కావేరి(పెద్ద కధ ) - అచ్చంగా తెలుగు

కావేరి(పెద్ద కధ )

Share This

కావేరి(పెద్ద కధ )

కౌండిన్య 


డాబా మీద నిదురించడం అనేది మనకు సరా మాములే ఆ రోజుల్లో, అదీ ప్రత్యేకంగా వేసవి కాలం లో. కొన్ని ఊళ్ళల్లో, చల్లటి గాలుల కోసం, ఇళ్ళల్లో ఉక్కపూతలు తట్టు కోలేకో సేద తీర్చుకోవటం కోసం, లేకపోతే తేట తియ్యని వెన్నెలను ఆస్వాదించడం కోసం, మరియు ఆకాశం అంతా పరిచిన నక్షత్రాలను చూస్తూ లెక్క పెట్టడం కోసం, ఇంకా కేంద్రబిందువైన చంద్రుడిని చూసి మైమరిచి పోవడం కోసం, అదీకాక అటూ, ఇటూ వెడుతూ గాలిలో తేలే మేఘాలను చూడటం కోసం, లేదా ఆదమరిచి నిదురించడం కోసం ఇంటి డాబా పైకి ఎక్కే వాళ్ళం. అదీ, ఓ మంచి అనుభూతే కాకుండా భలే సరదా కూడా. చక్కగా మెత్తటి దూదితో ఇంటికొచ్చి ఏకిన పరుపు, కింద వేసుకొని, దాని మీద మల్లెలాంటి తెల్లటి దుప్పటేసి, ఓ రెండు దిండ్లు తలకింద వేసుకొని, పల్చటి దుప్పటి సగం వరకూ కప్పు కొని, ఓ మందపాటి దుప్పటి తెల్లవారు జామున నిద్ర భంగం కలుగకుండా కప్పకోవడం కోసం దగ్గర ఉంచుకొని, అలా ఆకాశం వైపు చూస్తూ, ఊహలతో విహరిస్తూ,, ఆ గోరుముద్దల పాలిట తండ్రి అయిన చందమామను ఆస్వాదిస్తూ, అలా, అలా కళ్ళు చిన్నవై నిద్ర లో జారుకోవడం లో ఉన్న హాయి ఇంక దేంట్లో ఉంటుందండి?
సాయంత్రం అయ్యే సరకే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం, అదే చేత్తో, డాబా మీదకెళ్ళి ఊడ్చి, నీళ్ళు చల్లి, ఆ ప్రదేశాన్ని రాత్రికి రెడీ చేసుకోవడం అనేది సహజం. కావేరమ్మకు కి అరవైఐదు ఏళ్ళుంటాయి. ఇంటి చాకిరి భారమంతా తన నెత్తి మీదే. వాళ్ళయన పోయి దాదాపు పదేళ్ళ పైనే. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులు. పొద్దున్న పోతే ఆఫీసు లకు ఇద్దరూ రాత్రి వచ్చే సరికే పొద్దు బోతుంది. రాత్రి అలిసి పోవడం తో సూటి పోటి మాటలతో ఓకరినొకరు ఏదో ఓకటి అనుకోవడం, ఏదో సర్ది చెప్దామనుకొన్న కావేరమ్మను విసుగు కోవటం అలవాటు అయిపోయింది. పొద్దున్న ఏడింటి కల్లా ఇద్దరూ ఇంటినుంచి బయలు దేరాలాయే, అంటే ఆరింటి కి లేస్తారు అటూ ఇటూ గా, కాఫీలు, టిఫిన్ లతో సహా చేతికంది చాల్సిందే, క్యారేజి కట్టడాలు, బాటిల్ లో నీళ్ళు నింపడాలు అంతా హడవుడే. కావేరమ్మ నాలుగింటికి లేస్తుంది రోజూ, తన ఆరోగ్యమా అంతంత మాత్రం. ఇస్తీ చాకళ్ళ లెక్కలు, ఇంట్లో పనివాళ్ళతో వేగడాలు, వాళ్ళు రాని రోజూ ఆ పని భారాలు, మార్కెట్ లో కూరలు తెచ్చుకోవడాలు, తరగుకోవడాలు, వంట చేయటాలు, అన్నింటి పద్దులు రాయటాలు, అవి కొడుకు కు చెప్పి తిట్టించుకోడాలు, వీటన్నిటి తో విసుగారి పోయింది అమాయకపు కావేరమ్మ. కొడుకు కాంతారావు కు పిల్లలు పుట్టరని డాక్టర్లు కచ్చతంగా చెప్పి కొన్నేళ్ళయింది. కావేరమ్మ కు ఉన్న గోలల లో ఆ ఆందోళన ఓకటి. ఏన్నో సార్లు తను మాట్లాడటానికి ప్రయత్నించింది, కానీ వ్యర్థం. సాయత్రం అయ్యింది, కల్లాపు చల్లి ముగ్గు లేసింది తనకు తెలిసిందేదో. మేడ పైకెళ్ళింది. కాళ్ళు కాలాయి, గబా గబా ఓ చెంబు నీళ్ళు బక్కెట్ లోంచి తీసి నేలమీద పోసి వెంటనే ఆ చోట నించుంది. అయినా కూడా నేల వేడే, ఓ కాలు ఎత్తుతోంది, దించుతోంది, పుల్లల చీపురు తో సాధ్యమైనంత త్వరగా చేసింది, మిగిలిన నీళ్ళన్నీ అక్కడే పారపోసింది, లేక పోతే మళ్ళీ దాన్ని మోసుకుంటూ కిందకి తీసుకెళ్ళాలి ఆ ముసలి ప్రాణి. కిందకెళ్ళి గడియారం చూసుకొంటోంది, ఓ అరగంట లో వస్తారు తను మళ్ళీ తయారవక పోతే లేని పోని చివాట్లు అని తను తయారై నేత చీర కట్టుకొని కూర్చుంది ఇంటి ముందు వాకిట్లో. షేరింగ్ ఆటో శబ్ధం వచ్చింది, అది విని కావేరమ్మ ఇంటిలోకి పరిగెత్తింది, వాళ్ళకు చేతికి అందించ టానికి గ్లాసులలో మంచినీళ్ళు కుండ లోంచి తీసి ఉంచింది. కోడలు సావిత్రి, లోపలకు వస్తూ ఆ ముగ్గు చూసి, “రోజూ ఇదే, నాలుగు పిచ్చి గీతలు చక్ పీస్ వేస్టు ఈవకి”, అని విసుక్కోంది, అదేని విననట్టు లోపలకు వస్తున్న కోడలిని చిరునవ్వు తో పలకరించి నీళ్ళు చేతికివ్వ బోయింది, “ఆ, అక్కడ పెట్టంది”, అంది సావిత్రి. కొడుకు కాంతారావు లోపలికి వచ్చాడు, “పోస్ట్ ఏమైనా వచ్చిందా”, అని అడిగాడు రాగానే. “రాలేదు నాయన”, అని జవాబిచ్చింది. “నిద్ర పోయింటావు మద్యాహ్నం, ఆ పోస్ట్ మ్యాన్ కాస్తా ఏవరూ లేరనుకోని వెడిపోయింటాడు”, అన్నాడు కాంతారావు. గ్లాసుడు నీళ్ళు చేతికందించింది. సగం తాగి గ్లాసు చేతికిచ్చాడు, దురుసుగా. నీళ్ళు కొన్ని ఒలికి కావేరమ్మ చీర మీద పడ్డాయి, “ఏం, పట్టుకోడం రాదా, అంత ఓపిక లేనట్లు, అన్నీ పనులకు మనుషులు పెట్టాగా”, అన్నాడు విసుగ్గా. “చేసే ఓక్క పని సరిగా చేయడం లేదు ఈ మధ్య”, అని కసురుకున్నాడు. ఎంతకైన తల్లి కదా, అలిసి పోయాడేమో అనుకొని “కొంచెం విశ్రాంతి తీసుకో నాయన, కాసిని బజ్జీలు తిని కాఫీ తాగుదువు గానీ”, అంది కావేరమ్మ. “మొన్న ఆ పద్దు లో యాభై రాసావు, ఖర్చులు పెరుగుతున్నాయంటే మాట వినవు”, అంటూ లోపడి కెళ్ళాడు. వంటింటి లో ఓ మూల కింద కూర్చుంది కావేరమ్మ. వచ్చిన దగ్గర నుండి ఇద్దరూ ఎడా పెడా మొహం, ఓకళ్ళ కొకళ్ళు కళ్ళలో చూసుకొని మాట్లాడరు. మాటకు పైమాట, కొన్ని సార్లు పెద్దగా కింద వస్తువులు పడేసిన శబ్దాలు. ఓక్కోసారి, కావేరమ్మ చెవులు మోసుకుంటుంది, ఇంకెన్నేళ్ళు దేముడా అనుకుంటూ. భోజనం చేసారు, ఉలుకు లేదు, పలుకు లేదు. అవ్వగానే కాంతారావు పరుపు, దుప్పటి, దిండు పట్టుకొని మేడ మీదకు వెళ్ళాడు. కోడలు కూడా తిని తిన్నవన్నీ అలాగే వదిలి, తను బెడ్రూము కెళ్ళింది. ఈ రోజేంకొత్త అనుకుంది. ఆ ఎంగిలి ప్లేట్లు తీసింది, కొన్ని కావలసినవి చెంబు, గ్లాసులు తోమింది. తను తినకుండా మంచి నీళ్ళు చెంబు, గ్లాసులు తీసుకొని మేడ మీద కెళ్ళింది. అది చూసి, “అక్కడ పెట్టి వెళ్ళు”, అన్నాడు కాంతారావు. అమ్మాయిని పైకి పిలువు నాయన అంది, “ఎందుకు, మనశ్శాంతి లేకుండా ఉండటానికా?”, అన్నాడు వెటకారంగా. “నీతో, ఓ ముఖ్య మైన విషయం మాట్లాడాలి”, అంది.
“నీతో, ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి”, అంది కావేరమ్మ. “కూర్చుంటా నాయన, ఏమైనా అనుకో, ఈ మధ్య ఓపిక ఉండటంలా”, అంది. “సరే, ఆ చెప్పేదేదో త్వరగా కానిస్తే ఇంక నే పడుకుంటా, పొద్దున్నే లేవాలి, నిద్ర ముంచుకు వస్తోంది”, అని అన్నాడు కాంతారావు. పక్కనే కూర్చుంది, చేతితో నుదిటి మీద నిమరబోయింది, ఆ చేతిని విదిలిచ్చుకొని తల అటు జరిపాడు. “నాయన, నేను పెద్ద దాన్ని అవుతున్నా, మీ ఇద్దరినీ ఇలా చూసి భరించలేక పోతున్నా”, “మనసు తట్టుకో లేక పోతుందిరా”, అంది కావేరమ్మ. “ఈ సుత్తి చెప్పడానికా”, అన్నాడు కోపంతో, అటు తిరిగి పడుకున్నాడు. చాలా కాలం తరువాత ఈ మాత్రమైనా వింటున్నాడు. అటు ఆకలేస్తున్నా తన మనసు లో ఉన్నది ఎలాగొలా చెప్పేయాలనుకుంది ఈ రోజు. కొంచెం ముందుకు జరిగింది చెప్పేది సరిగా వినపడుతుందో లేదో అని. “ఇంకెక్కడ, నా నెత్తి మీద కూర్చో సరిపోతుంది”, అన్నాడు ఇంకా కోపంతో. ఎంతైన తల్లి కంటే ఎవరికి తెలుసు తన సొంత పిల్లల స్వభావం. అని కాంతారావు చిన్నప్పటి ఇష్టమైన విషయం గురించి చెప్పటం మొదలు పెట్టింది. “గుర్తుందా, పరంధామయ్య గారు, వాళ్ళ ఇల్లు?”, “నువ్వు చిన్నపుడు ఆయన నిన్ను ఎత్తుకొని బలాదూరు తీసుకెళ్ళే వారు”, పరంధామయ్య గారంటే కాంతారావు కు ప్రాణం, సొంత తాతగారు లేక పోయినా, తాతగారు లా ముద్దు మురిపాలు కురిపించిన మహనీయుడు తన ఉద్ధేశం లో. ఆయన ప్రస్తావన రాగానే, కోపం చల్లారి, విసుకు తగ్గి, అలసటంతా పోయినట్లు ఓ సారి నిట్టూర్చి అమ్మ వైపు తిరిగాడు.
కాంతారావు మెత్తబడి లొంగినందుకు, తన వైపు తిరిగినందుకూ, ఆ తల్లికి కళ్ళలో నీళ్ళు ఆ కావేరి నదిని ఓక్క సారిగా ఆపి, వదిలితే వచ్చే ఒరవడి లా గుండె లోతునుండి తన్నుకొని వచ్చింది కన్నీటి ప్రవాహం. కాంతారావు పరంధామయ్య గారి ఆలోచనలో లోకి వెళ్ళాడు. కావేరమ్మ మాత్రం తట్టుకోలేక పోతొంది, చీకటిలోకన్నీరు ధారలు, ధారలు గా కారుతున్నాయి. గట్టిగా ఏడిచేయాలని పించింది కావేరమ్మకు, గుండె వద్దన్నా శబ్ధం చేస్తోంది, గట్టిగా లోతుల నుండి వచ్చే ఆర్తనాదాన్ని కుక్కేయటానికి చేతులు గట్టిగా అడ్డు పెట్టుకుంది, అయినా సరే ఆగట్లేదు. అదే గనక ఏవరూ లేకుండా ఖాళీ ప్రదేశమయ్యుంటే ఆ మేడ, తను చేసే రోదనం కు భూమి కంపించి ఉండేది. ఉరుము మెరుపులు వస్తున్నపుడు ఉరుముల శబ్ధం కంటే మిన్నగా వినపడే అర్జున ఫాల్గుణా అనేటివిగా ఉండేది. ఓ వేయి గంటలు ఓకే సారి మ్రోగిస్తే వచ్చే శబ్ధం లాగా ఉండేది, కడలి లో ఉవ్వెత్తున ఉప్పొంగిన ఉప్పెన శబ్ధం లా ఉండేది, అగ్ని పర్వతం విస్పోటణ అప్పుడు చేసే శబ్ధం లాగా ఉండేది. ఆ తల్లి ఆర్తనకు పరమేశ్వరుడు శివ తాండవం మొదలు పెట్టేవాడు. తను మాత్రం చీకటి లో కొడుకు వినకుండా తను తీసుకొచ్చిన మంచినీళ్ళు చెంబు గ్లాసు తో నీళ్ళు తాగినట్లు గా శబ్ధం చేసింది ఆ గుబులుతో నున్న ఏడుపు శబ్ధం కలిసిపోయేలా, చీర కొంగు తో కన్నీటిని తుడుచుకొంటోంది, ముద్ద ముద్ద అయ్యింది, ఏమీ అవ్వనట్లు, మళ్ళీ దగ్గరకు జరిగి, కనిపించ కుండా మళ్ళీ నేత చీరతో తుడుచుకొని నిమరడం మొదలు పెట్టింది. తల్లి స్పర్శ జీవితకాలం లో మరవడం అసాధ్యం. ఎంత హాయిగా ఉందో అనుకుంటూ, “అవునూ, ఇంతకీ ఆ పక్క డాబా లో ఎవరో ఏడుస్తున్నట్లు శబ్ధం వచ్చినట్లుందే, నేను ఏదో ఆలోచనలో పడ్డాను”, అన్నాడు. “ఏం లేదులే నాయన, నేను మంచినీళ్ళు తాగడం సొంపు”, అంది శోకభరిత కావేరమ్మ.
తను చెప్పాలనుకున్నది మొదలు పెట్టింది. “మీ ఇద్దరికీ ఓ పసి గొడ్డు తోడు అవసరం ఏంతో ఉంది నాయనా”, అని అంది కావేరమ్మ. “నాదేముంది, త్వరలో ఆరే దీపమే”, అంది, “అది కాదమ్మ, అన్నీ నీకు తెలిసినవేగా, ఇంక సాధ్యం కాదు, ఈ విషయం గురించి చర్చ అనవసరం”, అని ఖచ్ఛితంగా చెప్పాడు, “నాకు, నిద్ర వస్తోంది”, అని మాట మార్చబోయాడు. “ఆలోచించు, నువ్వు పరంధామయ్య గారిలా ఓ పసి బిడ్డను లాలిస్తూ, ఆడిస్తూ, ముద్దు చేస్తూ ఉంటే మీ జీవితం చాలా మెరుగు పడుతుంది నాయనా”, అంది. “పోనీ ఈ సారికి సావిత్రి మాట విను, తను చెప్పిన ఉపాయం సబబుగానే ఉంది, నువ్వు నా మాట విని ఈ ఒక్క సారి ఆలోచించు, అనాధాశ్రమం వాళ్ళు దత్తతకు ఒప్పుకున్నారు నాయన”, “మనందరికీ తోడు నీడగా కూడా ఉంటుంది”, అంది. ముభావం తో ముందు తిరస్కరించి నా తరువాత “సరే” నన్నాడు. ఆ సంతోషం తట్టుకోలేక “ఉండు, మన అమ్మాయిని తీసుకొస్తా ఆ సంగతి తనకు కూడా చెప్పి ఆ కలను నిజం చేద్దువు”, అంది. హడావుడి గా కిందకు పరిగెత్తింది. కాంతారావు మూలుగుతూ, అటు ఆకాశం వైపు చూడటం మొదలు పెట్టాడు. ఈ మధ్య కాలం ఎన్నడూ సరిగా చూసింది లేదు, అటో ఇటో పడుకొని గురకలు పెట్టడం తప్ప, అన్నింటిని చూడటం మొదలు పెట్టాడు ఆనందం తో, మళ్ళీ ఓ వైపు సావిత్రి ఏమంటుందో అని గుర్తు కొచ్చి గుబులు కూడా వేసింది.
“అమ్మాయ్, అమ్మాయ్ సావిత్రి”, అని గట్టిగా తలుపు బాదుతోంది. కళ్ళు నలుపుకుంటూ అప్పుడే పట్టిన నిద్ర చెడినందుకు కోప్పడతూ, “అబ్బ, ఇంత అర్ధ రాత్రి ఏంటండి అంకమ్మ సివారులు”, అంది సావిత్రి. వెంటనే, “అబ్బాయి, ఆ బుజ్జి తల్లి కస్తూరిని దత్తత తీసుకోవటానికి ఒప్పుకున్నా డమ్మ”, అంది మహా సంతోషం తో, నువ్వు నా మాట విని ఓ సారి మాట్లాడమ్మ వాడితో డాబా మీద కాచుక్కుర్చున్నాడు, రా వెడదాం”, అంది కావేరమ్మ. “రేపు మాట్లాడదాము లే”, అని తలుపేసేసింది. మళ్ళీ తలుపు బాదింది ఆత్రుత తో, ఏది ఏమైనా ఈ రోజే సంగతి తేలాలని పెట్టుకుంది. సావిత్రి తలుపు తీసింది, ఇద్దరూ కలిసి మేడమీదకు వెళ్ళి మాట్లాడు కొని రేపు ఆ అనాద శరణాలయానికి వెళ్దామని నిశ్చయించు కున్నారు. ఓ రెండు నెలల క్రితం కస్తూరి ని అందరూ చూసి వచ్చారు వాళ్ళ ఊళ్ళో ఉన్న అనాధాశ్రమం లో. కానీ కాంతారావు కే ఆ ఆలోచన అంతగా నచ్చ లేదు, దాని మీద ఇద్దరి మధ్య ఘర్షణలు చాలా సార్లే జరిగాయి, మొత్తానికి అందరూ ఏకీభవించారు కస్తూరి ఇంటికి రాబోతుంది త్వరలో. కావేరమ్మకు మనసు లోమంచి రోజులు రాబోతున్నాయని అనిపించింది. అటు ఎడమ నుండి మూడో బుజ్జి పిల్లే కస్తూరి, దాన్ని చూసుకుంటూ మురిసి పోతోంది, కావేరమ్మ.
(ముగింపు వచ్చే నెల)

No comments:

Post a Comment

Pages