(జ)వరాలి కధలు - 10 :
నిరీక్షణ (కధ)
గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి ( సోమసుధ)
ఇటీవలనే మా ఆఫీసులో క్రొత్తగా జేరిన రాజేంద్ర చిన్నసైజు కవి అని తెలిసింది. నాకు కూడా కాగితాలు ఖరాబు చేసే అలవాటుందని తెలిశాక, నాతో మధ్య మధ్య చర్చ అనండి, వాదన అనండి పెట్టుకొంటూ ఉంటాడు. కవుల బుర్ర పదును దేరాలంటే యిలాంటి సాహితీగోష్టులు ఆవసరమే అని నా భావన. గతంలో కవులు యిలాంటి సాహితీగోష్టులతో సంఘానికి మంచి సాహిత్యం అందించేవారు. కానీ యీ కాలంలొ ఎవరికివారు తామే గొప్ప అనే భావనలో తమ పైత్యాలను సాహిత్యాలుగా లోకంపైకి వదిలి సంఘనాశనానికి దోహదిస్తున్నారు. అంతేకాదు.
రాజులకాలంలో కవులు సంస్కృత గ్రంధాల కధలు తీసుకొని, వాటిని దేశిభాషల్లో తమ కాలంలోని సాంఘిక, సామాజిక పరిస్థితులను జోడిస్తూ కావ్యాలు వ్రాసేవారు. అంటే వారికి కధావస్తువు సిద్ధంగానే ఉండేది. ఇక కావలసినది భాషపై పట్టు. ఆ పట్టు ఉన్న కవులు రాజులను, జమీందారులను ఆకట్టుకొని తమ కావ్యాలను వారికి అంకితం యిచ్చేవారు. దానికి బహుమానంగా వారి కావ్యాల స్థాయిని బట్టి బంగారం, ఆభరణాలు, అగ్రహారాలను పొందేవారు. అగ్రహారాలపై వచ్చే పన్నుల ఆదాయంతో ఆ కవులు కొన్ని తరాలవరకు హాయిగా బ్రతికేవారు. ప్రస్తుతం రాజులకాలం పోయింది. పద్యకావ్యాల స్థానాల్లో కధలు, నవలలు, నాటకాల వంటి అనేక రూపాలలో సాహిత్యం వస్తోంది.. అవి కూడా రాజులకాలంలో సంస్కృతకావ్యాల తర్జుమాగా గాక, ప్రజాజీవితాలని ప్రతిబింబించే సాంఘిక సమస్యలను తమ సృజనాత్మకతతో కధలుగా వెలయిస్తున్నారు. అయితే యిప్పుడు రాజులు, జమీందారులు లేరు గనుక వారి స్థానంలో పత్రికలు రాజపోషకులుగా వచ్చాయి. దీనివలన ప్రజలలో సామాజిక చైతన్యానికి వీలు కలుగుతోంది. ఈ పత్రికలు ముఖ్యమైన పండగదినాల్లో కధలపోటీలు నిర్వహించి ధనరూపంలో బహుమతులు ప్రకటిస్తున్నాయి. ఆ రకంగా పండుగల్లో యీ పత్రికల ద్వారా సృజనాత్మకత కల కొత్త రచయితలు ప్రజల మధ్యనుంచి వస్తున్నారు.
ఎప్పటిలాగే ఆ సంవత్సరం దసరా కధలపోటీలు జరిగాయి.
ఆ రోజు రాజేంద్ర నా వద్దకొచ్చి " గురూగారూ! ' ఫలానా ' పత్రిక దసరా కధలపోటీ పెట్టింది. చూశారా?" అని అడిగాడు.
" లేదయ్యా! నేనేదో వ్రాయాలనిపించినప్పుడు వ్రాయాలనిపించిన విషయంపై వ్రాయటమే తప్ప, యిలా పోటీలకు కధలు వ్రాసి పంపే అలవాటు లేదయ్యా!" అన్నాను.
" ఏం లేదు గురువుగారూ! నేనొక పెద్ద కధ వ్రాశాను. దాన్ని చదివి యిది పోటీలో నిలబడుతుందో, లేదో చెప్పాలండీ! " అన్నాడు.
" నాకంత ఓపిక లేదయ్యా! కాకపోతే నా భార్యకి తర్కదృష్టి ఎక్కువ గనుక ఆమె నీ కధ చదివి సాయం చేయగలదేమో అడుగుతా" అన్నాను.
మర్నాడు ఉదయమే మాయింటి ముందు ప్రత్యక్షమైన రాజేంద్రని చూసి ఆశ్చర్యపోయాను.
" ఇదేంటయ్యా ప్రొద్దునే వచ్చేశావ్?" అనడిగాను.
"ఏ విషయంలోనైనా నిరీక్షించటమంటే నాకు మహా చిరాకు గురువుగారూ! ఆఫిసుపనుల్లో మీరీ విషయాన్ని మరిచిపోవచ్చు. అందుకే మీరు విషయం చెప్పేలోపున కధ తీసుకొని తిన్నగా వచ్చేశా" అన్నాడు. నిజం చెప్పొద్దూ! రాత్రి అతని కధ విషయం వరాలికి చెప్పటం నేను మరిచిపోయిన సంగతి నిజమే! సరె ! ఎలాగూ వచ్చాడు గనుక అతన్ని వరాలికి పరిచయం చేసి, అతని కధను ఆమెకి యిప్పించాను. వరాలు ఏకబిగిని ఆ కధను రెండుసార్లు చదివి పుస్తకం నాకు తిరిగిచ్చింది.
"కధ ఎలా ఉందోయి?" అడిగాను.
" వెనకటికెవరో నాలుగు సినిమాలు కలిపి ఒక సినిమాగా తీసేవాట్ట. అలాగుంది అతని కధ. వెనకటి కవులు ఫలానా సంస్కృతకధను కావ్యవస్తువుగా తీసుకొన్నామని ధైర్యంగా చెప్పేవారు. ఇప్పుడలా కాదు, నాలుగు కధలు కాపీగొట్టి అంతా నా ప్రతిభే అని చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా యితని కధలో ఎలాగైనా విషాదం చేయాలనే తాపత్రయమే కనిపించింది. ఎంపికలకమిటీలో నేనుంటే ఖచ్చితంగా తిప్పికొట్టేదాన్ని. కానీ వేరేవాళ్ళు ఉంటారు గనుక అతని అదృష్టాన్ని పరీక్షించుకోనివ్వండి. కధ బాగుందనే చెప్పండి" అందామె.
" అదిసరె! ఇంతకీ కధేమిటి?" కుతూహలంగా అడిగాను.
" నేను చెప్పటమెందుకు? పుస్తకం యిచ్చాగా. . . మీరే చదవండి " అంది.
" చదివే ఓపిక లేకే కద కధని నీకిమ్మన్నది. టూకీగా కధేమిటో చెప్పు" నా ప్రశ్నకు వరాలు కధ చెప్పటం మొదలెట్టింది.
"కధ పేరు ' నిరీక్షణ '. రాజవొమ్మంగి అనే ఊళ్ళో నాలుగిళ్ళలో పాచిపని చేసుకొంటూ కాలక్షేపం చేస్తోంది " ఏకామ్ర ". పసితనంనుంచి అనాధగా బ్రతుకుతున్న ఆమె చెట్టునున్న ఒంటరి మామిడికాయలాంటిది. మామిడికాయ రుచికి పుల్లగా ఉన్నా అందరికీ కావాలి. అలాగే ఏకామ్ర పేరుకి అనాధ అయినా ఆ ఊరిలో ఎందరికో ఆమె కావలసిన అమ్మాయి. ఎవరు ఏ కష్టంలో ఉన్నా తక్షణం వెళ్ళి ఆదుకొని కావలసిన మనిషి అయింది. ఆమె సేవాతత్పరతకి ఆకర్షితుడయ్యాడు " ప్రాప్తకాలజ్ఞ ". అతనొక ధనవంతుడి కుమారుడు. అసలు పేరేమిటో తెలీదు గాని అతను నిత్యం వల్లించే మెట్టవేదాంతాన్ని బట్టి అతని స్నేహితులు అతనికా పేరు పెట్టారు. ఆ పేరు ఆధునికంగా అనిపించి అదేపేరుతో అతను పిలిపించుకొనేవాడు. ప్రాప్తకాలజ్ఞ, ఏకామ్రల స్నేహానికి ఆ ఊరి చెరువుగట్టున చెట్టునీడలో బీజం పడి ప్రేమగా పరిమళించింది. ఆ విషయాన్ని చూసినవారు ప్రాప్తకాలజ్ఞ తండ్రికి మెల్లిగా చేరవేశారు. అతను ఒకరోజు కొడుకుని యీ ప్రేమ గురించి నిలదీశాడు.
"వయసులో ఉన్నవాళ్ళకు వలపు పుట్టడం సహజమే కదా !" అన్నాడతను.
" వేరేవాళ్ళ సంగతి అనవసరం. నీ సంగతి చెప్పు " అన్నాడు తండ్రి.
" నా సంగతే చెబుతున్నా. నేను ఆ పిల్ల సేవాతత్పరతను చూసి ప్రేమించాను " అన్నాడు.
" అంతేకదా! అంతకు మించి ముందుకు పోలేదు కదా?" అడిగాడు తండ్రి.
" నాన్నగారూ! ప్రేమ అనేది మనసులో పుట్టేది. అడ్వాన్స్ ఐపోవటమనేది సంస్కారానికి సంబంధించినది. నేను సంస్కారవంతులైన మీ కొడుకుని. తప్పుపని ఎలా చేస్తాననుకొన్నారు?" అన్నాడు.
" నీ సంగతి నాకు తెలుసు గనుకే చెబుతున్నాను. ప్రేమ అనే వికారం వయసులో ఉన్న వారి రక్తంలో కలిగే రసాయనిక మార్పు వల్ల కలుగుతుంది. అందువల్ల ఆ ప్రేమజోలికి నువ్వు పోయి ఆ పిల్ల బుర్ర తినకు. నేను చూపించిన సంబంధం చేసుకొని నా కొడుకుగా దర్జాగా బ్రతుకు "
" నాన్నగారూ! ఆనాడు దేవదాసు ప్రేమకి అతని తండ్రి అడ్డుపడ్డాడు. ఏం జరిగింది? ప్రేమించిన పార్వతిని తనకు దక్కనివ్వలేదని, త్రాగుబోతుగా మారి తండ్రి పరువుని, వంశప్రతిష్టని మట్టిపాలు చేశాడు దేవదాసు. లైలా? ప్రియుడు మజ్నూని గాక వేరొకరితో తన తండ్రి పెళ్ళి చేస్తే, కట్టుకొన్నవాణ్ణి వదిలేసి తన ప్రియుడితో యిసుకతుఫాను పాలై ఎడారిలో సమాధయిపోయింది. ప్రేమ అంత బలీయమైంది నాన్నగారూ! వారిని వేరు చేయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు"
" ఈ డైలాగులు సినిమాల్లోనో, కధల్లోనో గొప్పగా కనిపిస్తాయి. కానీ జీవితం రెండున్నర గంటల సినిమా కధ కాదు. వందపేజీల అక్షరపంక్తుల పుస్తకం కాదు. నూరేళ్ళ నిడివి గల శ్వాస. ఇది విను. తొలిసారి తనని పెళ్ళిచూపులు చూసిన వ్యక్తితో తీయనైన జీవితాన్ని ఊహించుకొని నెల్లాళ్ళు కలలు కంది మీ అమ్మ. మీ అమ్మాయి నచ్చలేదని వాళ్ళొక కార్డుముక్క వ్రాస్తే పదిరోజులు భోరుమంది. వాళ్ళ నాన్న మరొక సంబంధం తీసుకురాగానే పాత వ్యక్తిని మనసులోంచి తుడిచేసింది. అతనితో పదిహేను రోజులు కలల్లో ఆశలు పంచుకొంది. మళ్ళీ నిరాశే! అలా పదిహేనుమందిని మనసులో ప్రతిష్టించుకొని చెరిపేశాక, పదహారోవాడిగా నేను ఆమె జీవితంలోకి వచ్చాను. ఇప్పుడు ఆ పదిహేనుమందిలో ఒక్కణ్ణయినా తలచుకుంటోందా? లేదు. రేపు నువ్వూ మరొక అమ్మాయిని చేసుకొన్నావనుకో! ఆ ఏకామ్ర నీ తలపులలోనికి రాదు. అదే కాలం తెచ్చే మార్పు."
" మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళి నాన్నగారూ! మీకు జీవితంలో ప్రేమ మాధుర్యం తెలీదు. మీరు చెప్పారని ఏకామ్రని విడిచిపెట్టను. అలాగని మీ మాటను ధిక్కరించి ఆమెను వివాహమాడి మీకు తలవంపులు తీసుకురాను. నాకేది ప్రాప్తముంటే అది జరుగుతుంది. కానీ ఆమెకోసం యీ రోజు మన యింటిని విడచిపెడుతున్నాను. మీరు మా పెళ్ళికి అంగీకరించేవరకూ ఆమె యింట్లోనే మీ పిలుపు కొరకు ఎదురుచూస్తూంటాను. సెలవ్ " అంటూ పెట్టె, బేడా పట్టుకొని ఆమె యింటికి వెళ్ళిపోయాడు.
ప్రేమవ్యామోహంలో ఏకామ్ర అతని రాకను కాదనలేకపోయింది. ప్రాప్తకాలజ్ఞకు తండ్రినుంచి పిలుపు రాలేదు. అలా రెండు నెలలు గడిచిపోయాయి. పెళ్ళికాని కుర్రాణ్ణి యింట్లో పెట్టుకొన్నందుకు ఆ పల్లెటూళ్ళో ఆమెకున్న గౌరవం పోయింది. తాము కూడా ఆమె యింటికొచ్చి ఉంటామని కొంతమంది ఆమెను అవమానిస్తూ వేధించసాగారు. ఆ ఊళ్ళో పనిలో పెట్టుకొన్నవాళ్ళు ఆమెను తీసి పడేశారు. ప్రేమగా మొదలైన అతని స్నేహం ఒక బాధ్యతగా మారి ఏకామ్ర నలిగిపోతోంది. పోనీ ఎలాగూ కలిసే బ్రతుకుతున్నారు గనుక పెళ్ళాడుతాడా అంటే మా నాన్న ఒప్పుకొనేవరకూ నిరీక్షిద్దామంటాడు. అర్ధరాత్రి తనపై ఆశ పడి అఘాయిత్యం చేసినా, ఊరిలో పంచాయితి పెట్టి పెళ్ళాడుదామనుకొంది. కానీ గొప్ప సంస్కారవంతుడైన అతను ప్రక్కగదిలో తలుపు గడియపెట్టి పడుకొంటాడు. గడ్డివాములో కుక్క తంతు. కుక్క ఆ గడ్డిని తను తినదు. వేరే పశువుని తినటానికి రానీదు. అలాగయిపోయింది ఆమె ప్రేమ తంతు. పేరులో ఒకే మామిడికాయ ఉన్న తన చేత మామిడికాయలు తినిపించే పని చేయని అతని సంస్కారానికి ఆమెకు చిరాకేసింది. తనే బరితెగిస్తే? అతను అపార్ధం చేసుకొని తన యింటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు తను ఏం జరక్కపోయినా ఏదో జరిగినట్లు నవ్వులపాలై ఆ ఊరు వదలాల్సి వస్తుంది. అలా పనికిరాని ప్రేమ ఊబిలో దిగిపోయి ఆమె ఆ ఊళ్ళో పని పోగొట్టుకొంది.
ఆ ఊరిలో పని పోయాక ప్రక్క ఊరిలో పని చూసుకుందుకు వెళ్తున్న ఏకామ్ర వెంట వెళ్ళాడతను. ఆమెతో పాటే ఆ ఊళ్ళో పనిచేస్తూ ఆర్ధికంగా బాధ్యత పంచుకొంటున్నాడు. సాయంత్రం పొలం గట్లమ్మట అతనితో యింటికి వస్తూంటే ఒక ప్రక్క బాధగా ఉన్నా, తన కోసం ధనవంతుడైన ప్రాప్తకాలజ్ఞ కష్టపడటం ఆమెకెంతగానో నచ్చింది. అలా అయిదు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి.
" తెలివిలేమి " వాళ్ళు పని చేస్తున్న ఊళ్ళో స్వంత మేనమామని పెళ్ళాడి నివసిస్తోంది. ఒక రోజు వీరిద్దరూ తమ పనులలో తిరుగుతుండగా దారిలో తెలివిలేమి కలిసింది. ఏకామ్ర తన పోలికలో ఉండటం గమనించి ఆమె వారిని తన యింటికి తీసుకెళ్ళింది. ఆ రాత్రి తమ యింట్లోనే ఉన్న వారి ద్వారా ప్రాప్తకాలజ్ఞకు ఏకామ్రపై ఉన్న ప్రేమ గురించి తెలుసుకొంది. తానలా ప్రేమలో పడక, అమ్మ తమ్ముణ్ణి అదే మేనమామని కట్టుకొన్నందుకు తనపై తనకే అసహ్యమేసింది. ఇంకా లోతుకు వెళ్ళగా, ఒక ఆవారా గాడి మోసానికి బలై ఏకామ్రను కని, ఆమె తల్లి కన్నుమూసిందని తెలుసుకొంది. అదే ఆవారాగాడికి అతని తండ్రి బలవంతంగా తన తల్లిని పెళ్ళి చేశాడని, వారి ప్రేమఫలంగా తను పుట్టిందని, అలా తల్లులు వేరైనా తమ తండ్రి ఒక్కరే కావటాన తామిద్దరికి ఒకే పోలికలొచ్చాయని తెలివిలేమి తెలుసుకొంది. అలా కలిసిన అక్కని తరచుగా తమ యింటికి రప్పిస్తుంటే ఆమె భర్తకు కోపం వచ్చి తెలివిలేమిని యింట్లోంచి తరిమేశాడు. యిష్టం లేని భర్తతో కాపురం చేసే కన్నా, యిన్నాళ్ళకు కలిసిన అక్క ప్రేమకు తన వంతు సహకారమందించాలని తెలివిలేమి కూడా రాజవొమ్మంగి వచ్చేసింది. ఒకరికి ముగ్గురు తోడై ఆరు నెలలు గడిచింది.
ఒకరోజు పొరుగూరిలో పనికోసం వెళ్తుండగా దారిలో ప్రాప్తకాలజ్ఞ రక్తం కక్కుకున్నాడు. వెంటనే అతన్ని డాక్టరుకి చూపించగా రెండురోజులు అతనేవో పరీక్షలు చేసి బ్లడ్ కాన్సరని తేల్చాడు. ఆ విషయాన్ని అతని తండ్రికి చేరేసినా అతను చూట్టానికి రాలేదు.
భర్తకు దూరమై తమకోసం వచ్చేసిన తెలివిలేమి తనపట్ల చూపే శ్రద్ధకు ప్రాప్తకాలజ్ఞ చలించిపోయాడు. ఇలా రోజులు గడుస్తూండగా, గడియలేని బాత్రూంలో బట్టలు మార్చుకొంటున్న తెలివిలేమిని చూసి అతనికి ప్రేమ పొర్లిపోయింది. తనకింతే ప్రాప్తమనుకొంటూ తప్పు చేసేశాడు. గడపదాటిన బిడ్డ రోడ్లపైకి పోకుండా ఆగుతుందా?
తన రోగిష్టి ప్రేమికునిపై చెల్లెలు చూపే శ్రద్ధకు విస్తుపోతున్న ఏకామ్రకు ఒక రోజు అసలు కారణం తెలిసింది. ప్రాప్తకాలజ్ఞతో ప్రేమసాఫల్యం కోసం యిన్నాళ్ళూ నిరీక్షించి తను చేసిన బాడుగచాకిరీకి, ఊర్లో అనుభవించిన అవమానాలకి తనకి దక్కిన ఫలం యిదేనా? జరుగుతున్న కధకి ఏకామ్ర ఒత్తిడికి లోనై , ఒక అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూసింది.
" ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? ముగియని యీ యాత్రలోనా. . . . ముగిసిన యీ నిరీక్షణలోనా. . . " అంటూ దూరం నుంచి మైక్ లో వచ్చే పాట ఏకామ్ర తుదిశ్వాసలో మిళితమై లోకమంతా ప్రతిధ్వనించింది.
" ఇంతకీ యీ కధపై నీ అభిప్రాయమేమిటి? " కధ చెప్పి చెంబుతో నీళ్ళు తాగుతున్న వరాల్ని అడిగాను.
"కధని ఎలాగోలా విషాదం చేయాలన్న తాపత్రయం తప్ప, రాజేంద్ర లోకానికి ఏం చెప్పదలచుకొన్నాడో నాకు అర్దం కాలేదు. అతని దృష్టిలో ప్రేమంటే వెట్టిచాకిరి అని నాకు అర్ధమైంది"
" అదేంటి వరాలూ! అతని ప్రేమభావాన్ని అలా తీసిపారేస్తున్నావ్?" అడిగాను.
" లేకపోతే ఏంటండీ? తండ్రితో దెబ్బలాడి యీమె యింటికొచ్చేశాడా? వెంటనే పెళ్ళి చేసుకొని హాయిగా ఆమెను సుఖపెట్టాడా? లేదు. మా నాన్న ఒప్పుకొనేవరకూ యిలాగే ఉండిపోదామంటాడా? అలాంటప్పుడు యింట్లోనే ఉండి తండ్రితో దెబ్బలాడాలి. అలాగాక ఆమెకు బరువై ఉన్న ఊళ్ళో ఆమె పరువు తీసి, ఆఖరికి అన్నం పుట్టకుండా చేశాడు కదండీ! తండ్రి అనుమతి లేనిదే పెళ్ళాడని పిరికి వెధవ కోసం అయిదున్నర సంవత్సరాలు ఊళ్ళో అవమానాల పాలవుతూ బ్రతికిందంటే. . .లోకంలో ఆమెకన్న పిచ్చిమాలోకం మరొకరు ఉండరు. ఇక రెండవ ఆడపిల్ల. తన కాపురాన్ని చెందనాడుకొని యీ అవకాశవాదికి సేవ చేయాలని వచ్చిందట. అయిదేళ్ళుగా ఏకామ్రని బాత్రూంలో చూడనివాడు యీమెని చూశాట్ట. అసలు వాడు తెలివిలేమిపై కన్నేసి బాత్రూంలో దూరాడేమో? తనకి సేవ చేయటానికి భర్తని వదిలి వచ్చింది కదా! వాడు నిస్వార్ధ ప్రేమికుడా? తెలివిలేమి అక్కకి ప్రేమలో సాయపడాలని వస్తే, ప్రాప్తకాలజ్ఞ యింటికి వెళ్ళి ఆ జమీందారుకి క్లాసు పీకి యీడ్చుకొచ్చి వీళ్ళ పెళ్ళి చేసేది. అంతేగాని బావగారికి బాత్రూంలో సాయపడేది కాదు. ఈ చెత్తకధకి చివర్లో " ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? " అన్న ముక్తాయింపొకటి. ఆడవాళ్ళని, తెలుగు పాఠకులని యిలా అర్ధం లేని సెంటిమెంట్లతో చావకొడుతున్నారు కదండీ!" " అంటూ మరి చెప్పలేక వరాలు వంటింట్లోకి వెళ్ళిపోయింది.
నెల్లాళ్ళ తరువాత రాజేంద్ర ఆఫీసులో వాళ్ళకి స్వీట్లు పంచుతుంటే విషయమడిగాను. ' ఫలానా ' పత్రికవాళ్ళు అతని కధకు యిరవైవేల రూపాయల మొదటి బహుమతి ప్రకటించారట. కధ చదివి బాగుందన్న వరాలికి అరకిలో స్వీటు బలవంతాన చదివించి వెళ్ళాడతను.
" వరాలూ! ఏమిటిది?" అడిగాను.
" ఆరోజే చెప్పానుగా సెలక్షను బోర్డులో నేనుంటే తిప్పికొడతానని. అతని అదృష్టం. నేను లేను. బహుమతి వచ్చింది. గతంలో మహానటుడెవరో " ఇప్పుడున్న అయిదుగురు భర్తలు చాలరు, కర్ణుడు కూడా కావాలి " అని పాంచాలి కృష్ణుడితో చెప్పినట్లు సినిమా తీస్తే బ్రహ్మరధం పట్టలేదా? అలాంటి యీ దేశంలో, యీ " వెట్టిచాకిరి " కధకు మొదటి బహుమతి రావటంలో ఆశ్చర్యమేముంది? కాకపోతే నాకు అర్ధం కానిదొక్కటే. మన తెలుగు ఆడపిల్లలు అంత తెలివితక్కువ వారా? అని"
ఆమె సూటిప్రశ్నకు నా దగ్గర బదులు లేదు.
ఆ వారాంతంలో వరాలితో సినిమా చూద్దామని వెళ్ళాను. అది ఒక ప్రఖ్యాత నటుడి సినిమా మరియు ఆరోజు వారాంతపు సెలవుదినం. సినిమా హాల్లో ప్రతి కౌంటరు దగ్గర పెద్ద క్యూ ఉంది. ఆడాళ్ళ కౌంటరులో వరాలు, మగాళ్ళ కౌంటర్లో నేనూ నిలబడ్డాం. ఇద్దరిలో ఎవరికి ముందు టిక్కెట్లు దొరికినా మంచిదేగా! క్యూ ముందుకు కదులుతున్నా జనం తరగటం లేదు. క్యూలో నిలబడి పావుగంట అయింది. అనుకోకుండా ఆడాళ్ళ క్యూల దగ్గర తచ్చాడుతున్న రాజేంద్రని చూసి పిలిచాను. నన్ను చూడగానే నా వద్దకొచ్చాడు.
" బాబాయిగారూ! మీరిక్కడా? పిన్నిగారెక్కడా?" అడిగాడు రాజేంద్ర.
" పాత సినిమా కదాని వచ్చానయ్యా! కానీ హాలు దగ్గర జనం బాగానే ఉన్నారు. అందుకే నేనిక్కడ, తను అక్కడ క్యూలో నిలబడ్డాం. నువ్వూ ఏదో క్యూలో సర్దుకో! లేకపోతే జనం పెరిగిపోయి టిక్కెట్టు దొరకదు " అన్నాను.
" ఆఫ్టరాల్ ఒక సినిమా టిక్కెట్టు కోసం అరగంట క్యూలో నిరీక్షించాలంటే చిరాకు గురూగారూ! ఆడాళ్ళవైపు జనం తక్కువ ఉన్నారు గనుక అదిగో. . . ఆ ఎర్రచీరావిణ్ణి టిక్కెట్టు తీసిపెట్టమన్నా. ఆమె తీసిస్తానంది" అని చెప్పి యీలేసుకొంటూ హాలు బయటికెళ్ళిపోయాడు.
సినిమానుంచి యింటికొచ్చాక వరాలికి రాజేంద్ర విషయం చెప్పాను.
"అరగంట సినిమా టిక్కెట్టు కోసం క్యూలో నిరీక్షించలేనివాడు ప్రేమకోసం ఆడపిల్ల అయిదున్నరేళ్ళు నిరీక్షించి మట్టిగొట్టుకుపోయిందని వ్రాస్తాడా? ఇలాంటి చెత్త సెంటిమెంట్లు వ్రాసే రచయితలకు బహుమతులివ్వటం కాదు, బడితె తీసుకొని నడుం విరక్కొట్టాలి. అప్పుడు గాని దేశం.. . . .కాదు కాదు. . . .తెలుగు అమ్మాయిలు బాగుపడరు" రుద్రకాళిలా కళ్ళల్లో నిప్పులు చెరిగింది. వరాలి వాలకానికి జడుసుకొని పక్కగదిలోకి జారుకొన్నాను.
ఎందుకంటే నేను కూడా సెంటి. . .మెంటల్ రచయితనే కద!
***
No comments:
Post a Comment