వింటుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతుంది.
ఋషి ఇంకా సహనం వీడలేదు. “స్నిగ్ధ, నేను చెప్పేది విను. నేను విశ్వామిత్ర పెయింటింగ్ గురించి విన్నప్పటి నుంచి దాన్ని స్వయంగా చూడాలన్న ఉత్సుకత కలిగింది, అదే సమయంలో అప్సర ఆహ్వానించింది. నేనామె ఇంటికి వెళ్ళింది కేవలం పెయింటింగ్ ను చూసేందుకే.”
స్నిగ్ధ ఎగతాళిగా నవ్వింది,”ఓహ్ ఋషి, దయుంచి నాతో అబద్ధాలు ఆడకు. మనం ఇన్నాళ్ళుగా ఎన్నో పెయింటింగ్స్ మీద పని చేస్తున్నాము, నీకు ఆ పెయింటింగే చూడాలని ఎందుకు అనిపించింది? నాకు బాగా తెలుసు ఋషి. ఒక సాన్నిహిత్యం కోసం స్త్రీకి కారణం అవసరం, కాని, పురుషులకి ఒక చోటు చాలు. ఆ చోటు అప్సర ఇల్లు కావాలని నువ్వు కోరుకున్నావు. ఆమె పెద్ద వగలాడి అని ఎవరితోనైనా పడుకునేందుకు సిద్ధమని నీకు...”
ఇక ఋషి భరించలేకపోయాడు, అతను గొంతు పెంచి,” కమాన్ స్నిగ్ధా, మనం ఈ విషయాన్ని ఇక్కడే తేల్చిపారెయ్యాలి. అప్సరతో శృంగారం పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. అప్సర తీరు గురించి నాకు బాగా తెలిసినా, నువ్వు నమ్మినా, నమ్మకపోయినా , నేనామె ఇంటికి కేవలం ఆ పెయింటింగ్ కోసమే వెళ్లాను.” అన్నాడు.
స్నిగ్ధ కూడా స్వరం పెంచి, “పెయింటింగ్, పెయింటింగ్, పెయింటింగ్ ! ఆ పెయింటింగ్ గురించి అంతగా తాపత్రయ పడాల్సింది ఏముంది మిష్టర్ ఋషి ? దాని వంకతో మనల్ని మనం మోసగించుకోవడం ఇక్కడితో ఆపేస్తే మంచిది. నువ్వు, లొంగిపోయావని , ఇప్పుడు దాన్ని కవర్ చేస్తున్నావని నాకు తెలుసు. అంతే కాదు, నా పట్ల నీ ప్రేమ కూడా నకిలీదని నేను భావిస్తున్నాను, లేకపోతే ఇలా జరిగేది కాదు.”
ఋషి అసహనంగా,” అవును స్నిగ్ధ, నీతో ఏకీభవిస్తున్నాను. ఇక్కడ ప్రశ్న నకిలీ దాని గురించే. చివరిసారిగా చెబుతున్నాను విను. నేను ఆమె ఇంటికి ఎందుకు వెళ్ళానంటే, ఆమె మ్యూజియం కోసం కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని నాకు తెలిసింది.” అన్నాడు.
స్నిగ్ధ తాను విన్నది నమ్మలేకపోయింది.
ఋషి మళ్ళీ చెప్పాడు,” విన్నావా? మీరు కోట్లు పెట్టి కొని, మ్యూజియం యొక్క ప్రధాన ఆకర్షణగా ప్రదర్శనకు పెడదామనుకుంటున్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీది. దాని వెల కొన్ని లక్షలు కూడా ఉండదు.”
అలా అని, అతను కిటికీ వైపు తిరిగి, అప్పుడే కాస్త వేగం పుంజుకుంటూ కదులుతున్న ట్రాఫిక్ ను చూడసాగాడు. వారు దాదాపుగా హోటల్ ను చేరుకోబోతున్నారు.
స్నిగ్ధ ఇంకా షాక్ లోనే ఉంది. నకిలీ పెయింటింగ్స్ గురించి ఆమె వార్తల్లో చదివింది, కాని అటువంటివి ఎప్పుడూ చూడలేదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం’ ప్రాజెక్ట్ లో ఒక నకిలీ పెయింటింగ్ అనే మచ్చ ఏర్పడిందంటే ఆమెకు నమ్మశక్యంగా లేదు. ఋషి ఏదో పొరబడి ఉంటాడు, అనుకుంది ఆమె. పెయింటింగ్ యొక్క ప్రామాణికతను నిర్ధారించే విషయంలో ఆమె స్వయంగా శ్రద్ధ వహించింది.
అన్నిటికంటే ముఖ్యంగా, ఆమె దీన్ని ఎందుకు నమ్మలేకపోతోంది అంటే, ఆ ప్రాజెక్ట్ కు ఎంపిక చేసిన పెయింటింగ్స్ యొక్క నాణ్యతకు ఆమే బాధ్యురాలు కనుక. గత కొన్ని నెలలుగా జరిగిన సంఘటనల పరంపరను ఆమె ఇంకా గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి, పేపర్స్ క్లియర్ చేసేముందు తాను ఆ పెయింటింగ్ ను చూడనందుకు ఆమె బాధపడసాగింది. కాని, పెయింటింగ్ ను కొనేందుకు, పేపర్స్ క్లియర్ చేసేటప్పుడు ఆమెకు దాని విషయంలో ఇసుమంతైనా అనుమానం రాలేదు.
నిజానికి, మహేంద్ర ప్రామాణికతను నిర్ధారించమని అడిగినప్పుడు, అదంతా తాను చాలా జాగ్రత్తగా పరిశీలించానని ఆయనకు చాలా విశ్వాసంతో చెప్పింది. ఈ విషయంలో మహేంద్రకు ఎలా జవాబు చెప్పాలా అన్న పూర్తి సందిగ్ధంలో ఆమె ఉండిపోయింది. ఆమెకు ఋషి తో మాట్లాడి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంది. కాని, ఇప్పుడతను మౌనంగా ఉన్నాడు. తానెంతగా చెబుతున్నా వినిపించుకోని ఆమె మొండి వైఖరిని గురించి అతను కోపంగా కూడా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని కదిలించే ధైర్యం చెయ్యలేదు ఆమె.
మరికాస్త ఆలోచించాకా, ఈ విషయంపై మరింత వేచి చూడాలని ఆమె తనను తాను ఒదార్చుకుంది. ఋషి విషయంలో కూడా అదే అనుకుంది. అతను చెప్పేవాటికి ఆధారం లేదు.
ఆమె ఆలోచనల్లో మునిగి ఉండగానే టాక్సీ హోటల్ చేరుకుంది. ఋషి డబ్బులు కట్టాడు. హోటల్ అటండెంట్ వారు వారివారి గదుల్లోకి వెళ్లేందుకు సహాయ పడ్డాడు.
(సశేషం)
No comments:
Post a Comment