శ్రీధర మాధురి – 31 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి – 31

Share This

శ్రీధర మాధురి – 31

(దైవప్రేమను గురించి పూజ్యశ్రీ  వి.వి.శ్రీధర్ గురూజీ అమృతవాక్కులు)


తేనెటీగ నుంచి తేనెను దొంగిలించవచ్చు, కాని తేనెను తయారుచేసే కళను కాదు. దాన్ని దోచేందుకు వీలుకాదు. ఇలాగే దైవం ప్రతి ఒక్కరినీ ఏదో ఒకదానితో దీవించారు. దైవానుగ్రహం, దీవెనల వల్ల మీరు మీలోని ఆ ప్రత్యేకమైన కళను/ప్రవృత్తిని తెలుసుకోగలుగుతారు.
***
అందరం ఆయన గొడుగు నీడలో ఉన్నాము. ఆలయం నుంచి దేవీదేవతలను బయటకు తెచ్చినప్పుడు ఒకటో రెండో గొడుగుల్ని దేవుడి పైన పట్టుకుంటాము. రాజు విహారానికి వెళ్ళినప్పుడు సేవకులు వెనుక నుంచి ఆయన తలమీదకు  వచ్చేలా గొడుగు పట్టుకుంటారు. ఇది దైవం యొక్క, లేక రాజు యొక్క ఆధిక్యాన్ని చాటుతుంది. ఇది భగవంతుడు, భాగవతుడు  అనే అంశాలను కూడా సూచిస్తుంది. ఎండ, వాన నుంచి దైవానికి నీడనిచ్చేందుకు భాగవతుడు ఆయనకు గొడుగు పడతాడు. భాగవతుడికి భగవంతుడు ఇలా చెబుతాడు,”నాపట్ల గల ప్రేమతో నీవు ఈ గొడుగు మోస్తున్నావు, నీకెప్పుడూ గొడుగుగా (కవచంగా) నేనుంటాను. భగవంతుడిగా, నీకెప్పుడూ నేనుంటాను, నువ్వెల్లప్పుడూ నా రక్షణ(గొడుగు)లో ఉంటావు.”...
***
దైవం తన సృష్టిలోని ప్రతి అంశాన్ని అంగీకరించి, వాటిలో వేటి పట్లా విభేదాలను చూపనప్పుడు, మనము కూడా  ప్రతీ దాన్ని ఆయనలాగే చూసి,  వాటిపట్ల దయను, బేషరతైన ప్రేమను చూపాలని, ఆయన  మనకు మార్గాన్ని చూపుతున్నట్లే కదా !
***
 దైవానికి నిజమైన భక్తుడు బహుమానాలకి, శిక్షలకి తేడా చూపలేడు. అతనికి అన్నీ దైవానుగ్రహమే. ఆయనను సంపూర్ణ శరణాగతి వేడి, ఆయన ఇచ్చను పూర్తిగా అంగీకరిస్తాడు. నిజంగా అటువంటి భక్తుడు దైవం యొక్క కరుణకు, దయకు ప్రతిరూపం వంటివాడు.
***
మీరు భౌతిక ప్రపంచానికి చెందినవారు కనుక, మీరు లౌకిక దృష్టితో ఉండడాన్ని నేను అర్ధం చేసుకోగలను. నా పరంగా, నాకు అన్నీ దైవీకమైనవే, భౌతిక దృష్టి, అందులో ఒక భాగం మాత్రమే. చాలా మంది ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పొందేందుకు లౌకిక ప్రపంచాన్ని విడనాడాలని భావిస్తారు. మీరు ఈ ప్రపంచంలో నివసిస్తూ ఉన్నంతవరకూ, మీరు లౌకిక ప్రపంచానికి అతీతంగా బ్రతకలేరు. ఇది కేవలం దృక్పధానికి సంబంధించిన అంశం. సిరిసంపదల్లో జీవించండి, కాని, ఏదీ మీది కాదని, మనసులో ఉంచుకోండి. లౌకిక ప్రపంచాన్ని త్రోసిపుచ్చి (పృథ్వి, భూ, నీల, లక్ష్మి ), నారాయణుడిని చేరడం సాధ్యమని నేను అనుకోవట్లేదు. ఆ మహాపురుషుడే ఈ పృథ్విని సృష్టించాడు, కాబట్టి దాన్ని త్రోసి పుచ్చడం, నారాయణుడిని త్రోసిపుచ్చడం వంటిదే. అందుకే వైష్ణవులు నామాన్ని (తెలుపు – U లేక Y గుర్తులో), మధ్యలో శ్రీచూర్ణం ( ఎరుపు, పసుపు )తో ధరిస్తారు.
***
ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపదకు అతీతం కాదు, ఇరుప్రక్కల నామం రూపంలో దైవం ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడితే, మధ్యలో అమ్మవారు లౌకిక సంపదగా భాసిస్తుంది. లౌకిక ప్రగతి ఇరుప్రక్కలా ఉన్న ఆధ్యాత్మిక ప్రగతితో సంరక్షించబడి, మంచి సమతుల్యతలో ఉంటుంది.అందుకే పరిపూర్ణత అనేది దైవీకమైనది.
***
తిరునామం, శ్రీచూర్ణం అనేవి వరుసగా దైవం యొక్క పాదాలు, మధ్యలో లక్ష్మీదేవి. మీరు వంగి, ఆయన పాదాలపై తలను ఉంచి నమస్కరించేటప్పుడు అది శరణాగతి. మీరు ఆయన్ను పూర్తిగా శరణాగతి వేడితే ఆధ్యాత్మిక లేక భౌతిక ప్రగతికి ఎటువంటి లోటూ ఉండదు.
***
భగవంతుడి  పాదాల్ని భాగవతుడు ఇంట్లో పెట్టుకని, పూజిస్తుంటాడు. అయితే, దైవం ఎవరి పాదాల్ని పూజిస్తారు ?
కృష్ణ భగవానుడు తన ఉదయం పూజను ముగించుకుని, తనను చూసేందుకు వచ్చిన నారదుడికి మంగళహారతి అద్దుకోమని చూపారు.
నారదుడు – ఇప్పటిదాకా నేను మీరు సాక్షాత్తూ నారాయణులని భావించి మిమ్మల్ని పూజిస్తూ వచ్చాను. నా దైవమే పూజ చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఎవరికి చేస్తూ ఉండాలి ? ఈ నాటకం ఏమిటి కృష్ణా ?
కృష్ణుడు – ఇక్కడ చూడు, ఏమిటిది ?
నారదుడు – రాగి పాత్ర, అయితే మీరు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం వంటి షోడశోపచార పూజలన్నీ ఈ రాగి పాత్రకు సమర్పించారా? ఈ రాగి పాత్ర మీకంటే శక్తివంతమైనదా ?
కృష్ణుడు – ఆ పాత్రలో ఏముందో చూడు.
నారదుడు చూడగా, ఆయనకు కేవలం మట్టి అందులో కనిపించింది.
నారదుడు – మీరు మట్టిని పూజిస్తారా ?
కృష్ణుడు నారదుడిని ఆటపట్టించాడు – “మరీ అంత కఠినంగా మాట్లాడకు, ఇది మామూలు మట్టి కాదు. నా ప్రతి భక్తుడు నన్ను ‘కృష్ణా’ ‘కృష్ణా’ అని తలస్తూ ఉంటాడు. నా భక్తులు నన్ను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడు నేనేం చేస్తానంటే, ఆ భక్తుడి (భాగవతుడి) వెనకాలే వెళ్లి, వారు నడిచి వెళ్ళాకా, అతని కాళ్ళ క్రింద నుంచి ఒక మట్టి కణాన్ని ప్రోగుచేస్తాను. ఈ పాత్రలో ఉన్న మట్టి కణాలన్నీ నా భాగవతుల పాదాల నుంచి సేకరించినవే. నేనూ వారిని ప్రేమిస్తాను. వారు ఎల్లప్పుడూ నా గురించే ఆలోచిస్తూ ఉంటారు కనుక, నేనూ వారి గురించే ఆలోచిస్తూ ఉంటాను. వారి ప్రేమకు గౌరవ సూచకంగా, నేను ప్రోగుచేసిన ఈ మట్టిని రోజూ పూజిస్తాను....’
కాబట్టి భాగవతుడు(భక్తుడు) నామాన్ని, శ్రీచూర్ణాన్ని దైవం యొక్క పాదాలకు చిహ్నంగా ధరించినట్లు, దైవం కూడా తిరునామాన్ని, శ్రీచూర్ణాన్ని భాగవతుడి పాదాలకు చిహ్నంగా ఆయన నుదుటిపై ధరిస్తారు.
భగవంతుడు, భాగవతుడు ఎల్లప్పుడు దైవికంగా అనుసంధానమై ఉంటారు.
***
చాలా మంది మేధావులకు ఆశ్చర్యపోయే కళ ఉండదు. వారి పరంగా ప్రతీ దానికి ఓ కారణం ఉంది, అది వెతకడంలోనే వారికి ఆసక్తి. వారు విచ్చేదనం చేస్తూ పోతారు. వారు జీవితంలో ప్రతీ దాన్ని మైక్రోస్కోప్, లేక టెలీస్కోప్ లోంచి చూస్తారు. ప్రకృతి మాత ఎంత అద్భుతమైనది అంటే ఆమె ఏ సూక్ష్మ లేక స్థూల పరీక్షలకు అందదు. ప్రకృతి ఆట మొదలుపెడుతుంది. అది ఏదో ఒక చిన్న ముక్కను చూపుతుంది, ఈ మేధావులు దాన్ని కాగితాలపై పెట్టి, ‘కనుగొన్నాము’ అంటారు. వారు సాధించిన విజయం వల్ల ఇప్పుడు వారి అహం పెరుగుతుంది. కొన్ని దశాబ్దాల తర్వాత, మరో మేధావి, మొదట కనుగొన్న సిద్దాంతం లోపాలతో నిండి ఉన్నాదని నిరూపిస్తాడు. ఇప్పుడు ఈ పెద్దమనిషి, కారణాలు వెతకడం మొదలుపెడతాడు. ఈ ప్రక్రియ వలయాకారంగా కొనసాగుతూ ఉంటుంది. వాస్తవం ఎంత విస్త్రుతమైనది అంటే, దాన్ని చూసి మనం ఆస్వాదించవచ్చు, ఆశ్చర్యపోవచ్చు, కాని కారణాలతో ఇదీ అని తేల్చి చెప్పలేము. ఆ నిజాన్నే ‘దైవం’ అంటారు.
***
ఒక నిజమైన భక్తుడు గురువు కోసం అన్నింటినీ త్యాగం చేస్తాడు. అతని ప్రపంచం మొత్తం గురువే. ఇంకేదీ అతని మనసులోకి రాదు. ఏదీ అతని ధ్యాస మళ్ళించలేదు. అతని ప్రాణం గురువే. గురువు యొక్క ఆదేశాల్ని వినేందుకు అతను ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు, దానికి అనుగుణంగానే నడుచుకుంటాడు. అతని సంపద, జ్ఞానం, కీర్తి, విశిష్టతలు, భావనలు, చివరికి అతని శరీరం కూడా గురువుకు అర్పించబడి ఉంటుంది. అటువంటి భక్తుడిని వైకుంఠ ద్వారం వద్ద  స్వయంగా విష్ణువే ఆహ్వానిస్తారు.
***
క్రొవ్వొత్తి గురువు, లోపల కాలే ఒత్తి, భక్తుడు/దాసుడు. వారిద్దరూ కలిసి, చీకటి లోకానికి వెలుగును తీసుకుని వస్తారు. ఒత్తి కాలుతున్న కొద్దీ, మైనం (గురువు ) కరుగుతుంది. వారిద్దరూ కలిసి, ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని దీపింపచేస్తారు. వారిద్దరినీ వేరు చెయ్యడం వీలుకాదు, వారు సామరస్యంగా పని చేస్తారు. వారిద్దరూ ఒకరినొకరు దన్నుగా ఉంటారు.
***
మీరు భక్తుడిగా/దాసుడిగా మారగానే, ఇక ఇరుక్కుని పోయినట్లే. బయటున్న మైనాన్ని తుంచకుండా, క్రొవ్వొత్తిలో ఉన్న దారాన్ని వెలికి తీయడం కష్టం. దారం (భక్తుడు) అన్నివైపుల నుంచి మైనం (గురువు) తో ఆవరించబడి ఉంటుంది. అటువంటి నిజమైన భక్తుడు అన్నిటా, అంతటా దైవాన్నే చూస్తాడు.
***
 గురువు మిమ్మల్ని పూర్తిగా అర్ధం చేసుకుంటారు. మనసులో ఏవో ఉద్దేశాల్ని దాచుకుని, ఆయన వద్దకు వెళ్ళకండి. శూన్యమైన మేధస్సుతో, ప్రేమతో నిండిన మనసుతో వెళ్ళండి.
***
ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ , ప్రముఖ సంస్థ నిర్వహిస్తున్న ధ్యానం గురించిన ఒక వర్క్ షాప్ కు వెళ్లేందుకు నా అనుమతిని అడుగుతున్నారు.
నేను –  ‘నువ్వు నీ కుటుంబ పోషణకు ఒక ఉద్యోగం ఎందుకు వెతుక్కోకూడదూ ?’
అతను – ‘గురూజీ, ఈ వర్క్ షాప్ ను గురించి నేను యు ట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసాను, నాకు వెళ్లాలని ఉంది.
నా భావాలను అర్ధం చేసుకోండి...’
నేను – ‘నీకు ఏ పని చేసేందుకూ ఎవరిఅనుమతినీ అడగాల్సిన పని లేదు. ఇది నీ జీవితం, నీకు నచ్చిన విధంగా చెయ్యవచ్చు. దైవం నీకు శాంతిని ప్రసాదించే దిశను చూపుగాక.’
ఈ రోజుల్లో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు పరిణితి చూపడం యువతకు తెలియదు. ఒక గురువుగా, నాకు మీ భావాలు బాగా తెలుసు, ఈ విషయంలో మాకు మీ సూచనలు వద్దు.
అంతేకాక, మీరు ఒక విషయం గురించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, గురువు వద్దకు వెళ్లి, అనుమతి కోరవలసిన అవసరం ఏముంది ? ఆయన ఖచ్చితంగా మీకు రెండో బాజా వాయించరు. గురువు వద్ద ఏవైనా సమస్యలను ప్రస్తావిస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పదాల్ని ఎంపిక చేసుకోవాలి.
***
దైవం ఏ నీడ, ఆహారం, ఏ దిక్కూ లేని వీధి కుక్క గురించి కూడా శ్రద్ధ వహించినప్పుడు, మన గురించి వహించరా ? వీధికుక్క దైవం ఇచ్చిన జీవితాన్ని అంగీకరించి, తేలిగ్గా జీవితాన్ని ఈదుతుంది. కాని, మనం దైవం ఇచ్చినవన్నీ అంగీకరించకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. మనం ఇంకేదో ఆశిస్తాము. అందుకే వేదన, బాధ.
***

No comments:

Post a Comment

Pages