హరి నామము - అచ్చంగా తెలుగు

హరి నామము 

రావి కిరణ్ కుమార్ 


సంకట శరముల తాకిడికి అలసిన  తనువును 
మదియు ఆర్తితో హరీ యని మొరపెట్టుకున్న పొంగు
వాత్సల్యామృత ధార బడలిక తీర్చిఆనంద సాగరమున
ఓలలాడిమ్ప వెన్నుని మది యది వెన్న సాగరంబు 
 అహంకారాగ్నుల విషజ్వాలలలో  చిత్తశాంతి తరుగు
వేళ హరి హరీ యన్న కురిపించు దయావర్షం నీల మేఘ
శ్యాము డతడు వాత్సల్య  భావమున భక్తి కుసుమాలు 
మొలకలెత్తించ  వెన్నుని మది యది వెన్న సాగరంబు 
వేల పడగల కామ కాళింది మానసంబు కల్లోల పరుచువేళ 
క్రిష్ణా  క్రిష్ణా యని పరధ్యానమున పలవరించినను చిరు మువ్వల   
సవ్వడులతో వాత్సల్య  తాండవమాడు కామ పడగలపై మానసంబు 
నిర్మల సరోవరంబు చేయగా  వెన్నుని మది యది వెన్న సాగరంబు 
దహించివేయు తనువు నెల్ల క్రోధమది మది కమ్ముకున్న వేళ 
దామోదరా యని తలవగలిగిన పొందవచ్చు సహన భూషణంబు  
ధరణీధరుడతడు వాత్సల్యమున భరియుంచు భారములెల్ల శాంతి
దరహాస చంద్రికలు పూయించగా వెన్నుని మది యది వెన్న సాగరంబు 
నాది నాది యనుచు వీడలేని మోహమున మది మూల్గువేళ  
నారాయణా యన్నచో మనది కాదన్న సత్యమెరుకపరచి నీది 
నీ దనుఁచు భగవతార్పితము చేయు బుద్ది నిచ్చు వాత్సల్యమున 
నిర్మోహమున మది తేటపరచ వెన్నుని మది యది వెన్న సాగరంబు 
******

No comments:

Post a Comment

Pages