ఇల కైలాసమీ శ్రీశైలం
రావి కిరణ్ కుమార్
శ్రీశైలం పేరే ఆశ్చర్యకరం . శ్రీ వున్నది ఆ వేంకట నాధుడి హృదయస్థలం పై కదా అంటే గింటే తిరుమల ను శ్రీ పర్వతమని పిలవాలి.
కొద్దిగా ఆలోచన చేస్తే సాక్షాత్ ఆ రాజ రాజేశ్వరి మాత లలితా త్రిపుర సుందరీ దేవి ఇక్కడ భ్రమరాంబ గా కొలువైతే ఆ మహాదేవుడే మల్లిఖార్జునుడిగా నిలిచారు . ఆ అమ్మ నామమే మహాలక్ష్మీ . అందుకే ఇది మాత్రమే శ్రీ పర్వతమయ్యింది
ఆది శేషునిఁ శిరోభాగాన వున్న ఆ వేంకటాద్రి సాక్షాత్ వైకుంఠమయితే ఆయన తోక భాగాన నిలచిన ఈ శ్రీగిరి ఇల కైలాసమే సందేహమే అవసరం లేదు .
సాయం సంధ్యలో పరమేశ్వరుడు వాహనారూఢుడై ఆకాశ మార్గాన సంచరిస్తారని ప్రతీతి. ఆ సమయంలో ఇక్కడ మల్లిఖార్జునుని ఆలయం చుట్టూ పరమ గంభీరుడు శాంతవదనుడు అయిన నంది ప్రదక్షిణ చేస్తుంటే లోక వీక్షణం చేస్తున్న ఆ మహాదేవుడే మన ముందు కదులాడతారు. మనం బొందితోనే కైలాసాన్ని దర్శించామనటానికి సాక్షి గణపతి సాక్ష్యం .
మనం ఎంతో ప్రేమతో ఇచ్చే ఓ చిన్ని ఉండ్రాయినే రత్నాలుగా పదిల పరుచుకున్న రత్నగర్భ గణపతి దర్శనం మనసుకు ఎంతో మోదం.
ఎదురుగా మల్లిఖార్జునుడు రత్న సింహాసనం పై తానుంటే అర్ధభాగం పంచుకున్న అమ్మ చూడగానే మాతాపితరులను ఓ అందమైన కుటుంబమే కనుల ముందు కదులాడుతుంది ఇలా వారి ప్రక్కనే ఒద్దికగా నిలుచున్న జ్ఞానదీపం ముద్దులొలుకుతూ ఆ శరవణభవుడు ఎదురుగా మనసుకు ఉలాసం కలిగిస్తూ ఆ బొజ్జ గణపయ్య , ఆ పక్కనే బృంగి నంది ప్రమథగణాలు సమస్త పరివారం మనసులో పండాలె కానీ పదాలు తరగవు.
బయటకు వచ్చి కుడి వైపుకు వస్తే వృద్ధ మల్లిఖార్జునుడు అలిగి పర కైలాసం వీడి ఇల కైలాసం వచ్చిన షణ్ముఖుడికోసం వృద్ధ దంపతులుగా వచ్చిన పార్వతీపరమేశ్వరులు కాదు కాదు తన సోదరులైన మానవులు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే జాలిపడి అగ్ని సంభవుడు నేలకు దిగిరాగా , ఇంటికి పెద్దలుగా మేము మీతోడనే అంటూ మన చెంతకు వచ్చిన తల్లి తండ్రులు ఆ ప్రక్కనే త్రిఫల వృక్షము (రావి, జువ్వి, మేడి) మూడు పవిత్ర వృక్షాల పవిత్ర సంగమ స్థలి .. సదా లోక క్షేమం కోరే అత్రి మహర్షి , అసూయ ఎరుగని తల్లి అనసూయ పుణ్య దంపతులకు తనను తాను దత్తత చేసుకున్న త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు తపమాచరించిన పవిత్ర ప్రదేశంలో కొద్దిసేపు నిలవటం మన దృక్పధంలో మార్పుకు దోహదమవుతుంది.
అక్కడ నుండి అమ్మ సన్నిధానానికి వెళ్లే దారిలో పంచ పాండవులు అష్ట దిక్పాల ప్రతిష్టిత శివలింగాలు ఆ ప్రాంత వైశిష్ట్యాన్ని తెలిపితే అమ్మ సన్నిధి కి అతి సమీపాన సాక్షాత్ ఆ జగన్మాత సీతమ్మ తల్లి ప్రతిష్ఠిత సహస్ర లింగం ఇదే కైలాసమంటోంది. ఇక వీనుల విందైన తుమ్మెద ఝుంకారాల నడుమ కొలువైన భ్రమరాంబ దర్శనం కనులకు పండుగే పువ్వుకు నొప్పి తెలియకుండా మకరందం గ్రోలే తుమ్మెదకు మనకు ఎంత తేడా . అందుకే అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఇతరుల నొప్పింపని జీవన విధానం మన పరమవుతుంది.
ప్రధాన క్షేత్రానికి 5 లేక 6 కి.మీ దూరంలో వున్న పాలధార పంచదార శివుని ఫాల భాగం నుండి జాలువారే ధారలైతే అక్కడ తపమాచరించిన శివ స్వరూపుడు ఆది శంకరుల హృది నుండి జాలు వారిన రసధారలే సౌందర్య లహరి శివానంద లహరి అక్కడ వాటిని స్మరించటం మనలో ఆనంద ధారలు కురిపిస్తుంది.
ఇక ప్రధాన క్షేత్రానికి 25 కి.మీ దూరంలో కొంత రహదారి ప్రయాణం మరికొంత అడవి ప్రయాణం, పచ్చని ప్రకృతి అందాల నడుమ వికృతి తో కూడిన రాళ్ళ దారిలో వాహన ప్రయాణం అమ్మ దయే అలా పయనిస్తే చేరుకునే అద్భుత ప్రాంతమే ఇష్ట కామేశ్వరి కొలువైన అందాల కోన.
త్వమేకా సర్వ లోకానాం సృష్టి స్థిత్యంత కారిణి /
కరాళ వదనే కాళీ కామేశ్వరీ నమోస్తుతే //
అంటూ ధర్మరాజు చేత కీర్తింపబడిన తల్లి . ఆ తల్లి మహా కామేశ్వరి మహా లలిత త్రిపుర సుందరి . ఆ తల్లి వదనారవిందాన్ని చూసి తరించాల్సిందే కానీ మాటలు సరిపోవు (సూచన : 41 రోజుల్లో కోరికలు తీరుతాయనో లేక నుదుటి మీద బొట్టు పెడితే మనిషి నుదురులా మెత్తగా తగులుతుందనో మీ కష్టమైన ప్రయాణం వృధా చేసుకోకండి . ఆ రూపం తనివితీరా కాంచి గుండెల్లో నిలుపుకోండి ఆ తల్లి లలితా త్రిపుర సుందరి ఆ ప్రాంతం మణిద్వీపమే మరువకండి)
ఇక మరోవైపు ఒక గంట సమయం క్రిష్ణమ్మ ఒడిలో ప్రయాణం అక్క మహాదేవి గుహలకు దారి తీస్తుంది . కన్నడిగుల ఆడపడుచు అక్కమహాదేవి తపమాచరించిన ఆ ప్రదేశంలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలూ వాటి అందం కొద్దిగా పైకి వెళితే ఒక యోగి ఆశ్రమం అక్కడ నుండి క్రిష్ణమ్మ అందం చుస్తే ఆ ఒంపు సొంపులు బహుశా జగన్మోహిని గా సకల జగత్తునే కాదు ఆ మన్మధ వైరిని సైతం సమ్మోహ పరిచిన మహా విష్ణువు ఆనాటి ఆ సంగతికి గుర్తుగా ఇక్కడ క్రిష్ణ వేణి రూపంలో పరమేశ్వరుని చెంత అత్యంత రమణీయంగా నిలచిన తీరు చూస్తూ ఆ క్రిష్ణ నామం పలుకుతూ యుగాలకు యుగాలు గడిపేయవచ్చు.
అంతేనా ఈ కృష్ణమ్మ గొప్పతనం విష్ణు అవతారంగా భాసిల్లే దత్తుడి రెండో అవతారమైన నృసింహ సరస్వతుల వారు అంతర్ధానమైనది కూడా ఇక్కడే ఈ కృష్ణవేణి తరంగాలలోనే!
ఇది కొద్దే చెప్పాల్సింది చాలా మిగిలే వుంది, మరి ఈ శ్రీశైలమే కదా ఇల కైలాసం.
(అమ్మ శ్యామల పలికించింది ఈ పలుకులు పెద్దలు తప్పులు మన్నించగలరు )
No comments:
Post a Comment