ఒకరాజు ఏడుగురు కొడుకుల కధ - అచ్చంగా తెలుగు

ఒకరాజు ఏడుగురు కొడుకుల కధ

Share This

ఒకరాజు ఏడుగురు కొడుకుల కధ 

కౌండిన్య 


మొదటి భాగం అనగనగా ఒక రాజు.  ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.  ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు.  ఏడు చేపల్ని ఎండ పెట్టారు.  అందులో ఒకచేప ఎండలేదు.  చేప చేప ఎందుకు ఎండలేదు. గడ్డిమూట అడ్డమొచ్చింది. గడ్డిమూట... గడ్డిమూట ఎందుకు అడ్డమొచ్చావు... ఆవు మెయ్యలేదు. ఆవూ ఆవూ ఎందుకు మెయ్యలేదు... గొల్లవాడు మేపలేదు. గొల్లవాడా... గొల్లవాడా ఎందుకు మేపలేదు... అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా... అమ్మా ఎందుకు అన్నంపెట్టలేదు...  పిల్లవాడు ఏడిచాడు.  పిల్లవాడా... పిల్లవాడా ఎందుకు ఏడిచావు... చీమ కుట్టింది.  చీమా చీమా ఎందుకు కుట్టావు... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టానా... అన్నది.
ఆ సరిగా ఎండని చేపను ఆరోజు వండారు. అది తిని రాజు గారు రుచిగా లేదని విసిరి కొట్టారు, సరిగాలేని కారణం అడిగారు. గడ్డిమూట దగ్గరనుంచి చీమ కుట్టడం వరకూ వివరించారు, అందువల్ల చేప ఎండలేదని క్షమాపణ కోరారు. రాజు గారికి ఆకలితో ఉండటం వల్ల కోపం వచ్చింది. "ఆ చీమను తీసుకు రండి", అని ఆజ్ఞాపించాడు. ఆ భటులు అక్కడ నుండి కదల లేదు, రాజు గారు ఏదో సరదాగా అన్నారని. ఇంతలో రాజు గారు ఇంకా కోపంతో "ఇంకా ఇక్కడే నిలుచున్నారే, వెళ్ళండి, ఆ కుట్టిన చీమేనే తీసుకొని రండి, మరొక చీమ తీసుకు వచ్చారో...జాగ్రత్త", అని హెచ్చరించి, కోపంతో పళ్ళాలు విసిరేసి తన వసతి గృహానికి బయలు దేరాడు. భటులకు ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. ఇద్దరి భటులలో ఓకడు నేల మీద చతికిల పడ్డాడు ఏంచేయాలో తెలియక, ఇంకొకడు ఆ కూర్చున్న వాడిని  ఓదారుస్తున్నాడు. ఇంతలో మంత్రిగారు అటు వచ్చారు. ఇద్దరూ చేతులు కట్టుకొని నించొని మీరే ఏదో ఉపాయం ఆలోచించమని ప్రాథేయ పడ్డారు ఆ మంత్రి గారిని.
మంత్రిగారు ఆలొచించారు. మంత్రి గారు నడవటం మొదలు పెట్టారు. ఆ భటులు ఆయన వెనక నడుస్తున్నారు. వెళ్ళి ఆ రాజ భవనం లో రాజుగారు కుమారులతో మాట్లాడి, ఆ భటులను పంపించి చేపలను ఎండ పెట్టినవారిని, గడ్డిమోపులు రోజూ తీసుకొచ్చే వాడిని, ఆ గొల్ల వాడిని, వాళ్ళ అమ్మను, వాళ్ళ పిల్లవాడిని తక్షణం తీసుకురమ్మని పంపారు. అందరూ వచ్చారు, చేపలు ఎండ పెట్టిన దగ్గరనుండి చీమకుట్టడం వరకూ వాళ్ళకు కూడా అంతా చెప్పి జరిగిందంతా నిర్థారణ చేసుకున్నారు. ఆ గొల్ల వాళ్ళింటి దగ్గరున్న పుట్ట అని తేలింది. బయలు దేరారు మంత్రిగారు. ఆయనతో పాటు అక్కడకు వచ్చిన ఆ గొల్లవాని తల్లి, గొల్లవాడు, ఆ పిల్లవాడు, భటులు కలిసి ఆ ప్రదేశానికి బయలు దేరారు, అక్కడకు చేరారు.
ఆ గొల్లవాని ఇంటికి పెరడులో ముందువైపు ఓ చిన్న పుట్ట కనిపించింది. ఆ భటులను పంపించి ఆ ప్రదేశాన్ని పరిశీలన చేయమన్నారు. వారు చూస్తే వెనుక ఇంకా చాలా పెద్ద గుట్టలుగా పుట్టలు కనపడ్డాయి. ఆ సంగతి మంత్రిగారికి వివరించారు. ఆయన ఆశ్చర్యపోయి ఆ పుట్టలు ఎవ్వరూ కదిలించ రాదని ఆజ్ఞాపించారు. మంత్రిగారు ఆ ఊరిలో చీమల పుట్టల గురించి, ఆ చీమలగురించి తెలిసిన వారెవరైనా ఉంటే వారికి తగిన బహుమానం ప్రకటిస్తామని దండోరా వేయించారు.  వాళ్ళ చీమల గురించి చెప్పింది సరికాదు అని ఋజువైతే మళ్ళీ రాజుగారు కోపంతో ఏమి శిక్ష వేస్తారోనన్న భయంతో ఎవరూ ముందుకు రాలేదు.
తరువాత రోజు రాజుగారు సభలో ఆ భటులను  పిలిపించి మళ్ళీ అడిగారు. రాజుగారి కుమారులు కూడా ఆ సభలో కూర్చొని ఉన్నారు. ఆ కుట్టిన చీమను భందించి తీసుకొని వచ్చారా అని అడిగారు, ఇంతలో మంత్రిగారు జోక్యం చేసుకొని జరిగిన సంగతి అంతా వివరించారు. అది విని కొంత సమయం గడువు ఇచ్చారు రాజుగారు. రాజు గారి కొడుకులకు కూడా ఇదంతా విని కుతూహలం కలిగింది. సభ ముగిసిన తరువాత మంత్రిగారు వెనకాల బయలుదేరారు. వారు కూడా ఆ చీమ వేటలో సాధ్యమైనంత సహాయం చేస్తామన్నారు. ఆ భటులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు, ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.
మంత్రిగారు మళ్ళీ తరువాత రోజు దండోరా వేయించారు.  అది విని ఓ సాధువు వచ్చాడు. జరిగిందంతా వివరించమన్నాడు. అది తెలుసుకొని ఆ పుట్ట దగ్గరకు తీసుకొని వెళ్ళమని చెప్పారు. అక్కడకు వెళ్ళిన తరువాత తన జింక చర్మం కింద పరిచాడు, కమండలం మీద ఓ చెయ్యి వేసి, ఓ చేతిలో రుధ్రాక్షలతో ఆ పుట్ట ముందు కూర్చొని ధ్యానం చేశాడు. ఆ కళ్ళు తెరిచి లోపల చీమలదండు వాటి వంశం చాలా పెద్దది ఉంది కావున వాటిని ఏమీ చేయవద్దని సలహా ఇచ్చారు. తన మంత్రశక్తి తో ఆ చీమను గుర్తించగలనని, కానీ అలా చేయలేనని చెప్పాడు ఆ సాధువు. మంత్రిగారికి అది సమంజసం అనిపించింది, ఆ సాధువును సత్కరించి వారి విషయాలు ఉండే చోటు కనుక్కొని సాగనంపారు.
తర్వాత రోజు సభ మొదలయ్యింది, రాజు గారు ఇంకా కోపంగానే ఉన్నారు. భటులు రాజుగార్ని చూసి వణుకుతున్నారు ఏమంటారో అని. ఇంతలో అడగనే అడిగారు ఆ చీమ సంగతి. మంత్రిగారు ఆసాధువు విచ్చేసిన సంగతి, ఆ పుట్టలు వాటిలో ఉన్న చీమలదండు గురించి చెప్పారు. రాజుగారు కోపంతో ఊగిపోయారు. నా మాట కంటే ఆ సాధువు మాట మీకు ఎక్కువ అయ్యందా అని మూర్ఖత్వం తో మండి పడ్డాడు. భటులను ఆజ్ఞాపించి తక్షణం ఆ సాధువును ఉన్న పళంగా తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు. ఆ సాధువును తీసుకొని వచ్చారు భటులు. ఆ సాధువును ఆ చీమను తన మంత్రశక్తి తో తీసుకొని రమ్మన్నారు. ఆ సాధువు తిరస్కరించాడు, అలా చేయడం వల్ల వాటికి హానికలుగుతుంది మరియు వాటిని చెడిపితే మనుషులకు, ఆ ఊరికి కూడా హాని కలగవచ్చని విన్నవించారు. రాజు గారి కోపమూ మూర్ఖత్వం తారా స్థాయికి చేరాయి. ఆ సాధువును చెరసాల లో భందించమన్నారు. మంత్రిగారు ఎంత చెబుతున్నా వినకుండా రాజుగారు ఏడుగురు కుమారులను, భటులను పురమాయించి అక్కడున్న పుట్టని కూల్చి ఆ చీమలదండు ను నాశనం చేయమని ఆజ్ఞాపించారు.
రాజు గారి కుమారులు, భటులు వెళ్ళారు. అక్కడకు చేరి ఆ ముందు ఉన్న చిన్న పుట్టని ధ్వంసం చేసి వచ్చి రాజుగారికి ఆ వార్త చెప్పారు, కొన్ని చీమలను తీసుకొచ్చి మచ్చుకకు చూపించారు. రాజుగారు ఆవేశం కొంచెం శాంతించింది. ఇంత చిన్నపని చేయలేనందుకు ఆ భటులను పనిలోనుండి పీకేశారు, మంత్రిగారిని హెచ్చరించారు. ఆ సాధువుకు చెరసాల లో వంద కొరడాలు కొట్టించమన్నారు అనవసర ప్రసంగం రాజు గారి ముందు చేసినందులకు. సభను ముగించారు.
చీకటి పడింది. మంచి నిద్ర పోయేవేళలో రాజుగారు లేచి అరుస్తున్నారు, ఆ అరుపులకు భటులు వెంటనే హజరు అయ్యారు. రాజుగారి సైన్యాధిపతి ఆయన అరుపులకు వెంటనే అక్కడికి వెళ్ళాడు. రాజు గారిని చూసి ఆయన వళ్ళంతా పాకుతున్న చీమలను దులిపారు. ఆ మూల నుండి రాసులు రాసులు గా వస్తున్న చీమలదండు ను చూసి సైన్యాధిపతి రాజుగారిని ప్రమాదం లేని ప్రదేశానికి తీసుకెళ్ళమని భటులకు చెప్పి, వాటిని తరమటానికి ప్రయత్నం మొదలుపెట్టారు. అవి వాళ్ళు చేరలేని ప్రదేశం అంతా పాకుతూ రాజుగారి పడకగదిని నాశనం చేసి అన్నీ మాయమైయ్యాయి. అది గ్రహించి ఆ చెరసాల లో ధ్యానంలో ఉన్న సాధువు చిరు నవ్వు నవ్వాడు.
రాజుగారు ఉదయం తన వసతి గృహానికి వచ్చి చూసారు. చీమలు అలా చేయటంతో తట్టుకోలేక మంత్రులను, సామంత్రులను, సైన్యాధికారిని మరియు ఏడుగురు కొడుకులను సభకు పిలిపించారు. ఇది చిన్నదిగా మొదలయ్యి ఇప్పుడు పరువు మర్యాదల సమస్యగా మారింది. అందరూ కొలువు తీరారు సభలో మంత్రిగారు లేచి రాజుగారితో జరిగేందేదో జరిగి పోయింది కావున ఇంక ఆ చీమల పుట్టల జోలికి వెళ్ళకుంటేనే సబబు అని విన్నవించారు. సైన్యాధికారి వీరావేశంతో లేచాడు. చీమలు ఇంతలా కీడు చేస్తే చేతులు కట్టుకొని కూర్చునే దద్దమ్మను కాను, రేపటి లోగా ఆ పుట్టలన్నింటికి రూపులుండవని మీసం రువ్వి తొడకొట్టాడు. అది విని రాజుగారికి కూడా ఉద్రేకం వచ్చింది. తక్షణ కర్తవ్యం గురించి ఆలోచిద్దామన్నారు. మంత్రిగారు అక్కడ చూసిన పెద్ద పుట్టల గురించి కూడా తెలిపారు. రాజుగారు వాటినన్నింటిని చుట్టుముట్టి మొత్తం కొల్లగొట్టి రమ్మని పంపారు. రాజుగారు ఇంత చిన్న విషయాన్ని చిలికి పెద్దది చేస్తున్నందులకు మంత్రిగారు నిరుత్సాహ పడ్డారు.
సైన్యము, సైన్యాధికారి మరియు రాజుగారి ఏడుగురు కొడుకులు అక్కడికి చేరారు. ఆ పుట్టలన్నింటిని చుట్టూ ముట్టారు. గుణపాలతో కూల కొట్టడం మొదలు పెట్టారు.  చీమలు తండాలు తండాలుగా బయటకు రావడం మొదలు పెట్టాయి. అందరి మీద పాకుతున్నాయి. కొంతమంది తట్టుకోలేక ఆ గుణపాలు అక్కడ పారేసి దగ్గరలో ఉన్న నీళ్ళలోకి దూకారు, కొందరు కింద మట్టిలో పడి దొల్లటం మొదలుపెట్టారు. మరికొందరు ఆయుధాలు పడేసి వళ్ళంతా దులుపుకోవడం మొదలు పెట్టారు, సైన్యధికారి కోపగించడంతో కొందరు ఒళ్ళు మంటలతో ఉన్నా అలాగే ముందుకు సాగి ఇంక కొంత నష్టం చేయసాగారు. చీమలలో కూడా చాలా రకాల చీమలను చూస్తున్నారు నల్లవి, ఎర్రవి, కండ చీమలు, కొన్ని రెక్కలు కలిగి ఎగరగలిగే చీమలు. ఆ ఎగిరే చీమలు వాళ్ళ చెవులలోకి, నాసిక రంధ్రాలలోకి, నోరు తెరిస్తే నోటిలోకి వెళ్ళి నానా బాధలు పెడుతున్నయి. కొందరు సైనికులు తట్టుకోలేక పారిపోవడం మొదలు పెట్టారు. కొందరు ఆ తొక్కసలాటలో వాటి ధాటికి తట్టుకోలేక మరణించారు. సైన్యాధికారి ఊగిపోతున్నాడు, రాజు గారికి మాట ఇచ్చాడు, ఎలా అయినా వాటిని నాశనం చేయాలని ముందుకు రాజుగారి కొడుకులతో కలిసి వాళ్ళు కూడా పోరాటం సాగించారు. ఆ చీమలదండు అలా వస్తూనే ఉన్నాయి. వాటి ధాటికి తట్టుకోలేక పోయారు, ఆ పోరాటంలో చీమలదండు దే పైచేయిగా నిలిచింది.
సైన్యాధికారి, రాజుగారి కొడుకులు, మిగిలిన వారు గాయాలతో దీనావస్థతో వెనుకకు వచ్చారు. రాజుగారికి అంతా వివరించారు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. వచ్చి శుభవార్త వినిపిస్తారను కుంటే ఇలా చెడువార్త వినిపించారు అని ఛీ కొట్టారు. రాజుగారు ఆ చీమలని మరియు అవి చిన్న ప్రాణులన్న విషయాన్ని తేలికగా తీసుకొని వ్యూహం లేకుండా వెళ్ళినందుకు ఇలా జరిగిందని, తనుకూడా రంగంలో దిగుతానని వాగ్దానం చేసాడు. తనేగనుక వచ్చిఉంటే వాటిని ఈ పాటికి ముట్టగట్టే వాడినని విర్రవీగారు. మళ్ళీ మంత్రిగారు ఆలోచనలో పడ్డాడు, ఏదోవిధంగా ఆపే ప్రయత్నం చేయాలని తలంచాడు కానీ అంతా వ్యర్థం అయ్యింది.
తరువాత రోజు వాటితో యద్ధానికి ఎలా చేయాలో ప్రణాళికలు చేయడం మొదలుపెట్టారు. చేసేది లేక మంత్రిగారు కూడా తనకు తోచిన సలహాలు ఇస్తున్నారు. కొంతమంది పుట్టలకు పొగ పెడదామని అన్నారు, కొందరు కాల్చి మంటలు పెడదామని సలహా ఇచ్చారు. కొందరు అవి కుట్టకుండా వేసుకోవటానికి బట్టలను తయారు చేయించ గలిగితే కనుక వాటికి ఎక్కువ నష్టం కలిగించ వచ్చన్నారు. వాటి సర్వనాశనాని ఏదైతే తోడ్పడుతుందో అన్నీంటిని జమచేసుకొని తరువాత రోజు అందరూ కలిసి బయలు దేరారు. ఈ వార్త ఆ రాజ్యం లో ప్రజలకు కూడా చేరింది. రాజు గారి మూర్ఖత్వానికి నిరాశ పడ్డారు. ఆ చీమల వల్ల పంటలకు హాని చేసే క్రిమి కీటకాలు నశిస్తాయని, పంటభూమి నేలలకు గాలి సోకేలాగే చేస్తాయి కావున వాటిని మంట కలపడం వల్ల అపార నష్టమని ఊరిలో ప్రజలు రాజు గారి దగ్గరకు తన గోడు విన్నవించడానికి బయలు దేరారు. కానీ ఆ పాటికి రాజుగారు కూడా రంగం లోకి బయలుదేరారు. అక్కడకు చేరారు. ఆ భూమిని చూస్తే అన్నింటిని కొల్లకొట్టిన రణభూమి లాగా ఉంది.
రోజూ మనుషులు వచ్చి ఆ చీమలదండు మీద దండయాత్ర చేయడంతో ఆ చీమలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఆ చీమలు కూడా ప్రణాలికలు పన్నడం మొదలు పెట్టాయి. చీమలకు కూడా మనుషుల వలె రాజ్యాలున్నాయి. ఒక్కొక్క రాజ్యం లో ఆడ చీమల రాణులుంటారు, మగధీరలు ఉంటారు, ఆ మగధీరు చీమలకు రెక్కలుండి ఎగిరే శక్తి ఉంటుంది. ఆ రాణి దగ్గర చీమల సైన్యాల దండులు, కొంతమంది పనిచేసే చీమలు ఉంటాయి. రాణులను రక్షణలో వీరంతా సహాయపడతారు. ఆ రాణుల వల్ల వారి వంశ్యాభివృద్ధి అవుతుంది అందుకని వాటికి ఏ హామి జరిగినా సహించరు. ఈ రెండు రోజులలో చాలా రాజ్యాలకు అపార నష్టం కలిగించారు. ఆ రాణులను అక్కడనుండి తరలించారు. ఆ పిల్లవాడిని కుట్టిన చీమను కూడా ముప్పు ఉంది కాబట్టి తరలించారు. వాటికి తోచినంత పన్నాగాలు పన్నుతున్నారు. ఆ చీమలన్నింటిలోకి చాలా తెలివైన చీమ ఉంది. అది ఓ మంచి ఉపాయం చెప్పింది. పుట్టలు కూలకొట్టినపుడు ఎవ్వరూ బయటకు వెళ్ళకూడదని వారి సొరంగం లోనే ఉండి మనుషులనే సొరంగం లోకి కనుక రానిస్తే గెలవడం సాధ్యం అని. ఆ ఉపాయం అద్భుతం గా ఉందన్నారు.లోపలకు కొన్ని మట్టిని ఒంటిమీద రాసుకొని ఎవరికి కనిపించకుండా యద్దం చేయాలని, కొన్ని  కలిసికట్టుగా ఉండి ఓకేసారి దండయాత్ర చేయాలని, కొన్ని ఎగరగలిగే చీమలు రసాయనాలు కంటిలో కొట్టలాని పన్నాగాలు పన్నాయి.
రాజుగారికి తన ప్రతాపం చూపించే అవకాశం వచ్చింది.  అక్కడికి చేరగానే ఒళ్ళంతా కనపడకుండా వస్త్రాలు ధరించిన వారిని వెళ్ళి ఆ పుట్టలు పగుల కొట్టమన్నారు. వాళ్ళు మొదలు పెట్టారు ఇదివరకు లాగా ఆ చీమలు బయటకు రావడం లేదు.  ఇంకా తొవ్వమన్నారు, తొవ్వుతూ పోతున్నారు. ఆ చీమలదండులు వాటి సొరంగంలో వెనుకకు జరుగుతున్నాయి. రాజుగారు కోపంతో మిగతా సైనికులను కూడా వెళ్ళి ఆ పుట్టలోకి చొరబడి చూడమన్నారు. ఆ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు లోపలికి చొరబడ్డారు, లోపల ఏ మాత్రం గాలి లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కనుచూపు మేరకు ఏమీ కనబడక వెనుకకు తిరిగి వచ్చి విన్నవించారు. రాజుగారికి ఉద్రేకం ఆగడం లేదు. రెండు రోజుల నుండి అందరిని బాధ పెట్టినవి ఇంకా లోపల ఉండి ఉంటాయని నిర్థారించి సైన్యాధికారి, రాజుగారు కొంతమంది సైన్యం లోపలకు చొరబడ్డారు. ఆశ్చర్య పోయారు లోపల ఆ చీమల కట్టుకున్న వన్ని చూసి. అన్నీ చూసుకుంటూ లోపలకు వెడుతున్నారు. ఆ మట్టిరంగు లో ఉన్న చీమలు పన్నాగం ప్రకారం అటు ద్వారం వైపు కనపడకుండా వెడుతున్నాయి. ఎగరే మగధీర చీమలు రసాయనాలతో తయారయ్యాయి, సైనిక చీమలు కలిసి కట్టుగానించొని సైన్యాధికారి సైగ కోసం వేచి ఉన్నాయి. పనిమంతులైన చీమలు సరఫరాలతో తయరైఉన్నారు. సమయం ఆసన్నమైయింది, ఆ చీమల సైన్యాధికారి సైగ చేసారు. ఓక్క సారిగా ఆ చీమలదండు సైన్యం గుంపుగా రావడం మొదలు పెట్టాయి. ఆ ఎగిరే మగధీర చీమలు ఎగురుతూ ఒక్కసారిగా చుట్టు ముట్టాయి. రాజుగారి సైన్యానికి కంగారు పుట్టింది తట్టుకోలేక తొక్కిసలాట మొదలయ్యింది. సైన్యాధికారి రాజును ఆయన కొడుకులను కాపాడే బాధ్యత తీసుకొని వారికి ఏమాత్రం హాని కలుగకుండా చీమలు చొరబడకుండా చుట్టుముట్టారు. కొందరు సైనికులు ఆ చీమలతో వీరపోరాటం సాగిస్తున్నారు, ఆ మగధీర చీమలు రసాయనాలు కళ్ళల్లో జల్లడంతో కొంత మంది నేలకూలు తున్నారు. ఆ చీమల దండులు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి, వాటికి విపరీతమైన నష్టం కలుగుతోంది, కానీ అవి రాణిచీమల కనుచూపుమేరల వరకూ కూడా వెళ్ళన్నివ్వట్లేదు.
సైన్యాధికారి వాటి ధాటికి తట్టుకోలేక వెనుతిరగడం భావ్యమని తలిచి రాజుగారు వద్దకు వచ్చి ఆ సంగతి విన్నవించారు. ఆయన మూర్ఖత్వం మాని ఆ సాధువు మాట వింటే గనుక ఇంత వరకూ వచ్చిఉండేది కాదు. ఆయన సైన్యాధికారిని తోసి వాటితో యుద్ధం ప్రారంభించారు. ఆయన కొడుకులు కూడా రంగంలోనికి దిగారు. ఆ వీరపోరాటంలో చీమల ధాటికి తట్టుకోలేక పోయి అందరూ గాయాలతో బతికి బయటపడి వెనుదిరిగి బయటకు వచ్చారు. అప్పుడు అర్థమైయ్యింది రాజు గారికి ఆ సాధువు లోపల ఆ చీమలగురించి ఏంత దివ్యదృష్టి తో చూడగలిగారోనని. ఆయన సిగ్గుతో తలవంచుకొని తన రాజ్యం చేరారు. మంత్రిగారు ఆ రాత్రి రాజుగారికి, కొడుకులకు గాయాలకు చికిత్సలు చేయించారు, గాయపడిన సైనికులకు కూడా సిబిరాలలో చికిత్సలు మొదలుపెట్టారు. రాజుగారు ప్రజలందరిని  తరువాత రోజు సభకు పిలిపించమని మంత్రిగారికి చెప్పాడు. మంత్రిగారు రాజ్యమంతా దండోరా వేయించారు.
సభ కిక్కిరిసి పోతోంది. సభ బయటకూడా నించొని రాజుగారు ఏమి చెబుతారా అని వింటున్నారు. మంత్రిగారు ఆ గొల్లవాడిని, వాని తల్లిని పిల్లవాడిని పొద్దున్నే వచ్చేయమన్నారు. ఆ సాధువును కూడా చెరసాల నుండి విడిపించి సభకు తీసుకొచ్చారు. కొన్ని గూఢాచారి చీమలు, మరికొన్ని సైనికులను రాణి చీమలు తరువాత రోజు పరిస్తితి చూసిరమ్మని పంపాయి. అందరూ గుంపులుగా బయలుదేరడం చూసి అవికూడా ఎవరూ చూడకుండా సభలోకి చేరాయి. రాజుగారు సభలోకి వస్తున్నారు. ఇంతలో ఒకడు గట్టిగా అరిచాడు "రాజ రాజ మూర్ఖాండ చీమలతో చిత్తుగోడిన మార్తాండ రాజు గారు వస్తున్నారహో", అని. సైన్యాధికారి రాజుగారు వినేలోపు అతడ్ని బంధించి తీసుకొనమని ఆజ్ఞాపించాడు. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నారు, సభలో పెద్దలను కూర్చోమని సైగ చేసారు. అందరూ కళ్ళు ఆర్పకుండా కుతూహలంతో రాజు గారు ఏమని విన్నవిస్తారోనని గుండుసూది కిందపడితే ఆ శబ్థం కూడా వినపడేంత నిశ్శబ్దం గా ఉన్నారు. ఇంతలో రాజుగారు...
"నా ప్రియతమ ప్రజలారా! మీరంతా సభకు విచ్చేసినందులకు నాకు చాలా సంతోషం గా ఉంది", అన్నాడు.
ఇంతలో ఓకడు "రాజు గారికి జై", అని అరిచాడు. అందరూ జై కొట్టారు. రాజుగారు సైగ చేసి మళ్ళీ
"మీ అందరికి తెలుసు నా వయసు పెరిగిందని. నా కుమారులు సకల కళావిద్యాలు నేర్చుకొని రాజ్యం ఏలగలిగిన వారయ్యారు", అని అన్నారు.
"యువ రాజుల వారికి జై", అని అరిచారు, మిగతా వారు కూడా జేజేలు కొట్టారు.
సమయం ఆసన్నమైయింది కావున ఆయన ఏడుగురు పుత్రులు కలిసి రాజ్యభారాన్ని మోయగల శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. సభంతా హర్షం వ్యక్తం చేసారు, తప్పట్లు కొట్టారు, వీలలు వేసారు. సైగ చేసి ఆ సాధువు దగ్గరకు పిలిచారు, ఆయన లేచినుంచొని నమస్కారం చేసి, అందరిముందు సత్కారం చేసి తను చేసినదానికి క్షమాపణ కోరారు. ఆ చీమల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పారు. అందరూ సంతోషించారు.
అక్కడున్న గూఢాచారి చీమలకు , మిగతా చీమలకు పరిస్తితి అర్ధం అయ్యింది, అవి తిరుగుముఖం పట్టాయి. ఇంతలో ఆ గొల్లవాని పిల్లవాడు "అమ్మా...", అని గట్టిగా సభంతా మారు మోగేలాగా ఏడ్చాడు. ఆ పక్కనే ఉన్న సైనికుడు ఆ పిల్లవాడు తల్లికి చూపిస్తున్న వేలిమీద ఉన్న చీమను తన చేతితో గట్టిగా కొట్టి చంపుదామని ఎత్తి దించేలోపు ఆ సైన్యాధికారి ఒక్క తోపు తోసాడు ఆ సైనికుడి కింద నేలమీద పడ్డాడు. రాజుగారు ఆశ్చర్యంతో తన సింహాసనం నుంచి లేచి నించున్నారు. ఆ కుట్టిన చీమను, మిగతా అన్ని చీమలను అందరూ దండం పెడుతూ సాగనంపారు. అందరూ చూస్తుండగా అవి నిమిషంలో మాయమయ్యాయి.
సమాప్తం

No comments:

Post a Comment

Pages