మధుర బాణీల వాణి - మన కీరవాణి - అచ్చంగా తెలుగు

మధుర బాణీల వాణి - మన కీరవాణి

Share This

మధుర బాణీల వాణి - మన కీరవాణి

మధురిమ 


పుణ్యభూమి నాదేశం నమోనమామి అంటూ మన రోమాలు నిక్కబొడిచేలా మన లోని  దేశ భక్తిని నిద్రలేపే పాటైనా , వేణువై వచ్చాను భువనానికీ--గాలినైపోతాను గగనానికి అంటూ జీవిత సత్యాన్నీ కళ్ళముందు ఆవిష్కరింపచేసిన పాటైనా, అంతర్యామి అలసితి సొలసితి  అని అన్నమయ్య ఆర్ధతతో ఆలపించినా, ....(ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి)అంటూ సాగే కాలేజీ పిల్లల వీడుకోలు పాటైనా, గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి…. అంటూ ఆ పాటవిన్న ప్రతీ వారినీ జ్ఞాపకాల ఆనందభాష్పాల  జడివానలో తడిపినా , అల్లో నేరెళ్ళో ..అల్లో నేరెళ్ళో అంటూ సాగే జానపద బాణీలైనా , అంతా రామమయం అంటూ రామదాసు గారి భావసంపద ని రాగ భావంతో మనకు అందించినా, మమతల తల్లి ఒడిలో బాహుబలి కి జోల పాడించాలన్నా,పచ్చబొట్టేసినా పిల్లగాడానీతో అంటూ సాగే యుగళ గీతమైనా గాయనీ గాయకులచే  సమయానికి తగు పాట పాడించిన గొప్ప సంగీత దర్శకులు, ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషి… ఆయన స్వరపరిచిన ఓ పాట బాణీలాగానే మౌనంగానే ఎదగి…  ఎదిగినకొద్దీ ఒదిగి ఒదిగి ఉంటున్న గొప్ప సంస్కారం గల మనీషి  శ్రీ ఎం.ఎం.కీరవాణి గారు.
1961 వ సంవత్సరంలో జూలై 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు లో జన్మించారు.వీరి కుటుంబం సినిమా రంగానికి దగ్గరగా ఉన్న కుటుంబమే.వీరు ప్రముఖ తెలుగు,హిందీ చలనచిత్రాల స్క్రీన్ ప్లే రచయిత శ్రీ కె.వి విజయేంద్ర ప్రసాద్ గారి మేనల్లుడు.ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ కల్యాణి మాలిక్ గారు,శ్రీలేఖ గారి సోదరులు.రచయిత శివశంకర్ కాంచి గారు కూడా వీరి సోదరులే. తనదైన ముద్ర తో తెలుగు సినిమా స్థాయి ని పెంచిన ప్రఖ్యాత దర్శకులు శ్రీ ఎస్.ఎస్ రాజమౌళి గారికి కూడా దగ్గర బంధువే మరి.
ఆయన పూర్తి పేరు కోడూరి మరకతమణీ కీరవాణి.వేదనారయణ అనే ఇంకో పేరు కూడా ఉంది. ఎం.ఎం క్రీం అని హింది చలనచిత్ర రంగం,మరకతమణి అని తమిళ చిత్ర పరిశ్రమ ,కీరవాణిగారు అని మన తెలుగు చలచిత్ర పరిశ్రమ వాళ్ళు పిలుచుకున్నా ఆయన పేరు లోనే ఓ మధురమైన ,అద్భుతమైన శాస్త్రీయ సంగీత  రాగం ఉంది మరి. బాల్యం లో కొన్ని రోజులు కర్ణాటక రాష్ట్రంలో ని రాయిచూర్ లో నివసించారట తరువాత సినిమాలలో కి రావాలనే ఉద్దేశ్యంతో చెన్నయ్ నగరానికి వచ్చారు.ఇప్పుడు వీరి కుటుంబం లో సినిమాలకు సంబంధించి చాలామంది ఉన్నా కానీ వీరు  యుక్తవయస్సు లో ఉన్నప్పుడు అలా ఏమీలేదుట.ఈరోజుల్లో ఎంతో మంది గాయకులకు పారితోషకాల పరమాణ్ణాలు పెడుతున్నా,శ్రోతలైన మనకైతే తన పాటలనే పంచ భక్ష్య పరమాణ్ణాలతో మన వీనులకి విందు గావిస్తున్నా...... కీరవాణి గారి జీవితం వడ్డించిన విస్తరి ఎంత మాత్రము కాదు. తొలినాళ్ళలో ఆయన చాలా కష్టపడ్డారు.అందరి లాగే అవకాశాల కోసం అలుపెరగకుండా ప్రయత్నించారు.200 రూపాయల నెల జీతానికి పెద్దవారి దగ్గర పనిచేసిన రోజులూ ఉన్నాయి.
1987 లో ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ చక్రవర్తి గారి దగ్గర సహాయ సంగీతదర్శకుని గా పని చేశారు.కలక్టర్ గారి అబ్బాయి, భారతం లో అర్జునుడు వంటి సినిమాలకు చక్రవర్తి గారి దగ్గర సహాయదర్శకులుగా పనిచేసేరుట. చక్రవర్తి గారి దగ్గర పని చేస్తున్న రోజుల్లొనే తెలుగు సినిమా పాట కి ఒక గౌరవం, హోదా ని తెచ్చిపెట్టిన కీ.శే. శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారితో కూడా సన్నిహితం గా  ఉంటూ  సుమారు ఒక సంవత్సరం పాటు సినీ సంగీత, సాహిత్యాలపై ఎన్నో విషయాలు అవగాహన చేసుకున్నారు. ఈ సమయం లో అంటే 1989 లో విడుదలైన శివ సినిమా కి సంగీతాన్ని అందించే  అవకాశం  తృటి లో తప్పింది.ఎటువంటి అనుభవం లేని కీరవాణి గారికి అవకాశం ఇస్తే ఏం ప్రమాదం వస్తుందో అని భయపడి ఆ అవకాశం అప్పటికే విజయాల జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఇళయరాజా గారికి ఇచ్చారు  నిర్మాత అక్కినేని వెంకట్ గారు.
మొట్టమొదటి సారిగా 1990 లో కల్కి అనే తెలుగు సినిమాకి స్వయంగా సంగీతం చేసే అవకాశం వచ్చింది.ఆ సినిమా కి సంగీతం సమకూర్చినా ఆ సినిమా విడుదల కాలేదు.అదే సంవత్సరంలో తెలుగు సినీపరిశ్రమ ప్రఖ్యాత దర్శకులు శ్రీ మౌళి గారు "మనసు మమత" అనే సినిమాకు సంగీత దర్శకత్వం చెయ్యడానికి అవకాశం ఇచ్చారు.ఈ సినిమా కి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల వెలుగులోకి వచ్చారు. ఈ విధంగా మనసు మమత తన సంగీత దర్శకత్వం లో మొదటి సినిమాగా ఆయన వర్ణిస్తారు.
1990 లో సీతారామయ్య గారి మనవరాలు,అశ్విని  వంటి సినిమాలు, 1991లో మొండిమొగుడు పెంకి పెళ్ళాం లాంటి సినిమాలు చేసి వైవిధ్యమైన సంగీత దర్శకులు అని పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో కీరవాణి గారి దశను-దిశను కూడా మార్చిన సినిమా రాంగోపాల్ వర్మ గారి దర్శకత్వం లో వచ్చిన క్షణ-క్షణం. ఈ సినిమాకి ఆయనకు ఉత్తమ సంగీత దర్శకులుగా నంది అవార్డ్ కూడా లభించింది.ఈ సినిమాలోని పాటల ద్వారా ఒక వైవిధ్యమైన సంగీత దర్శకులు గా ప్రేక్షకుల మనసుల్లోనే కాదు చాల పెద్ద పెద్ద సినీ దర్శ క -నిర్మాతల దృష్టిలో కూడా పడ్డారు మన కీరవాణి గారు.
ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా సుందరాకాండ, ఘరానామొగుడు, అల్లరిప్రియుడు, గాండీవం, శుభసంకల్పం, అల్లరిప్రియుడు, పెళ్ళిసందడి,స్టూడెంట్ నెం:1, సింహాద్రి, ఒకరికొకరు, నేనున్నాను, నా ఆటోగ్రాఫ్, ఛత్రపతి, మగధీర ,వేదం,మర్యాద రామన్న వంటి వాణిజ్యపరమైన చిత్రాలు చేస్తూ విజయాలపై విజయాలతో తన సంగీత ప్రవాహం సాగిస్తూనే అన్నమయ్య,రామదాసు,శిరిడీ సాయి వంటి భక్తి సంగీత ప్రధాన సినిమాలు కూడా చేసి విజయాలను సాధించి తన వైవిధ్యత ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు మన కీరవాణి గారు.
ఇక నిన్నటి బాహుబలి (థ బిగినింగ్) చిత్రం విజయం లో కీరవాణి గారి సంగీతం యొక్క పాత్ర ఎంత ఉన్నతమైనదో,విశేషమైనదో,ఎంత విశిష్టమైనదో కూడా అందరికీ తెలుసు అంతేకాదు  రేపు రాబోయే  బాహుబాలి (థ కంక్లూషన్) పై అయన అభిమానులకి ఎన్ని ఆశలున్నాయో కూడా మనందరికీ తెలుసు.
ఒక్క తెలుగు భాష లోనే కాక ప్రారంభ దశ అంటే 1990వ సంవత్సరం నుంచే తమిళం,మళయాళం,కన్నడ వంటి దక్షిణ భారతదేశ భాషలోనే కాకుండా 1995లో క్రిమినల్ సినిమాతో హిందీ చలన చిత్ర పరిశ్రమలో కూడా తన సత్తా చాటారు శ్రీ కీరవాణి గారు. ఆయన తమిళంలో చేసిన మొట్టమొదటి సినిమ అజగన్ (1991).ఆ సినిమా కి ఆయనకు తమిళనాడు రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకులుగా  పురస్కారం లభించింది. సుర్,జఖ్మ్,ఇస్ రాత్ కి సుబహ్ నహి,రోగ్,పహేళి వంటి సంగీత ప్రధానమైనహిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి విజయం సాదించారు మన కీరవాణి గారు. మొత్తానికి మన జాతీయ భాష హిందీలో ఇతర ప్రాంతీయ భాషలతో కలిపి ఇప్పటివరకు సుమారు 200 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించిన ఘనత మన కీరవాణి గారిది.
ఐతే ఈ ప్రయాణం లో  పూర్తి వాణిజ్యపరమైన చిత్రాలు చేస్తూ అన్నమయ్య ,రామదాసు,శిరిడీ సాయి,శ్రీ మంజునాథ వంటి భక్తిసంగీత ప్రధాన సినిమాలు చెయ్యడం ఒక అద్భుతమే. అన్నమయ్య సినిమాకి ఉత్తమసంగీత  దర్శకులుగా జాతీయ పురస్కారం అందుకోవడమే అందుకు  నిదర్శనం. ఆయనకు శాస్త్రీయ సంగీతం పై ఎంత అవగాహన ఉందో ఈ చిత్రాలలో పాటలే అందుకు తార్కాణాలు.
ఈ ప్రయాణం లో కీరవాణి గారి కి లభించిన అవార్డులు,రివార్డులు ఎన్నో ఎన్నెన్నో..
ఇప్పటికి ఆరు సార్లు 1991(క్షణ క్షణం),1993(అల్లరి ప్రియుడు),1994(క్రిమినల్),1995(శుభసంకల్పం),1996(పెళ్ళి సందడి),2009 (మగధీర) చిత్రాలకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
ఆరు సార్లు ఉత్తమ సంగీత దర్శకులుగా  1992(రాజేశ్వరి కళ్యాణం),1993(అల్లరి ప్రియుడు),1995(పెళ్ళి సందడి), 2002(ఒకటో నెంబరు కుర్రాడు),2005(ఛత్రపతి), 2009 (వెంగమాంబ) చిత్రాలకు గానునంది అవార్డ్
రెండు సార్లు ఉత్తమ నేపధ్య గాయకులుగా 2001(స్టూడెంట్ నెం:1),2010(మర్యాద రామన్న) చిత్రాలకు గాను  నంది అవార్డ్ అందుకున్న వారు కూడా..
వివిధ ఛానెళ్ళలో సంగీత పరమైన కార్యక్రమాలకు న్యాయనిర్ణేత గా వచ్చి వర్ధమాన సంగీత కళాకారులకు ఎన్నో అద్భుతమైన,ఉపయోగకరమైన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు.కొత్త కొత్త గాయనీ గాయకులకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు.మంచి మనసు ,వ్యక్తిత్వం ,విలువలకు ప్రాధాన్యం ఇచ్చే ఉన్న గొప్ప మనిషి.
ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వరా భక్తి ఛానెల్ వారు నిర్వహిస్తున్న  అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా  ఎంతోమంది గాయనీ గాయకులకు అన్నమయ్య కీర్తనాలాపనలో  చక్కని శిక్షణ ని ఇస్తూ, వారి చేత పాడిస్తూ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు.
మన కీరవాణి గారు ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నెనో మంచి మంచి సినిమాలకి సంగీత  దర్శకత్వం వహిస్తూ,మరిన్ని మంచి మంచి సంగీత  కార్యక్రమాలు నిర్వహిస్తూ,ఇంకా మరెన్నో పురస్కారాలు,సన్మానాలు పొందుతూ ఆరోగ్యంతో కూడిన ఆయుష్షు తో మధురమైన కీరవాణి రాగం లాగానే  కలకాలం  వర్ధిల్లాలని కోరుకుందాం.
*******

No comments:

Post a Comment

Pages