బాల కృష్ణుని లీలలు- ఉత్సాహముతో.. - అచ్చంగా తెలుగు

బాల కృష్ణుని లీలలు- ఉత్సాహముతో..

Share This

“బాల కృష్ణుని లీలలు- ఉత్సాహముతో..”

                              మంథా భానుమతి


కన్నని కిలకిలల తోడ గయగవాక్షములదిరే
ఎన్నగా యశోదకు మనసెంతొ సంతసింపగా
పన్నుగానె పిలిచి చూప బాళి వెన్న ముద్దలే
వన్నె వెలుగ వెన్నుడంత పరుగున చను దెంచెనే.
 **************
అందరిళ్ల జేరి కన్నయల్లరెంతొ సేయగా
సంధ వేళ వరకు నమ్మ చాల నోర్మి తోడనే
సందులందు యమున ముందు సంలపించి నంతనే
బంధనమును చేసెనతడు బాళి చుట్టి ప్రేమతో.
 **********
అల్లరంత నోప లేక యమ్మ కట్టె రోటి కే
అల్ల మెల్ల పాకి వచ్చి యంత రోలు నీడ్చెగా
చల్ల గానె కృష్ణు డేమొ జారి చెట్ల మధ్యగా
పెళ్ల గించె మద్ది మాను పేర్మి శాప మూడ్చగా.
***********
రక్కసి నలవోక దుంచి రమ్యముగను యాడెనే
అక్కసమున బండి యరిని నాకశమున విసిరెనే
ఎక్కి పాము పడగ మీద నెగిరి గంతులేసెనే
మొక్కిన వనితలకు మాన మొసగి కాచె కరుణనే.
  ************
మురళి నూద వనితలంత మోదమంది వచ్చెగా
వరుసగా నొకరికొకరు వివరము సైగ సేయగా
విరిసెననుచు వెన్నె లంత వేడుకగనె నిలువగా
హరిని పిలిచి రాసకేళి హాసముగనె జరిపెగా.
************
కొండ నెత్తి గొల్ల పల్లె కుంగ కుండ నాపెనే
అండ గాను నిలిచి యంత హయుని క్రోధ మణచెనే
మెండుగాను యాలమంద మెచ్చి మోరలెత్తెనే
పండగే కదా జనతకు వాసుదేవు కూడనే.
 ************
ప్రేమ మీర నంద సతియె వెన్నుని పెనుచు కొనగా
కామితములు తీర్చ గాను కలసె గొల్ల వాళ్లతో
దామము నెమలీక పేర్మి తాల్చ పట్టు దట్టితో
సామజవర గమనుడేగె సరగునంత మురళితో.
  ************
కంసమామ పిలువనంప కదలె యన్నదమ్ములే
అంశభాగ మదియె కాద యమ్మ దేవకికినదే
       వంశకరుడు వచ్చుననుచు వసువెలుగులు జిమ్మగా
                  కంస హరణమే యశోద గంటి కారణమునకే.            
         *-------------------*

No comments:

Post a Comment

Pages