తాత - ఓ మనవరాలు! - అచ్చంగా తెలుగు

తాత -  ఓ మనవరాలు!

కుంచె లక్ష్మీనారాయణ. 9908830477     

        
అదో...మారుమూల కుగ్రామం. ఆ ఊర్లో ఓ ముసలి తాత ఉండేవాడు, ఆ తాతకు ఝాన్సీ అనే మనవరాలు ఉంది. తాతకు మనవరాలు  అంటే ఎంతో ప్రేమ, ఎంత ప్రేమ అంటే మాటల్లో చెప్పలేనంత. చేతల్లో చూపలేనంత. ఇద్దరూ ఆనందంగా ఉండేవారు. ఇంట్లో పనులన్నీ మనవరాలు చేస్తుంటే ఎంతో సంభరపడుతుంటాడు. తన మనవరాలు కసువు ఊడుస్తుంటే ఆటపట్టించడం కోసం అలా కాదు ఇలా కాదు కసువు ఊడ్చడం అని మనవరాలుని ఎంత ఆట పట్టించినా విసుగు చెందకుండా తాత చెప్పిన విధంగా నడుచుకుంటూ తాత చెప్పినట్టే చేస్తూ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉంటారు.
            ఒకరోజు ఎప్పటిలాగే భోజనం చేసి తాత మనవరాలు ఇద్దరూ నులకమంచం పై పడుకొని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ, తాత కథలు చెప్తుండగా ఝాన్సీ నిద్రలోకి జారుకుంది. తాత కూడా ఝాన్సీకి దుప్పటి కప్పేసి తనూ నిద్రపోయాడు.
            ఉదయం ఝాన్సీ నిద్రలేచి, కసువు ఊడ్చి, కల్లాపి చల్లి తాతను నిద్రలేపడానికి వెల్లింది. తాత నిద్రలోనే ఈ లోకాన్ని విడిచి తిరిగి రాని లోకానికి ఝాన్సీని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. తాత చనిపోయిన దుఃఖంలో ఝాన్సీ బోరున ఏడుస్తూ... తాత! ఇంకెవరున్నారు? తాత నాకు. తోడెవ్వరు తాత నాకు? ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూలేరు తాత నేను కూడా నీతోనే వస్తా...తాత అని ఏడుస్తోంది.
ఝాన్సీ ఏడ్వడం ఇరుగు పొరుగు వారికి వినిపించి ఏంజరిగిందో అన్నసందేహంతో అక్కడికి చేరుకున్న అందరికీ పరిస్థితి అర్థమై ఝాన్సీని ఓదార్చారు. అలా తాతను ఇరుఇరుగు పొరుగు వారే తలా ఓ చేయేసి అంత్యక్రియలు జరిపించారు.
              ఝన్నీ ఉన్న ఒక్కతాత కూడా తోడు లేకుండా స్వర్గస్తులయ్యే సరికి ఒంటరయ్యింది. కానీ డబ్బుకు, బంగారంకు కొదవలేదు. ఈ విషయం ఊరందరికీ తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తుంటారు ఝాన్సీ  ఇంటి చుట్టు పక్కల వాళ్లు. ఝాన్సీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం ఎలాగైనా కాజేయాలని ఊళ్ళో అందరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఆలోచిస్తుంటారు.
                  ఒకరోజు ఝాన్సీ ఇంటి ముందు కసువు ఊడుస్తుండగా ఒక గుండా అటువైపుగా వెళ్తూ ఝాన్సీని చూశాడు. ఝాన్సీ మెడలోని నగలు తళ తళలాడుతున్నాయి. అవి చూసిన గుండా కళ్ళకు ఆశపుట్టి ఝాన్సీని ఎలాగైనా మాటల్లో పెట్టి బంగారం కాజేయాలని పన్నాగం పన్నుతాడు. గుండా ఝాన్సీతో అమ్మాయ్ కొంచెం దాహంగా ఉంది మంచినీళ్ళు ఇస్తావా? అని అడిగాడు. ఝాన్సీ ఇంట్లోకి రండి అని పిలవగానే గుండా తన ఎత్తుగడ పారిందని ఉబ్బితబ్బిపోయాడు. ఇంట్లోకి వెళ్ళడానికి గుమ్మం దగ్గర అడుగు వేస్తుండగానే గుండాకి దెబ్బలు తగులుతున్నాయి. అటూ ఇటూ చుట్టు పక్కల అంతా చూశాడు ఎవరూ కనపడలేదు. మళ్లీ గుమ్మం దాటి ఇంట్లోకి పోవడానికి అడుగు వేయబోయాడు మళ్లీ దెబ్బలు తగులుతున్నాయి. ఈ ఇంట్లో ఏదో దెయ్యం ఉందని గుండా భయంతో కేకలు వేస్తూ వెళ్లిపోయాడు. ఝాన్సీ మంచినీళ్ళు ఇవ్వడానికి తీసుకువస్తే మంచినీళ్ళు అడిగిన వ్యక్తి కనపడకపోడంతో ఝాన్సీ ఇంట్లోకి  వెళ్ళిపోయిఉంది.
                ఇంట్లో వంట వండుకోవడానికి కూరగాయలు అయిపోవడంతో ఝాన్సీ కూరగాయల మార్కెట్ కు వెళ్లింది. అక్కడ ఒక రౌడీ కన్ను ఝాన్సీ వేసుకున్న బంగారు నగలపైన పడింది. ఎలాగైనా ఆ బంగారు నగలు చేజిక్కించుకోవాలని ఝాన్సీ వెనుక నుండి మెడపై  చేయి వేయభోయిన రౌడీ వీపు విమానం మోత మోగింది. అరె..ఎలా దెబ్బలు తగులుతున్నాయో? అర్థం కాక రౌడీ ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఏమి జరుజరుగుతుందో? అని లగెత్తాడు. ఝాన్సీ కూరగాయలు తీసకుని ఇంటికి చేరుకొని వంట చేసుకొని భోజనం తిని విశ్రాంతి తీసుకోవడానికి నిద్రలోకి జారుకుంది.
               నిద్రిస్తున్న ఝాన్సీని గమనించిన ఆ ఊరిలోని ఒక ఆయన ఝాన్సీ ఒంటిపైనే ఇన్ని నగలుంటే ఇంట్లో ఇంకెన్ని నగలున్నాయో అనుకొని ఇంట్లోకి వెళ్లి నగలు, డబ్బులు దొంగలించాలని అనునుకుంటాడు. ఝాన్సీ ఇంట్లోకి అడుగు పెడుగు పెడుతుంటే అక్కడ ఆయనకు దెబ్బలు తగలడం ఆరంభమయ్యాయి. ఆయన దెబ్బలు తగులుతున్నా పరిసరాలు గమనించగా ఒక ముసలి మనిషి తనని కొడుతున్నట్లు ఆకారం కనిపించి ఝాన్సీ నగలు కాజేయాలనుకున్న ప్రతి ఒక్కరినీ చనిపోయిన ఝాన్సీ తాతే చితకబాదుతన్నట్లు అరుస్తూ ఊళ్లోకి పరుగుతీసాడు.
              ఇది చూసిన ఊళ్ళో జనమంతా ఝాన్సీ నగలు, డబ్బు కాజేయడం ఏ ఒక్కరిచేతాకాదని మనం ఒకవేళ నగలు, డబ్బు కాజేయాలని ఎవరు ప్రయత్నం చేసినా వాళ్లను ఝాన్సీతాత  వారి అంతు చూడకుండా ఉండడని ఒక నిర్ణయానికి వచ్చారు. అలా అప్పటి నుండి ఆ ఊరి జనమంతా ఝాన్సీకి తోడుగా ఉన్నారు.
            ఝాన్సీ ఆనందంగా ఉండడం చూసి తాత నా మనవారిలి ఇంతమంది తోడు ఉన్నారని ఆత్మశాంతించి పై లోకాలకు మరలిపోయాడు.
****

No comments:

Post a Comment

Pages