జీవన వేదం - అచ్చంగా తెలుగు

జీవన వేదం

(మా బాపట్ల కధలు – 8)

భావరాజు పద్మిని


ఈ భూమి పైన పరమపవిత్రమైన కాశీ నగరం...
ఉదయాన్నే పావనగంగా తీరంలో స్నానం ముగించుకుని, డూండీ వినాయకుడిని, విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణమ్మను, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుని, నేను, మావారు బయటపడేసరికి, దాదాపు 12 కావచ్చింది. ఉదయం నుంచి  ఏమీ తినకపోవడంతో కడుపులో ఆకలి దంచేస్తోంది. ‘కరివెన వారి సత్రంలో అచ్చతెలుగు భోజనం దొరుకుతుంది, కాని, ఉదయాన్నే వెళ్లి, పేరు రాయించుకోవాలి,’ అన్న అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. కానీ, ఇప్పటికే ఆలస్యం అయ్యిందే,ఎలా మరి?
‘పోనీ ఆటోలో అటే వెళ్లి చూద్దాం పదండి, మనముండే కుమారస్వామి సత్రానికి అది దగ్గరేగా. ఇంకేమైనా భోజన హోటల్స్ దొరికితే సరి, లేకపోతే చండీగర్ లో లాగా పరాటాలే గతి !’ అన్నాను. కరివెన సత్రం వద్దకు వెళ్లి, ‘దగ్గరలో ఎక్కడైనా తెలుగు భోజనం దొరుకుతుందాండి ?’ అని అడిగాము. కాస్త ముందుకు వెళ్తే, ‘అన్నపూర్ణ హోటల్’ అని ఉంది, వెళ్ళండి,’ అని చెప్పారు.
‘ఇదా, గట్టిగా ఎనిమిది బల్లలు ఉన్నాయి, బాగుంటుందో లేదో... 40 రూపాయలేనట భోజనం’ మావారి సందేహం.
‘ఎలా ఉన్నా తినేస్తాను బాబూ, ఇక నావల్ల కాదు,’ అన్నాను నేను.  రెండు భోజనాలు చెప్పాము. దొండకాయ కూర, అక్కూర పప్పు, టమాటో పచ్చడి, సాంబారు, చారు, అప్పడం, పెరుగు. మహత్తరంగా ఇంటి భోజనంలా ఉన్నాయి. టమాటో పచ్చడైతే, అప్పుడే చేసినట్లు తాజాగా ఉంది. వడ్డించే కుర్రాళ్ళు కూడా విసుగు, చిరాకు లేకుండా వడ్డించారు. అసలే చండీగర్ లో తెలుగు భోజనానికి మొహం వాచిపోయి ఉన్నామేమో, ఇద్దరం మౌనంగా లాగించేసాం.
‘మూడు భోజనాలు పార్సెల్ ఇవ్వండి,’ అంటూ అత్తయ్యగారు, పిల్లలకి పార్సెల్ చెప్పి కౌంటర్ వద్దకు వచ్చాము. ‘అన్నం వాయ ఇంకో పది నిముషాల్లో దిగుతుంది తల్లీ, ఇలా కూర్చోండి,’ అంటూ కౌంటర్లో ఉన్న పెద్దాయన, తన ప్రక్కనున్న కుర్చీలు చూపించారు. నుదుట త్రిపుండాలు, మధ్య పావలా కాసంత కుంకుమ, తెల్లటి జుట్టు, గడ్డంతో బ్రహ్మకళ ఉట్టిపడుతూ ఉన్నారు ఆయన.
‘ఇంతకీ ఏ ఊరు తల్లీ?’ పలకరించారు.
‘వీళ్ళది కాకినాడండి, మాది బాపట్లండి, కాని రెండేళ్ళ నుంచి చండీగర్లో ఉంటున్నామండి’ అన్నాను నేను. ‘ఇంత వివరంగా చెప్పడం అవసరమా?’ అన్నట్లు మావారు నన్నో చూపు చూసారు. అవేమీ పట్టించుకోనట్లు...
‘ఏదమ్మా, బాపట్లా? బాపట్ల బిడ్డవా ?’ అంటూ ఒక నమస్కారం పెట్టారు పెద్దాయన.
మా ఇద్దరికీ ఏమీ అర్ధం కాలేదు. ‘మా ఊరి మీద ఈయనకు ఎందుకింత అభిమానం?’ మనసు కళ్ళతో ప్రశ్నిస్తోంది. అది అర్ధమయ్యింది కాబోలు... ఆయన ఇలా అన్నారు.
‘నేను బాపట్లలోని శ్రీ శంకర విద్యాలయము అనే వేద పాఠశాలలో యజుర్వేదం, స్మార్తం చదువుకున్నాను. కొన్నేళ్ళ తర్వాత కాశీ వచ్చి, అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయాను. అప్పట్లో నేను వారాలు చేసుకున్నప్పుడు, ఆ మహాతల్లులు నాకు పెట్టిన ముద్దే, ఈరోజున నన్ను ఇంతవాడిని చేసింది. అందుకే నాకు బాపట్ల పేరు విన్నా, అక్కడి మనుషుల్ని చూసినా, మనసు పులకిస్తుంది.’
‘బాబాయ్ గారు, వారాలు చేసుకోవడం ఏమిటి? వేద పాఠశాలలో నాకు తెలిసి, విద్యార్ధులకు వసతి, భోజన సదుపాయాలు ఉన్నాయి కదా ! గాయత్రి  అమ్మవారి గుడికి వెళ్తూ వేద పాఠశాల పిల్లల్ని చూసాను కానీ, ఇంత వయసున్న మీరు అక్కడ చదువుకున్నారంటే, అసలు ఆ వేదపాఠశాల ఎప్పటినుంచి ఉండి ఉండాలి ? ఎలాగూ సమయం ఉంది కనుక, మరికాస్త వివరంగా చెబుతారా?’ వరస కలిపేస్తూ అడిగాను.
‘చేబుతానమ్మా...’ అంటూ ఇలా చెప్పసాగారు ఆయన...
***
శ్రీ శంకర విద్యాలయానికి  వందేళ్ళ చరిత్ర ఉంది తల్లీ ! అప్పట్లో బ్రహ్మసమాజం బాగా చలామణీలో ఉండేది. బాపట్ల చాలా చిన్న ఊరు, అసలు అక్కడ రైలు ఆగేది కాదు. ఒకసారి శృంగేరీ పీఠానికి చెందిన ‘స్వామి బ్రహ్మానంద తీర్ధుల వారు’ ఇటుగా వెళ్తూ ఉన్నారట. ‘అంతరించిపోతున్న హిందూ ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టేందుకు ఇక్కడ ఒక వేద పాఠశాల పెట్టాలి,’ అన్నారట. ‘స్వామీ, ఇది చాలా చిన్న ఊరు, ఇక్కడ మనకు అంత సహకారం లభించదు, పైగా ఇక్కడ రైలు కూడా ఆగదు,’ అన్నారట శిష్యులు. కానీ, అనుకోకుండా అక్కడ రైలు ఆగడం, స్వామి వారు అప్పట్లో భావన్నారాయణ స్వామి ఆలయంతో పాటు కలిసి ఉండే శివాలయంలో బస చెయ్యటం జరిగాయట. స్వామివారు అక్కడ శంకరాచార్యుల వారి విగ్రహాన్ని, గాయత్రి, దత్తాత్రేయ, విద్యా గణపతి విగ్రహాల్ని ప్రతిష్టించి, ఈ వేద పాఠశాలను నెలకొల్పే ముందు, ఆ ఊరి పెద్దమనిషి అయిన ప్రాచూరి వారిని పిలిచి, తన ఉద్దేశం తెలిపారట.  హిందూ ధర్మానికి బ్రహ్మ రధం పట్టాలన్న వారి ఉద్దేశానికి ఊరి ప్రజల నుంచి అనేక విధాలుగా సహాయసహకారాలు లభించాయట. అలా ఆరంభమైన ఈ వేదపాఠశాలలో క్రమంగా, ఔదుంబర వృక్షం క్రింద దత్త పాదుకలను ప్రతిష్టించి, విద్యార్ధుల వసతికి ఒక భవంతిని, ఇతర సదుపాయాలను నిర్మించడం జరిగింది. అప్పట్లో పెద్దగా నిధులు లేనందువల్ల, ఇంత గొప్ప కార్యక్రమానికి తామూ సహాయపడాలి అనే ఊరి ప్రజల సహృదయం వల్ల, నావంటి కొందరు విద్యార్ధులు వారాలు చేసుకునే వీలును వారు కల్పించారు. ఇప్పుడు మాన్యం భూములు, పటిష్టమైన విద్యామండలి, మిత్రమండలి ఏర్పడి, ఈ పాఠశాల బాధ్యతల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారని విన్నాను.’
***
‘బాబాయ్ గారు, వేదాలు నాలుగని తెలుసు, కాని స్మార్తం అంటే ఏమిటి ?’
‘స్మార్తం అంటే స్మృతి గ్రంథాలలో చెప్పిన ప్రకారం చేయవలసిన కర్మ. వేదాలను మరియు శాస్త్రాలను అనుసరించే వారిని స్మార్తులు అంటారు. స్మార్తులు ప్రధానంగా ఆది శంకరాచార్యుడు ప్రవచించిన అద్వైత వేదాంత తత్త్వాన్ని అనుసరిస్తారు. నిత్య కర్మలు, యజ్ఞాలు, పౌరోహిత్యానికి అభ్యసించవలసిన విధానాలు, అన్నీఇందులో నేర్పుతారు.’
‘ఓహో, అలాగా... కానీ బాబాయ్ గారు, అసలు ఈ వేదాలని ఎందుకు చదువుకోవాలి ? ఇప్పుడు చాలా రకాల విద్యలు, వృత్తులు వచ్చాయి కదా ! మరి వేదాల ప్రాముఖ్యత ఏమిటి ?’
‘సృష్టిలో ఎన్నో గుహ్యమయిన విషయాలు ఉన్నాయి. మానవ మేధకు, తర్కానికీ అందని విషయాలను వివరించడానికి విజ్ఞులు వేదాలను ప్రమాణంగా చెప్తారు. ప్రపంచ సాహిత్యంలో వేదములకంటే అత్యంత పురాతనమైన సాహిత్యం మరోటి లేదు."విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. ఋషులు తీవ్రమైన తపోనిష్ఠలో ఉన్నప్పుడు ఆకాశవాణి రూపంలో వీటిని విని, అక్షరబద్ధం చేశారు. అలా వేదం నిరంతర ప్రవాహంగా, అనంతంగా సాగిపోయింది. ఈ అనంతమైన వేద విజ్ఞానాన్ని వ్యాసుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు భాగాలుగా విభజించాడు. ఋగ్వేదం వాక్కు ప్రధానంగా కలది. ఋగ్వేదంలో ఉండే మంత్రాలకి ఋక్కులని పేరు. ఇవి ఛందోబద్ధంగా ఉంటాయి. రెండవది యజుర్వేదం. ఇంద్రియాలతో కర్మలు చేసే విధానం తెలిపేది. యజ్ఞయాగాదుల గురించిన వివరణ ఇందులో ఉంటుంది. ఇందులో రెండు భాగాలున్నాయి. అవి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం మూడవది సామవేదం. సామం అంటే గానం అని అర్థం. అంటే సామవేదం సంగీతానికి సంబంధించింది. ఇది అన్ని వేదాలలోకీ చిన్నది. నాలుగవది అధర్వణ వేదం. దీనిలో యుద్ధవిద్యలు, పౌరధర్మాలు, ఆరోగ్యం, మూలికా చికిత్స, రాజ్యం, రాజ్యాంగం, రాజకీయవ్యవస్థల గురించిన వర్ణనలు, అనేకరకాలైన చికిత్సా విధానాలు ఉంటాయి.
ఈ సకల చరాచర సృష్టికి కారణ భూతుడయిన పరమాత్మ , ఈ సృష్టి రహస్యాలను, ఆత్మల స్వరూపాన్ని, ఆధ్యాత్మిక తత్వాలను, మానవ ధర్మాలను, ఎన్నో గుహ్యమయిన మంత్రాలను, వీటిలో పొందుపరచాడు. అనంతమైన విజ్ఞానాన్ని నిబిడీకృతం చేసుకున్న వేదాలు మానవుని ఐహిక, పారమార్థిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ ప్రవచించాయి. సత్యధర్మాలతో గడిపే జీవనమార్గానికి అనేక మంత్రాలు, స్తోత్రాల రూపంలో మనకు అందించాయి. అవే యజ్ఞయాగాదులు, పూజలు, ప్రార్థనలు, వ్రతాలు, మొక్కులుగా మారాయి. వేదాల్లో అనేక శాస్త్ర విషయాలు సంక్షిప్తంగా, గూఢంగా చెప్పబడ్డాయి. వేదానికి ఒక నాదం వుంది. వేదానికి ఒక స్వరం వుంది. వేదానికి ఒక ఛందస్సు వుంది. స్వరయుక్తంగా వేదం చదువుతూ వుంటే , చెవులకు ఇంపుగా ఉండడమే కాదు, ఆ చదివేచోట అలౌకికమైన ప్రశాంతత కూడా ఏర్పడుతుంది.
ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ప్రయాసపడి కనుగొనడానికి ప్రయత్నిస్తున్న విషయాలన్నీ మన వేదాలలో ఏనాడో చెప్పబడ్డాయి. కుండల్లో కౌరవులు పెరిగిన వృత్తాంతం, నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ లను గుర్తు చేస్తుంది. చందగ్యోపనిషత్తు లో చెప్పబడిన ఉద్భిజాలు(చెట్టు నుంచి జనించేవి), అండజాలు(గుడ్డు నుంచి జనించేవి), జీవజాలు(జంతువుల నుంచి జనించేవి) వంటి జాతుల వివరణ ఇటువంటి రహస్యాలను తెలుపుతుంది. అధర్వణ పరిష్ట ప్రకారం సప్త ద్వీపాలు ఉన్నాయి. మనము 'అంటార్కిటిక' ను కనుగొన్నది ఎనభై సంవత్సరాల పూర్వం మాత్రమే ! ఈ విషయాన్ని వేదాల్లో మునుపే వివరించడం జరిగింది. ఛాందోగ్య ఉపనిషత్ లో సూర్యోదయం ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం నుంచి ఉత్తరానికి, పశ్చిమం నుంచి తూర్పుకి ఉండే ప్రాంతాల వివరణ అసలు సూర్యోదయం- అస్తమయం లేనే లేని ప్రాంతాల వివరణ ఉంది. ముందరి రెండు ప్రక్రియలు ధ్రువాల వద్ద జరుగుతాయని తెలిసిందే, సూర్యోదయం, సూర్యాస్తమయం లేనిది సూర్య గ్రహం పైనే... మిగిలిన రహస్యాలను కనుగొన వలసి ఉంది. మన వేదాల్లోనే, విమాన విజ్ఞాన శాస్త్రం, మెదడు లోని కుడి ఎడమ భాగాలలోని పని తీరు లోని వ్యత్యాసం వంటి వాటిని వివరించారు. విజ్ఞాన శాస్త్రం సహాయంతో, ఎంతో క్లిష్టమయిన ఈ రహస్యాలను చేదించేందుకు కొన్ని సంవత్సరాలు పడుతోంది. మరి ఈ రహస్యాలు వేదాల్లో ఎలా ఉంటాయి---సృష్టి కర్తే, వేద కర్త అయితే తప్ప!
సముద్రంలోని బిందువు ఆవిరై, మేఘమై, వర్షమై, ప్రవాహమై, అనేక నదీనదాల్లో భాగమై, తిరిగి సముద్రాన్నే చేరినట్లు, జీవులన్నీ సముద్రంవంటి పరమాత్మ నుంచి గత కర్మలకు అనుగుణంగా అనేక ప్రాణులుగా జన్మించి, పరితపించి, చివరకు పరమాత్మను చేరాలి. ఇదే మానవ జీవిత పరమార్ధం. ఈ పరమార్ధం దిశగా మనిషిని నడిపించే నిజమైన విద్యే వేదవిద్య. మిగిలిన విద్యలన్నీ అహాన్ని పెంచే మిధ్యలే. వేదాలు చదువుకున్నవారు తాము తరించడమే కాక, సనాతన ధర్మం ద్వారా ఇతరులకు కూడా తరించే మార్గాన్ని చూపగలరు. అందుకే వేదాలు చదవడమే, తద్వారా ధర్మాన్ని కాపాడడమే ఉత్తమమైన మానవ ధర్మం తల్లీ. ‘
ఆయన  చెప్పటం ముగించేసరికి మా పార్సెల్ కూడా రావడంతో ఆయనవద్ద సెలవు తీసుకుని, బయలుదేరాము. ఆ సాయంత్రం పడవపై కాశీలోని అన్ని ఘట్లు తిరుగుతూ, వివిధ రాజులు గంగాతీరంలో కట్టించుకున్న కోటలు చూస్తూ, గంగా హారతి ఇచ్చే ‘మణికర్ణికా ఘాట్’ వద్దకు చేరాము. దారిలో పడవల్లో ఒక పెద్ద ఆకులో పువ్వుల మధ్యన దీపాల ప్రమిదలు పెట్టి  అమ్ముతున్నారు. దాదాపు గంగాహారతి చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ దీపాలు కొని, వెలిగించి నదిలోకి వదులుతున్నారు. కోటి చుక్కల్ని పొదుగుకుని, విర్రవీగుతున్న ఆకాశానికి పోటీగా తనువెల్లా దీపాల చుక్కలతో మెరిసిపోతోంది గంగమ్మ. ఇక 5-7 మంది వరుసలో నిలబడి, శంఖాలు పూరించి, గంటలు వాయిస్తూ, లయబద్ధంగా ఒకే విధంగా కదులుతూ, గంగమ్మకు ధూపం, హారతులు ఇచ్చే వైభవం కళ్ళారా చూడాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు సరిపోవు.
మర్నాడు రాత్రి మా తిరుగుప్రయాణం. రైల్లోకి  పార్సెల్ చెప్పి, పాక్ చేయించుకునేందుకు మర్నాడు మధ్యాహ్నం వెళ్ళాము. పార్సెల్ ఒచ్చేలోగా మళ్ళీ ఆయనతో మాట కలిపాను.
‘బాబాయ్ గారు, నిన్న మీరు చెప్పిన దాన్ని బట్టి, ఇహానికి, పరానికి, ఇతరుల సంక్షేమానికి, వారు తరించడానికి పనికొచ్చే అసలైన విద్య వేదవిద్య. మరి ఈనాడు ఆలయ పూజారులను ‘పంతుళ్ళు’ అంటూ లోకువ కడుతున్నారు. వాళ్లకు డబ్బులు లాగే వాళ్ళుగా ముద్ర వేస్తున్నారు. ‘అర్చకులా !’ అయితే మేము పిల్లను ఇవ్వము, అని తెగేసి చెప్తున్నారు. అంతెందుకు తరతరాలుగా పౌరోహిత్యం చేస్తున్నవారు కూడా తమ బిడ్డలను డిగ్రీలు చదివించి, సాటి పురోహితుల పిల్లలకు ఇవ్వమని, ఉద్యోగాస్తులకే ఇస్తామనీ అంటున్నారు. అంటే, సమస్త జగతికీ అధినాయకుడైన దేవేదేవుని సేవ కంటే, ‘ఇమ్మనుజాధమ్ముల’ అడుగులకు మడుగులొత్తే ఇతర వృత్తులే గొప్పవని, అర్చకులే అంగీకరించినట్లే కదా ! ఇటువంటి తరుణంలో నానాటికీ వేదాధ్యయనం చేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. అలా వేదాలు చదివేవారు ఉన్నా, వారికి వివాహాలు కాక, వారి వంశాలు నిలిచిపోయే దుర్గతి దాపురించింది. ఇక ఈ పరిస్థితుల్లో మనకు ఏదీ దారి ?’
‘అమ్మా, మంచి ప్రశ్న వేసావు. దైవం పదేపదే ఎంచుకుని అవతరించే ఈ కర్మభూమి, పాశ్చాత్యుల ప్రభావం వల్ల వారిలా, భోగ భూమిలా తయారవడం అత్యంత విచారకరం. జపాలు, పూజలు, పేరుతో అర్చకులు మనకర్మను తొలగిస్తున్నారు. అనేక రకాల దానాలు స్వీకరించి, మన పాపాలను క్షయం చేస్తున్నారు. ఉపనయనాలు, వివాహాలు చేసి, మీకు అనేక శాస్త్రబద్ధమైన వేడుకలకు అర్హత కల్పిస్తున్నారు. చివరికి చనిపోయిన వారి ఆత్మల్ని కూడా క్షేమంగా వైతరిణి దాటించి, పితృ కార్యాల ద్వారా పితృ దేవతలకు సంతుష్టి కలిగిస్తున్నారు. ఒకవిధంగా వారు చేసేది గొప్ప త్యాగం తల్లీ. మన జీవితాల్ని మెరుగుపరిచేందుకు వచ్చిన దైవదూతలు వారు. వేలకు వేలు హోటళ్ళకు, విలాసాలకు ఖర్చు పెట్టేవారు సైతం వారడిగిన దక్షిణ ఇచ్చేందుకు వేనుకాడుతూ, వారికి వంకలు పెడుతున్నారు.
ఎంత గొప్ప పదవుల్లో ఉన్నవారైనా, దేవుడి గుడికి వచ్చి, గుమ్మంలోనే నిలబడాలి. కానీ, అర్చకులకు మాత్రమే దైవాన్ని  తాకి, ఆయనకు అన్ని ఉపచారాలు చేసే అవకాశం, అదృష్టం ఉంటుంది. ఇది మరచి  లోకువ కట్టడంతో ‘చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా’ అన్నట్లు ఇప్పటికే అనేక గ్రామాల్లోని ఆలయాలలో దేవుడికి పూజలు చేసేందుకు అర్చకులు లేక, మూతబడి, శిధిలమైపోతున్నాయి. పూజారి లేని ఆలయాల్ని, పెళ్ళిళ్ళకి, బారసాలలకి, వ్రతాలకి, కర్మకాండలకి తగిన విధివిధానాలను జరిపించే పురోహితులు లేని జీవితాల్ని ఒక్కసారి ఊహించండి. అటువంటి స్థితిలో ఏ వేడుకలూ సంప్రదాయబద్ధంగా జరగలేదని, మన మనస్సులో ఎంతో శూన్యం, అసంతృప్తి కలుగుతుంది కదా. రాకెట్ల యుగంలో ఈ చాదస్తాలు ఏమిటి, అంటూ కబుర్లు చెప్పేవారు సైతం ఇలా వాపోవడం చూస్తుంటాము, ఎందుకంటావు చెప్పు ?ఎందుకంటే, మనిషి ఆధునికత పేరుతో భౌతికంగా ఎంత మారిపోయినా, అతని మనసు, ఆలోచనలు మాత్రం భారతీయమే. అందుకే వేదవిద్య గొప్పతనాన్ని లోకానికి చాటి, ఇది సమూలంగా అంతరించిపోకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వాల మీద, దాతల మీద, మీవంటి ముందు తరాల వారసుల మీద ఉంది. ధర్మో రక్షతి రక్షితః.’
ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసి, అనేక కటువైన వాస్తవాలు తెలుసుకున్న భావనతో, భారమైన మనసుతో, ఆయనకు నమస్కరించి, దీవెనలు అందుకుని అక్కడినుంచి కదిలాను. ఈయన కాశీ యాత్రికుల కడుపులు నింపేందుకు అన్నపూర్ణమ్మ పంపిన ముద్దుబిడ్డడో , లేక మూఢ జనుల అజ్ఞానాన్ని తొలగించేందుకు ఈ గడ్డపై నడయాడుతున్న పరోక్ష పరమేశ్వరుడో ! ఏమైనా మన జీవితాలతో తెలిసో తెలియకో పెనవేసుకుపోయిన ఈ ‘జీవన వేదాల్ని’ వేదపండితుల్ని, పురోహితుల్ని సగౌరవంగా ఆదరిస్తూ, ఈ సంస్కృతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది.
***
(ఈ కధ కోసం శ్రీ శంకర విద్యాలయం గురించిన వివరాల్ని అందజేసినందుకు ఆ సంస్థ సెక్రటరీ శ్రీ చలపతిరావు గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు.)

No comments:

Post a Comment

Pages