నా నడక మా ఉషదే ! - అచ్చంగా తెలుగు

నా నడక మా ఉషదే !

(మా బాపట్ల కధలు -9)

భావరాజు పద్మిని


జీవితం అనేక జ్ఞాపకాల, అనుభూతుల సమాహారం. కొన్ని జ్ఞాపకాలు నీటి అలలమీద తెలినురగలా క్షణాల్లో మాయమైపోతాయి. కొన్ని జ్ఞాపకాలు తొలకరి జల్లులా కురిసి, మనిషిని, మనసుని మధురంగా తడిపేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు గుండెల్లో ముళ్ళలా గుచ్చుకుని గుర్తొచ్చినప్పుడల్లా బాధిస్తూనే ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు మనలో పట్టుదల పెంచి, జీవితంలో ఏదైనా సాధించేలా ప్రేరణనిస్తాయి. కాని... తన జ్ఞాపకం... నన్ను అడుగడుగునా వెంటాడుతుంది. ‘నీ నడక బాగుంది... నీ నడకలో ఒక రాజసం ఉంది... సామజవరగమనా...’ అంటూ ఎవరు ఎలా పోల్చినా నాకు తనే గుర్తొస్తుంది. తనే నా చిన్ననాటి నేస్తం ఉష...
*******
బాపట్లలోని ఎస్.ఎం.జి.హెచ్ బాలికోన్నత పాఠశాలలో పదవతరగతిలో ఆ రోజే కొత్తగా చేరాను. ఆ పాఠశాల నాకు ఆశ్చర్యం కలిగించింది. విద్యార్దినులంతా నేల మీదే కూర్చున్నారు. కనీసం బెంచీలు కూడా లేవు. ఒక మూల ఖాళీ చూసుకుని, కాస్త బెరుగ్గా ఒదిగి కూర్చున్నాను.
‘నీ పేరేంటి, కొత్తగా వచ్చావా?’ పలకరించింది, తెల్లగా చక్కటి నవ్వుతో ఉన్న ఒకమ్మాయి.
‘నా పేరు పద్మిని, ఇవాళే చేరాను, నీ పేరు ?’
‘నా పేరు ఉష. వరమ్మ గారి వీధిలో మా ఇల్లు. నువ్వెక్కడ ఉండేది?’
‘మేము శిఖరం వారి వీధిలో కరణం గారి ఇంటి ఎదురుగుండా ఉంటాము. అక్కడే మా బామ్మా వాళ్ళ పెద్ద మేడ ఉంది. మా తాతగారు కృష్ణమూర్తి గారని, ఈ ఊర్లో పెద్ద క్రిమినల్ లాయెర్. అనుకోకుండా పోయిన ఏడాది ఆయన కాలం చెయ్యడంతో, బామ్మ ఒంటరిది అయిపోయిందని, నాన్నగారు అమ్మని, ముగ్గురు పిల్లల్ని ఇక్కడికి పంపారు. బామ్మ ఇంటి వెనకాల మా ఇల్లు కూడా ఉందిలే. ‘
‘ఓహ్... శిఖరం వారి వీధంటే మాకు చాలా దగ్గర, మీ మేడకి తిన్నగా వచ్చి నాలుగిళ్ళు దాటితే చిన్న అడ్డ వీధి వస్తుంది. అక్కడే మా ఇల్లు. రోజూ నువ్వు వెళ్లేముందు ఆ సందు దగ్గరే ఆగు, కలిసెళ్ళి, కలిసొద్దాము, సరేనా ?’
‘అలాగే’ అన్నాను, కొత్త నేస్తం దొరికిందన్న సంబరంలో. ఈలోగా మరికొన్ని పరిచయాలు అయ్యాయి. బడి ఒదిలాకా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళసాగాము. అప్పుడు పరిశీలనగా చూసాను, తను అప్పటికే ఐదడుగుల పైనుంది, చక్కటి సౌష్టవం, తెల్లటి మేనిఛాయ, చూడగానే మళ్ళీ చూడాలనిపించే నవ్వు.  ఆ స్కూల్ యూనిఫారం లో షూస్ లేవు కనుక  చిన్నపాటి హీల్స్ వేసుకుంది. వాటిమీదే చాలా అందంగా నడుస్తోంది. నడకకు నడుము లయబద్ధంగా అటూ ఇటూ కదులుతోంది. ఆ కదలికకి పొడవాటి వాలుజడ అటూ ఇటూ ఊగుతూ శృతి కలుపుతోంది. కావ్యనాయికల వర్ణనల లాగా, ఆ నడకలో అదేదో రాజసం కనిపిస్తోంది.
‘నీ నడక చాలా బాగుంది. నేను సన్నగా ఉండడంతో, చిన్నప్పటి నుంచి పుస్తకాల బాగ్ బరువు మోసీ, మోసీ కాస్త వంగి నడవడంతో, అంతా నాది కొంగ నడక అంటారు,’ అన్నాను కాస్త బాధగా.
‘ఏం పర్లేదు. అదెంత పని, కాస్త ప్రయత్నిస్తే నువ్వూ నాలా నడక మార్చుకోవచ్చు. అడుగులు వేసేటప్పుడు ఒకదానిపక్కన ఒకటి కాకుండా, ఎడమ పాదం ముందుకి కుడిపాదం, కుడిపాదం ముందుకి ఎడమ పాదం పడేలా నడువ్. ఇవాల్టికి ఇవాళ నీ నడక మారకపోవచ్చు, కాని అలవాటైపోతే అదే వచ్చేస్తుంది,’ నవ్వుతూ అంది ఉష. అప్పుడే తన కళ్ళలోకి చూస్తూ ఒక విచిత్రమైన సంగతి గమనించాను.
‘అలాగే, అదేంటి నీ ఎడమ రెప్ప అలా ఉండుండి, గమ్మత్తుగా పడిపోతోంది ఉషా ? ఇలా చూస్తుంటే నువ్వు నాకు కన్ను గీటినట్టు ఉంది.’ అంతగా చనువు లేదని తెలిసినా గబుక్కున అనేసాను ఆటపట్టిస్తూ.
‘అదంతేలే, చిన్నప్పటినుంచి, దాని మీద నా మెదడు అదుపు లేదట, డాక్టర్ చెప్పారు. నువ్వనుకుంటే పర్లేదులే, కుర్రాళ్ళు ఎవరూ అనుకోకూడదు.’ అంది, తనూ సరదాగా తీసుకుని నా భుజమ్మీద చనువుగా చెయ్యేస్తూ.
‘నీకో సంగతి తెలుసా, ఈ సృష్టిలో అందమైన ప్రతి దానికి, దిష్టి తగలకుండా దేవుడు ఒక చిన్న మచ్చ పెడతాడట . అంత అందమైన చందమామలో కూడా మచ్చ ఉంది కదా ! అలాగే కుందనపు బొమ్మలాంటి నీకు దిష్టితగలకుండా నీ కంటి రెప్పను దేవుడు ఇలా పెట్టాడేమో ! ‘అన్నాను. అప్పటికే ఇద్దరం ఉష ఇంటి సందుకి చేరుకున్నాము.
‘అబ్బో, కవితాత్మకంగా మాట్లాడుతున్నావే ! సరే, మా ఇంటికి రాకూడదూ, ఓసారి’ అంది ఉష.
‘కాస్త స్నానం చేసి, తయారయ్యి సాయంత్రం వస్తాలే. అయిపోయిన క్లాస్సుల నోట్స్ కూడా తీసుకోవాలి నీదగ్గర.’ అని తనదగ్గర సెలవు తీసుకుని, ఇంటికి వెళ్లాను.
సాయంత్రం ఉష ఇంటికి వెళ్లేసరికి, తను కాలిన చేతికి మందు రాసుకుంటూ కనిపించింది.
‘అరె, ఏమైంది ఉషా, చెయ్యెలా కాలింది? మీ అమ్మగారు ఇంట్లో లేరా ?’ అని అడిగాను. తన కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
‘అమ్మ ఇంట్లోనే కాదు, ఇలలోనే లేదు, అందుకే రాత్రికి వంట చేస్తుంటే చెయ్యి కాలింది.’ అంది ఆమె విచారంగా.
‘ఏంటి, నీకు అమ్మ లేదా ? ‘ నాకొక నిముషం మాట రాలేదు. ఆడబిడ్డకు చిన్న వయసులో తల్లి లేకపోవడం కంటే గొప్ప కష్టం ఉంటుందా ? పాపం ఉష...
‘నువ్విందాక అన్నావే. అందమైన వాటికి దిష్టి చుక్కలా ఓ మచ్చ ఉంటుందని. కాని, నాకెందుకో చాలానే ఇచ్చాడే దేవుడు. మా అమ్మ నాకు ఊహ తెలిసేసరికే మంచాన పడి, కృంగి కృశించి చచ్చిపోయింది. పోయేముందు మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటానని, నా దగ్గర మాట తీసుకుంది. మా అమ్మ మీదే ప్రాణాలు పెట్టుకున్న మా నాన్న అమ్మ చనిపోవడం తట్టుకోలేక తాగుడుకి అలవాటు పడ్డారు. రాత్రి తాగేసొచ్చి ఒక్కోసారి కొడతారు కూడా. కాని పొద్దున్న లేచి, కొట్టినందుకు బాధపడతారు.’
తను చెప్పేవి వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
‘పొద్దున్నే లేచి, ఇల్లు సర్ది, నాన్నకి కాఫీ ఇచ్చి, నేను పాలు తాగి, పనమ్మాయితో పాచిపని చేయించి, స్నానం చేసి, దీపం పెట్టి, జడేసుకుని, టిఫిన్ చేసి, తిని, లంచ్ బాక్స్ సర్దుకుని వస్తాను. మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే పనులన్నీ చేసుకుని, చదువుకుంటాను. మధ్యలో ఏమైనా ఇంటికి కావలసిన కూరలు, సామాన్లు తెచ్చుకోడం లాంటి పన్లు కూడా ఉంటాయి, నాన్న డబ్బులిచ్చి వెళ్తారు. ఇదంతా నాకు అలవాటైపోయింది. నువ్వు బాధపడకు. ఇంతకీ నీకు ఏం నోట్స్ కావాలి?’
నెమ్మదిగా తేరుకుని, నాకు కావాల్సినవి అడిగి తీసుకుని బయల్దేరాను. కాలంతో పాటు ఉషతో నా బంధం కూడా బలపడింది. తనకు అమ్మలేదని, మా అమ్మ, బామ్మ ప్రత్యేకంగా తనను ఆదరించేవారు. తను ఎక్కడికి వెళ్ళాలన్నా, మా ఇంటి ముందునుంచే వెళ్ళాలి కనుక నేనూ తోడొస్తానేమోనని క్రింద నుంచి పిలిచి తీసుకుని వెళ్ళేది. ఇంటి వేడుకలలో పాల్గొంటూ, కార్తీకమాసం ఉదయమే దీపం పెట్టేందుకు గుడికి మాకూడా వస్తూ, ఎప్పుడైనా చెక్కరిక్షా ఎక్కి సముద్రానికి వెళ్ళినప్పుడు తనూ మా అక్కచెల్లెళ్ళతో సరదాగా కబుర్లు చెప్తూ, ఒకరకంగా ఉష  మా కుటుంబంలో ఒక సభ్యురాలు అయిపొయింది. కలిసి తినేంత, చదువుకునేంత, పడుకునేంత, అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకునేంత చనువది.
మొత్తానికి ఉష లాగా నడవాలని నేను ప్రయత్నించి సఫలమయ్యాను. పదవ తరగతి తర్వాత, మా కుటుంబం తెనాలికి మారిపోయింది. మధ్య మధ్య బాపట్ల వెళ్ళినప్పుడు ఉషను కలిసేదాన్ని. నేను డిగ్రీలో చేరినప్పుడు, తనూ డిగ్రీలో చేరిందని తెలుసుకున్నాను. తను బాగుందని, బాగా చదువుతోందని సంతోషించాను. ఆ తర్వాత  నాకు ఎం.ఎస్.సి కెమిస్ట్రీ సీట్ మా సొంత ఊరైన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలోనే రావటంతో బామ్మతో పాటు బామ్మ ఇంట్లోనే ఉంటూ చదువుకున్నాను. అప్పట్లో చదువు భారం వల్ల అంత ఎక్కువగా కుదరకపోయినా వీలున్నప్పుడు వెళ్లి, ఉషను కలిసేదాన్ని. తను డిగ్రీ పూర్తయ్యి, ఇంట్లో ఉన్నానని, పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది.
నా పి.జి అయ్యాకా, కొన్ని నెలల పాటు కంప్యూటర్ కోర్స్ లు చేసేందుకు గుంటూరులో ఉన్నాను. అప్పుడే నాకు పెళ్లి కుదిరింది. తాంబూలాలు బాపట్లలో మా సొంత ఇంట్లోనే తీసుకోనున్నారు. ఈ వేడుకకు నా చిన్ననాటి నేస్తం వస్తే ఎంత బాగుండో కదా, అనిపించి, తనను పిలిచేందుకు వెళ్లాను. వాళ్ళ ఇంటికి తాళం వేసుంది. ఆ వెనకింట్లో ఇదివరలో మా ఇంట్లో అద్దెకున్న లక్ష్మి ఆంటీ ఉన్నారు. ఆవిడని అడిగేందుకు వెళ్లాను.
‘ఆంటీ, నా పెళ్లి కుదిరింది, ఉషను పిలవాలని వచ్చాను. ఉష లేదా?’
అవతలి వైపు మౌనం... ఉండమ్మా, కాసిన్ని మంచినీళ్ళు తెస్తాను... అంటూ లోనికి వెళ్ళింది ఆంటీ. నేను నీళ్ళు తాగాకా నెమ్మదిగా చెప్పింది...
‘చూడమ్మా, చిన్నపిల్లవు, ఎలా చెప్పాలో తెలియట్లేదు. నిమ్మళంగా గుండె దిటవు చేసుకుని విను. ఉష ఉరేసుకుని చచ్చిపోయిందమ్మా’
ఒక్కసారి పిడుగేదో తలమీద పడ్డట్టు కొయ్యబారిపోయాను. అలాగే బొమ్మలా చెబుతున్న ఆమె వంక చూస్తూ ఉన్నాను.
‘పాపం తల్లిలేని బిడ్డ. ఎవరో పెళ్ళైన కుర్రాడు ప్రేమ పేరుతో మోసం చేసాడు. తల్లి అండ లేక, మోసాన్ని దిగామింగలేక, ఎవ్వరికీ చెప్పుకోలేక లోలోపల ఎంత బాధపడి ఉంటుందో... ఎంతగా కృంగిపోతే ఇలా చేసి ఉంటుందో... ఈ అవమానం తట్టుకోలేక, వాళ్ళ నాన్న ఊరొదిలి వెళ్ళిపోయారు.’
నాకు నిల్చున్న చోటే భూమిలోకి దిగబడిపోయినట్లు అనిపిస్తోంది. యాంత్రికంగా లేచి అడుగులు వేద్దామంటే అడుగులు పడవే ! అడుగు అడుగులో, నాకు కొత్త నడక నేర్పిన ఉషే జ్ఞాపకం వస్తోంది.
“నాకెందుకో చాలా మచ్చలే ఇచ్చాడే దేవుడు....” ఉష గొంతే చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది.
నా మనసులో సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు ! ‘పితృ శాపం అనాలా? పూర్వ జన్మల పాపం అనాలా? ఎందుకిలా జరిగింది? ఎందుకని కొన్ని కలలు, కళ్ళ వాకిళ్ళు దాటకుండానే కన్నీరై కరిగిపోతాయి? ఎందుకని కొన్ని జీవితాల ఆశలు, రెక్కలు తొడగకుండానే తెంచబడతాయి? సుఖమంటే తెలియకుండా ఉష జీవితం అర్ధాంతరంగా ఎందుకిలా ముగిసిపోయింది? ఉషా... ఎందుకిలా చేసావు? ఎందుకు నన్ను వదిలి వెళ్లావు?’ మనసు మూగగా రోదిస్తోంది.
ఆ మనిషి, ఆ నవ్వు, ఆ మరపురాని స్నేహం, అలవోకగా వాలిపోయే ఆ కంటి రెప్పే గుర్తొస్తున్నాయి... ఉషా ! నీ ఆత్మకు శాంతి కలగాలి. మళ్ళీ జన్మంటూ ఉంటే, నువ్వు ఏ శ్రీమంతుల ఇంట్లోనో మహారాణిలా వైభవంగా పుట్టి పెరుగుతుంటే చూసి, మురిసిపోవాలి. మళ్ళీ నీ నేస్తంగా పుట్టే అదృష్టం కావాలి.... తూనిగల్లా ముసిరిన భావాలు ఎంతోకాలం నన్ను వేధించాయి.
నెమ్మది, నెమ్మదిగా ఉష లేదన్న కటువైన నిజాన్ని నా మనసు జీర్ణించుకుంది. కాని, ఇప్పటికీ అడుగువేసినప్పుడల్లా ఉషే గుర్తొస్తుంది. నిజమే... కొన్ని జ్ఞాపకాలు నీటి మీద రాతల్లా చెరిగిపోతే, మరికొన్ని రాతిమీద నీటిజాడల్లా  మనోఫలకంపై ఎప్పటికీ చెరగని బలమైన ముద్ర వేస్తాయి. ఉష నా జీవితంలో అటువంటి ఓ మరపురాని జ్ఞాపకమే !
***
(ఇదొక యదార్ధ గాధ. ఈ కధను దైవ సన్నిధికి చేరిన నా ఆత్మీయ స్నేహిత ఉషకే అంకితం ఇస్తున్నాను.)

No comments:

Post a Comment

Pages