సమయం మించి పోలేదు !
- సతీష్
లయ బద్దంగా అందరూ చప్పట్లు చరుస్తూ వుంటే కేకు కట్ చేస్తున్నాను. 60 సంఖ్య చూపిస్తున్న కొవ్వొత్తి ఆర్పి నా మనమడు నాకు కేకు తినిపిస్తున్నాడు. ఎక్కువ కాలం బతికినది నేనే అని పత్రికల వాళ్ళు వచ్చారు, నన్ను ఇంటర్వ్యూ చేయటానికి. వాళ్ళు అందరూ 2 లేదా 3 సంవత్సరాల క్రిందటే ఉద్యోగంలో చేరారు అని తెలిసింది. చూడటానికి అందరూ 40 ఆపైన వయసు వున్నట్లు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ వయసు 25 లోపే !
"మీ గురించి చెప్పండి?" ఒక విలేఖరి ప్రశ్న.
"నా చిన్నపుడు పుట్టినరోజు వస్తే ఎంతో సంతోషం, ఉత్సాహం ఉండేవి. తెల్లవార ఝామునే లేచి అభ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి పెద్దలకు నమస్కరించి, దేవుడి గుడికి వెళ్లి ఆశీర్వచనాలు పొంది స్కూలులో తోటి పిల్లలకు పళ్ళు, మిఠాయిలు పంచి, పెద్దలు ఇచ్చిన బహుమతులు స్వీకరించి ఇంటికి వచ్చి చూసుకుని మురిసిపోయే వాళ్ళం. "
"అభ్యంగన స్నానం అంటే ఏమిటి ?" నా వాక్ ప్రవాహానికి అడ్డు వస్తూ అడిగాడు ఇంకో విలేఖరి.
"నెత్తికి, వంటికి చమురు పెట్టుకుని , సున్నిపిండి తో వళ్ళు నలచి, వేడి నీటితో తలరా స్నానం చేయడం." వివరించాను నేను.
"ఐ కాంట్ బిలీవ్ దిస్ !?" ఎవరో కామెంట్ చేసారు.
"వై ?" అడిగాను నేను.
"మీ రోజుల్లో రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు త్రాగామనే వారు. ఇప్పుడు అరగ్లాసు నీళ్ళు రోజుకు జీతంగా మేము తీసుకుంటున్నాం. మీరు 60 వ పుట్టినరోజు జరుపుకుంటున్న చూడటానికి తొంభయి ఏళ్ల వారిలా వున్నారు. మా తరానికి 40 ఏళ్ళు బ్రతకటమే గొప్ప కాని మీరు 60 ఏళ్ళు పూర్తి చేసుకున్నారని, అది ఎలా సాధ్యం? అని తెలుసుకోవటానికి వస్తే మీరు గొప్పలు చెపుతున్నారు. త్రాగాటానికే నీళ్ళు లేని మాకు నీటితో అభ్యంగన స్నానం అనే ఫాంటసీ గురించి చెబుతున్నారు మీరు."అంటూ పూర్తి చేసాడు అందరిలోకి కొంచెం అనుభవం వున్నట్లు కనిపిస్తున్న విలేఖరి.
"ఏంటి ? రోజుకు అరగ్లాసు నీళ్ళు జీతం తీసుకునే రోజుల్లో వున్నానా ?" నాకు స్పృహ తప్పింది.
****
"స్కూల్ కి లేటు అవుతోంది ఇంకా పక్కలమీదే ఉంటే ఎలా ?" కోడలి అరుపులు వినపడుతున్నాయి.
చిన్నగా నవ్వుకుంటూ పూజ గదిలోంచి బయటకు వచ్చారు చిత్తరంజన్ గారు. ఆవిరి కుడుములు, ఒక గ్లాస్ పళ్ళరసం టేబిలు పైన వుంచి ఎదురు చూస్తోంది చిత్తరంజన్ గారి ఇల్లాలు.
అమ్మాయి నుంచి వచ్చిన ఫోన్ విశేషాలు చెబుతూ వుంటే ఫలహారం తినడం ముగించారు ఆయన ! బట్టలు మార్చుకుని ఆఫీస్ రూం లోకి వచ్చారు .
"గుడ్ మార్నింగ్ సర్ !"అన్నాడు సెక్రటరీ .
"మనది గ్రేట్ మార్నింగ్ వాసు! " అని చిన్నగా తల పంకించి సిద్ధంగా ఉంచిన, ఆ రోజు షెడ్యూలు చూసుకున్నారు .
ఉదయం పది గంటలకు మంత్రి మండలి మీటింగ్. మధ్యాహ్నం రెండు గంటలకు జలరక్షణ కార్యక్రమం. సాయంత్రం ఐదు గంటలకు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ ముగింపు కార్యక్రమం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఏ కార్యక్రమంలో ఏమి మాట్లాడాలో మనసులోనే తలచుకున్నారు !
కనుల ముందు రాత్రి వచ్చిన కలే కదలాడుతోంది !
***
మధ్యాహ్నం సమయం : మూడు గంటలు
"అబ్బబ్బ ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి కదండీ!?" గవర్నర్ గారితో అంటున్నాడు ఒక పెద్దమనిషి. నవ్వి వూరుకున్నారు ఆయన.
జలసంరక్షణ కార్యక్రమం అది...
"ఇంకుడు గుంటలు తవ్వుదాం, వాన నీటిని ఒడిసి పడదాం," అని గట్టిగా స్లొగన్స్ ఇస్తూ సభ్యులు సమావేశ ప్రదేశంలోకి వస్తున్నారు. వక్తలు తమ ఉపన్యాసాల విన్యాసాలు చేస్తున్నారు. నీళ్ళు, వాటి ఆవశ్యకత , వచ్చేతరం అంటూ దంచేసారు.
చిత్తరంజన్ గారు ప్రసంగం మొదలు పెట్టారు..
"సభకు వందనం. వానాకాలం,శీతాకాలం ఎక్కడాలేవు. ఉన్నకాలం అంతా, మండే కాలం! ఎండాకాలం!! కలకాలం!! ఇది కాదు, దేముని వినోదం. మనిషి తన పాపాలకు చెల్లిస్తున్న మూల్యం. డెబ్భయ్ శాతం నీరు, ముప్పై శాతం భూమిని కలిగిన మనం భూమి పై నీరు లేకుండా చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉచితంగా వస్తున్న వాటిని, నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వాటి ధరకు మనం సరి తూగలేం. గాలి, నీరు, భూమి, ఆకాశం ఏదైనా ఇప్పుడు కాలుష్యమయం అడ్డుగా వచ్చిన ప్రతీ చెట్టూచేమా, రాయీ రప్ప అన్నీ తీసి పడేయడమే ! కాళీగా ఉన్న ప్రతీ భూమీ, మన స్థలం సరిపోకపోతే అనుకుని ఉన్న నీటి చెరువులు అన్నీ ఆక్రమణ! ఇంకా ఎందుకు ఎదురుచూపులు, ఎవ్వరూ రారు మనకు సహాయం చేయడానికి. అన్నీ ప్రభుత్వం చేయాలంటే ఎలా ?"
"మనం అందరి కలిస్తే ఈ పరిస్తితులను ప్రక్షాళన చేయగలం ఇవాళే! ఒక్కసారైనా ఆలోచించారా ? మనం తప్పు చేస్తున్నామో లేదో? మిద్దెపైన ఉండే వాటర్ టాంకు నింపటానికి స్విచ్ వేస్తాం ,నీళ్ళు పొంగి పోయి ఎవరైనా చెబితేనే ఆఫ్ చేస్తాం ! ప్రతీ ఇంటికి మునిసిపల్ వాటర్ కనెక్షనుపక్కవాళ్ళ కు రాకుండా మన మోటారు చేస్తాం ఆన్ ! పిల్లలు స్కూలుకి తీసుకుని వెళ్ళిన వాటర్ బోటిల్ ఖాళి అవ్వకపోతే ,ఇంటికి వచ్చిన ఆ నీరు చేస్తాం మురుగునీటి పాలు పక్కనే ఉన్న మొక్కలలో అయినా పోయం, టాయ్లెట్ వాడకానికి బట్టలు ఉతికిన నీరు వాడకూడదా? స్నానం షవర్ కిందే చేయాలా, బొత్ టబ్ నీళ్ళు ప్రతీ చోటులో నీటి వాడకం ఎక్కువగా చేస్తాం."
"ఇకనైనా మారుదాం! కొత్తగా నీటిని పుట్టించలేం, దానికి మార్గం నీటి అదా మాత్రమే. పదిగ్లాసుల వాడకానికి రెండో మూడో గ్లాసుల తో సరిపెడదాం. వర్షం నీరు భూమిలోకి ఇంకేలా చేద్దాం. అందుకు అడ్డుగా వచ్చే ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైక్లింగ్ చేద్దాం. ప్లాస్టిక్ వాడకం మానేద్దాం. మంచి నీటి పైపులు లీకులు లేకుండా చూద్దాం. లీకులు అరికట్టడానికి వెంటనే సంబధించిన అధికారులకు తెలియపరచేట్లువారి ఫోన్ నంబర్లు అందరికీ తెలిసే విధంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరదాం. శుభం"
****
సాయంత్రం సమయం : ఐదు గంటలు
ఆడిటోరియం నిండిపోయింది, ఆహుతులు వారి స్థానాల్లో కుర్చుని వున్నారు. ప్రార్ధన, జ్యోతి ప్రజ్వలన తరువాత ఆహుతులు వరుసగా తమ సందేశాలు ఇవ్వటం , విద్యార్ధులు వాటినిగురించి గుసగుసలు అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు చాన్సెలర్ గారి ప్రసంగం... సభ అంతా కరతాళధ్వనులు...
ముక్కు సూటిగా మాట్లాడటమే కాక మంచి వక్తాగా ఆయనకు ఉన్న పేరు సభను నిశ్శబ్దంగా ఉంచింది.
"నా యువ సోదర సోదరీమణులారా మీకు నా అభినందనలు, చదువు అనే లోకం నుంచి జీవితం అనే లోకం లోకి మీకు నా ఆహ్వానం. ఒక్కసారిగా సభ అంతా మళ్ళీ కరతాళధ్వనులు. ఈ ప్రపంచంలో మనం అందరం మన తోటి జీవ జాలంతో కలసి మెలిసి జీవించడానికి వచ్చాం, కానీ ఈ నాటి రోజున మన పరిస్తితి ఏమిటి అంటే మనకు అడ్డు వచ్చినది ఎవారైనా, ఏదైనా అడ్డు తొలగించవలసిందే! నిజం. కావాలంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. రోడ్లున్నాయి వాటిని వెడల్పు చేయడంలో అడ్డువచ్చిన చెట్లు ఎక్కడ? మనం ఇల్లు కట్టుకోవడం కోసం కొన్న స్థలం సరిపోలేదు పక్కనే ఉన్న చెరువు ఆక్రమణ. ఇలాగే సాగితే, మానవులు అడ్డుగా వున్నారని ఇతర జీవ జాతులు అనుకుంటాయి. డైనోసారులు ఉండేవి అని ఎలా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నామో, మానవులు ఉండేవారు అని ఇతర జీవ జాతులు చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రతీ సంపదా దుబారాగా ఖర్చు చేస్తున్నాం. ఒక గదిలోకి వెళ్ళినపుడు చీకటి తొలగించడానికి లైట్ వేస్తాం. తిరిగి ఆ గదిలోంచి బయటకు వెళ్ళేపుడు లైటు ఆఫ్ చేస్తామా ? నీటికోసం తిప్పిన నల్లా ఆఫ్ అవ్వకపోతే ఇంకా దానిని తిరిగి పట్టించుకోం. "
"ఈ రోజు ప్రపంచం ఎదురుకుంటున్న అనేక సమస్యల్లో ఒకటి నీటిఎద్దడి. క్రితం రాత్రి నాకు వచ్చిన కలకు, కారణం అయిన ఒక కధను మీకు ఇపుడు చెపుతాను. ఆ కధ అబ్దుల్ కలాం గారు నీటి కరువు గురించి ఇచ్చిన ఒక ప్రెజంటేషన్ గురించి. వారు భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించి, ఒక వ్యక్తి 2070 లో లేఖ రాస్తున్నట్టుగా చిత్రీకరించారు. వినండి ఆ కధ..."
'ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను..... త్రాగలేను, అంత నీరు ఇప్పుడు అంబాటులో లేదు.
నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం. ఇప్పుడున సమాజంలో అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని.
నాకు గుర్తుంది, అప్పుడు నాకు 5 ఏళ్ళు, అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది. ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి, ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి, దాదాపు అరగంట పాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక. అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన టవల్సతో శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాము. స్నానం చేయడమనేది అసలు లేనేలేదు. రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేసేది.
ఇంతకముందు ఆడవాళ్ళకు అందమైన జుట్టు ఉండేది. కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించడానికి అందరూ రోజు తల మొత్తం నున్నగా షేవ్ చేసుకుంటున్నారు. అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్‌తో కడిగేవారు. ఇప్పుడా విషయం మా అబ్బాయికి చెప్తే, అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడంలేదు.
నాకు గుర్తుంది, నీటిని కాపాడండి, సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్ పోస్టర్లు ఉండేవి, రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నీరనేది ఎప్పటికి తరగని సహజవనరని మాకు భావన ఉండేది.
కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు, డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి, లేదా పూర్తిగా కలుషితమయ్యాయి.
పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు మాత్రమే అధికశాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి. వాటిలో పని చేసే కార్మీకులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు. నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది.
రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి, ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి. నీటిబాటిల్ కోసం అగంతకులు గన్‌తో భయపెడుతున్నారు. 80% ఆహారం అంతా కృతిమమే. నీరు లేకపోతే ఏం పండుతుంది?
గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు. ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే 'అవకాశం' మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు.
ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు ఉపయోగిస్తున్నాము. ఇంతకముందువలే నేత బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి. అటువంటి బట్టలు ధరించినా, వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా.
ఇప్పుడు మేము డ్రైనేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంకు వాడుతున్నాము. ఎందుకంటే డ్రైనేజి వ్యవస్థకు కూడా నీరు అవసరం.
జనాల యొక్క బాహ్యరూపం చాలా భయంకరంగా ఉంది. ముడతలు పడి, డిహైడ్రేషన్ కారణంగా కృశించి, అతినీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి, ఓజోన్ పొర లేని కారణంగా చాలా దారుణమైన చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు. చర్మక్యాన్సర్, వాతప్రకోపిత రోగాలు, మూత్రపిండ సంబంధిత వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు.
చర్మం అధికంగా పొడిబారడం వలన 20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధించినా, ఎటువంటి మార్గం కనుగొనలేకపోతున్నారు. నీటిని ఉత్పత్తి చేయలేము, చెట్లు, పచ్చదనం తగ్గిన కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది. ఆధునికతరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది.
పురుషుల వీర్యకణాల్లో కూడా తేడాలు సంక్రమించాయి. ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక అవయవ లోపాలతో, రోగాలతో పుడుతున్నారు.
గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గరి నుంచి డబ్బులు వసూల్ చేస్తోంది. 137 కూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశం ఇస్తోంది. ప్రజల ఊపిరి తిత్తులు ఎప్పుడో చెడిపోయాయి, అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరి తిత్తులు కనుగొన్నారు, వాటిని వెంటిలేటేడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు. డబ్బులు కట్టలేని వాళ్ళని వెంటిలేటేడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు. అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి మంచిదేమీ కాదు, కానీ ఏదో పూటగడుస్తుందంతే.
కొన్ని దేశాల్లో ఇప్పటికి నదుల పక్కన పచ్చని మైదానాలు ఉన్నాయి. కానీ వాటిని రక్షించడం కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది. నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది, బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది.
నేనుండే చోట వృక్షాలు అసలే లేవు, ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలు పడవు. ఎప్పుడైన వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది. 20 వ శతాబ్దంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం, అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది. అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు, కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు.
నా కొడుకు, నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడు పచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి, వానల గురించి, నదులు, డ్యాముల్లో ఈత కొట్టడం గురించి, చేపలు పట్టడం గురించి, కడుపు నిండుగా నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడుతాను.
అప్పుడు వాడు 'నాన్నా! ఇప్పుడు నీళ్ళెందుకు లేవు?' అని అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. నాకు కలిగే అపరాధభావం నుంచి బయటపడలేను. ఎందుకంటే నా తరమే పర్యావరణవినాశనానికి దోహదపడింది, ఎన్ని హెచ్చరికలు చేసిన బేఖాతరు చేసింది. ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు. పర్యావరణ విధ్వంసం దారుణమైన స్థితికి చేరుకుంది, ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు.
కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఎలా చెప్పాలని ఉంది. ఈ భూమాతను కాపాడటానికి ఇంకా మనకు సమయం మిగిలే ఉందని. కానీ అదెలా సాధ్యం. ఈ విషయం గురించి నాకు వచ్చిన కల, అబ్దుల్ కలాం గారి ఆలోచనలు నిజం కాకూడదని నేను కోరుకుంటున్నాను.
రండి , ఇంకా సమయం మిగిలే ఉంది, భూమాతను, ప్రకృతిని కాపాడటానికి. రండి చేయి, చేయి కలుపుదాం, మంచి భవిష్యత్ ముందు తరాలకు అందిద్దాం. జై హింద్.
ఆయన స్టేజి దిగిన పావుగంట దాకా హాల్ లో కరతాళధ్వనులు మారుమ్రోగుతూనే ఉన్నాయి. ప్రకృతి పట్ల గౌరవ భావంతో, సమాజం పట్ల ఒక నిబద్ధతతో నిండిపోయాయి అందరి మనసులూ ! ఆలోచన నుంచి జనించే కొత్త శకానికి అప్పుడే శ్రీకారం చుట్టబడింది.
******
No comments:
Post a Comment