తేట తెనుగు పాటల టంకసాల -- మన ఘంటసాల
-మధురిమ
డిసెంబర్ నాల్గవ తేదీ ఆయన జయంతి సందర్భంగా ఆయనను ఈరీత్యా మనందరం ఇంకొక్కమారు స్మరించుకోవడానికి ఈప్రత్యేక వ్యాసం..
“మాష్టారు” అని తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో వాళ్ళంతా ఆత్మీయంగా,గౌరవంగా సంబోధించే ఏకైక వ్యక్తి మన ఘంటసాల. తెలుగు పాటకి చిరునామా ఎవరంటే అది ఘంటసాల మాష్టారే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఓ తెలుగు పాటల నేపధ్య గాయకుడిగా లేక ఓ సంగీత దర్శకునిగా ఘంటసాలగారికి పరిచయం అవసరం లేదు,కాని ఈ వ్యాసం చదివే ప్రతీవారికీ ఆయన వ్యక్తిత్వం గురించి కూడా తెలియాలన్నది నా తపన, ఉద్దేశ్యం కూడా..ఆయన ఎంతటి ప్రతిభావంతులో అంతకంటే ఎక్కువ శ్రమ జీవి.ముఖ్యం గా నేటి తరానికి ఆ పరిశ్రమ తెలియాలనే ఉద్దేశ్యంతో మాష్టారులోని కొన్ని తెలియని కోణాలను మీకు పరిచయం చెయ్య సంకల్పించాను.
జననం,బాల్యం:
ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. తండ్రిగారు సూర్యనారాయణ గారి జీవన విధానం వింతగా ఉండేదట.తరంగాలు అనే సంగీత ప్రక్రియలు పాడడంలో విశేష కృషిచేసిన సంగీతజ్ఞులు.మృదంగం వాయించడంలో కూడా ప్రవీణులే.ఇంట్లో ఉంటే జపం చేసుకోవడం,బయటకి వెళితే భజన కాలక్షేపాలలో తన్మయులై గానం చేసుకోవడం. సూర్యనారాయణ గారు వీపున మృదంగం కట్టుకుని ఘంటసాలను భుజంపై ఎక్కించుకుని భగవత్ సంకీర్తన జరుగుతున్న చోటుకు.. అది ఎంత దూరంలో ఉన్నా అక్కడకు వెళ్ళి తాను మృదంగం వాయిస్తూ ,పాడుతూ ఘంటసాల చేత నృత్యం చేయించేవారట. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ, పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు.
దురదృష్టం ఏంటంటే..ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ గారు మరణించారు. చివరి రోజుల్లో కుమారుడిని దగ్గరకు తీసుకుని ఆయన సంగీతం గొప్పదనాన్ని వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు.
చిన్నపటినుండీ మాష్టారుకి చదువుపై ఆసక్తిలేదు.ఆయన ధ్యాస ఎప్పుడూ పాటపైనే ఉండేది.
సంగీతం నేర్చుకోవడానికి ఆయన పడిన కష్టాలు:
అంతగా చదువుపై మక్కువలేక ఏదో ఓ విధంగా 9వ తరగతి పూర్తి చేసారట.మధ్యలో నాటకల్లో వేషాలూ వేసారట.ఇలా ఓ రెండేళ్ళు గడిచాయి.సంగీతం మీద ఇష్టం ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంది కానీ ఏమాత్రం తగ్గలేదు.సంగీతం నేర్చుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ జీవితాన్ని గడపాలనిఅనుకున్నారుట. అందుకే కృష్ణాజిల్లా మోపిదేవి మండలం లో ఉన్న పెద్దకళ్ళేపల్లి వెళ్ళారు అక్కడ ప్రఖ్యాత సంగీతవిద్వాంసులైనసుసర్ల దక్షిణామూర్తి గారి అబ్బాయి కృష్ణబ్రహ్మ శాస్త్రి గారి వద్ద శుశ్రూషలు చేస్తూ సంగీతం నేర్చుకున్నారు...గురువుగారి పిల్లల బట్టలుకూడా ఉతికిన రోజులు కూడా ఉన్నాయిట. కాని సంగీతం మాత్రం గీతాలదాకానే వచ్చిందట. ఇలా లాభం లేదనుకుని భీమవరం దగ్గర ఉన్న కుదరవల్లి గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఘంటసాల నాగభూషణం గారని ఒక వయొలిన్ విద్వాంసులుండేవారు...వారు వీరికి దూరపుబంధువు కూడా. ఆయనైనా శ్రద్ధగా సంగీతం నేర్పుతారేమో అని అనుకున్నారు...కాని వారింటికి వచ్చే పోయే వారి సేవే సరిపొయేదట. సంవత్సరం గడిచిందికానీ సంగీతం వర్ణాలు దాటలేదు..ఇక లాభం లేదని తండ్రి గారు చెప్పినట్లు విజయనగరం వెళ్ళి అక్కడైనా పట్టుదలగా నేర్చుకోవాలని చేతికి ఉన్న ఉంగరం అమ్మి ఎవ్వరికీ చెప్పకుండా ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల విజయనగరం చేరుకున్నారు మన మాష్టారు.
విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉన్నది. ఆ కళాశాలప్రిన్సిపాల్ద్వారం వెంకటస్వామి నాయుడుగారి అనుమతితో కొంత కాలం కళాశాలలోనే బసచేసారు. కాని అక్కడ ఉన్న కొందరు విద్యార్ధులు దొంగతనం నేరం మాష్టారిపై మోపడంతో కాలేజీ లోనుంచి వెళ్ళిపొమ్మన్నారు.నిలువనీడలేకదిక్కులేని వారయ్యారు.ఏదిక్కు లేనివాడికి ఆ దేవుడే గా దిక్కు అందుకే కళాశాలకు తూర్పువైపున్న ప్రవేశ మార్గానికి చేరువలో ఉన్న ఎల్లమ్మ గుడిలో కొంత కాలం తలదాచుకున్నారు.
ఇదిలా ఉండగా 1936 లో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పట్రాయని సీతారామ శాస్త్రిగారు విజయనగరం వచ్చారు. 1936లోనే ఘంటసాల కూడా విజయనగరం వెళ్ళారు.అంతా దైవ లీల కాకపోతే ఇంకేమిటి?
అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే ఆయనే అని చెప్పేవారు.
మాష్టారి గాత్రం విన్న వారు ముగ్ధులై కాలేజీ తెరిచేదాకా ఆగకుండా ఇంటివద్దనే సంగీతం నేర్పేవారు. 1936 నుండీ 1942 వరకు గురువుగారింట్లో బసచేసారు.అయితే సీతారామ శాస్త్రి గారు కూడా చాలాపేదవారు,అప్పటికే వారి భార్య కూడా మరణించారు. ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయారు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మధూకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడంనేర్పించాడు.భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవారు. మిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవారు.
వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరారు. మూడవ సంవత్సరం విధ్యార్ధి గాఉన్నప్పుడుమహారాజా వారి సింహచలం భోజన విధ్యార్ధి సత్రంలో సదుపాయం కుదిరింది.సత్రం లో భోజన సదుపాయం కుదిరాక విజయనగరం లోని మూడు కోవెళ్ళలో కొన్నాళ్ళు రాత్ర్లులందు పడుకునేవారు మన మాష్టారు.అక్కడ నల్లచెరువు మెట్ట ప్రారంభంలో ఉన్న నుయ్యిలో కాల కృత్యాలు తీర్చుకుని అక్కడచిన్నకొండపై వ్యాస నారయణ స్వామి ఆలయంలో సంగీత సాధన చేసేవారు.ఈవిధం గా ఎన్నో కష్టాలను,కన్నీళ్ళను సహించి,భరించి సంగీత సరస్వతి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలిగిన తపస్వి మన ఘంటసాల.
ఈ విధంగా విజయనగరం లో సంగీతం నేర్చుకుని ,సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవారు. రాజమండ్రీలో గోదావరి దగ్గర సినిమా షూటింగ్ అని తెలిసి పాడే వాళ్ళు కావాలేమో అని అక్కడికి వెళ్లారు.కాని వాళ్ళు రేపురా !ఎల్లుండిరా! అనేవారట.
1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నారు.పైగా ఆ రోజుల్లో వీరేశలింగం పంతులుగారు వితంతు వివాహాలను ఉదృతంగా ప్రోత్సహిస్తున్న రోజులవి...ఆ ఉద్యమ ప్రభావ కారణంగా ఓ వితంతువు ని వివాహం చేసుకుంటానని వారి తల్లి గారు రత్తమ్మ గారికి ఉత్తరం రాస్తే ఆవిడ భయపడి దగ్గర సంబంధం కుదిర్చి మేనకోడలు వరుస అయిన సావిత్రమ్మ గారితో మార్చి 3వ తేది 1944 లో మాష్టారి వివాహం జరిపించారు. పెళ్ళి రోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తారు.
అప్పటికే తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో సముద్రాల రాఘవాచార్యులు గారు(సముద్రాల సీనియర్) గారు పేరున్న కవి.వారిదీ ఘంటసాల గారి ధర్మపత్ని అయిన సావిత్ర్మ్ గారిదీ ఒకటే ఊరు.గుంటూరుజిల్లా రేపల్లె తాలుకాలోని పెదపులివఱ్ఱు. వీరు , సావిత్రమ్మగారి తండ్రిగారు చిరకాల మిత్రులు కూడా. వీరి వివాహానికి వచ్చిన ఆయన దంపతులని ఆశీర్వదించి,మాష్టారి పాట విని మద్రాసు రమ్మన్నారు.సినిమాలలో గాయకునిగా అవకాశాలకు ప్రయత్నిద్దాం అన్నారు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి 1944 మే నెలలో మద్రాసు బయలుదేరి వెళ్ళారు.
సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తన మకాం ను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చారు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవారు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవారు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందారు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరునాగయ్య,బి.ఎన్.రెడ్డిలుతమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్నిఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది. తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది.తర్వాత బాలరాజు,మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు.
సముద్రాల సీనియర్ గారి ఆశీస్సులతో,సిఫార్సులతో అంచెలంచెలుగా చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. మద్రాసు వెళ్ళిన కొత్తలో గ్రాం ఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా(హెచ్.ఎం.వి) లో పాడే అవకాశాల కోసంప్రయత్నించగావారు ఘంటసాల గారి గొంతుని ఆడిషన్ చేసి నీ గొంతు మైక్ కు పనికి రాదని పంపేసారట.ఆయన చాలా బాధపడి సముద్రాలగారితో చెప్పుకున్నారుట. తరువాత పేకేటి శివరాం గారి ద్వారా అవకాశాన్ని సంపాదించుకుని "గాలిలో నా బ్రతుకు" అనే పాటను"నగుమోమునకు నిశానాధ బింబము" అన్న పద్యాన్ని 1945లో (హెచ్.ఎం.వి) కి పాడారు. ఇది 1946లో విడుదలైన మాష్టారి మొట్టమొదటి ప్రయివేటు గ్రాంప్ఫోన్ రికార్ద్. తరువాత 1949లో నాగిరెడ్డి, చక్రపాణి గారి విజయా వారి సంస్థ తీస్తున్న షావుకారు సినిమాకి పూర్తి స్థాయిలో సంగీతం చేసే అవకాశం లభించింది. పలుకరాదటే చిలుకా లాంటి మధుర గీతాన్ని ఎంత అద్భుతం గా స్వరపరిచారో అనిపిస్తుంది.
1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి ఘంటసాల గాత్రం కాదా కారణం?? 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో మైలురాయిగా నిలిచిపోయింది. ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని ఎన్నో సార్లు నాగేశ్వర రావు గారు అన్నారు.1955లోవిడుదలైన అనార్కలిచిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో ఎప్పటికీ నిలిచిఉండేవి..1960లో విడుదలైన శ్రీవెంకటేశ్వరమహత్యంసినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పై చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నారు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.
సంగీత దర్శకునిగా షావుకారు , పాతాళభైరవి, మాయాబజా,ర్ గుండమ్మ కథ, లవకుశ, రహస్యం, గుడిగంటలు ఇలా ఎన్నో చిత్రాలు ఎంతో మంచి పేరు తెచ్చి పెడితే నేపధ్య గాయకుడిగా దేవదాసు, కన్యాశుల్కం, దొంగరాముడు,తోడికోడళ్ళు,డాక్టర్ చక్రవర్తి,ఇద్దరు మిత్రులు,అప్పు చేసి పప్పుకూడు,జగదేకవీరుని కథ,మూగ మనసులు,మంచి మనసులు,భక్త జయదేవ,మహాకవి కాళిదాసు,భక్తతుకారాం,పాండురంగ మహత్యం, ఆరాధన, ఆత్మబలం,ప్రేమనగర్,బంగారు బాబు ఇలా ఎన్నో వందల చిత్రాలలో ఎన్నో పాటలు పాడారు.
ఎన్నో సంవత్సరాలు సినీ పరిశ్రమలో పని చేసినా తన వ్యక్తిత్వాన్ని అలానే కాపాడుకున్నారు. అందరికీ అవకాశాలు రావాలని ఆకాంక్షించే మంచి మనిషి.సంగీతం ఒకరి సొత్తు కాదు ఒక్కొక్కళ్లకు ఒక్కో ప్రతిభ ఉంటుంది అనేవారు ఆయన.ఎంతో మంచి మనసు ఆయనది కుల మత భేదాలు లేని కారణం గా ఎవరి పక్కన అయినా కూర్చుని భోజనం చేసేవారు. మాష్టారికి డబ్బులూ లెక్కలు రాసే అబ్బాయి హరిజనుడైనా, ఆ అబ్బాయి మాష్టారి వారి ఇంట్లో ఆయన పక్కనే కూర్చుని భోజనం చేసేవాడట. అలానే ప్రసిద్ధ కవి జాషువా గారు ఓసారి మద్రాసు వచ్చినప్పుడు ఘంటసాల గారిఇంటికి వచ్చారట. కానీ లోపలకి రాకుండా వరండాలో కూర్చున్నారుట.ఆయన లోపలకి రావడానికి సంశయిస్తూ ఉంటే వారి చెయ్యి పట్టుకుని లోపలకి వచ్చి సకల మర్యాదలూ చేస్తూ ఉంటే వారు కన్నీరు పెట్టుకుని "ఎంత మహోన్నతమైన వ్యక్తి మీరు" అని మురిసిపోయారట.ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఆర్దిక సహాయం చేసారు. ఎంతోమంది వర్ధమాన గాయనీగాయకులకుఅవకాశాలు ఇచ్చారు.ఆయనను ఎంతో మంది మోసం చేసినా,కొంత మంది మాటలు నమ్మి సినిమాలు తీసి నష్టపోయినా ఎవ్వరినీ ఏమీ అనలేదు.ఎప్పుడు పారితోషకం పెంచమని ఎవ్వరినీ అడగలేదు.తక్కువ పారితోషకానికే ఎన్నో మంచి పాటలు పాడారు.
గుండమ్మ కథ పాటల రికార్డింగ్ కు వెళ్ళేటప్పుడు పాటలు బాగా రావాలని భార్యని దీవించమని అడిగే గొప్పమనసున్న, వ్యక్తిత్వం ఉన్న ధీమంతుడాయన.పేరు ప్రతిష్టలు ఆకాశాన్ని అంటినా కూడా గర్వం వారి కాలి గోటిని కూడా స్పృశించలేక పోయింది. ఎవరైనా మీరు చాలా అద్భుతంగా పాడతారండీ అంటే అదంతా భగవంతుని కృప నాయనా అని ఉదారంగా చెప్పేవారట.ఒక్కోసారి ఓ సినిమాలో అన్ని పాటలూ తానే పాడాల్సి వస్తే చాల బాధపడేవారట! ఎంత మంచి మనిషి??మాధవపెద్ది గారికి షావుకారు సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చింది మాష్టారే! అలాగే పిఠాపురం గారికి కూడా అవకాశాలు ఇచ్చింది వారే.రేలంగి గారి చేత, ఆఖరికి పద్మనాభం గారి చేత కూడా పాటలు పాడించారు.హాస్య పాత్రలకి ఓగొంతు,నటీనటులకి ఓ గొంతు,బ్యాగ్రౌండ్ పాటలకి ఓ గొంతు ఉండాలని అభిప్రాయ పడేవారట. ఎవరైనా డబ్బింగ్చెప్పమన్నా, నటించమన్నా ఒప్పుకునేవారు కాదు.మనం ఇంకొకరి పొట్ట కొట్టకూడదు అన్నది ఆయన సిద్దాంతం..అవును మరి ఆకలి విలువ ఆయన కన్నా బాగా ఎవరికి తెలుసు??రికార్డింగ్స్ లేనప్పుడు ఆర్కెష్ట్రా వారికి పని కలిపించాలన్న ఉద్దేశ్యంతో ఎన్నో సంగీత కచేరీలు చేసేవారు.ఆయన ఏమీ తీసుకోకుండా ఆర్కెష్ట్రా వారికి డబ్బులు ఇమ్మనేవారు.
ప్రతీ పాట కచేరీ ప్రారంభం ముందు"సంగీతము నేర్పి నన్ను ఇంత వానిగా చేసిన గురువులు శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారికి,జన్మనిచ్చిన నా తల్లి,నిరంతరము నా అభివృద్ధిని కోరే నా అర్ధాంగి సావిత్రి"అని ముగ్గురినీ తలచి కచేరీ ప్రారంబించేవారుట మాష్టారు.ఏ లౌకికమూ తెలియని అమాయక వ్యక్తి.సంగీతం తప్ప ఇంకేమీ తెలియని మనీషి.. పుట్టిన మొదలు మరణించేవరకూ ఎన్నో కష్టాలు కన్నీళ్ళు అనుభవించినా సాటి మనిషి కష్టాల్లో ఉన్నారంటే ఎంత అవసరం అయితే అంత సాయం చేసేవారు.భగవంతుడు కూడా మంచి వాళ్ళకే పరీక్షలు పెట్టి కష్టాలనిస్తాడు ఏమిటో మరి ఆ లీలలు??సామాన్యులమైన మనకి అర్ధం కావు...
ఇక ఆయన పాడిన భగవద్గీత తెలియని తెలుగువాడు ఉండడు .ఆ కృష్ణుడు నిజంగా గీత చెప్పినప్పుడు ఎంత మధురం గా చెప్పడో మనం వినలేదు కానీ మాష్టారి గీత విని తరిస్తున్నాం అనిపిస్తుంది.
నా పాట విని తమ సొంత మనిషిలా ప్రేమించే అసంఖ్యాక శ్రోతలే నాకు నిజంగా మిగిలిపోయే ఆఖరి బంధువులు.ఋణపడటం అంటూ ఉంటే ఆజన్మాంతం వారికే ఋణపడి ఉంటాను అంటూ తన జీవితకాలం అంతా పాటలకి, శ్రోతలకి అంకితం చేసిన మాష్టారు అనారోగ్యాన్ని చక్కెరవ్యాధి రూపం లో చాలాఅనుభవించారు. ఆ అనారోగ్యం కారణంగానే 1974వ సం.ఫిబ్రవరి 11వ తేదీన సంగీత సరస్వతి సానిహిత్యానికి శాశ్వతంగా వెళ్ళిపోయారు. "నాడు ఏతల్లి మొదటి భిక్ష నా జోలెలో వేసిందో ఆమె ఆ వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎప్పుడూ తన గతాన్ని మర్చిపోకుండా జీవించారు కాబట్టే భవిష్యత్ తరాల వారు ఆయన్ను ఇలా స్మరిస్తూనే ఉన్నారు ఉంటారు...
మాష్టారంత విద్య,విద్వత్తు ఉన్నవారు ఈరోజుల్లో కనుక ఉంటే పది తరాలకు మిగిలే అంత సంపాదన పైనే దృష్టి పెట్టేవారు.కానీ మాష్టారు ఆ చంద్రతారార్కం మిగిలిపోయే ఘనకీర్తి మాత్రమే సంపాదించుకున్నారు.అన్నిటికన్నా ముందు ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని దాన్ని బతికినంతకాలం కాపడుకున్న మహర్షి ఆయన.విలువలతో కూడిన జీవితాన్ని మనుషుల ఆదరాభిమానలచే గుణించుకుంటూ,దుఃఖాన్ని మనస్సులోనే భాగించుకుంటూ చివరి రోజుల్లో సాక్షాత్తు పరమాత్ముని వాక్కు అయిన గీతా గాన యజ్ఞం చేసి, ఎనలేని కీర్తిని మాత్రమే శేషంగా మిగుల్చుకుని పరిపూర్ణ జీవితాన్ని గడిపిన ధన్య జీవి,పుణ్యజీవి మన ఘంటశాల మాష్టారు.
భౌతికంగా ఈలోకంలో లేనప్పటికీ సుస్వరాల రూపంలో వారు ఎప్పుడు అమరజీవులే. వారిని, వారిపాటనూ అభిమానించే ప్రతీఆప్తునికీ మాష్టారి 94వ జయంతి శుభాకాంక్షలతో ఈ వ్యాసం అంకితం.
*****
No comments:
Post a Comment