అన్నమయ్య దశావతార కీర్తనలు
ఇట్టె మమ్ము రక్షి౦చుట యేమి దొడ్డ నీకు నేడు
డా.తాడేపల్లి పతంజలి
బట్టబాయిటనే నీవు పదిరూపు లైతివి
చ.1: చదువుల చిక్కుదిద్ది చక్కఁగఁ జేసితివి
మొదలఁ గుంగినకొండ మోఁచి యెత్తితి
పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్ధరించితివి
అదనునఁ బ్రహ్లాదు నట్టె మన్నించితివి
చ.2: అడుగులు మూఁటనే యఖిలము గొలచితి
బడిబడినే రాచపగ నీఁగితి
బెడిదపు లంక విభీషణు నేలించితివి
అడరి పాండవులదిక్కై నిలిచితివి
చ.3: త్రిపుర కాంతలగుట్టు దీర బోధించితివి
వుపమఁ గలికిరూపై యున్నాఁడవు
ఇపుడు శ్రీవేంకటేశ యేలితివి లోకాలెల్ల
యెపుడు నుతులకు నిరవైతివి (రేకు: 0198-02సం: 02-503)
తాత్పర్యము
పల్లవి: ఇట్టె మమ్ము రక్షించుట యేమిదొడ్డ నీకు నేఁడు
బట్టబాయిటనే నీవు పదిరూపు లైతివి
శ్రీవేంకటేశ! ఈ కలియుగంలో క్షణంలో, వెంటనే (ఇట్టె) కనబడకుండా మమ్ములను రక్షించుట యేమి గొప్ప (దొడ్డ) నీకు !అందరికి తెలిసేటట్లుగా (బట్టబాయిటనే) నువ్వు పది అవతారాలెత్తావు.
చ.1: చదువుల చిక్కుదిద్ది చక్కఁగఁ జేసితివి
మొదలఁ గుంగినకొండ మోఁచి యెత్తితి
పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్ధరించితివి
అదనునఁ బ్రహ్లాదు నట్టె మన్నించితివి
హయగ్రీవుడనే (సోమకాసురుడను) రాక్షసుడు నాలుగు వేదాలు దొంగిలించి సముద్రములో దాక్కున్నప్పుడు,
1.మత్స్యావతారం ధరించి, రాక్షసుని చంపి వేదాలకు వచ్చిన కష్టాన్ని తొలగించావు. (చిక్కుదిద్ది)
- క్షీర సాగర మథన ప్రారంభంలో (మొదల) మందర పర్వతము కుంగిపోకుండా 2.కూర్మావతారంలో మూపున ధరించి పైకి ఎత్తావు..
3.హిరణ్యాక్షుడు భూమినంతా చాపగా చుట్టినప్పుడు 3.వరాహావతారంలో అతనిని కమ్మి(పొదిగి) భూమిని గ్రహించి (చేపట్టి) దంతం చివర భూమిని పైకి ఎత్తావు(ఉద్ధరించితివి.)
- సరియైన సమయములో- రాత్రి పగలు కాని సమయములో-(అదనున) హిరణ్య కశిపుడిని 4.నరసింహావతారంలో కొనగోళ్ళతో చంపి.ప్రహ్లాదుని ఆశ్చర్యము గొలుపుతూ (అట్టె) రక్షించావు.
చ.2: అడుగులు మూఁటనే యఖిలము గొలచితి
బడిబడినే రాచపగ నీఁగితి
బెడిదపు లంక విభీషణు నేలించితివి
అడరి పాండవులదిక్కై నిలిచితివి
5.వామనావతారంలో బలిని మూడడుగుల( మూటనే) దానమడిగి అఖిల ప్రపంచాన్ని రెండు అడుగులలోనే కొలిచావు. .6.పరశురామావతారంలో రాజులమీద పగతో వారిని మాటిమాటికి (బడిబడి) సంహరించి, వాళ్ళ భూములను కశ్యపునకు దానము చేసావు(ఈగితి).
7 రామావతారంలో అధికమయిన , ఐశ్వర్యయుతమైన లంకలో ( బెడిదపు లంక ) ఉన్న రావణుని చంపి విభీషణునిచే లంకను పరిపాలింపచేసావు.
8 . ఉత్తమ గుణాలతో ప్రకాశించి (అడరి) కృష్ణావతారంలో పాండవులకు దిక్కుగా నిలిచావు.
చ.3: త్రిపుర కాంతలగుట్టు దీర బోధించితివి
వుపమఁ గలికిరూపై యున్నాఁడవు
ఇపుడు శ్రీవేంకటేశ యేలితివి లోకాలెల్ల
యెపుడు నుతులకు నిరవైతివి
స్వర్గాన్ని అందరూ పొందుతూ పుణ్యవంతులైప్రజలున్నప్పుడు, ఏమి పని లేని యముడు విష్ణుమూర్తి మొరపెట్టుకోగా , ప్రజలకువేదాలలో గౌరవాన్నిపోగొట్టి వారిని కర్మ భ్రష్టులను చేయటానికి విష్ణుమూర్తి 9.బుద్ధావతారము ధరించి త్రిపురసతుల మానాలువ్యర్థము చేసేటట్లు బోధ చేసావు.
పాపాత్ములను నాశ నం చేయటానికి భయంకరమైన అగ్ని జ్వాలలు చిమ్మే ఖడ్గాన్ని ధరించి10.కల్క్యావతారపు పోలికలో (ఉపమ) ఉన్నావు.
ఇప్పుడు ఈ కలియుగంలో వేంకటేశా ! లోకాలను పరిపాలించావు. పరిపాలిస్తున్నావు
ఎప్పుడూ మా పొగడ్తలకు నువ్వే నిలయమయ్యావు.
విశేషాలు
శ్రీవేంకటేశ స్వామి ఈ కలియుగంలో ప్రత్యక్షంగా మనకు తన రూపంతో కనబడడు. రకరకాల రూపాలలో ప్రవేశించి మనకు సాయం చేస్తాడు. దీనిని అన్నమయ్య వ్యంగ్యంగా “ఈ కలియుగంలో క్షణంలో, వెంటనే కనబడకుండా మమ్ములను రక్షించుట యేమి గొప్ప (దొడ్డ) నీకు !” అని నిందాస్తుతి చేసాడు.
"చుట్టమవైతే నీవు సుద్దులు చెప్పుదువా, బట్టబాయలీఁదించేవు పనిలేనిపనికి." [తాళ్ల-23-291] అని మరొక చోట కూడా ఈ బట్టబాయలు పద ప్రయోగము గమనించవచ్చు.
స్వస్తి.
No comments:
Post a Comment