మానసిక ఒత్తిడి
బి.వి.సత్యనగేష్ (ప్రముఖ మానసిక నిపుణులు )
మానసిక ఒత్తిడి లేని వారెవరైనా వుంటారా అని ప్రశ్నించుకుంటే వుండరనే సమాధానం వస్తుంది. మానసిక ఒత్తిడి అనేది మన జీవితంలో ఒక భాగం అని మనం ఒప్పుకోవాలి.ఎటువంటి లక్ష్యాలు లేని వారు కూడా అపుడపుడు మానసిక ఒత్తిడికి గురౌతూ ఉంటారు. వారికి కావలసినది దొరకనప్పుడు ఒత్తిడికి గురౌతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఒత్తిడిని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి అనే విషయాన్ని వేరు వేరు కోణాల్లో చూద్దాం.
మనిషికి బ్లడ్ ప్రెషర్ ఉండాలి. అది ఉంటేనే రక్తప్రసరణ జరుగుతుంది. బి.పి. ఎక్కువైనా తక్కువైనా కష్టమే. ప్రపంచంలో ఎక్కడైనా నార్మల్ బి.పి. ని 120/80 గా చెపుతారు. ఈ మోతాదు మించినా, తక్కువైనా అనేక సమస్యలకు దారి తీస్తుంది. కాని మానసిక ఒత్తిడికి నార్మల్ మోతాదు అంటూ ఏమి లేదు. ఎందుకంటే ఒత్తిడి అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశం. కొంతమంది విషయంలో చిన్న విషయాలకు కూడా ఒత్తిడిని గమనించవచ్చు. మరి కొంతమంది విషయంలో పెద్ద సమస్యలు ఎదురైనపుడు కూడా ఒత్తిడిని గమనించం. చాలా ప్రశాంతంగా ఉంటారు. అందువల్ల మానసిక ఒత్తిడికి బి.పి లాగా యునివర్సల్ రేటు అంటూ ఏమి లేదు. కనుక ఒత్తిడి పూర్తిగా మానసికమైనదే కాబట్టి ఒత్తిడి నుంచి సమస్యలు రాకుండా చూసుకోగలం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మానసిక ఒత్తిడి అనేది ఒక ప్రమాదకరమైన సమస్య. ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మానసిక ఒత్తిడి కూడా ఒకటిగా చేర్చారు. ఎయిడ్స్, క్యాన్సర్, హెపిటైటిస్- B గుండెపోటు లాంటిదే మానసిక ఒత్తిడి కూడ అంటున్నారు. ఒత్తిడిలో రెండు రకాలు. 1. ACUTE 2. CHRONIC . మొదటి రకమైన ACUTE ఒత్తిడి గురైన వారు చాలా అలజడి, ఆందోళన, అసహానం కొద్ది సమయం పాటు మాత్రమే ప్రదర్శిస్తాయి. ఈ కొద్ది సమయం తర్వాత మళ్ళీ మాములుగా ప్రవర్తిస్తారు. రెండవరకమైన CHRONIC ఒత్తిడికి గురైన వారు ఎప్పుడూ చికాకుగా ఉంటూ నిరుత్సాహంగా శక్తిహీనుడిలా ప్రవర్తిస్తూ వుంటారు. ఈ రెండింటిలో మొదటిరకం కన్నా రెండవరకం ఒత్తిడి ఎక్కువ ప్రమాదకరమైనది. ఎందువల్ల నంటే ... మొదటిరకంలో స్ట్రెస్ హార్మోన్లు ఒక్కసారిగా విడుదలై నప్పటికీ తర్వాత శరీరం సతుల్యం (HOMEOSTASIS) చేసుకుంటుంది. రెండవరకంలో స్ట్రెస్ హార్మోన్లు అదేపనిగా, నిర్విరామంగా విడుదలౌవడం వలన శరీరంలో సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్ల రెండవరకం ఒత్తిడి కారణంగా అనేక శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నమౌతాయి.
ఇక కొన్ని ఉదాహరణను, నివారణోపాయాలనూ చూద్దాం. ఒత్తిడి పూర్తిగా మానసికమైనదే. ఒక వ్యక్తి ఒక పరిస్థితిని ఒక విధంగా అర్ధం చేసుకుంటాడు. అదే పరిస్థితిని వేరొక వ్యక్తి వేరే విధంగా అర్ధం చేసుకుంటాడు. దీనినే PERCEPTION అంటారు. అంటే మనకు అర్ధమయ్యే తీరు, ఆలోచించే తీరు అని అర్ధం. ఒక ఉదాహరణను తీసుకుందాం. మనం ఎక్కవలసిన రైలు బయలుదేరే సమయం దగ్గరపడుతున్నపుడు మనం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కు పోయిఉంటే ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఒకేరకంగా ఆలోచించరు. ముఖ్యముగా మూడు రకాలుగా ఆలోచిస్తారు. అవేంటో చూద్దాం.
1. IF (ఒకవేళ అలా జరిగితే) 2. IF NOT (ఒకవేళ అలా జరగపోతే) 3. SO WHAT?(అయితే ఏంటి) ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న ప్రదేశం నుంచి రైల్వే స్టేషన్ కు 15 నిముషాల్లో చేరగలుగుతామనుకుందాం. చేరడానికి 30 నిముషాల సమయం వుంది. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియటం లేదు . పైన వివరించిన మూడు రకాలుగా ఆలోచిద్దాం.
IF (ఒకవేళ): ట్రాఫిక్ 5 నిముషాల్లో క్లియర్ అయి 15 నిముషాలు ప్రయాణం చేస్తే మొత్తం 20 నిముషాల్లో రెయిల్వే స్టేషన్ కు చేరిపోవచ్చు. పది నిముషాల ముందే చేరిపోతాం. కనుక ఒత్తిడి పెంచుకోనవసరం లేదు.
IF NOT:ఒకవేళ 30 నిముషాల్లో చేరలేం ప్రత్యామ్నాయం ఏంటి? తదుపరి స్టేషన్ లో రైలును అందుకోగలమా? రైలు మిస్ అయితే తదుపరి రైలు ఎన్ని గంటల కుంది? రైలు లేకపోతె బస్సు లో వెళ్లగలమా? ఇవి IF NOT పద్దతిలో ఆలోచించే విధం.
SO WHAT?: ఒకరోజు ఆలస్యంగా వెళ్తే నష్టముందా? రైల్వే స్టేషన్ కు వెళ్లిన తరువాత రైలు మిస్ అయితే అపుడు ఆలోచిద్దాం. ప్రయాణం మానుకుంటే ఏమవుతుంది? ఇవి SO WHAT లో ఆలోచించే విధం.
ప్రయాణం వున్నపుడు ముందుగానే బయలుదేరితే ఈ కష్టాలన్నీ వుండవు. ఒకవేళ కష్టాలొస్తే మనం ఒత్తిడి పెంచుకోకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకునే పద్ధతిని అవలంభించాలి. మానసిక ఒత్తిడిని జయించడానికి ఈ క్రింది సూచనలు బాగా ఉపకరిస్తాయి.
శారీరక వ్యాయామం, మానసిక ప్రశాంతతకు రిలాక్సేషన్ ఎక్సర్ సైజ్ , పాజిటివ్ థింకింగ్ , ఒక హాబీని అభివృద్ధి చేసుకోవడం, టైం మేనేజ్మెంట్ , మంచి ఆహారపు అలవాట్లు , రోజుకు కనీసం ఆరుగంటల నిద్ర, వారానికి ఒకసారైనా కుటుంబ సభ్యులతో బయటకెళ్ళడం, తృప్తిగా వుండే మనస్తత్వం వృద్ధి చేసుకోవటం, సంవత్సరానికి ఒకసారి లేదా అవసరమైనపుడు మెడికల్ చెకప్ చేయించుకోవడం. ఈ విధంగా చెయ్యడం వలన రెండవ రకమైన CHRONIC TYPE మానసిక ఒత్తిడి కి గురి కాకుండా ఉండడం.
మానసిక ఒత్తిడి నివారణలో RED TRIANGLE అనే పద్దతి కూడా చాలా ప్రాచూర్యం పొందింది. ఈ పద్ధతిని క్రింది బొమ్మలో వివరంగా చూద్దాం.
‘R’అంటే రిలాక్సేషన్,’E’ అంటే ఎక్సర్ సైజ్,’D’ అంటే డైట్ ,(ఆహారం),’T’ అంటే థింకింగ్. ఈ నాలుగు విషయాలపై శ్రద్ధ పెడితే మానసిక ఒత్తిడికి దూరం, సంతోషానికి దగ్గర అవుతాం. అంతకంటే కావలసిందే ముంటుంది! 'సంతోషం సగం బలం' అన్నారు పెద్దలు.
No comments:
Post a Comment