ఆట - ఆడు
కందాళ విజయ
ఆట అనగానే ఆనందం.ప్రతివారి మొహంలోనూ సంతోషం . మనకు తెలిసిన ఆటలు కొన్నే . తెలీని ఆటలు బోలెడున్నాయి . అన్ని ఆటలూ ఒకటి కాదు .అలాగే అన్నిటి అర్థం , పరమార్థం ఒకటేకాదు . ఈ వ్యాసంలో ఆటలకు సంబంధించిన వివరాలుంటాయని మీరు భావిస్తే పప్పులో కాలేసినట్లే . ఆడే ఆట కాదిది . ఆలోచించే ఆట . మొదలెడదామా.
శంకరనారాయణ నిఘంటువులో ఆట అనే పదానికి play , sport , game , dance , joke , gambling ఇలా ఎన్నో అర్థాలున్నాయి .ఇవన్నీ మనకు పరిచయమైనవే. అయితే కొన్నిసార్లు పరిచయమైన పదాలైనా కాస్త లోతుగా ఆలోచిస్తే ,కొత్త గా కనిపిస్తాయి . కొత్త అందాలు కనిపిస్తాయి .
ఒక్కసారి గతంలోకి వెళ్తే ధర్మరాజు జూదమాడాడు . సారంగధరుడు పావురాల తో ఆడాడు . బాలచంద్రుడు పల్నాటి చరిత్రలో బొంగరాలతో ఆడాడు .ఇవి మనకు తెలిసిన ఆటలే . మరి క్రింది సందర్భాలను ఓ సారి గమనించండి .మొదటి ఆట సినిమాకు టికెట్లు దొరకలేదు అంటే show అని అర్థం .ఆ అమ్మాయి గజ్జె కట్టి ఆడిందంటే అబ్బో ! , అంటే నాట్యం అన్నమాట .వెనకటికి ఆటపాటలు అని పిల్లలకోసం ఒక మాసపత్రిక వచ్చేది .ఆటతోటలు అంటే Guest house అని అర్థం నీ ఆట కట్టిస్తాను అంటే నీ పనైపోయిందని భావం . ఆటవిడుపు రోజులు అంటే అనధ్యయనపురోజులు .అంటే ఆ రోజుల్లో పిల్లలు చదవక్కరలేదు.
చదరంగంలో నీ ఆటకట్టిందంటే నువ్వోడావనిఅర్థం . ఆట పట్టించడం అంటే హేళన చేయడం . అంటే నేటి ర్యాగింగ్ లాంటిది .ఆటల్లో అరటి పండు అనేది తెలుగులో బాగా ప్రసిధ్ధి లో వున్న జాతీయం .ఆడేటప్పుడు దెబ్బలు తగిలితే తేలికగా తీసుకొని మరిచి పోవాలని అర్ధం .
నీ ఆటలు సాగనివ్వనని అంటే హెచ్చరిక .ఆటరాక మద్దెల ఓడని అంటే నైపుణ్యం లేని వాడని అర్ధం .
నేనంటే ఆటగా వుందంటే నన్ను చిన్నచూపు చూస్తున్నావని .
ఇలాఆటలు బోలెడన్ని రకాలు .ఆటతో ఎన్ని ఆటలాడినా ఫరవాలేదు కానీ మాటలు జారకండి . మనుషులు దూరమౌతారు .
****
No comments:
Post a Comment