నీకు నేనున్నా - 3
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
పెళ్ళి క్యాన్సిల్ అయిందని తను చెప్పకుండానే చాలామంది అమ్మాయిలకి తెలిసిపోయింది. మధురిమ మనను బాగలేదు. క్లాసులో కూర్చోవాలని పించలేదు.లెక్చరర్స్ వేసే కొశ్చన్స్ కి సరిగ్గా ఆన్సర్ చెయ్యలేక పోయింది. అసలే అంతంత మాత్రంగా అర్థమయ్యే ఇంగ్లీష్ మరీ మొండికేసింది.
కాలేజీ అయ్యాక ఇంటిముఖం పట్టింది మధురిమ.
ఆలోచిస్తూ ఒంటరిగా నడుస్తోంది. ఈ మధ్యన మధురిమతో ఫ్రెండ్చెవ్వరూ మాట్లాడటం లేదు. మధురిమకు కూడా వాళ్లతో పలకాలనిపించలేదు. సుజాత కాలేజీకి రాలేదు. సుజాతను కలవాలని వుంది మధురిమకు, తన మనసులో వున్న బాధను సుజాతతో చెప్పకోవాలని వుంది.
సుజాతకు మధురిమపై అణుమాత్రం కూడా అనుమానం లేదు. అందుకే సుజాత మధురిమతో మాట్లాడుతుంది.
మధురిమపై బయట పుకారు లేవటానికి కారణం సుజాతేనని మధురిమకు తెలియదు. అందుకే సుజాతపై మధురిమకు ఎలాంటి భేదం లేదు.
నేరుగా ఇంటికెళ్లింది మధురిమ, తల్లి ఇచ్చిన కాఫీ త్రాగింది. క్లాసులో ఈ మధ్యన మిస్ అయిన ఇంగ్లీష్ లెసన్స్ సుజాతతో చెప్పించుకుంటానని తల్లితో చెప్పి సుజాత ఇంటికి వెళ్లింది మధురిమ.
"ఏమండీ! సుజాత లేదా?" లోపలకి చూస్తూ అడిగింది మధురిమ. లేదండి! ఇప్పడే తన ఫ్రెండ్ ఇంటికెళ్లింది. త్వరగానే వస్తుంది. లోపలకి రండి!" అంటూ బజారుకెళ్లే ప్రయత్నంలో బయటకు నడవబోతున్న హరి మధురిమను చూడగానే లోపలకు ఆహ్వానించాడు.
సుజాత ఇంటికి అప్పుడప్పుడు వెళ్లటం మధురిమకు అలవాటే. అందుకేలోపలకు నడిచింది.
“కూర్చోండి!” అంటూ సోఫా చూపించాడు హరి. హరి. ఎప్పుడైనా రూంలోనే రామకృష్ణతో ఉంటాడు. ఈ రోజు ఏదో అవసరమైన పని వుంది ఇంట్లో వున్నాడు. ఎప్పుడో తప్ప హరి ఎక్కువగా ఇంట్లో వుండదు.
“మీ అమ్మగారు లేరండీ?” అంటూ లోపలకి చూస్తూ సోఫాలో కూర్చుంది మదురిమ.
“మా తాతయ్య వూరి వెళ్ళి రెండురోజులు కోవోస్తుంది. బహుశ రేపు వస్తారేమో" అంటూ పాంటు టేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. నిజానికి సుజాత కూడా వాళ్ల తాతయ్యగారిఊరేల్లింది. హరి మధురిమకి అబద్ధం చెప్పి సోఫాలో కూర్చోబెట్టాడు.
"ఈ హరేంటి తనముందే సిగరెట్ వెలిగించాడు?కొంచెం కూడా సంస్కారం లేనట్లుంది" అని మనసులో అనుకుంటూ పక్కనే వన్న మాగజైన్ తీసుకొని పేపర్స్ తిప్పసాగింది మధురిమ.
సిగరెట్ తాగుతూ అక్కడే నిలబడ్డాడు హరి
తెల్లగా, పొడవుగా, తీగలా, నాజూగ్గా వుండి సోఫాలో కూర్చుని తలవంచుకొని మాగ్జైన్ చదువుతున్న మధురిమను చూస్తుంటే హరిలో కోరిక కలిగింది. మనోహర్ కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చింది. ఎలాగైనా ఈ అందాన్ని మనోహర్కి దక్కనియ్యకూడదు. గులాబి పువ్వును నలిపినట్లు నలపాలనుకున్నాడు. కనిగా, కోపంగా మధురిమనే చూస్తూ సగం తరిగిపోయిన సిగరెట్ ని క్రిందపడేసి బూటకాలితో నలిపాడు.
హరి మీడియం సైజులో వుంటాడు. నల్లగా వుంటాడు. ముఖం మాత్రం ఎప్పుడు చూసినా మేకప్ వేసినట్లు వుంటుంది. గ్లో మాత్రం ఉండదు. నవ్వినప్పుడు చూడబుద్ధి కాదు. కళ్ళు పెద్దగా వుంటాయి. కాని జీవం వుండదు. భుజాలు బలిష్టంగా వుండి, చూడగానే నలుగుర్ని కొట్టేవడిలా వుంటాడు.
“సుజాత ఇంకా రాలేదేమిటి?త్వరగా చెప్పించుకొని, వెళదామానుకుంటే ఫ్రెండ్స్ తో కబుర్లు చాలలేదేమో ఇంకా! అనుకుంటూ టైం చుకుని ఓసారి హరివైపు కూడా చూసింది. హరిణి చూడగానే మధురిమ గుండె జల్లుమంది.
మర్యాదస్తుడు అని లోపలికి వస్తే తినేసేలా చూస్తున్నాడు.
సుజాత అన్నయ్య ఇలాటి వాడు అని ఊహించలేదు మధురిమ. ఊహించి ఉంటె ఇంత సేపు కూర్చునేది కాదు. అసలు ఇంట్లోకే వచ్చి వుండేది కాదు.
మధురిమ చుట్టూ సిగరెట్ వాసన వ్యాపించింది.
కడుపులో తిప్పినట్లు అయింది. హరివైపు కంపరంగా చూసింది.
హరి ఆగలేకపోయాడు. చొరవగా మధురిమ పక్కన కూర్చుని భుజంపై చేయి వేశాడు.
సోఫాలోంచి చివాలున లేచి నిలబడింది మధురిమ.
“ఎందుకు లేవడం. కూర్చో. నిన్నేమీ చెయ్యను” అంటూ మధురిమ చెయ్యి పట్టుకున్నాడు. అసహ్యంగా అనిపించింది మధురిమకు.
“ఛీ..ఛీ.. నన్ను వదులు. నువ్వు అందరిలాంటి అన్నయ్యవే అనుకున్నాను. నీకు ఈ అవకాశం ఇవ్వడం నాదే తప్పు?” అంటూ కస్సుమంది.
"కోపంలో కూడా నువ్వు అందంగా వున్నావు. నాకు ఇలాంటి అందమంటే చాలా ఇష్టం. నీలాగ కస్సుమనే అమ్మాయిలంటే ఇంకా ఇష్టం" అంటూ రెండవ చేయి కూడా గట్టిగా పట్టుకున్నాడు. క్షణంలో రెండు చేతులు హరి చేతిలోకి పోయాయి. హరి పట్టు భల్లూకం పట్టులా వుంది. ఇప్పడెలా?
"నన్ను వదలండి! ప్లేజ్ మీక్కూడా ఓ చెల్లెలుంది" అంటూ మర్యాదగా సుజాతను గుర్తు చేసింది. ఆ మాటతో ఇంకా రెచ్చిపోయాడు హరి.
"నోర్మయ్! ఈ టైంలో మా చెల్లెను గుర్తు చేశావంటే చంపేస్తాను. ఏం! ఆ మనోహర్ గాడిలా లేనా నేను? అవునూ! ఎందుకే నేనంటే యింత అయిష్టం నీకు? నాలో లేనిది వాడిలో ఏముంది? అంతా అదేగా!" అంటూ గొప్ప సత్యమేదో చెప్తున్నవాడిలా గట్టిగా నవ్వాడు.
ఆ నవ్వు, ఆ చూపులు వెగటనిపించాయి.
నీచంగా అన్పిస్తున్న హరి మాటలకి మధురిమ ఒళ్లు వుడికిపోయింది.
ఆవేశంతో, రోషంతో ఒళ్లంతా కంపించింది.
నీళ్లు రావలసిన మధురిమ కళ్లలో నిప్పలు కురిశాయి.
శరీరంలో వున్న బలాన్నంతా కూడగట్టుకొని, పిచ్చి బలంతో ఒక్కతోపుతోసింది.
పట్టు సడలిన హరి విసురుగా పడబోయాడు. కానీ అంతలోనే తెప్పరిల్లి తిరిగి మధురిమను అందుకోబోతున్నాడు.
“అడుగు ముందుకు వేశావో... చంపేస్తాను. మీ ఫ్యామిలిలో ఇలాంటి పిచ్చికుక్కలున్నాయని ముందే తెలిసుంటే ఈ గడప తొక్కేదాన్ని కాదు" అంటూ ఒక్క అంగలో తలుపు దగ్గరకెళ్లి గట్టిగా తలుపు లాగింది.
"ఆఫ్ట్రాల్ ఓ ఆడదానివి. మా ఫ్యామిలీనే వంక బెడతావా? నిన్నింత సులభంగా వదులుతానని అనుకుంటున్నావా!" అంటూ మధురిమను సమీపించబోతున్నాడు.
"వదలక నన్నేం చేస్తావురా నువ్వు ఆదమరపించి గట్టిగా ఓ తన్ను తన్నానంటే జన్మలో ఏ ఆడపిల్లకి పనికి రాకుండా పోతావ్!నాతోపెట్టుకోక ఎప్పుడైనా..." అంటూ తలుపును రెండు చేతులతో పట్టుకొని బలంగా తోయటంతో మధురిమను సమీపించబోతున్న హరి నుదురు గట్టిగా కొట్టుకొంది.
తలుపు గట్టిగా తగలటంతో హరి నుదురు నెత్తురు కారింది. కళ్ళ తిరినట్లు అయ్యి అలాగే నిలబడ్డాడు. హరి అహం దెబ్బతిన్నది. పౌరుషం పెల్లుబికింది.కానీ మధురిమ బయటపడింది.
అదురుతున్నగుండెలను అదిమిపట్టుకొని, అతివేగంగా, ఆందోళనగా ఇంటికెళ్లింది మధురిమ.
దిగులు ఇంకా తీరని తల్లి అలాగే పడుకొని వుంది.
ఆస్థితిలో వున్న తల్లిని చూస్తుంటే మధురిమకు బాధనిపించింది. సుజాత అన్నయ్య తన చేయిపట్టుకున్నాడన్న విషయం తల్లితో చెబితే యింకా బాధపడుతుంది. ఇప్పటికే రారానిమాటలు వచ్చాయని కుమిలిపోతున్న తల్లికి యింకెలాంటి బాధ కలిగినా తట్టుకోలేదు. అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా వుంది.
ఓ చోట ఒంటరిగా కూర్చుంది మధురిమ.
ఆలోచనలు తేనెటీగల్లా చుట్టుముట్టాయి.
ఆలోచనలన్నీ మనోహర్ చుట్టే తిరుగుతున్నాయి. . మనోహర్ ప్రక్కింటి అబ్బాయిగానే తెలుసు మధురిమకి.
బాబు కోసం వెళ్లినప్పుడు తప్ప మళ్లీ మనోహర్తో మాట్లాడలేదు.
అందరూ కలసి మనోహర్కి, తనకి సంబంధం అంటగట్టి తనకి పెళ్ళికాకుండా చేశారు.
నిజానికి మనోహర్కి తనకి వున్న సంబంధం ఏమిటి?
సంబంధం వున్నట్లుగా ఎందుకనుకుంటున్నారు? తన పరిస్థితి యిలా ఎందుకు తయారైంది?
ఎంతగా ఆలోచించినా జవాబు దొరకలేదు మధురిమకి.
*****
మధురిమ పెళ్లి ఆగిపోయినప్పటి నుండి బాధగా వుంది మనోహర్కి. అదీ తనవల్ల ఆగిపోవటంతో యింకా బాధగా వుంది. ఎప్పడు చూసినా అదే ఆలోచిస్తున్నాడు. చదువు కూడా తలకెక్కటం లేదు. ఊహ తెలిసినప్పటి నుండి తను ఎవరికి ఏ హాని చెయ్యలేదు. కానీ తన ప్రమేయం లేకుండానే మధురిమకు తనవల్ల హాని జరిగింది. నిస్సహాయంగా వుండటం తప్ప తనేం చెయ్యలేక పోతున్నాడు.
అందుకే ఆ ఇల్లు ఖాళీ చేసి వెంటనే వేరే ఇల్లు మారాలనుకున్నాడు మనోహర్, వసంతమ్మతో చెప్పాడు. వసంతమ్మ ఒప్పకోలేదు.
"మీ అమ్మాయి పెళ్లి ఆగిపోవటానికి కారణం నేనే వసంతమ్మ గారు! అందుకు నాకు చాలా బాధగా వుంది. అందుకే నేను యిక్కడ వుండలేక పోతున్నాను" అన్నాడు మనోహర్.
"అది మా ఖర్మ అనుకొని మేము అప్పడే మరచిపోయాం బాబు! ఇందులో నువ్వు బాధపడాల్సిందేమీ లేదు. నువ్వు కూడా మరచిపో" అంది వసంతమ్మ.
ఒళ్లు మండిపోయింది మనోహర్కి.
కన్నకూతురు మీద అంతటి అపనింద వచ్చినా ఏమీ పట్టనట్లు మరచిపొమ్మంటున్న వసంతమ్మను చూస్తుంటే ఛీ... అన్పించింది. మాట్లాడకుండా మౌనంగా వున్నాడు మనోహర్.
"ఏమిటి బాబు! మాట్లాడకుండా మౌనంగా వున్నావు?" అంటూ మనోహర్ వైపు చూసింది వసంతమ్మ.
“ఏం లేదండి! ఒకవేళ నాకూ, మీ అమ్మాయికి నిజంగానే సంభంధం వున్నా మీరిలాగే మౌనంగా వుండేవారేమోనన్నసందేహం వచ్చింది నాకు” అంటూఅసలు సంగతేమిటో కనుక్కుందామన్నట్లుగా అడిగాడు మనోహర్.వసంతమ్మ మధురిమ కన్నతల్లి కాదేమోనన్న అనుమానంగా వుంది మనోహర్కి.
మనోహర్ ముఖంలోకి చాలా ప్రశాంతంగా చూసింది వసంతమ్మ.
"నేను మధురిమ కన్నతల్లిని బాబు! నా బిడ్డ ఎలాంటిదో నాకుతెలుసు. ఆ మాత్రం నమ్మకం నాకుండబట్టే యింకా మేమిద్దరం ప్రాణాలతోమిగిలున్నాం. నేను కూడా పరువుకి ప్రాధాన్యత యిచ్చే మనిషిని. మా వంశం కూడా పరువు ప్రతిష్టలు కలది. కానీ విధి వెక్కిరించింది. అందుకే పరిస్థితుల తలవంచి బ్రతుకుతున్నాం" అంది నెమ్మదిగా వసంతమ్మ.
ఆ పెద్దావిడను అపార్థం చేసుకున్నందుకు మనోహర్ మనస్సు నొచ్చుకుంది.
"నీలో ఎంత మంచితనం వుందో నా బిడ్డలో కూడా అంతే మంచితనం వుంది బాబు! అందుకే నిన్నో కోరిక కోరుతున్నాను. నువ్వు మా ఇంట్లో నుండి వెళ్లిపోవద్దు" అంది వసంతమ్మ.
"ఇంత జరిగాకనేనిక్కడే వుంటే బావుండదండీ!" అన్నాడు మనోహర్
"నువ్వు వెళ్లే మా ఆర్ధిక పరిస్థితి బావుండదు బాబు! అందుకే నిన్న వుండమంటున్నాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్లాక ఎలాగూ ఈ ఇంటిని చదువుకు అబ్బాయిలకు యివ్వను. అలాగని సంసారులు వుండేందుకు తగిన వసతుల లేవు ఈ ఇంటికి. ఇప్పడా వసతులు కల్పించే శక్తి నాకులేదు. రంగారావు ఇక మా ఇంటికి రాడు. ఆరోజు జరిగిన సంఘటన అలాంటిది" అంది వసంతమ్మ.
వసంతమ్మ చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటున్నాడు మనోహర్ .
"నువ్వు ప్రతి నెలా నాకు ఇచ్చే అద్దెడబ్బులతోనే మా అమ్మాయి చదువు పూర్తి అవుతుంది. ఆ తర్వాత మా కష్టాలు మావి. ఇప్పుడు మధ్యలో ఆ చదవుకి ఆటంకం కల్గిస్తే ఎందుకూ పనికి రాకుండా పోతుంది బాబు! నీపై నమ్మకంతో ఈ మాట అడుగుతున్నాను. అర్థం చేసుకో" అంది వసంతమ్మ.
తనని సాంత మనిషిలా భావించి వాళ్ల బాధలన్నీ తనతో చెప్పుకుంటున్న వసంతమ్మను చూసి మనోహర్ మనసు కదిలిపోయింది. అక్కడ తను చదివినంత కాలం వాళ్ల ఇంట్లోనే వుంటానని మాట ఇచ్చాడు మనోహర్.
మనోహర్ అలా మాట ఇచ్చాక వసంతమ్మకి ధైర్యం వచ్చింది. తన కూతురు చదువు పూర్తి అవుతుందన్న నమ్మకం కలిగింది. మధురిమ డిగ్రీ పూర్తి చేస్తే వసంతమ్మకి దిగులుండదు. ఆ తర్వాత పెళ్లి చేస్తే ఆ బాధ్యత కూడా తీరిపోతుంది. కృష్ణా, రామా అనుకుంటూ ఏ గుళ్ళో కూర్చున్నా సరిపోతుంది. అదీ వసంతమ్మ కోరిక.
*****
హరి రామకృష్ణ రూంలోనే వుంటున్నాడు.
కృష్ణ, మనోహర్ ప్రాణ స్నేహితులయ్యారు.
ఇంకా తనతోపాటు చదువుకుంటున్న ఇద్దరబ్బాయిల్ని ఆ ఇంట్లోనే వుంచాడు మనోహర్ వాళ్లిద్దరు రావటంతో అద్దెడబ్బులు పెరిగాయి. వసంతమ్మకి డబ్బుకి ఇబ్బంది లేకుండా చేశాడు మనోహర్. ఆ పెద్దావిడకి ఎవరూ లేరన్న జాలి, అభిమానం ఎక్కువయ్యాయి మనోహర్కి, అందుకే తనకి చేతనైన సహాయం చేస్తున్నాడు.
నెమ్మది, నెమ్మదిగా తన బాధలన్నీ మనోహర్తో చెప్పుకుంటోంది వసంతమ్మ. మనోహర్ కూడా ఓపిగ్గా ఆమె మాటల్ని వింటుంటాడు. ఏదైనా మనోహర్కి చెప్పకుంటేనే ఆమెకి మనశ్శాంతిగా వుంటోంది. ప్రస్తుతం మనోహర్కి చెప్పకుండా ఏ పనీ చెయ్యట్లేదు వసంతమ్మ.
బాబు లేకపోవటం వల్ల మధురిమకి పని బాగా తగ్గింది. టైమంతా చదువుకే కేటాయిస్తోంది.
కొత్తగా ఇప్పడిప్పడే మనోహర్ గురించి ఆలోచిస్తోంది మధురిమ, మొదట్లో మామూలుగా మొదలైన ఆలోచనలు తర్వాత, తర్వాత ఊపిరిగా మారాయి. ఆ ఆలోచనలు ఆగినప్పుడు ఊపిరి ఆగిపోయేలా ఉంది. అందుకే ఏదో ఒకసందర్భం కల్పించుకొని రోజూ మనోహర్ ని చూస్తూనే వుంది మధురిమ. ఇంకా మనోహర్ ని చూడలేనపుడు మధురిమ మనసులో ఏదో వెలితిగా అనిపిస్తుంది.ఆ వెలితిని తట్టుకోవటం కూడా కష్టంగా వుంది. తనలో కలిగే ఈ భావాలను ఎవరితోనూ చెప్పుకోలేకపోతోంది. మనోహర్తో చెప్పాలంటే భయంగా వుంది.మొహమాటంగా వుంది.
ఒక్కోసారి మధురిమకు మనోహర్ ఎంతో దగ్గరగా అన్పించి ఎదను గిలిగింతలు పెడుతుంటాడు. ఇంకోసారి అందనంత దూరంగా అనిపించి అలజడి కల్గిస్తుంటాడు. తను తిరిగే ప్రతిచోట మనోహరే వున్నట్లు అన్పిస్తోంది .అలా అన్పించినప్పడు ప్రతిదీ అందంగా, అర్థవంతంగా కన్పిస్తోంది...బుక్ చదువుదామంటే మనోహరే గుర్తొస్తున్నాడు. కళ్లు మూసుకొని నిద్రపోయినా మనోహరే కన్పిస్తున్నాడు. అంతా మనోహరే అన్పిస్తున్నాడు.మనసంతా మనహరే అయ్యాడు.
*****
కాలేజీలకి సెలవులు ఇచ్చారు.
ఈసారి ఊరెళ్ళాలంటే ఉత్సాహంగా లేదు మనోహర్కి.
ఫ్రెండ్ఫంతా వెళ్లటంతో మనోహర్ కూడా ఊరెళ్లాడు.
ఊరంతా నిద్రలేచినా మనోహర్ లేవలేదు. ఒకటికి రెండుసార్లు లేపటంతో నిద్ర లేచాడు మనోహర్. కానీ మళ్లీ పడుకున్నాడు.
"బారెడు పొద్దెక్కింది. నిద్ర లేవరా మనోహర్" అంటూ మరోసారి నిద్రలేపింది తులశమ్మ.
"బద్ధకంగా ఉందమ్మా!" అంటూ ఒళ్లు విరుచుకున్నాడు మనోహర్. కప్పకున్న దుప్పటిని సగం మాత్రమే తొలగించాడు.
పడుకుంటే అలాగే వుంటుంది నాన్నా!లే... లేచి స్నానం చెయ్యి. మన పొలంలో వరి కోస్తున్నారు. వెళ్లి చూసిరా! పద్మకూడా అక్కడే వుంది" తాతయ్యతో వెళ్లింది" అంది తులశమ్మ.
లేచి రెడీ అయ్యాడు మనోహర్, పొలం బయలుదేరాడు.
ఎప్పడైనా మనోహర్ నిద్ర లేవగానే పద్మ గురించి అడిగేవాడు. ఆ తర్వాత ఊళ్ళో జరిగే సంగతులన్నీ చెప్పించుకునేవాడు. చెప్పిన విషయాలనే మళ్లీ, మళ్లీ చెప్పించుకుని వినేవాడు. అప్పడప్పడు తన కాలేజీలో జరిగే సంగతులు చెప్పి నవ్వించేవాడు. ఇంట్లో ఉన్నంత సేపు సరదాగా, సందడిగా తిరుగుతూ టైమెలా గడిచిపోతుందో తెలియనట్లుగా వుండేవాడు. అలాంటి మనోహర్ ఈసారి హైదరాబాదు నుండి వచ్చినప్పటి నుండి మౌనంగా వున్నాడు. కొడుక్కి ఒంట్లో బాగలేదేమో అనుకొంది తులశమ్మ.
పొలంలో - నేలమీద ఎండుగడ్డి పరచి,దానిమీద టవలు వేసుకొని, ఆ టవలపై కూర్చుని వుంది పద్మ. పద్మను చూస్తుంటే ప్రపంచంలో వుండే ఏ బాధలూ తనకు లేవన్నట్లుగా వుంది. ఆ బాధలతో తనకి ఎలాంటి సంబంధం లేనట్లుగా వుంది. ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఎవరైనా చాలా అదృష్టవంతురాలను కుంటారు.
సాళ్లు పట్టి కూలివాళ్లు వరి కోస్తున్నారు.
పనివాళ్లతో సరదాగా మాట్లాడుతూ, గట్టుపై నిలబడి పనిచేయిస్తున్నాడు మాధవయ్య.
మాధవయ్య పొలాన్ని ఎంతో శ్రద్ధగా, కష్టపడి సాగు చేయిస్తున్నాడు. భూమిని నమ్ముకున్నరైతుకు చివరకు మిగిలేది కష్టమే అయినా అందులో దొరికే తృప్తి, ఆనందం, ప్రతిఫలం మాధవయ్య లాంటి వాళ్లకే అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఎంతో శ్రమపడి తన ప్రతి రక్తపుబొట్టును చెమట బిందువుగా మార్చి ఎండనకా, వాననకా తాను చేసిన కృషి ఫలితమే ఈనాడు గొప్ప రైతుగా గుర్తింపు.
"తాతయ్యా! ఆ వచ్చే మనిషెవరో చూడు. మనోహర్ మామయ్య కదూ?" అంటూ అప్పటివరకు పనివాళ్ల మీద వున్న తన చూపును రోడ్డు మీదకి మళ్లించింది పద్మ.
"ఆ..ఆ.." అంటూ మందహాసం చేశాడు మాధవయ్య. మనోహర్ని చూస్తుంటే మాధవయ్యకి ఎప్పడైనా తృప్తిగా వుంటుంది.
అప్పటికీ మనోహర్ వాళ్ల నాన్నగారిని సమీపించాడు.
“ఏరా!వచ్చావ్! పొలం చూసి వెళ్లాలనా! చాలా ఎండగా వుందే. అంతగాచూడాలని వుంటే దగ్గరగా వుండే పొలం చూసిరా! మిగతాది రేపు చూద్దువుగాని అన్నాడు మాధవయ్య కొడుకు వైపు ప్రేమగా చూస్తూ.
“సరే నాన్నా!" అన్నాడు మనోహర్.
పనివాడిని గట్టిగా అరుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మాధవయ్య.
పద్మ వైపు చూశాడు మనోహర్.
"అబ్బో పెద్దమనిషిలా బుద్ధిగా కూర్చుని పనివాళ్లతో పనిచేయిస్తున్నావా”అని జోక్ గా అంటూ పద్మను సమీపించాడు మనోహర్.
“కాకపోతే మీలాగా ఇంట్లో పడుకోమంటారా?" కళ్లు చక్రాల్లా తిప్పుతూ అంది పద్మ.
"నీకు బాగా పొగరెక్కువైంది. మా నాన్న నిన్ను పెంచుకొని పెద్ద తప్పచేశాడు" అన్నాడు నవ్వుతూ మనోహర్.
"ఏమిటీ! మా తాతయ్య నన్ను పెంచుకొని పెద్ద తప్ప చేశాడా? అదేం కాదు. నిన్నుకని పెద్ద తప్ప చేశాడు" అంటూ మాటకు మాట చెప్పేసింది పద్మ.
"నాకేమ్మా! నాకేమైంది? బుద్ధిగా చదువుకుంటున్నాను. చదువు పూర్తి అయ్యాక ఏదైనా జాబ్ వస్తే సిటీలో సెటిలయిపోతాను" అన్నాడు గర్వంగా మనోహర్.
"నాక్కూడా మా తాతయ్య పెళ్లి చేస్తే అదే సిటీలో నేను కూడా సెటిలయిపోతాను" అంటూ మనోహరన్నట్లే అంది పద్మ.
"నీతో వాదన ఎందుకులే. నేనలా వెళ్లి పొలం చూసి వస్తాను" అంటో అక్కడ నుండి కదిలాడు మనోహర్.
"ఉండు మామయ్యా! నేను కూడా వస్తాను నీ వెంట" అంటూ టక్కున లేచి నిలబడింది పద్మ.
"నువ్వెందుకు నా వెంట ఎండగా వుంది. అక్కడే నీడలో కూర్చోకుండాఅన్నాడు మనోహర్.
పద్మ వినలేదు. సంతోషంగా గంతులేస్తూ మనోహర్ వెంట బయలుదేరింది.
ఏపుగా పెరిగి, మినమిస లాడుతూ నగలన్నీ ధరించి సిగ్గుతో తలవంచుకొని వున్నకొత్తపెళ్లి కూతురులా వుంది వరిపైరు. ఇరువైపులా పెద్దపెద్ద ఎన్నులు తీసి వున్న వరిపైరు మధ్యన నడుస్తున్నారు పద్మా మనోహర్. వాళ్లు నడుస్తున్న గట్టు చాలా సన్నగా వుంది.
పద్మ కాలు గట్టమీద నుండి సర్రున జారింది.
"అబ్బా" అంటూ గట్టుపక్కకి చతికిలపడిపోయింది పద్మ ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న మనోహర్ వులిక్కిపడ్డాడు. పద్మను ఆ స్థితిలో చూస్తుంటే జాలేసింది మనోహర్కి.
"వీరనారి లెవల్లో అడుగులేస్తే అంతేమరి" అంటూ చెయ్యి అందించాడు మనోహర్ చెయ్యి అందుకొని లేచి నిలబడింది పద్మ.
మనోహర్ చేతిస్పర్శ కొత్తగా వుంది పద్మకి. ఆ స్పర్మకి పద్మ గుండె వేగంగా కొట్టుకొంది.
"పద్మా! ఇలా చేలల్లో నడవడం మీ తాతయ్యతో నీకు అలవాటేగా. మరి పడిపోయావెందుకు?" అంటూ పద్మవైపు చూస్తూ నడుస్తున్నాడు మనోహర్. మనోహర్ నడక చాలా స్థిరంగా వుంది.
"అలవాటే మామయ్యా గట్టుకి బురద ఎక్కువగా ఉంది. అందుకే బ్యాలెన్స్ తప్పింది" అంది పద్మమెల్లగా.
మనోహర్ పద్మవైపు పరిశీలనగా చూశాడు.
"నీ బట్టలకి మట్టి బాగా అంటింది పద్మా! అటువైపు పెద్దకాలువ నిండా నీళ్లు పారుతున్నాయి. అక్కడకెళ్లి శుభ్రంగా కడుక్కొని ఇంటికెళ్లాం" అంటూ తనే ముందుగా దారితీశాడు మనోహర్.
"అలాగే మామయ్యా" అంటూ మనోహర్ని అనుసరించింది పద్మ.
ఇద్దరు కలసి పెద్దకాలువ కట్ట ఎక్కారు.
పద్మనీళ్లలోకి దిగింది. తన పరికిణీకి, ఓణికి అంటిన మట్టిని నీటితో కడుక్కొంది.
ఆ స్థితిలో వద్మను చూస్తుంటే మనోహర్ మనను కోరికలతో వుర్రూతలూగలేదు. ఒడిసిపట్టుకోవాలన్న వాంఛ కలగలేదు. వెంటనే మధురిమగుర్తొచ్చింది."ఈ స్థితిలో, ఇంత దగ్గరగా మధురిమ వుండివుంటే ఎలా అని మనసులో గుర్తుచేసుకున్నాడు మనోహర్.
పద్మ తన చేతుల్లోకి కొన్ని నీళ్లు తీసుకొని మనోహర్ పైన చల్లి అల్లరిగా నవ్వింది. పరధ్యానంగా వున్న మనోహర్ ఆ నీటి స్పర్శ తగలగానే పద్మవైపు చూశాడు. పద్మ నవ్వుతోంది. పద్మ ఎప్పుడూ నవ్వుతూనే వుంటుంది. నవ్వు పద్మవూపిరి. ముందు నవ్వి తర్వాత మాట్లాడుతుంది.
“ఏమిటి మామయ్యా ఆలోచిస్తున్నావ్? ఈసారెందుకో నువ్వమునుపటి లాగలేవు. చాలా మార్పు కనిపిస్తుంది నీలో ఎందుకని?" అడిగింది పద్మ.
ఏం చెప్పాలో అర్థం కాలేదు మనోహర్కి. తనలో మార్పు వచ్చినట్లు మనోహర్ కి కూడా తెలుస్తోంది. మాటిమాటికి మధురిమ గుర్తొస్తుంది. గుర్తొచ్చి నప్పుడల్లా మనసుకి హాయిగా అన్పిస్తుంది. హాయిగా వుండటానికి అలవాటు పడ్డ మనసు ప్రతిక్షణం మధురిమనే గుర్తు చేసుకుంటోంది.
"పద్మా! అక్కడ నేనొక అమ్మాయిని చూశాను" అన్నాడు నెమ్మదిగా మనోహర్.మధురిమ గురించి పద్మతో చెప్పాలని ఉంది మనోహర్ కి.
నెత్తిమీద పిడుగు పడ్డట్ల అదిరిపడింది పద్మ.
"ఏమిటీ అమ్మాయిని చూశావా?వుండు నేను మా అమ్మతో చెప్పినీ పని చెబుతాను" అంటూ వెంటనే సివంగిలా లేచింది పద్మ.
ఆశ్చర్యపోయాడు మనోహర్. పద్మ అలా అంటుందని మనోహర్ ఊహించలేదు.
“మీ అమ్మతో చెబుతావా? ఇందులో ఏముంది మీ అమ్మతో చెప్పటానికి? అయినా నేను ఏం చెప్పానని మీ అమ్మతో చెప్పటానికి?”
నువ్వేం చెప్పకపోయినా, ఏదో వుంది నీ మనసులో. ఎప్పుడైనా ఇలా నాతో ఓ అమ్మాయి గురించి మాట్లాడవా? మాట్లాడితే నేను తట్టుకోగలనా? ఇదిగో మామయ్యా! నేను నీ కాబోయే భార్యను. నువ్వు నా ఒక్కదానికే సొంతం” అంది పద్మ.
“అలాగని నీకు నేను ఏమైనా బాండ్ రాసిచ్చానా ఎప్పుడైనా, ఏది చూపించు”పద్మవైపు చూస్తూ మనోహర్.
తిక్కరేగింది పద్మకి.
“ఉండు! నేను మా అమ్మమ్మతో చెబుతాను. ఈరోజు నీకేదో అయింది. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు" అంటూ చకచక నడుచుకుంటూ మనోహర్ కన్నా ముందే ఇంటికెళ్లింది పద్మ.
ఇంటికెళ్లగానే జరిగింది మొత్తం తులశమ్మతో చెప్పింది పద్మ.
మనోహర్ పొలం నుండి ఇంటికి రాగానే మండిపడింది తులశమ్మ. బయటకాసే ఎండకన్నా తీవ్రంగా వున్నాయి తులశమ్మ చూపులు.
"ఏరా! మనోహర్ పద్మచెప్పింది నిజమేనా? నువ్వు వచ్చినప్పటి నుండి నేను గమనిస్తూనే వున్నాను. నీ వ్యవహారం తేడాగానే వుంది. ఏంటి కథ" అంది తులశమ్మ.
"కథ లేదు, కవిత లేదు. దాని మాటలు నువ్వు కూడా నమ్ముతున్నావా అమ్మా" అంటూ తేలిగ్గా తీసిపారేశాడు మనోహర్.
"నేను నమ్ముతున్నానురా! అక్కడ నువ్వో అమ్మాయిని ప్రేమించావటగా, పద్మ చెప్పింది" అంటూ అప్పడేలోపలకొచ్చింది పార్వతి. అక్కను చూడగానే ఆశ్చర్యపోతూ నవ్వాడు మనోహర్."
నీతో కూడా చెప్పిందా? అదేం లేదక్కయ్యా! పద్మ చిన్నపిల్ల. వుత్తినే అపార్థం చేసుకొంది" అంటూ పద్మవైపు చూశాడు మనోహర్.
"నేనంత చిన్న పిల్లనేం కాదు. అక్కడో అమ్మాయిని చూశాను" అని నువ్వు నాతో చెప్పావా లేదా?" అంటూ నిలదీసింది పద్మ.
"చెప్పాను తల్లీ! నువ్వు తోకను చూసి పులి అంటావనుకోలేదు. ఏదో కాలక్షేపం కోసం ఓ కథ చెప్పాలనుకున్నాను. అది కాస్త రివర్స్ అయింది. అంతే అక్కయ్యా! దీని మాటలు మీరు అంతగా పట్టించుకోకండి!" అంటూ మళ్లీ నవ్వాడు మనోహర్.
మనోహర్ నవ్వు చూసి తులశమ్మ, పార్వతిలు కూడా నవ్వారు.
తన మాటను నమ్మకుండా వాళ్లలా నవ్వుతుంటే మండిపోయింది పద్మకి.
“ఉండు నేను రాణితో చెప్పొస్తా. అప్పుడు నీ పని చెబుతాం. వీళ్ళిద్దరూ లాభం లేదు” అంటూ తులశమ్మను, పార్వతిని ఉరిమి చూస్తూ బయటకు నడవబోయింది పద్మ.
ఈసారి మనోహర్ నిజంగానే భయపడ్డాడు.
“ముందు దాన్ని పట్టుకొండత్తయ్యా! వదిలామంటే ఊరంతా చెప్పెట్టుగా వుంది” అన్నాడు మనోహర్.
పద్మను పట్టుకుని ఆపింది పార్వతి.
గుండె నిండా గాలి పీల్చుకుని తేలిగ్గా నిట్టూర్చాడు మనోహర్.
ఒక అమ్మాయిని చూసానంటేనే ఇలా వుంది. ఆ అమ్మాయి నిజంగా తన మనసులో బలంగా తిష్టవేసిందన్న విషయం వీళ్ళకి తెలిస్తే ఎలా వుంటుందో? ఊహించలేకపోయాడు మనోహర్.
*****
No comments:
Post a Comment