భావకవి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి - అచ్చంగా తెలుగు

భావకవి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి

Share This

భావకవి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి

బాలాంత్రపు వేంకట రమణ 

Mobile: 95731-70800


శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు  పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో పండిత కుటుంబంలో  తమ్మన్న శాస్త్రి సీతమ్మ పుణ్యదంపతులకి 1897 నవంబెర్ 1వ తేదీన జన్మించారు. విజయనగరం కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. పెద్దాపురం మిషినరీ హైస్కూల్, కాకినాడ కళాశాలలో ఉపాధ్యాయులుగా, తరవాత ఆకాశవాణి హైదరాబాద్  కేంద్రంలో ప్రయోక్తగా పని చేసారు. 1964లో  మద్రాస్ చేరి సినీగేయ రచయితగా స్థిరపడ్డారు. భావకవిశ్రేష్టులుగా, సినీగీత రచయతగా తెలుగుజాతి గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్నారు కృష్ణశాస్త్రి గారు.
దేవులపల్లి వారి రచనలు బహుముఖాలుగా సాగాయి.
ఖండ కావ్యాలు: కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి, నిశ్రేణి, పల్లకి.
బ్రహ్మసమాజ కృతులు: మహతి, పద్యావళి, ఋగ్వీథి.
తిరుప్పావైను అనువాదం చేశారు.
గేయనాటికలు : శర్మిష్ఠ, కృష్ణాష్టమి, యమునా విహారి, ఏడాది పొడుగునా, గౌతమి, వేణుకుంజం, ధనుర్దాసు అనే సంపుటి.
విప్రనారాయణ అనే యక్షగానం, లలిత గీతాలు, సినీగీతాల సంపుటి, మేఘమాల. ఇవి కాక, అతిథిశాల, కోత్త వెన్నెల, రాజఘట్టం, చౌరాస్తా, ఋతుచక్రం లాంటి సంగీత రూపకాలు, ఎన్నో వచన రచనలు చేసారు కృష్ణశాస్త్రి గారు.
“కృష్ణశాస్త్రిగారు ఒక గాంధర్వ గీతం, నిశ్వాస పారిజాతo, పదశిల్ప విరించి, పాటల పరమేశ్వరుడు, భావుకతా పట్టభద్రుడు, వేదనా మందాకిని, ఆయన స్పర్శతో ప్రాణం గానం అయింది, పదం శిల్పమయింది. వలాహక ఘోష వాక్యంలో ఇమిడింది. సాగరం అక్షరంలోకి చొరబడింది.” అన్నారు డా. నారాయణరెడ్డి గారు. “కృష్ణశాస్త్రిది కవిత” అన్నారు ఆరుద్ర. “అతని ననుసరించి చాలామంది వ్రాస్తారు. ఎవ్వరూ అతనినందుకోలేరు.” అని విశ్వనాథ వారు ప్రస్తుతించారు. “ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తమూ ఇక్షుర సార్ణవమే” అన్నారు శ్రీశ్రీ. కృష్ణశాస్త్రి ఆంద్ర షెల్లీ అని కొనియాడారు.
“ఆకులో ఆకునై పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై, ఈయడవి దాగిపోనా, ఎట్లైననిచటనే యాగిపోనా” అని ప్రకృతిని చూసి పులకించిపోయారు కృష్ణశాస్త్రి.
“నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు?
నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు?
కలవిహంగమ పక్షముల తేలియాడి
తారకామణులలో తారకనై మెలగి
మాయమయ్యెదను నా మధురగానమున.”
అన్న కవితలో కృష్ణశాస్త్రి గారి స్వేచ్ఛాప్రియత్వం కనబడుతుంది. కవిని చూసి లోకం నవ్వుతుంది.  నాకు సిగ్గెందుకు? నవ్వుతున్న లోకం నుంచి వెళ్ళిపోతాను. పక్షి రెక్కలమీద తేలుతూ, చుక్కల్లో చుక్కనవుతానంటారు మధురగానంలో మాయమౌతానన్నారు.
“నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు
నాకు కన్నీటి సరుల దొంతరులు కలవు
నా కపూర్వ మమూల్య మానంద మొసగు
నిరుపమ నితాంత దుఖంపు నిధులు కలవు”
అని తన విషాద విషాన్నే ఆనందామృతoగా చిత్రించుకున్నారు కృష్ణశాస్త్రి.
దేవులపల్లి వారు ఊర్వశిని భావించిన తీరు అనన్య సామాన్యం.
“నీవు తొలిప్రొద్దు నునుమంచు తీవసొనవు
నీవు వర్షా శరత్తుల నిబిడి సంగమమున
పొడమిన సంధ్యాకుమారి నీవు  .....” అంటూ
“ఆమె కన్నులలో ననంతాంబరంపు నీలినీడలు గలవు
నీయాజ్ఞ కూడేనా, గొంతు ముడి వీడెనా
హాయిగా యుగయుగంబుల కలలో పాడనా
చిరగాఢ నిద్ర మేల్కొలిపి సందేశాల
బరపనా దిక్కు దిక్కులకు చుక్కలను”
అని ఊర్వశి కోసం పరవశించారు.  పిన్నలూ, పెద్దలూ ఆయన కవితకు దాసోహమైనారు.
“జయ జయ జయ ప్రియ భారతి” వంటి దేశభక్తి గీతాలు,  “పాడనా తెలుగు పాట” “పదములె చాలు
రామా నీ పద ధూళులె పదివేలు.. ” ఇంకా  “మల్లీశ్వరి” లో అన్ని పాటలూ, “పగలైతే దొరవేరా, రాతిరి నా రాజువురా...” “సడిసేయకో గాలి...” వంటి వందలకొలది సినీ గాతాలలో తెలుగు వారి గుండెలలో హత్తుకుపోయిన భావకవి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి వారి జయంతి సందర్భంగా ఇదే మనందరి  శ్రద్ధాంజలి. (358)
********

No comments:

Post a Comment

Pages