చిత్ర 'కళా రత్న' - ఆర్టిస్ట్ రాంబాబు - అచ్చంగా తెలుగు

చిత్ర 'కళా రత్న' - ఆర్టిస్ట్ రాంబాబు

Share This

చిత్ర 'కళా రత్న' - ఆర్టిస్ట్ రాంబాబు 

భావరాజు పద్మిని 


మట్టిలో మాణిక్యాలు ఉంటాయి అంటారు. కష్టంలో పుట్టి, కష్టంలో పెరిగిన కళాకారుడికి పైకి రావాలన్న కసి ఉంటుంది. ఆ కసి కళనే ఊపిరిగా శ్వాసిస్తూ, తపస్సు  చేసి, చివరికి అందులో సమున్నత స్థాయికి చేరేలా ప్రేరణ కల్పిస్తుంది. నేర్చుకున్న చిత్రకళకు, తనదైన శైలి కలిపి, ముచ్చటైన  చిత్రాలను వేసే చిత్రకారులు రాంబాబు గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ  నెల  మీకోసం...

మీ బాల్యం కుటుంబ నేపథ్యం గురించి కుప్తంగా చెప్పండి. 
1970 జులై 1న తూర్పు గోదావరి జిల్లా తుని మండలం, చేవూరు అనే గ్రామంలో నేను జన్మించడం జరిగింది. నా తల్లిదండ్రులు శ్రీమతి మహాలక్ష్మి, శ్రీసూర్యారావుగారు. మేము ఆరుగురు సంతానము నేను నాలుగువ వాడిని.1977లో మా నాన్నాగారుకు రైల్వే ఉద్యోగం రావడం విజయవాడకు బదిలీ కావడంతో నాజీవితం మలుపు తిరిగింది అని చెప్పకోవాలి. నా బాల్యం అంతా ఆర్థిక ఇబ్బందులతో ఉండడం వలన నేను ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటూ ఉన్నత పాఠశాలవరకు చదివి దూర విద్యావిధానం లో చదువుతూ ఆర్థికంగా నా తల్లిదండ్రులకు సహాయపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే డ్రాయింగ్ గ్రేడ్ పరీక్షలతో పాటు B.A కూడా పూర్తి చేసాను. నాకు 16వ సం.ము నుండి సైన్ బోర్డ్ చిత్రకారులకు సహాయకుడిగా ఉంటూ, ఎడ్వర్టైజింగ్ సర్వీసులో సబ్ కాంట్రాక్టరుగా ఎదిగాను, కాని నాకు ఉపాధ్యాయుడు కావాలనే కోరిక ఉండడంతో T.TC కూడా (గుంటూరులో) పూర్తి చేసాను. నేను 20వ యేటనే ఉపాధ్యాయుడిని  అయ్యాను. ఇప్పడు నా సహాదర్మచారిణి పేరు దేవి.
నాకు ఇద్దరు కుమార్తెలు.
 మీ ఇంట్లో ఆర్టిస్టులు  ఎవరయినా ఉన్నారా?
మా కుటుంబంలో ఎవరు ఆర్టిస్టులు లేరు మాది వ్యవసాయ కూలి కుటుంబం మా నాన్నగారు వ్యవసాయదారుడి
నుండి రైల్వే ఉద్యోగిగా స్థిర పడ్డారు (విజయవాడ). వారికి చదవడం వ్రాయడం కూడా అంతంతమాత్రమే తెలుసు చిత్రకళ నాతోనే మొదలయింది.
చిన్నప్పట్నుండి బొమ్మలు వేసేవారా?చిత్ర కళ పట్ల మక్కువ ఎలా కలిగింది?
నేను  చిన్నప్పట్నుండి నాటక కళ, చిత్రకళ పట్ల ఆకర్షితుడిని అయ్యేవాడిని ఆ క్రమములో నాసహ విద్యార్థి బొమ్మలు గీసేవాడు. వాడిని అందరూ మెచ్చుకుంటుంటే, నేను బొమ్మలు అంటే ఇష్టపడేవాడిని కాబట్టి అప్పట్నుంటే, అభ్యాసం మొదలు పెట్టాను, అప్పడు నేను నాలుగువ తరగతి చదువుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభ్యాసం చేస్తూనే ఉన్నాను.


మీరు అభిమానించే చిత్రకారులు, గురువులు ఎవరు?
మా గురువుగారు డ్రాయింగ్ మాష్ణారు శ్రీ P.S.N మూర్తిగారు వీరు గొప్ప చిత్రకారులు. ఆయన శ్రీపినపాక వేంకట సుబ్బారావు గారి  కుమారుడు. వీరి కుటుంబమంతా చిత్రకళాకారులు. నేను అభిమానించే చిత్రకారులు శ్రీరాజా రవివర్మ గారు, శ్రీ వడ్డాది పాపయ్యగారు, మరియు శ్రీ పద్మశ్రీ బాపుగారు. వీరు గురించి మొదటగా బొమ్మలు చెప్పాయి, ఆ తరువాత ఆ బొమ్మలు వేసిన వాళ్ళ గురించి, వాళ్ళ పేర్లు, గొప్పతనం పరిచయమయ్యాయి. ఆ తరువాత కాలంలో చాలా మంది గొప్ప చిత్రకారులు మరెందరో ఉన్నారు, వారు అందరూ నాకు స్ఫూర్తి దాయకమే.
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయింది?
నాకు తాపీ పని చేసే మేస్త్రీ పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి నా బొమ్మలు చూసి, 'నీవు చాలా గొప్ప చిత్రకారుడివి అవుతావు' అని, అతనికి పరిచయమున్న ఒక సైన్ బోర్డ్  ఆర్టిస్ట్ శ్రీనివాసరావు దగ్గరకు తీసుకువెళ్ళి 'ఇతనిలో గొప్ప ఆర్థిస్ ఉన్నాడు, ఈ కుర్రాడిని నీవు తీర్చిదిద్దు'  అని చెప్పి నన్ను అతనికి సహాయపడుతూ పని నేర్చుకోమన్నాడు. ఆ వ్యక్తి దుర్గా పబ్లిసిటిలో ఆర్టిస్ట్ అవ్వడం వలన దుర్గాపబ్లిసిటి యాజమాని శ్రీ దూర్గారావు గారికి పరిచయం చేసాడు. ఆ దుర్గారావుగారు ఓ మంచి మనిషి అనే పదానికి ప్రతిరూపం. దుర్గారావుగారు మరియు చలపతిరావు మాష్టారుగారి సలహాల మేరకు గవర్నమెంటు
నిర్వహించే డ్రాయింగ్ పరీక్షలకు హాజరు కావడానికి ఒక డ్రాయింగ్ మాష్ణారు పేరును సూచించారు. వారే శ్రీ P.S.N మూర్తిగారు. వీరి దగ్గర శిష్యరికం చేసి చిత్రకారుడుగా పట్టా పొందాను. నాకు 16వసం.ము నుండి 20వసం.ము వరకు ఉన్న నాలుగు సంవత్సరముల వ్యవధిలో పరిచయమైన వ్యక్తుల నుండి చిత్రకళతో పాటు ఆ రంగంలో నిలదొక్కుకోవడానికి కావలసిన అనుభవం అంతా ఆ కాలములోనే పొందాను. చిత్రకళోపాధ్యాయుడుగాచేరి అంచలంచెలుగా నైపుణ్యతను పెంచుకుంటూ ఉన్నాను. నన్ను ప్రోత్సహించి, నాకు శ్రేయోభిలాషిగా ఉన్నవారు నాకు  విజయవాడ మహానగరానికి తల మానికం ఆయిన యస్.యస్.యమ్ స్కూల్లో ఉద్యోగం రావడానికి సహాయపడ్డారు. నాకు ఉన్నవారంతా మంచి సహాచరులే అని ఇప్పటికీ నేను భావిస్తుంటాను. వారికి సదా కృతజ్ఞుడనై ఉంటాను.
ఈ రంగాన్ని ఎంచుకున్నాక మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు?
ప్రతి రంగంలో ఉన్నట్లుగానే ఈ చిత్రకళారంగంలో కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. అయితే వాటిని ఒడిదుడుకులుగా భావించకుండా చిత్రకళారంగంలో నిలదొక్కుకోవడానికి కావలసిన అనుభవంగా భావిస్తాను. నా
విషయంలో నా సహచరగణం ఎక్కువ శాతం నా శ్రేయస్సును కోరిన వారే కావడం, నా అదృష్టంగా భావిస్తాను. ఈ చిత్రకళారంగంలో భవిష్యత్తు బాగుంటుంది అని చిత్రకళ అభ్యాసం చేయలేదు. అమితమైన ఆకర్షణ వలన లేదా పేదరికం వలన ఈ రంగంలో అడుగు పెట్టాను అని భావిస్తాను. దానివలన ఈ ఒడిదుడుకులు నాకు చిత్రకళాభవిష్యత్తుకు అడ్డంగా మారలేదు.
మీరు గీసిన చిత్రాలలో బాగా ఖ్యాతి తెచ్చిపెట్టిన చిత్రం గురించి చెప్పండి.
నేను గీసిన చిత్రాలలో శకుంతల దుష్యతుడుకి లేఖ రాసే చిత్రము నాకు బాగా ఖ్యాతి సంపాదించి పెట్టింది. ఆ తరువాత 2004వ సంవత్సరము కృష్ణా పుష్కారాలలో కోస్తాంధ్ర చిత్రకారులు అప్పటి కలెక్టర్ శ్రీ ప్రభాకర్ గారు చిత్రకళా ప్రదర్శనకు అవకాశము కల్పించారు. ఆ ప్రదర్శన చూడటానికి వచ్చిన వారి కోరిక మేరకు చిత్రప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులకు పోర్టెయిట్ వేసి ప్రసంశలు అందుకున్నాను. నా జీవితంలో అది గొప్ప ఆనందానుభూతి.
మీరు పొందిన అవార్డులు మరచిపోలేని ప్రశంసలు గురించి చెప్పండి.
నేను పొందిన అవార్డులలో మొట్టమొదటగా 2015వ సంవత్సరంలో గోదావరి పుష్కరాలలో ఆంధ్రపదేశ్
ముఖ్యమంత్రిగారు శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదగా అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా భావించాను. 'కళారత్న’ అవార్డు తీసుకున్న రోజును నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను."స్పూర్తిక్రియేటివ్ ఫైన్ ఆర్టు స్కూల్ వారు బహుకరించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ S.V. రామారావుగారు ప్రశంసలు అందుకోవడం. నా చిత్రకళాగమనానికి మరింత ఆనందాన్నిచ్చింది. 1857 లో ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వీరులు వాళ్ళ త్యాగాలు, ఆత్మబలిదానాలు గురించి పోరాటం జరిగి 150సంuలు అయిన సందర్భంగా విజయవాడ లో ఫ్రీడమ్ ఫైటర్స్ బిల్డింగులో వాటర్ కలర్స్ తో  వేసిన బొమ్మలను ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలు పొందిన అనుభూతి మరచి పోలేనిది. ఆనాటి విజయవాడ నగర మేయరు శ్రీరత్న బిందుగారు గోకరాజు గంగరాజుగార్ల ప్రశంసలు వారి ప్రోత్సహం మహానందానిచ్చాయి.
మీ అభిరుచులకు మీ కుటుంబ సభ్యుల ప్రోత్సహం ఎలా ఉంటుంది?
ప్రతి మనిషి జీవితంలో ప్రోత్సహాం ఇంటి నుండి ఉంటేనే ఆవ్యక్తి సమాజంలో విజయం, సాధించగలడు. ఇంటి నుండి ప్రోత్సాహం లేక పోతే ఎంతటి గొప్పవ్యక్తి అయినా, ఏ రంగములోనయినా రాణించ లేడు. నేను పొందిన ఈ విజయం వెనుక నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది.
భావితరాలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
ప్రధానంగా ఈ కళ నయానానందానికి సంబంధించినది కావున బ్రతుకు తెరువు కోసం, భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో ఈ రంగంలోకి ప్రవేశించకూడదు. ఈ కళ పట్ల మక్కువ, అంకితభావంతో ఆ ఆనంద అనుభూతి పొందడానికి వస్తే ఈ కళారంగం లో రాణించగలరు అనేది నా అభిప్రాయం.
ఆర్టిస్ట్ గా  సేవ చేసిన సంస్థలు:
1) క్రియేటివ్ ఆర్ట్ అకాడమీ (ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబరు)
2) స్నేహ ఆర్ట్అకాడమీ (జాయింట్ సెక్రటరి.)
3) సంస్కార భారతి (జనరల్ సెక్రటరి)
4) లలిత్ కళా అకాడమీ (చైర్మెన్ కల్చరల్ వింగ్)
5) విజయవాడ ఆర్ట్సొసైటి ప్రెసిడెంట్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాను.
నేను పని చేసిన సంస్థలు:
1) దుర్గా పబ్లిసిటి
2) మంజు ఆర్ట్స్
3) ఒకె ఆర్ట్స్
4) ప్రభు ఎడ్వర్టైజింగ్ సర్వీసు
5) విక్రమ్ బుక్ లింక్స్
6) ఎక్స్ ప్రెస్  ఎడ్వర్టైజింగ్ సర్వీసు
7) విజ్ఞాన విహార ఇంగ్లీషు మీడియం స్కూల్
8) భారతీయ విద్యాభవన్
9) యన్.యస్.యమ్ పబ్లిక్ స్కూల్
నా జీవితగమనానికి మూలపురుషులు :
1) ‘తాపీ మేస్త్రీ ‘ శ్రీ కృష్ణగారు
2) 'చిత్రకారులు. శ్రీనివాసరావు
3) 'చిత్రకారులు’ శ్రీ దుర్గారావు గారు
4) ‘మాష్టారు’ శ్రీ చలపతిరావుగారు మాష్టారు
5) ‘రైల్వే ఉద్యోగి' శ్రీ భాస్కర రావు గారు
6) ‘చిత్రకారులు' శ్రీ P.S.N మూర్తిగారు మాష్టారుగారు.
7) ప్రిన్సిపాల్ శ్రీ N. లక్ష్మి నారాయణగారు
8) యన్.యస్.యమ్. మాష్ణారు శ్రీ దుర్భాశ్రీనివాసరావుగారు
9) యన్.యస్.యమ్. మాష్టారు శ్రీ బండి స్టాన్లీ గారు
10) యన్.యస్.యమ్. మాష్టారుశ్రీ హరేరామ శర్మగారు
11) యన్.యస్.యమ్. ప్రిన్సిపాల్ బ్రదర్ పి.టి. జోషఫ్ గారు
12) కళాదర్శిని డైరెక్టర్ శ్రీ ఫాదర్ జోసెబస్టియన్ గారు
13) ప్రిన్సిపాల్సెయింట్ జోసఫ్ హైస్కూల్. గుంటూరు సిస్టర్ జయరత్న బాలగారు 14) ‘చిత్రకారులు' శ్రీజిలాని ఆర్టిస్ట్
15) 'చిత్రకారులు’ శ్రీ నరసింహారావు గారు
16) 'చిత్రకారులు’ శ్రీ అప్పారావుగారు
17) ‘శ్రేయాభిలాషి’ శ్రీ చక్రవర్తుల సుబ్బారావుగారు.
స్వయంకృషితో ఇంత  గొప్ప  స్థాయికి  చేరిన రాంబాబు గారు మరిన్ని  విజయాలు  సాధించి, సమున్నత  చిత్రకారులుగా ఎదగాలని మనసారా  ఆశిస్తింది ' అచ్చంగా తెలుగు.'

No comments:

Post a Comment

Pages