తాత మార్చిన తరం
పి.వి.ఆర్. గోపీనాథ్
చెన్నైలో ఉన్న భర్తతో స్కైపులో ఏదో విషయమై సీరియస్ గా చర్చిస్తున్న రాజి ఉలిక్కి పడింది. కొరియర్లున్న ఈ రోజుల్లో ఇంకా పోస్టేమిటా అనుకుంటూ లేవబోయింది.
అది చూసిన మూర్తి లేస్తావేం జవాబు చెప్పకుండా అన్నాడుత దాదాపు గద్దించినట్లుగానే.....
"పోస్టుట చూసి వస్తా..."
"అదెక్కడికీ పోదులే. ముందిది చెప్పు. నాకవతల కంపెనీకి టైమవుతోంది. 16న రమ్మంటావా?"
"పదహారునా..?!"
"ఏం వారం రోజులు సరిపోవా?"
"గడువు గురించి కాదు..."
"మరి... ఓహో . శుక్రవారమనా...!"
జవాబు చెప్పలేకపోయింది.
"కర్మ. అసలు మనం ఇదెందుకు నిర్ణయించుకున్నామో మరిచిపోయావా....
అయినా నాకిహ టైము లేదు. 16నే వస్తా. 17న పని చూసుకుని వచ్చేయాలి. మళ్లీ 18న టొరంటో పోవాలి కదా..."
విసురుగా లేచిపోయాడు.
********
ఉసూరుమంటూ ల్యాప్ టాప్ కట్టేసి సిటౌటులోకి వచ్చిన రాజిని గచ్చుపై పడి ఉన్న ఇన్లాండు కవరు పలకరించింది. వెనక్కు తిప్పి చూస్తే ఎవరు రాసిందీ లేదు. మరింత విస్తుబోతూ తెరుస్తూనే ఉలిక్కిపడింది.
కారణం.....
సీ : మా తాతలే మాకు మా మంచి నేస్తాలు ... ఆటలూ, అల్లరీ అంతులేదు !
అమ్మమ్మ, బామ్మలే ఆదరంగా చూసి ... తారంగ మాడేరు తనివి దీర !!
సరదాలు, సరసాలు, శతకాలు, సుద్దులూ ... నేర్పుగా పాఠాలు నేర్పినారు !
గాడి తప్పితె మాకు గోడకుర్చీలుండె ... అమ్మ నాన్నలెపుడు అడ్డు రారు !!
తే.గీ. అట్టి బంగారు రోజులే వట్టిపోయె !
వేగమైనది యుగమంటె వెఱ్ఱిగాదె ?
ఏవి మారెను, బంధమ్ములేవి మారె ?
మంచి చెడ్డల బేరీజు మార లేదె ?!
కవరులో నిలువుగా గుండ్రటి అక్షరాలతో రాసి ఉన్న ఈ పద్యం తప్ప పైన సంబోధన గాని చివర సంతకం గాని లేవు. ఎప్పుడు రాసేరో తెలీదు. తిప్పి చూస్తే షరామామూలే అన్నట్లు ఎప్పుడు పోస్టయిందీ కూడా అర్థం కాలేదు. కానీ ...
మలకపేటలో పోస్టు చేయబడినట్లు తెలుస్తోంది. ఎవరు రాసేరో అర్థమవుతూనే రాజి ఒక్కసారిగా షాక్ తింది. సుశీల.... రాసిందెవరైనా తనకిప్పుడు పంపింది మాత్రం సుశీలే. మనసు తన ప్రమేయం లేకుండానే గతంలోకి పరుగు తీసింది.
********
గోపాలరావు గారికి సంప్రదాయాలంటే గౌరవం. సమాజాన్ని బాగుచేయాలనే తపన. అయితే మాటలతో కన్నా పద్యాలతోనే అయితే ఆసక్తిగా చూస్తారని ఆయన ఉద్దేశం. అందుకే ఎప్పుడూ ఏదో ఒక అంశంపై పద్యాలు రాస్తూ ఉంటారు. ఇద్దరు కొడుకులు, ఓ కూతురూ. వారూ వారి సహచరులూ ఆరుగురూ పెద్ద ఉద్యోగాలలోనే ఉన్నారు. భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాల నుంచి తప్పుకున్నాక పదేళ్ళుగా పెద్ద కొడుకు దగ్గరే గుంటూరులోనే ఉంటున్నారు. కూతురూ అల్లుడూ హైదరాబాదులోనే మలక్ పేటలో ఉంటారు. కొడుకులలో రెండోవాడు బెంగుళూరులోఉంటాడు ఈ దంపతులు అటూ ఇటూ తిరుగుతూ అప్పుడప్పుడూ అమ్మాయిని కూడా పలకరిస్తూ ఉంటారు..
రావుగారికి ఉమ్మడి కుటుంబం అంటే గురి. రాజి చిన్నప్పుడు గుంటూరులో రావు గారింటి పక్కనే ఉండేవారు. వీరిని తాతా, అమ్మమ్మా అని పిలిచేంత చనవు. ఈమె తల్లి దండ్రులూ ఆ పెద్దలను వరసలతోనే గౌరవించేవారు. కష్ట సుఖాలు చెప్పుకునేవారు. ఆయన పిల్లలూ ముగ్గురూ బుద్ధిమంతులే. వారికీ తండ్రి గుణాలే అబ్బాయి. అవి ఆ రోజులు గనుక రావుగారు అందరినీ వయసులను బట్టి ఒరే ఒసే అంటూ మంచీ సెబ్బరా కనుక్కుంటూ సలహా సూచనలిస్తూ ుండేవాడు. చేసింది పత్రికా ుద్యోగం కావడం వల్లనేమో సంఘం పట్ల అభిమానంతోపాడూ బాష పట్ల సాహిత్యం పట్ల మక్కువ. ఎక్కువగా పద్యాలు మాత్రమే రాస్తుండేవారు.పది వాక్యాలకన్నా నాలుగు లైన్లయితేనే తేలికగా బుర్రకెక్కుతాయనేది ఆయన వాదన.
పిల్లలూ అలాంటి వారే కావడంతో పిల్లలకు ఉద్యోగాలు దొరికి పెళ్ళిళ్లయే వరకూ ఆ యిల్లు వచ్చేపోయే వారితో సందడిగా ఉండేది.
ఆ రోజుల్లోనే ఓ పత్రికవారు ఉమ్మడి కుటుంబంపై పద్యాల పోటీ పెడితే రావుగారు రాసిన పద్యమే పై పద్యం. వారి పిల్లలతోగాక మనమలూ మనుమరాండ్రతో కూడా రాజి కుటుంబానికి సాననిహిత్యం ఉండేది. ఆ సాన్నిహిత్యమే ఇప్పుడా పద్యం ఈమె ముంగిట వ్రాలింది. కారణం... ఈమె కుటుంబంలో రేగిన కలతల గురించి రావుగారి మనుమల వరకూ పాకడమే. ఆ కుటుంబాలన్నిటా ఈ విషయమై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి మరి..కానీ, అసలు విషయం మాత్రం ఎవరికీ తెలీదనే అనుకోవాలి.
రాజి తాత నాయనమ్మలు ఆమె చిన్నతనంలోనే ఏదో ప్రమాదంలో పోయారు. దాంతో ఆమెకు తాత నాయనమ్మల సాహచర్యం, ఆ మాధుర్యం అనుభవంలోకి రాలేదు. అమ్మమ్మ, తాత ఉన్నా వారు ఎక్కువ ఆమె మేనమామతోనే గడిపేవారు. కూతురింటికి పోవాలంటే తగని మొహమాటం. ఏదో చుట్టపు చూపు మాత్రమే.. ఇటు రాజీ ఒక్కతే కూతురు కావడంతో ఆడింది ఆటా పాడింది పాటా. అంత మాత్రాన మరీ ఈ కాలం పిల్లల్లా కాదు. తనకూ సంప్రదాయాల పట్ల కొంత చాదస్తం ఉంది. దాంతోపాటే వ్యక్తిత్వం ముసుగులో తన మాటే నెగ్గాలనే తగని పట్టుదల. తల్లిదండ్రులు ఇంకా సర్వీసులోనే ఉండడంతో వారికి ఈమె కాపురం గురించి పెద్దగా పట్టించుకునే అవకాశం లేనట్లు వ్యవహరిస్తారు. అది సమంజసం కాదని చెప్పేవారు లేకపోవడం, చెప్పనా వినకపోవడం. పైగా రాజి కూడా చిన్న పిల్లేం కాదుగా అనుకోవడం.. ఇంతకూ సమస్య ఏమంటే.....
********
" పోస్ట్ ! "
అప్పుడే రాజితో చాటింగ్ ముగించి లేచిన మూర్తిలో అసహనం పూర్తిగా తొలగలేదు. ల్యాపుటాప్ ఆఫ్ చేసి వడియాలు వేయించుకుందామనుకుంటూ వంటింట్లోకి నడుస్తుండగానే కారిడార్ లోంచి కేక. తనకసలు ఉత్తరాలే రావు. కొరియర్లయినా కంపెనీ చిరునామాకే వచ్చేది. మరి..... కారిడార్ లోకి వచ్చి చూడగానే నేలపై నీలం ఇన్లాండ్ కవరు పిలుస్తోంది. అతనికి నిజంగానే మతిపోయింది. వెనక్కి తిప్పి చూస్తే ఎవర్రాసేరో తెలీదు. హైదరాబాదులోని మలక్ పేట నుంచి అని మాత్రం తెలుస్తోంది. కొంత ఆశ్చర్యం, మరి కొంత అనాసక్తంగానే తెరిచి చూసేడు. సంబోధన లేదు. తారీకు లేదు. చివర సంతకమూ లేదు...!!
కానీ, నిలువుగా గుండ్రటి దస్తూరితో....
" సీ : మా తాతలే మాకు మా మంచి నేస్తాలు ... ఆటలూ, అల్లరీ అంతులేదు !
అమ్మమ్మ, బామ్మలే ఆదరంగా చూసి ... తారంగ మాడేరు తనివి దీర !!
సరదాలు, సరసాలు, శతకాలు, సుద్దులూ ... నేర్పుగా పాఠాలు నేర్పినారు !
గాడి తప్పితె మాకు గోడకుర్చీలుండె ... అమ్మ నాన్నలెపుడు అడ్డు రారు !!
తే.గీ. అట్టి బంగారు రోజులే వట్టిపోయె !
వేగమైనది యుగమంటె వెఱ్ఱిగాదె ?
ఏవి మారెను, బంధమ్ములేవి మారె ?
మంచి చెడ్డల బేరీజు మార లేదె ?!"
ఉలిక్కి పడ్డాడు. ఎవరు పంపేరో తెలిసిపోయిందతనికి. ఇంకెవరు రాఘవే అయ్యుండాలనుకున్నాడు. అనుకోగానే సుశీలా గుర్తొచ్చింది. అవును, సుశీలే... వద్దనుకున్నా మాట వినని మనసు గతంలోకీ పరుగు తీసింది...
రాఘవ చెల్లెలే సుశీల. రాఘవ గుంటూరులో తనకు క్లాస్ మేట్. మూర్తీ, రాఘవా, సుశీలా, రాజి అంతా ఒకే స్కూలు, కాలేజీ. గోపాలరావుగారి తమ్ముడి మనుమడే రాఘవా, అతడి చెల్లెలు సుశీల. వారిల్లూ అక్కడే కావడంతో ఎవరి పిల్లలు ఎవరో తెలియనట్లుగా కలిసిపోయారు. అప్పట్లో అందరి మనసులూ కలిసే ఉన్నా, ఎవరి భావాలు వారివే అన్నట్లు పెరిగారు. అదే విశేషం. పెద్దలు వారికా స్వతంత్రం ఇచ్చారు. అయినా ఎవరూ కట్టు దప్పలేదు. క్రమశిక్షణ వీడలేదు. రాఘవా, సుశీలా అచ్చు గోపాలరావు గారి బావాలే ఔపోశన పట్టారు. అదృష్టం కొద్దీ ద్యోగాల రీత్యా ఇద్దరి కాపురాలూ హైదరాబాదే కాక, మలకపేటకే చేరుకున్నాయి.
రాజీది ఆమె తండ్రి తరహా. వ్రతాలూ పూజలూ వరకైతే సరే. కానీ పాతకాలం సంప్రదాయాలన్నీ పాటించడానికి మాత్రం మనసు మొరాయస్తుంది. ఆమె తల్లి వారించ చూసినా తండ్రి దన్నుతో పట్టించుకోలేదు. విసుగెత్తి ఆమే ఊరుకుంది. ఇహ మూర్తిది వీరికి పూర్తిగా భిన్నం. దేవుడు చేసిన రోజులన్నీ ఒకటేననీ మనసూ, చేసే పనీ మంచిదైతే చాలనుననీ వాదిస్తాడు. పాడ్యమి నుంచి పూర్ణిమ వరకూ, చివరకు అమావాస్య కూడా పూజలకు అనువైనవీ, పండగ చేసుకునేవే అవుతున్నప్పుడు మిగతా మంచి పనులకు మాత్రం ఎందుకు పనికిరావంటాడు.
అయితే అందరూ చిన్నప్పటి నుంచీ కలిసి ఉండటం, తల్లిదండ్రుల మధ్యా సాన్నిహిత్యం ఉండటంతో యెదిగే కొద్దీ మూర్తి మనసు మొదట సుశీలవైపే మళ్ళింది. కానీ, ఇతని భావాలతో ఏకీభవించలేని సుశీల ఆదిలోనే ఇతని ఆశలపై నీళ్లు చల్లింది. కాకపోతే మంచి స్నేహితులుగా మిగిలారు. తర్వాత చదవుల కారణంగా రాజీ, మూర్తీ ఒకే చోట చేరడం, ఆ తర్వాత ఉద్యోగాల రీత్యా ఒకే ఊరిలో ఉండవలసి రావడంతో పాటు భావాలు దాదాపుగా కలిసి పోవడంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తల్లి దండ్రులకూ అభ్యంతరం లేకపోవడంతో ఒక్కటైనారు.కానీ, ఆ తర్వాతే వచ్చింది. సమస్య. వచ్చిందనేకన్నా వారే తెచ్చుకున్నారనడమే సబబుగా ఉంటుందేమో...
మూర్తికీ, రాజీకీ ఇద్దరికీ ఉమ్మడి కుటుంబం పట్ల సదవగాహన లేదు. తమ ప్రైవసీకి అడ్డం అనుకున్నారు. రాఘవగారు తప్పా వీరి ఇళ్లళ్ళో చెప్పేవారు లేకపోవడంతో వీరికి ెప్పేవారు లేకపోయారు. అటు మూర్తికీ ఉమ్మడి కుటుంబం వల్ల లాబాలు తెలిసే అవకాశం లేదు. అతను ఎదిగీ ఎదగక ముందే తాతలూ, అమ్మా, నాయనమ్మా వానప్రస్థం అంటూ కాశీ వెళ్ళి మరి వెనుదిరగలేదు. దాంతో అతనికీ చెప్పేవారు లేరు. ఇద్దరూ హైదరాబాద్ చేరారు. రాఘవా, సుశీలా కూడా అక్కడే స్థిరపడడం వల్ల. రాకపోకలూ, పూర్వపు సాన్నిహిత్మూ చివుల్ళు తొడిగి పరస్పరం సమస్యలు చెప్పుకునే వరకూ వెళ్లింది. రాఘవ తల్లిదండ్రులూ, సుశీల అత్తమామలూ కూడా వీరికి దగ్గరైనారు.
అయితే వీరి మనసులోని భావాలు మాత్రం తొలగలేదు. ఈ నేపథ్యంలో పెద్దలెంతగా చెప్పినా తమ సంతోషాలకు పిల్లలు భారమనుకున్నారేమో ఆ మాటే తలపెట్టలేదు. అయితే ఏదో సందర్భంలో రాజి చాదస్తం మూర్తికి నచ్చేది కాదు. ఆ విషయమై తరచూ ఘర్షణ పడటం రాఘవా, సుశీలా సర్దుబాటు చేయడం. చివరకు సమస్య తీవ్రం అవుతున్న నేపథ్యంలో మూర్తికి చెన్నై ట్రాన్స్ ఫర్ కావడంతో రాజీని తనతో వచ్చెయ్యమన్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆమెను ఒప్పించడానికి రాఘవా, సుశీలా కూడా ప్రయత్నించారు కానీ సాద్యం కాలేదు. కారణం, మూర్తితో పాటూ అప్పుడే రిటైరైన అతని తల్లి దండ్రులు కూడా చెన్నై బయల్దేరడమే. నిజానికి మూర్తికీ నచ్చకపోయినా లోకం కోసం తప్పదనుకున్నాడు. కానీ రాజీ మాత్రం సిద్ధం కాలేదు. వీరిని ఏకం చేసేందుకు పిల్లలు లేకపోవడం మరో ప్రతిబంధకమయింది. అయితే అసలు బంధం తెంచుకోలేక తరచూ అతనూ హైదరాబాద్ రావడమో, ఈమె చెన్నై వెళ్లడమే జరుగుతూనే ఉంది. వెళ్ళినా అత్తమామలతో సరిగా ఉండేది కాదు. అక్కడా కొంత అలజడి తప్పడం లేదు. ఈ పరిస్థితులలోనే రెండేళ్ళూ గడిచిపోయాయి. మూర్తిని అతని తల్లిదండ్రులు పోరుతున్నారు. అమ్మాయిని తీసుకురారా అని. అతను తప్పించుకు తిరుగుతుంటే చివరకు గట్టిగా నిలదీస్తూండడంతో ఇలా కాదనుకుని పూర్తిగా విడిపోవాలనుకున్నారు. అయితే ఇటు పెద్దలకు గానీ, అటు పెద్దలకు గానీ తెలియనివ్వలేదింకా. రాజీ తల్లి దండ్రులకు వీరి మద్య ఉన్న గొడవలేవీ అసలు తెలీదు. వారింకా సర్వీసులోనే ఉన్నందున తమ గొడవల్లో వారున్నారు. రాకపోకలు మామూలుగానే ఉండటంతో అనుమానించలేదు. పండగలకూ, పబ్బాలకూ పిలిచినా ఒకటి రెండు సార్లు తప్పదన్నట్లు వెళ్ళినా ఆ తర్వాత అల్లుడూ కూతురూ కూడా ఏవో సాకులతో తప్పించుకోసాగారు మరి. దాంతో ఏవో అనుమానాలు కలిగినా వారు తమ మనసులకే నచ్చజెప్పుకున్నారు. మరి వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నాక కూడా పెద్దలకు ఇప్పుడే తెలియనివ్వకూడదనుకున్నారు. అలాగే తమ నేస్తాలకూ చెప్పకూడదనుకున్నారాయె. మరి ఇప్పుడు...?!?
*********
రెండు రోజులుగా రాజీ మనసు మనసులో లేదు. దేనికో కూడా అర్థం కావడంలేదు. ఆఫీసుకు వెళ్తున్నా యాంత్రికంగానే. తేదీ దగ్గర పడుతోందనా, రాఘవ నుంచి శాశ్వతంగా దూరం కావాలనా, ఇంతగా ప్రేమిచింది ఇందుకా... మరు క్షణమే మనసు తిరుగుబాటు. అతనూ అలాగే అనుకోవాలిగా... "అనుకుంటున్నాడో లేదో నీకు తెలుసా?" లోపలనుంచి ఎవరో తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నట్లనిపించి ఉలిక్కిపడంది. క్షణం సేపే. అప్పుడే మ్రోగింది సెల్. సుశీల నుంచే. గోపాలరావు తాతారు వచ్చేరు. నిన్ను కలవరిస్తున్నారు అంటూ... ఆమాటే నాగస్వరంలాగ అనిపించింది. మరి మాటలేకుండా వచ్చేస్తున్నానంది. వెంటనే ఆఫీసుకు ఫోన్ చేసి సెలవు పెట్టి మలక్ పేట బయల్దేరింది. హైదరాబాద్ కదా... పంజగుట్టలో బయల్దేరిన క్యాబ్ లక్డీకాపూల్ దాటకుండానే ట్రాఫిక్ జామ్. రాజీ మనసులోనే విసుక్కుంది. మనసు బాధ పడుతున్నపుడు కావలసిన సాంత్వనను దైవమే ఏర్పాటు చేస్తాడు కాబోలు. అది ఆలస్యమవుతున్నదన్న భావన కూడా ఆమెకు తెలియకుండానే ఆమెలో ప్రవేశించినట్లయింది. చివరకు తీరికగా మలక్ పేట చేరేసరికి లంచ్ వేళకూడా దాటేసింది. అయినా వారి పలకరింపులూ, ఆప్యాయతా చూశాక తనను టిఫిన్ కూడా చేయకుండానే బయల్దేరానన్న మాట కూడా మరిచింది రాజీ. సాధారణంగా తన టిఫినూ, లంచీ కూడా ఆఫీసులోనే మరి. భోజనాలయ్యే వరకూ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అది గోపాలరావుగారి ఆదేశం కదా. అంతా సర్దుకునీ అవీ ఇవీ మాట్లాడాక ఆయనే అడిగాడు.
అయితే రాజా.. నా పద్యం చదివావా...
ఉలిక్కిపడింది. అయోమయంగా, ఏదో నేరం చేసిన దానిలా చూసింది. అర్థమయిందా పెద్దాయనకు.
సుశీల నాకు అంతా చెప్పిందమ్మా. నువ్వు చాలా తొందరపడుతున్నావు. అందుకే మీతో పెద్దలు ఉండాలనేది. వారే మీతో ఉంటే మీకూ పిల్లలు కలిగేవారు. బాధ్యతలు పెరిగి బావాలలోనూ మార్పు వచ్చేది. కదా..అసలు మీకు నేను నేర్పిందేమిట్రా. ఏం నేర్చుకున్నారు మీరు.. మంచి రోజులు చూడాలన్నానే గానీ, అన్నిటికీ అదే పెద్ద చాదస్తంగా పోవాలనలేదే. అసలు వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలుసునా మీలో ఎవరికైనా.. మన బావాలను మనం కాపాడుకుంటే చాలునా... దాంపత్యం అన్నాక అవతలి వారితో సమన్వయం సహకారం కలిగ అక్కర్లేదా... విడిపోవడానిక్కూడా మంచి రోజు కావాలంటున్నావంటే నువ్వెంత వెర్రిగా తయారయ్యావో తెలుస్తున్నదా...దీన్ని మీ భాోలో మేనియా అంటారా లేక పోబియా అంటారో మేం మాత్రం మీ తలలకు రోకలి కూడా సరిపోదంటాము. ఒక్క ముక్క చెప్పు. నీ అత్తామామలు దుర్మార్గులా, నిన్ను రాచి రంపాన పెడతారా, పీనాసులా, దుబారా మనుషులా, మీ అమ్మానాన్నలను రానివ్వరా...ఏ కారణంతో వారిని దూరంగా ఉంచాలంటున్నావో చెప్పగలవా... పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో చెప్పగలవా.. సుశీలకూ పిల్లడున్నాడు కదా.. ఇక్కడే దీని అత్తమామలూ ఉన్నారు. మరి ఇది సుఖపడటం లేదని చెప్పగలవా. మీది ప్రేమ వివాహం కదా... మీ అమ్మా నాన్నలు గానీ, అత్త మామలుగానీ ఏ దశలోనైనా మీ వివాహానికి అడ్డు చెప్పిన దాఖలాలున్నాయా....
జవాబు చెప్పలేక ఏదో మహాపరాధం చేసి దొరికిపోయిన దానిలా తల దించుకుంటుంటే......
ఎవరో చుబుకం పట్టుకుని పైకెత్తిన స్పర్శ. అదిరిపడి చూసింది. ఎవరికైతే తాము అసలు తెలియనీయకూడ దనునున్నామో వారే...తన తల్లీ, దండ్రీ. తండ్రి కాస్త బిగబట్టుకున్నా తల్లి మాత్రం మూర్తీభవించిన శోకమూర్తిలా కాదు, ధైర్యం చెప్పే దేవతలా...
అసలు వీరందరికీ ఎలా తెలిసిందీ... తాము సుశీలకూ, రాఘవకూ కూడా తెలియనీయలేదే.. ఆలోచనలతోనే ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు తప్పదంటూ ఆఫీసుకు వెళ్ళింది. అక్కడే టే ఇంకా ఏం వత్తిళ్ళు వస్తాయో అని భయం కాబోలు....
**********
" సారీ మూర్తీజీ. మీ ప్రాజెక్టు సకాలంలో కాలేదట కదా..వారు వెనక్కు పోయారు. మీ ట్రిప్ క్యాన్సిలయింది. వి ఆర్ సారీ. ీ సారైనా ప్రాజెక్టులు సకాలంలో అయ్యేట్లు చూడండి మరి.. "
లేకపోతే ఏమవుతందో తెలుసుగా అనకపోయినా ఆ మాటల ద్వారా తెలుస్తూనే ఉంది. తన వెనుక రాజకీయమేదో జరిగిందని గ్రహించిన మూర్తి కొంత నిరుత్సాహంగా మరికొంత అసహనంగా ఎండి చాంబరులోంచి బయటకు వచ్చాడు. నేరుగా క్యాంటీన్ వైపు వెళ్తూండటం చూసి ఆనంద్ అనుసరించాడు. ఏమయిందన్నా.. ఎందుకలా ఉన్నావ్. అంటూ ఆరా తీయడంతో జరిగింది చెప్పాడు. ఆనంద్ మూర్తీ ఒకేసారి చేరారా కంపెనీలో. మూర్తి చెన్నై వచ్చినపుడు మొదట ఇద్దరికీ ఒకే ప్రాజెక్టు వర్కు లభించడంతో ఇద్దరూ స్నేహితులైనారు. సాన్నిహిత్యం పెరిగంది అనేకంటే ఆనందే పెరిగేట్లు చూసుకున్నాడనటం సబబు. అందుకు తగిన కారణమూ ఉంది మరి. అది వేరే విషయం.
ఇప్పుడీ ట్రిప్ క్యాన్సల్ అనగానే అతను మనసులోనే ఆనందించాడు. పైకి మాత్రం
"పోనిస్తూ. ఇప్పుడు టొరంటో పోనంత మాత్రాన మన కొలువులకూ కెరీరుకూ పెద్ద ముప్పేం లేదుగా. అయినా ఇదే జీవితం కాదుగా. ఇదీ ఒకందుకూ మంచిదే అనుకో...హైదరాబాదులో తీరికగా మాట్లాడుకోవచ్చచు కదా" అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ మూర్తిలో మార్పు రాకపోవడం చూసి, అదలా ఉంచి, హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు, రాజి ఏమన్నదీ అంటూ మార్చాడు. వివరం తెలుసుకుని నిట్టూర్పు విడిచినట్లు నటించి ఊరుకున్నాడు.. ఎప్పుడూ లేనిదీ ఇవాళేమిటి వీడు ఇంత తొందరగా వదిలేశాడూ అనుకుంటూ, చివరి మాటలలో ఏదో అనుమానం తోచినా ఎక్కువ ఆలోచించే ఓపిక లేకపోవడంతో ఓ సిగరెట్ కాల్చి తనూ రొటీనులో పడిపోయాడు.
కొద్దిసేపటికే సుశీల నుంచి ఫోన్. గోపాలరావు తాతారు(చిన్నప్పటి పిలుపే అలవాటైపోయింది. పెద్దయినందున ముందు పేరు మాత్రం తగిలించారు.) వచ్చారనీ కలవాలనుకుంటున్నారనీ...ఆయనెందుకు పిలుస్తారో తెలిసినా తమ సంగతులు అక్కడి వరకూ పాకే చాన్సులేదని ధీమాగా ఉన్న మూర్తి వస్తున్నానంటూ ముక్తసరిగా జవాబిచ్చి ఫోన్ పెట్టేశాడు.
*********
ఫ్లైటెక్కుతూనే ఉలిక్కిపడ్డాడు. తనకన్నా ముందే ఆనంద్. వీడెందుకు వస్తున్నట్లూ...అదే అడిగితే ఊరికే అమ్మ చూడాలని గొడవ పెడుతుంటేనూ.... ఆ మాట నమ్మాలనిపించకపోయినా నమ్మక చేసేదేమీ లేదు గనుక ఓహో అని మాత్రం ఊరుకున్నాడు మూర్తి. ఇంకే ప్రశ్నా కనీసం ఎన్నాళ్ళుంటావని కూడా అడక్కపోవడం చూసి స్నేహితుడి మనసు అంచనా వేస్తూ తనలోనే నవ్వుకున్నాడు ఆనంద్ కూడా. నిజానికి ఆనంద్ పక్క సీట్లోనే కార్తీక్ కూడా ఉన్నాడు. కానీ, అతడెవరో మూర్తికి తెలిసే అవకాశం లేకపోవడంతో కథ మరింత ముదుకు సాగుతున్నది.
వైదేహీ ఎవరొచ్చారో చూడు. నీళ్ళు పట్రా. ఆయన హడావుడీ ఆ పిలుపూ మరోసారి మూర్తి మతి పోగొట్టాయి. ఏమిటిదీ ఏమవుతోందిక్కడా, ఏమి కాబోతోంది....తను రాజీతో మాట్లాడి లేచినప్పటి నుంచీ అనూహ్యాలే... ఇక ఒకదానికికొకటి కలుపుకుని ఆలోచించే ఓపిక కూడా లేకపోయిందతనికి. మౌనంగా అత్తగారి చేతిలోంచి చెంబు అందుకుంటూ ఆమె పరామర్శకు జవాబు చెప్తూ లోపలకు నడిచాడు.
అంతలోనే బయట నుంచి వచ్చిన మామగారు అల్లుడిని చూస్తూనే ఏదో అనబోయాడు కానీ,
"రారా రాజూ వెళ్ళిన పనేమయిందీ?" అంటూ గోపాలరావుగారు పలకరిస్తూ కనుసైగ చేయడం వలన వాతావరణం చెడలేదు.
" ఏమంటాడూ? మనవాడేగా, సంతోషించాడు. తానూ అదే ఆలోచిస్తున్నాడంట. వస్తున్నాడు."
హమ్మయ్య బతికించాడు అంటూ నిట్టూర్చేడాయన ఆనందంగా.
ఆయనకలా జవాబిచ్చి, ఏం అల్లుడుగారూ కులాసాయేనా. చెన్నైలో వానలు ఎలా ఉన్నాయీ అంటూ ఏవో తప్పనిసరి ప్రశ్నలు నాలుగు వేసేలోగానే లోపలి నుంచి అన్నాలకు పిలుపు వచ్చింది. వెంటనే మూర్తి పక్కగదిలోకి వెళ్ళాడు బట్టలు మార్చుకోవడానికి. కాళ్ళూ చేతులూ కడుక్కుని తుండుతో ముఖం తుడుచుకుంటూ ఇవతలకు వచ్చిన వాడికి మరో షాక్. ఎదురుగా దాదాపు రౌద్ర మూర్తిలా తల్లి. ఆ వెకే తండ్రి. హఠాత్తుగా వారినక్కడ చూసేసిరికి ఏమి జరగబోతున్నదో లీలా మాత్రంగా అర్థమయింది. కానీ సమాచారం ఎలా చేరిందో, అసలు చేరిన సమాచారం ఏమిటో మాత్రం అంతు బట్టడం లేదు. అయినా తప్పదు గనుక ఎప్పుడొచ్చారు అమ్మా, బావున్నారా నాన్నా అంటూ పలకరించబోయాడు. శంకర్ గారు ఏదో అనబోయేలోగానే తల్లి “వాడితో మాట్లాడకండి. మనం లేనట్టే వాడికి ...”.ఇంకా ఏదో అనబోతుండగా
“ నీకేం చెప్పాను లక్ష్మీ...” వెనక నుంచి మందలింపూ, సముదాయింపూ కలగలసిన కేక రావడంతో తమాయించుకుని విసవిస లోపలకు వెల్లిపోయింది. తండ్రి శంకరం గారూ వరండాలోకి నిష్క్రమించారు. తిరిగి భోజనాలు ముగిసే వరకూ ఎవరూ మాట్లాడలేదు. అమ్మాయి లేదేం వదినగారూ అన్న లక్ష్మి ప్రశ్నకు వైదేహి జవాబిచ్చే లోగానే సుశీలే కల్పించుకుని ఇవాళేదో స్పెషల్ డ్యూటీ ఉందని వెళిపోయిందత్తా. సాయంత్రం పెందలాడే వస్తానన్నదిలే అని జవాబిచ్చింది. మూర్తికి మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్లే ఉంది.
సాయంత్రం నిద్రలేచాక అలా పోయి వస్తానంటూ మూర్తి బయటకు నడిచాడు.
అన్న ప్రకారం అయిదింటికే ఇల్లు చేరిన రాజీకి అత్తా మామలు కనిపించేసరికి గుండెలు జారినట్లనిపించింది. తప్పని సరై పలకరించింది. కానీ వారు మాత్రం ఆప్యాయంగానే మాట్లాడడంతో వారికేమీ తెలీదనుకుని చల్లబడింది.
ఎక్కడెక్కడో తిరిగి దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరిన మూర్తికి గుమ్మలోనే ...
"దీపాలు వెలిగె ... పరదాలు తొలగె... " అంటూ పాతకాలం సినిమా పాట మంద్రంగా టీవీలోంచి వినపడ సాగింది. ఊగిసలాడ బోయిన మనసును అదుముకుంటూ లోపలకు అడుగుపెట్టిన అతనికి ఆ గదిలోంచి ఈ గదిలోకి పోతూ రాజి కనబడింది. దిగిందన్న మాట అనుకున్నాడు కసిగా... టీవీలో పాట ముగిసింది. అయితే ఈలోగా బయట జల్లు మొదలుకావడంతో వియ్యపురాళ్ళు ఇద్దరూ కూడబలుక్కున్నట్లుగా వేడి వేడి మిర్చి బజ్జీలు నిలువునా కోసి ఉల్లపాయలు పేర్చి, పైన నిమ్మ రసం జల్లి పక్కనే క్యాషూబర్ఫీతో ఒక్కప్లేటు మాత్రమే అలంకరించి గదిలోకి అందునా రాజితోనే పంపారు. మొదట తను మొరాయించింది. కోప్పడి పంపించారు. ఆ ఇద్దరికీ ఏం మాట్లాడుకోవాలో తోచలేదు. పెద్దలకు ఎం తెలుసో, ఎంత తెలుసో తమకేమీ తెలియదాయె మరి. ఏవో పొడి పొడి మాటలూ, ఆఫీసు కబుర్లతో గడిపేశారు.
అసులు ఘట్టం రాత్రి మొదలైంది. భోజనాలు కాగానే రాజీని చక్కగా సన్నజాజులూ, గులాబులతో జడ అలంకరించారు. లోలోపల గునుస్తూనే పూలపై మోజు వల్ల బుద్ధిగా జడేయించుకుంది. తీరా గదిలోకి పోబోయే వేళకు అతను ముందే అక్కడికి చేరుకుని(చేరుకోలేదు. వీరే అతడికీ ఆ పైజమా లాల్చీ తొడిగించి మరీ పంపారు) అసహన మూర్తియై అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. గది తీరు చూసి ఈసారి గట్టిగానే దెబ్బలాడంది. లోపలకు పోనంటే పోననీ అమ్మ దగ్గరే పడుకుంటాననీ వాదించింది. అదేమంటే అమ్మను చూసి చాలా కాలమయింది, మళ్లీ ఎప్పుడో అంటూ వంక పెట్టాలనుకుంది. కానీ ఆవిడే...
" ఏం ఒక్క పూటకే నిర్ణయం మారిపోతుందని భయమా?" అంటూ నవ్వూ, కోపమూ కలిపిన స్వరంతో తల్లే ప్రశ్నించేసరికి తానేదో అనబోగా,
"రేప్పొద్దున మాట్లాడుకుందాం లేండి వదినా" అంటూ అత్తగారు దాటించేయడంతో ఇంకేమీ అనలేక విస విస మంటూ గదిలోకి పోయింది.
అయితే గదిలోకి పోతూన మూర్తిపై విరుచుకుపడాలని చూసింది. “మనమేమనుకున్నాం. జరిగిందేమిటి, ఎవరు చెప్పారు వీళ్ళకూ…” అంటూ.. కానీ అతని పరిస్థితీసరిగ్గా అదే ఉందని తెలిసి విస్తుబోయింది. ఇద్దరూ కలసి మొత్తం తవ్వుకున్నారు. కానీ, వీరికి తెలిసిందని తెలుస్తూనే ఉంది కానీ, ఎలా అన్నదే అర్థం కావడంలేదు.. ఆ రాత్రి ఉద్దేశపూర్వకంగానే సుశీల పెట్టిన పాటల క్యాసెట్ పక్క గదిలోంచి వినపడసాగింది. మరోవైపు సన్నజాజులూ, అగరొత్తుల గుబాళింపు.అన్నీ చేరి ఇద్దరినీ కవ్విస్తున్నాయి. కానీ, ఎవరికి వారు లోకువైపోతామేమోననే గుంజాటనతో నిద్ర పట్టక...సతమతమవుతూ ఎలాగో తెల్లారిందనిపించారు. విషయం తెలిసిందే గనుక తెల్లారి ఎవరూ ఎవరినీ ఏమీ ప్రశ్నించలేదు. అంతా ఏమీ ఎరగనట్లే అప్పటికి మామూలుగానే ఉండిపోయారు. పనులన్నీ ముగిసే సరికి ఉదయం 9 దాటుతూండడంతో...
అత్తయ్యా టిఫెన్లు పెడదామంటారా అని అడిగింది. వాళ్ళని కూడా రానీయమనడంతో ఎవరో ఏమిటో అర్థం గాకపోయినా అయోమయంగానే తలూపింది.
********
సరిగ్గా పది కొడుతండగానే వచ్చారు. లాయరు సతీష్, రాఘవ, కార్తీక్, సుశీల భర్త , ఆ వెనకే ... ఆనంద్ !! దిమ్మెర పోయాడు మూర్తి.
దయచేసి ఎవరూ ఏమీ మాట్లాడకండా ముందు టిఫిన్లు కానీయండి. గోపాలరావుగారి ఆదేశం లాంటి విన్నపం.
టిఫెన్లు, కాఫీ అన్నీ అయినాక......
ఆఁ. ఇప్పుడు చెప్పండి ఏమిటి సమస్య. ఎందుకు మీరీ నిర్ణయానికి వచ్చారు, అసలెవరిని సంప్రదించి ఇంత కఠోర నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని దశాబ్దాలుగా నేను మీ అందరికీ చెప్పిన దంతా ఎటుపోయినట్లూ... వరసపెట్టి దులిపేస్తుంటే రాజీ, మూర్తీ మాత్రమే కాదు. వారి తల్లి దండ్రులూ, ఇంత దూరం వచ్చేదాకా పెద్దల చెవిన వేయనందుకూ సుశీలా, రాఘవ కూడా మాటరాక తలలు దించుకున్నారు.
“ అమ్మాయి రాజీ ! ముందు నువ్వు చెప్పు. అతనిని సుశీల ఎందుకు కాదన్నదో నీకు తెలుసు కదా. మరి నువ్వు ఏమి చూసి ప్రేమించావు, ప్రేమించావు సరే, ఎందుకు సర్దుకోలేకపోయావూ, సంప్రదాయం పాటించవచ్చు. కానీ, ముందు వెనకలు చూడక్కర్లేదా. అంత మంకుతనం పనికి వస్తుందా...మళ్ళీ అడుగుతున్నా... అత్తమామల వల్ల నీకు వచ్చిన ఇబ్బందేమిటి. ఎక్కడో ఎవరో ఏదో చేశారని అంతా ఒకటే అనుకోవడం సబబేనా. విషయం ఇంత దూరం వచ్చినా, ఇందాక నిన్ను మీ అత్తగారు ఎలా పలకరించారో ఇప్పటి వరకూ ఎలా చూసిందో గుర్తు చేసుకుని మరీ చెప్పు తల్లీ..”
ఈ దశలో లక్ష్మి కల్పించుకుని పోనీ ఆ పిల్లకు అంత ఇబ్బంది అనిపిస్తే మేం గుంటూరులోనే ఉంటామని చెప్పండి మామయ్యా అంది. వెంటనే “ కాదులే, మీకూ అక్షింతలు పడబోతున్నాయి రెడీగా ఉండండి మరి...” అంటూ నవ్వుతూనే అంటించాడాయన. వైదేహి కూతురునేదో అందామనుకున్నది కానీ లక్ష్మి పరిస్థితి చూసి మిన్నకుండిపోయింది.
సరే. ఇప్పుడు విడిపోతారూ. తర్వాత... నీ వయసెంతనీ... విషయం తెలిసిన తర్వాత మరెవరన్నా నీతో వస్తారా... ఒంటరిగా గడపగలననకు. అది నీ వల్ల కాదని నాకూ, నీకూ కూడా తెలుసు,. మరో ముఖ్యమైన ప్రశ్న. పెళ్లయి మూడేళ్ళవుతోంది. పిల్లలెందుకు వద్దనుకున్నారు. వారుంటేనైనా మీ బందం మరింత బలపడేది కాదా. సమస్య ఇంత దూరం వచ్చేది కాదు గదా... ఆగాగు,, నువ్వేం చెప్పబోతున్నావో తెలుసు. చూసేవారుండరనే...కాదూ... అప్పుడు మళ్ళీ అదేమాట ముందుకు వస్తుంది గా..ఉమ్మడి కుటుంబం వల్ల లాబాలలో ఇదీ ఒకటని తెలియదా. పిల్లల సంరక్షణ, వారికి మంచి మాటలు నేర్పడం చూసేది అదీ మీ లాంటి తల్లి దండ్రులున్నప్పుడు తాతాలూ, బామ్మలూ, నాయనమ్మలే కదమ్మా...
ఆలోచించుకో.. బాగా ఆలోచించుకుని మరీ చెప్పు.
“ ఇప్పుడు నీ వంతు...మూర్తీ. మీ అమ్మా నాన్నా నీతో ఉంటే ఏమిటి ఇబ్బంది. ఎందుకు ఇన్నాళ్లూ వారిని మీతో రమ్మని అడగలేదూ,ఉమ్మడి కుటుంబాల వల్ల ఇబ్బంది అని ఎందుకు బావిస్తున్నావూ, ప్రైవసీ అంటే ఏమిటీ, వారేమీ మీతో పాటు సినిమాలూ, షికార్లకూ వస్తామంటారా... అలా అనేవారుండవచ్చు. కానీ వీరలాంటి వారు కాదని తెలీదా నీకు..ఇప్పుడైనా రిటైరైనారనీ, లోకం ఊరుకోదనీ మాత్రమే తీసుకువెళ్ళుంటావు. పైగా అక్కడ నీకు వంట సమస్య కూడా ఉందాయె. ఆగు బుకాయించకు... నిన్ను ఇంతప్పటి నుంచీ ఎరిగిన వాడినే కదా...ఇక సంప్రదాయం. ఏం ఒక్క రోజు అటో ఇటో అయితే కొంపలంటుకుపోతాయా...అంతటి సమస్యే ఉంటే అమ్మాయే దిగి వస్తుందిగా. ప్రేమించినవాడివి ఆమాత్రం చెప్పుకోలేవా...చివరకు విడాకుల విషయంలో కూడా ఓ రోజు అటో ఇటో అందని ఎద్దేవా చేస్తావా ఆఁ...?”
“ మీ నలుగురు మాత్రం తక్కువ తిన్నారట్రా. పిల్లలను కంటే సరా. వారు ఎలా చదువుతున్నారో నేది చూస్తే సరిపోతుందా. మీ మాట జవదాటడం లేదని మురిసిపోగానే సరిపోతుందా. వారి మనసులలో ఎలాంటి భావాలు పేర్కొంటున్నాయో, అవి సమాజానికి ... కనీసం మన కుటుంబానికి ఏమాత్రం ఉపయోగపడగలవో లేదా చిక్కులు తెచ్చి పెడతాయో చూసుకోనక్కర్లేదా...అతిగా గారాబం చేస్తే వచ్చే అనర్థా లేమిటో ఇప్పుడైనా తెలిసిందా...నా పద్యాలు మీరూ చదువుతూనే ఉంటారుగా.. మరి ఏమి గ్రహించినట్లూ...?”
“తల్లీ సుశీలా, నాయనా రాఘవా, బాబూ కార్తీక్... ఇందులో మీ తప్పేమిటో మీకు ఈపాటికే తెలిసి ఉండాలి. తిరిగి ఆలస్యంగానైనా మీరే దిద్దుకున్నారు కనుక వో.కే.....”
సరే. నా మాటలు అయిపోయాయి. చెప్పాల్సింది చెప్పాను. మీరే ఆలోచించుకోండి. ఎదురుకుండా లాయరుగారు ఉండనే ఉన్నారు. భోజనాలయిన తర్వాత మీ నిర్ణయాలు చెపితే అంతా కలిసి ఆలోచించి ఆప్రకారంగా చేద్దాము. ప్రస్తుతానికి మీటింగ్ సస్పెన్డెడ్... చివరగా తన వైఖరికి తగినట్లు అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతూ నాటకీయంగా ఆపేసేరు.
*********
మద్యాహ్నం మూడయిందర్రో అంటూ పాత కాలపు గోడ గడియారం గొల్లుమనడంతో అంతా నిద్ర ముగించి హాల్లోకి చేరారు. అందరి ముఖాలూ విజయం (?) సాధించినట్లు వెలిగిపోతున్నాయి. టీలు అయినాక అందరినీ తయరవమన్నారు.
ఆం. ఇప్పుడు చెప్పండర్రా. ఎటెల్దాం, సివిల్ కోర్టుకా లేక....
రావుగారి హాస్యానికి జతకలుపుతూ లాయరుగారు చిలుకూరు పోదాం అన్నా మేము సిద్ధమే. మరి మూర్తి ఏమంటాడో .. శంకరంగారి చమత్కార సంశయం.
మామయ్యా ప్లీజ్ అన్నాడు అతను..
సరే. ఇప్పుడు అందరం చిలుకూరు పోదాం. వచ్చే ఏడాది మాత్రం తిరుమల తప్పదేమో అంది సుశీల.
కొసమెరుపు.. చర్చల సారాంశం ఏమంటే....
కొద్దిరోజులపాటు రాజీ సెలవు పెట్టి చెన్నై వెడుతుంది.. తర్వాత ఆమె ట్రాన్సుఫరుకో, రిజైన్ చేసి చెన్నైలోనే వేరే ుద్యోగం చూసుకోవడమో. ఆ తర్వాత అంతా బాగున్నదనుకుంటే మూర్తి తల్లి దండ్రులు కూడా అక్కడికి వెళ్తారు.
రావు గారు చెప్పిన ఈ తీర్పును సుప్రీమ్ కోర్టు కూడా కాదనలేదన్నాడు లాయరు గారు.
********
అవునురా రాఘవా..మీకెలా తెలిసిందీ... సాయంత్రం పార్కులో ఆరా తీసేడు మూర్తి.
పిచ్చోడా...ఆనంద్ ఎవరనుకున్నావూ. కార్తీక్ బావ మరిదే. కార్తీక్ తెలుసా అనబోయి..మూర్తి మొహం చూస్తూనే నవ్వేసి మన సుశీలకు వాడు బామ్మర్ది...అంటే బామ్మర్దులంతా చేరి ....
తెలిసిందిలే నాయనా ఇహ చెప్పకూ అంటూ ఉడుక్కుంటూ రాజీకేసి చూశాడు.
కానీ, ఈ కథంతా కొత్తది కావడం అలా ఉంచి ఇంత మంది తన కోసం ఆరాట పడటం అచ్చెరువుగానూ, గిల్టీగానూ అనిపించి ఆమె తలదించుకు కూర్చుంది. ఏయ్. చాల్లే. ఇక్కడెవరూ బైటవారు లేరుగానీ. నువ్వేం అలా ఫీల్ కానక్కర్లేదంటూ సుశీల నెత్తిన మొట్టడంతో వాతావరణం చల్లబడింది.
************** శుభమ్ **************
No comments:
Post a Comment