ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్నికణం(పాట) - అచ్చంగా తెలుగు

ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్నికణం(పాట)

Share This

ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్నికణం(పాట)

రెడ్లం చంద్రమౌళి 


పల్లవి: పొత్తిళ్ళలో మొగ్గే తొడిగి - ఓ కొమ్మలో పూచిన పువ్వే
కొమ్మా కంచె తల్లీ తండ్రిగా - కన్నవారి కలలే పండగా װ పొత్తిళ్ళలో װ
అను పల్లవి: ఎదిగిందీ పసి పువ్వే - విరిసిన మల్లియగా
వనమంతా తానే వెన్నెలగా - నిశీధిలో వెలిగే పున్నమిగా װ పొత్తిళ్ళలో װ
చరణం:1 కన్నవారి ప్రేమలో కలలుగన్న ఆశలో - యవ్వనాలు పూచె ఈ మల్లెపువ్వులో
పూవులోని గంధము పరిమళింప చేయగా - విస్తరించెనంతము వీచు గాలిలో
వెదికే దిశలో... ఉరికే కసిలో - విహరిస్తూ వచ్చాయి రాక్షస భ్రమరాలు
వనమంతా తామే రాజులుగా - వెదకంగా యవ్వన కుసుమాలు װ పొత్తిళ్ళలో װ
చరణం:2 సంధ్యవేళ సూర్యుడు మబ్బుచాటు చంద్రుడు - మూగబోయి ప్రకృతి కళ్ళు మూయగా
గూడుచేరు వేళలో గుంపుచేరి భ్రమరాలు - ఒంటరైన పువ్వుపై వాలిపోవగా
ప్రమిదే విరిచీ...చమురే తీసీ - వెలుగొందే దీపాన్ని ఆరిపివేసాయి
అది చూసీ భారతి ఏడ్చింది - తన ఒడిలో కాంతను చేర్చింది װ పొత్తిళ్ళలో װ
చరణం3: ఓ కొమ్మలో పూచిన పువ్వులు - వనదేవతే తల్లిగ యెదిగి
వావీ వరస మరిచే పోయెనా...?? - మానవతను చెరిపే వేసెనా...??
ఈనాటి స్త్రీ శోకం ఆరని అగ్నికణం - వెలిగిస్తే...వెలుగును పంచేను...
ఆర్పేవో...హారతి దహియించు - ఓ కొమ్మా ఓర్పుకు వందనము
నీ నవ్వే వెలుగుల నందనవనం װ పొత్తిళ్ళలో װ

గమనిక: తల్లీదండ్రులు కలలుగన్న మరియు తమ కలలు, ఆశయాలు తీరకుండానే కొందరి రక్కసి మూకల కామదాహానికి బలైపోయిన ఎందరో సోదరీమణులు భరతమాత ముద్దు బిడ్డలు ఆతల్లి ఒడిలో విగతజీవులై మిగిలిపోయారు.ఆ తల్లి గర్భశోకం తీర్చే తనయుడిగా ఈ పాటను స్త్రీలందరికీ అంకితమిస్తున్నాను.

No comments:

Post a Comment

Pages