జీవితం - అచ్చంగా తెలుగు

జీవితం

పి.వి.ఎల్.సుబ్బారావు

 

అనుభవాల పాఠశాల,
ఆనందాల పాకశాల ,
విడిచి వెళ్ళే పాంథశాల,
ఇహలోక శిక్షణశాల ,
ఈశ్వరమయ  యాగశాల,
ఉల్లాసాల విలాసశాల,
ఊహల  వలయశాల,
ఎరుక తెలిపే వేదశాల,
విలువల నాణల టంకశాల,
ఏడుస్తూ రావడం ,
ఐపోతూ పోవడం,
ఒంటరి ఒప్పందం,
ఓటమికి నిలదొక్కుకోవడం,
ఔచిత్యం సాధించడం ,
తిరిగిరాని క్షణం,
తీర్చుకోవలసిన ఋణం.
కాలంలో పుట్టడం, కలవడం,
ఖడ్గంతో వివేకపోరాటం,
దహనం వరకు అనుగమనం,
తెలియకుండా పగిలేఘటం, 
మేఘంలా చంచలం,
చివరివరకు చదవడం,
జననంతో ప్రారంభం,
వదలని జంజాంటం ,
మధురస్మృతుల ఝరి,
నమ్మకాలు వమ్ముచేసే టక్కరి,
నమ్మించి మోసం చేసే తుంటరి,
ఠలాయించడం తప్పదు మరి,
డబ్బు సంపాదిస్తే సరి,
ఢక్కాముక్కీకి సొగసరి,
తపస్సుతో పురుషార్థ సాధనం,
దయాగూణ నిరంతర ప్రదర్శనం.
కంచికి చేరని కథ,
కాలంతో మారని వ్యథ,
ధర్మం జీవితాంతం పాటించడం,
ప్రేమించడమే కాదు , ప్రేమించబడటం,
సేవించడానికి జీవించడం,
తత్త్వం తెలిస్తే నశ్వరం,
క్షణం ఆగని పరుగు,
కెరటాల మీది నురుగు,
అవ్యక్త మధురఫలం,
దైవమిచ్చిన దివ్య బహుమానం,
అనుక్షణం మహాభండనం,
సదా మురిపించే నవ్యమండనం,
తప్పక నిర్వహించవలసిన యజ్ఞం,
తెలిచికోవలసిన పరమరహస్యం,
తెలిసికొంటే ఱెప్పపాటు.
తెలివిలేకుంటే భంగపాటు.
నిర్దేశించిన చేరుకోవాల్సిన లక్ష్యం,
అనేక పూర్వజన్మల సుకృతాల వరం,
విజయ సాధనకై శపథం,
తీర్చిదిద్దుకున్నవారికి షాద్గుణ్యం,
అంతర బాహ్యశుచి,
సర్వదా నిబద్ధతే అభిరుచి,
చివరిక్షణం వరకు సహనం,
చివరిగా విడిచి వెళ్ళిపోయేటపుడు చేసే దరహాసం.
****

No comments:

Post a Comment

Pages