నాచన సోమనాథుడు - అచ్చంగా తెలుగు

నాచన సోమనాథుడు  

బాలాంత్రపు వేంకట రమణ

Ramana_84@yahoo.com

Mobile: 95731-70800.


నాచన సోమనాథుడు  అనగానే మనకి చప్పున గుర్తుకొచ్చే పద్యం :
అరిజూచున్ హరిఁ జూచుఁ జూచుకములం దందంద మందారకే
సరమాలా మకరంద బిందు సలిలస్యందంబు లందంబులై
తొరుగం బయ్యెద కొంగొకింతఁ దొలఁగం దోడ్తో శరాసారమున్
దరహాసామృత పూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్
ఈ పద్యం నాచన సోమనాథుడు రచించిన “ఉత్తరహరివంశము” లో సత్యభామ నరకాసురునితో యుద్ధం చేస్తున్న ఘట్టంలోనిది.  ఆమె శ్రీకృష్ణుని ప్రక్కనే ఉండి యుద్ధం చేస్తోంది. దూరంగా ఉన్న శత్రువుని (అరిన్),  రోషంగా  చూస్తోంది. ప్రక్కనే ఉన్న హరిని ప్రేమ ధృక్కులతో చూస్తోంది.  ఆమె  స్తనాగ్రభాగాలమీద (చూచుకములన్) అక్కడక్కడ మందార పుష్పమరందము  చెమట బిందువులతో కలిసి అందంగా భాసిస్తోంది.  అప్పుడప్పుడు  తొలగుతున్న పైటని చేతితో సర్దుకుంటోంది.  అటు నరకునివైపు,  బాణపరంపరల్ని (శరాసారమున్) గుప్పిస్తోంది.  ఇటు  భర్తవైపు అమృతమయమైన చిరునవ్వులూ చిందిస్తోంది.  దరహాసామృత పూరముం గురియుచున్.   ఇదంతా  ఆమె ఒక ఆటలాగ  (కేళీ గతిన్) చేస్తోంది.
ఈ ఘట్టం రౌద్రశృంగార రసాల కలయిక.  రౌద్ర శృంగార రసాలు విరోధి రసాలు.   రెంటికీ పొసగదు.  కానీ ఈ రెండు రసాల్నీ ఏక పద్యంలో  అధ్భుతంగా  గుప్పించిన ఒక మహాకవి యొక్క ప్రఙ్ఞ ఇక్కడ మనం చూస్తున్నాం.
అరిన్ జూచున్, హరిన్ జూచున్ యమకం. చూచున్ - చూచుకములన్ – మళ్ళీ  యమకం. తరవాత సమాసమంతా – మందార కేసర మాలా మకరంద బిందు సలిలస్యందంబులై - "అందంద"  అనే అక్షరాలు  మాటిమాటికీ రావడం వృత్త్యనుప్రాస. ఈ  యమకం  వృత్యనుప్రాసలతో కూడిన పద్యం చదివేసరికి మనస్సు ఆనందడోలికల్లో విహరిస్తుంది.   వినేవారికి శ్రవణ పేయంగా ఉంటుంది.  ఆహా!  అనిపిస్తుంది.
ఇంత అందమైన  పద్యాలు నాచన సోమన కవిత్వంలో కోకొల్లలుగా కనిపిస్తాయి.    కవిత్రయం – నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న – వ్యాస భారతాన్ని తెనుగీకరించే క్రమంలో  తెలుగు భాషకి ప్రాణ ప్రతిష్ఠ చేసారు, అందునా ముఖ్యంగా తిక్కనని చెప్పుకోవాలి.  “ఒకవిధముగా చెప్పవలెనన్న తిక్కన తెలుగు భాషను సృష్టి చేసినాడని చెప్పవలెను” అన్నారు విశ్వనాథ వారు. ఆంద్ర మహాభారతం విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వందాకా పదిహేను పర్వాలలో, 16,617 పద్య-గద్యాల్లో మహానుభావుడు  తిక్కనగారి  ఆ పని చేశారు.  కవిత్రయం   తమ రచనలో ఆధ్యాత్మిక భావనకి తత్వబోధనకీ  అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కవిత్రయం యొక్క శైలికి భిన్నంగా పద్యరచనకి శ్రీకారం చుట్టినవాడు నాచన సోమనాథుడు. అందుకే ఆయన నవీన గుణసనాథ, సంవిధాన చక్రవర్తి అనిపించుకున్నాడు. తెలుగు భాష అందానికి మెరుగులు దిద్దిన వాడు,  తెలుగు పద్యాన్ని అందంగా తీర్చి దిద్దడం అనే కళను మొదలుపెట్టినవాడు  నాచన  సోమన ఆని పెద్దలు అంటారు.   ఈ కళ శ్రీనాథుడి యందు మహా వృక్షం అయ్యి పెద్దనాదులయందు ఫలించింది ఆని చెప్పవచ్చును.
సహజ పండితుడిగా ప్రఖ్యాతి వహించిన పోతనామాత్యుడికి ఇద్దరు మహా కవుల పట్ల ఆరాధ్య భావం. మెండుగా ఉంది.  ఒకరు ఎర్రాప్రగడ, రెండో వారు నాచన సోమనాథుడు.  ఈ ఇద్దరు కవుల యొక్క  శైలి ప్రభావం పోతన గారి కవిత్వం లో కనిపిస్తుంది. నక్షత్రాలన్నీ స్వయం ప్రకాశాలే అయినా, ఒక నక్షత్రం ప్రభావం మరొక నక్షత్రం మీద పడినట్లు.
ఇందాకా మనం జ్ఞాపకం చేసుకున్న “అరి జూచున్, హరిజూచున్...” అనే పద్యం పోతన గారికి ఎంత నచ్చిందంటే, ఆయన  “భాగవతం” లో “నరకాసుర వధ”  ఘట్టంలో ఇలా వ్రాసుకున్నాడు.
పరుజూచున్ వరుజూచునొంపనలరింపన్ రోషరాగోదయా 
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం, గన్నుల గెంపు సొంపు బరగం, జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెరపుచుం, జంద్రాస్య హేలాగతిన్ !
నాచన సోమనాథుడు తిక్కన గారి శిష్యుడు తిక్కనగారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని హరిహరినాథునికి అంకితంగా “ఉత్తరహరివంశం”  రచించిన వాడు.  సోమనాథుడు ఇతని పేరు. నాచనగారి పుత్రుడు కాబట్టి నాచన సోమనాథుడు అన్నారు.
తన ఉత్తర హరివంశంలో “ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరంబున....”  అంటూ ఆశ్వాసాంత గద్యం వ్రాసుకున్నాడు.  తిక్కన గారి నామధేయాన్ని ప్రతి ఆశ్వాసం చివరిలోనూ సంస్మరించి తన గురుభక్తిని ప్రకటించుకున్నాడు సోమన.
మనకి లభించిన “ఉత్తర హరివంశం” ఆరు ఆశ్వాసాల గ్రంథం.  సాధారణంగా ప్రతి గ్రంథానికీ ఉండే  “అవతారిక” ఈ ఉత్తర హరివంశానికి లేదు.  ఆరవ ఆశ్వాసం చివరిలో ఈ గ్రంథం ముగిసినట్టు కూడా చెప్పలేదు.  సాధారణంగా కవులు “అవతారిక”లో తమ గురించి, తమ వంశం గురించి, ఇంకా  ఎవరికైనా ఆ గ్రంథాన్ని అంకితం ఇస్తే, ఆ కావ్య గ్రహీత వివరాలూ   వగైరాలు వ్రాసుకుంటారు.  ఉత్తర హరివంశం గ్రంథానికి అవతారిక లేకపోవడంతో సోమన గారి కాలం గురించి వాదోపవాదాలు జరిగాయి.
విజయనగర రాజు బుక్కరాయలు గుత్తి దుర్గంలో ఉన్న పెంచుకలదిన్నె అనే గ్రామాన్ని నాచనసోమన్నకు క్రీ.శ. 1344లో దానం చేసినట్లు లభించిన  తామ్రశాసనం ఆధారంగా ఇతడి కాలాన్ని సుమారు 1300 నుంచి 1380 మధ్య కాలంలో జీవించి ఉంటాడు ఆని పరిశోధకులు నిర్థారించారు.  ఎఱ్ఱాప్రగడకు సమకాలీనుడు కానీ కొంచెం తరువాతవాడు గానీ అవుతాడు.
కవిసమ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారు  నాచన సోముని కవితా వైభవాన్ని “ఒకడు నాచన సోమన అనే చక్కటి విశ్లేషణాత్మక  గ్రంథంలో వ్రాసారు. “సాహిత్య సురభి” అనే పద్యసంకలన గ్రంథంలో  సోమన గురించి విశ్వనాథ వారు  ఇలా అన్నారు "కొందఱితనిని  తిక్కన్న కన్నా  గొప్పవాడని యనుకొనువారు కలరు.  కొన్ని విషయములలో నట్లే యనిపించును.  తిక్కన్న గారికంటే ప్రౌఢుడు.  కాని తిక్కన్నకు శిష్యుని వంటివాడు.  ఎఱ్ఱన్న - నన్నయ గారి ననుసరించినట్లుగా నాచన సోమన్న తిక్కన్నగారి ననుసరించెను.  కాని ఎఱ్ఱయ్య నన్నయ్యకు కొంత తగ్గిపోవునని చెప్పవలయును.  సోమన్న తిక్కన్నను కొన్నిచోట్ల మించి పోవునని చెప్పవలయును" అన్నారు.   దీన్ని బట్టి సోమనాథుడు ఎంతటి మహాకవో మనం గ్రహించవచ్చును.
లక్షణగ్రంథాల్లో ఇచ్చిన ఒకటి రెండు ఉదాహరణల్ని బట్టి నాచన సోమన్న "వసంతవిలాసము" అనే మరోకావ్యం రచించాడని తెలుస్తోంది. కానీ ఇంతవరకూ అది బయటపడలేదు.
ఇప్పుడు మనం నాచన సోమనాథుని ఉత్తర హరివంశం నుండి ఒక రసవత్తర ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
మహాభారతం, ఉద్యోగపర్వంలో తిక్కనగారు   సంజయ రాయబారాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు.    శ్రీకృష్ణ రాయబారం గురించి చెప్పనే అక్కరలేదు.  అది జగద్వితం. ఈ రెండు రాయబారాల్లో తిక్కన సోమయాజిగారి రాజకీయ దురంధరత ప్రతి మాటలోనూ, కదలికలోనూ ప్రస్ఫుటం ఔతుంది.   నాచన సోమన్న ఉత్తరహరివంశంలో జనార్దనుడి రాయ బారాన్ని అంత రసవంతంగానూ  పండించాడు.
బ్రహ్మదత్తుడు సాళ్వదేశానికి రాజు.   అతనికి ఇద్దరు భార్యలు.  చాలాకాలం సంతానం లేదు.  పదేళ్ళు తపస్సుచేస్తే పరమేశ్వరానుగ్రహం వల్ల ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు హంసుడు, డిభకుడు.
బ్రహ్మదత్తుడికి ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు  మిత్రసహుడు.  ఇతడికీ సంతానంలేదు.  ఇతడుకూడా పదేళ్ళు తపస్సు చేయగా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఒక కుమారుడు జన్మించాడు.  అతడి పేరు జనార్దనుడు.   జనార్దనుడు విష్ణుభక్తుడయ్యాడు.
ఈ ముగ్గురు పిల్లలూ స్నేహంగా పెరుగుతూ సమస్త విద్యలూ నేర్చుకున్నారు.  మహావీరులయ్యారు.
హంస-డిభకులు హిమాలయాలకు వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చేశారు.  దేవాసురల చేతిలో ఓటమిలేకుండా ఒక వరం, బ్రహ్మాస్త్రంతో సహా సకల అస్త్రాలూ మరో వరంగా పొందారు. నిత్యం వారికి అంగరక్షకులుగా  ఉండేలాగా ఇద్దరు ప్రమథుల్ని కూడా సంపాదించారు.   పరమేశ్వరుడి వల్ల పొందిన వరాలవల్ల వాళ్ళు గర్వాంధులై  విఱ్ఱవీగ సాగారు.  వీళ్ళు ఒకసారి వేటకని అడివికి వెళ్ళి అక్కడ కొందరు ఋషుల్ని పీడించి దుర్భాషలాడారు.  వారిలో దుర్వాస మహర్షి కూడా ఉన్నాడు.  ఆయన ఎంతటి ముక్కోపి అయినా, ఎంతో నిగ్రహం పాటించి వీరిని శపించడమో, భస్మం చేయడమో చేయకుండా ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణునికి అంతా విన్నవించాడు.  శ్రీకృష్ణుడు హంస డిభకుల్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.
వేటనుండి తిరిగి వచ్చాకా,  హంస-డిభకులు  రాజసూయ యాగంచెయ్యమని తమ తండ్రి బ్రహ్మదత్తుడిని ప్రోత్సహించారు. మేం దిగ్విజయం చేసి యజ్ఞ సంభారాలన్నీ సమకూరుస్తామన్నారు.  బ్రహ్మదత్తుడు అంగీకరించాడు.
అయితే జనార్దనుడు వారికి హితం చెప్పాడు.  ధరణి ఇంగిలాల పుట్ట. అగ్ని కణాలలాంటి గొప్ప రాజులతో, శూరులతో, మహా వీరులతో ధర నిండి ఉంది.  రాజసూయ యాగం చేయాలంటే వారందరినీ జయించాలి.  అది జరిగే పని కాదు.  అనర్ధకారణం ఔతుంది ఆని చెప్పడానికి ప్రయత్నించాడు.       వారిని వారించే ప్రయత్నంలో జనార్దనుడు భీష్మ, బాహ్లిక, భీమ, బలరామాదుల పరాక్రమాలు వివరించాడు.  అజేయుడైన  జరాసంధుడున్నాడని చెప్పాడు.   ఈశ్వర వ ప్రభావంతొ వాళ్ళందరినీ ఎలగో అలాగ నిగ్రహించినా, శ్రీకృష్ణుని ముందు ఆ వరాలు ఏవీ పనిచేయవు అని చెబుతూ, శ్రీకృష్ణుని పరాక్రమం గుఱించి చెప్పిన పద్యం ఇది.
నరకాసుర ప్రాణ నాళోత్తఱణకేళి
     రణకేళి వలకేలి రమణ జూపె
కంసదానవశిరః కమల కృత్తన మేలు
     తన మేలుచేయి పెద్దలకు నొసగె
చాణూర ముష్టిక క్షతజ కీలాలంబు
     నాలంబులోనెల్ల నలవు వఱపె
ముర హయగ్రీవాంత్రమూల ఫేనావళి
     నావలిదలగ జీకాకు వఱచె

వీర రస సార కాసార విహరణంబు
విష్ణునకు నొప్పు నతనితో విగ్రహింప
దొరకొనిన వచ్చు మనకు "మద్దులు మునింగి
పాఱ వెంపళ్ళు తమకెంత బంటి" యనుట.
నరకాసురుణ్ణి అవలీలగా సంహరించాడు. అతడి ప్రాణనాళాలను (తూడులు)  పెకలించడం (ఉత్తరణం)  ఒక కేళి.   అటువంటి రణక్రీడలో తన ఎడమ చేతి గొప్పదనం (వలకేలు - దాని రమణ = వలకేలి రమణన్) చూపించాడు.
నరకాసురుడంతటివాణ్ణి ఒక తూడుని పీకినట్టు హేలగా కేళీ విలాసంగా ఎడంచేత్తో పీకేశాడు .
ఇక కంసాసురుడు.  వాణ్ణి కుడిచేత్తో పీకేశాడు. కంసుడి శిరస్సు ఒక కమలం. దాన్ని త్రుంచెయ్యడం (కృత్తనము) ఒక పని.  ఆ పనిని ఏలినది - శ్రమ లేకుండా నిర్వహించినది - తన మేలు చేయి. మేలయిన చేయి - కుడి చేయి.  దాన్ని శ్రీకృష్ణుడు పెద్దలకు ఇచ్చాడు (ఒసగెన్).  కంసుణ్ణి చంపి తన కుటుంబంలో ఉన్న పెద్దలకీ ఇంకా సజ్జనులకీ అభయహస్తం ఉచ్చాడని  అర్థం.
చాణూర-ముష్టికుల్ని చీల్చిచెండాడి వాళ్ళ గాయాల్లోంచి ప్రవహించే రక్తం (క్షతము = గాయము, క్షతజము = రక్తము) అనే నీటిని (కీలాలము) రణరంగం అంతటా (ఆలంబులోన్ ఎల్లన్) మళ్ళించాడు (అలవు వఱపె).
గుఱ్ఱంతల రాక్షసుడు హయగ్రీవుడు, మురాసురుడు.  వాడి పొట్టలోపలి పేగుల్ని - వాటి మూలాల్ని (అంత్రమూల)  అనే నురుగుల్ని (ఫేన + ఆవళి) అవతలికి  తొలగిపోయేటట్టు (ఆవలి తలగన్) చీకాకు పెట్టేశాడు. పేగులు నురుగుల్లా తెల్లగా ఉంటాయిట.  నురుగుల్ని చిమ్మినంత తేలికగా పేగుల్ని చిమ్మేశాడని.
వీర రసంతో నిండిన శ్రేష్టమైన సరోవరంలో (వీర రస సారకాసారము) విహరించడం విష్ణుమూర్తికే చెల్లింది  (ఒప్పున్).   అతడితో యుద్ధానికి పూనుకుంటే (దొరకొనినన్) మనకు ఒక సామెతతో పోలిక వస్తుంది. అదేమిటంటే,  మద్దిచెట్లు మునిగేట్టు ప్రవాహం పొంగిపారుతొంటే వెంపలిచెట్లు (వెంపలి – వెంపళ్ళు)   మనకేపాటి లోతు  (ఎంతబంటి?) - అన్నట్టుంటుంది మనం కృష్ణుడితో తలపడడం.  నరకాసుర కంసాదులకే దిక్కులేకపోతే మనం ఎంత ఆ మహానుభావుడితో పోరాడ్డనికి? (వెంపలి అంటే వరిమడికి ఎరువుగా తొక్కే ఒక చిన్నమొక్క).
ఇంక సాక్షాత్తు ఆదిశేషుడి అవతారం అయిన బలరాముడి బాల పరాక్రమాల గురించి చెబుతున్నాడు.
నిలువంజాలుదురే రణాంగణంబులో నీలాంబరాడంబరో  
జ్జ్వలవేషంబు హలా హలస్థల హల వ్యాపార దోస్పారముం 
బ్రళయాంభొధర సోదరారవము నొప్పన్ దర్ప మేర్పాటుగా
బలభద్రుండతి రౌద్రుడై కదిసినం బ్రత్యర్థి భూపాలకుల్ 
 బలరాముడిది నీలవస్త్రాల ఆడంబరంతో ఉజ్జ్వలమైన వేషం.  నిత్యం మద్యపానం సేవిస్తూ ఉంటాడని ప్రసిద్ధి.  హాలాహల మయమైన స్థలంలో కూడా - అటువంటి భీషణ రణరంగంలో కూడా తన హలాయుధ వ్యాపారం - దున్ని వేయగలగడం - సాగించగల భుజసారం (దోః భుజ, సారము - బలము) ఉన్నవాడు.  లేదా, హాలాహలానికి స్థలమైన హలం - దాన్ని ఆయుధంగా ఉపయోగించే భుజబలం ఉన్నవాడు.  ప్రళయకాల మేఘంతో సాటివచ్చే (ప్రళయ అంభోధరానికి సోదరమైన) అంటే ఆ మేఘగర్జనకి తోబుట్టువువంటి ఆరవం (హుంకారం, గర్జన) చెయ్యగలవాడు.  ఆ వేషం, ఆ దోస్సారము  ఈ ఆరవం  ఒప్పగా, ఠీవీ దర్పం స్పష్టపడేట్టు బలభద్రుడు అతి రౌద్రుడై ఎత్తివస్తే - సమీపిస్తే (కదిసినన్) శత్రురాజులు (ప్రత్యర్థి - భూపాలకులు) రణరంగంలో నిలువగలుగుతారా?  యుద్ధం చెయ్యడం, జయించడం మాట అటుంచు. ముందసలు ఎదిరించి నిలబడగలరా? అని అడుగుతున్నాడు జనార్దనుడు.
శ్రీకృష్ణభక్తుడైన జనార్దనుడు హంస-డిభకులతో చిచ్చరపిడుగైన సాత్యకి యొక్క శక్తిసామర్ధ్యాలు వివరిస్తున్నాడు.
వికల వ్యూహ విధా విహస్తభటమై విధ్వస్తమాతంగమై
శకలీభూత శతాంగమై శరఘటా  శల్యాయమానాశ్వమై
సికతాసేతువు నిమ్నగా రయముచే జిందైన చందాన సా
త్యకిచేతంబడు శతృసంఘము దశాదైన్యంబు సైన్యంబునన్
శత్రుసంఘం అది ఎంతటిదైనా సాత్యకి చేతిలో ఇట్టే నశిస్తుంది.  శత్రుసైన్యంలో దశాదైన్యం - దీన దశ - ఆవరిస్తుంది.  ఇసుకతో (సికతా) కట్టిన వారిధి (సేతువు) సెలయేటి ప్రవాహవేగంతో (నిమ్నగా - రయమునన్) చెల్లాచెదరై కొట్టుకుపోయినట్టు (చిందైన చందమున) శత్రుసంఘం క్షణంలో మాయమైపోతుంది.
ఎలాగంటే - శత్రువులు పన్నిన వ్యూహవిధానమంతా వికలమైపోయి (వికలవ్యూహవిధా) భటులు చెదిరిపోతారు (విహస్త భటమై). గజసైన్యం (మాతంగాలు) విధ్వస్తమైపోతుంది.  రథాలు (శతాంగాలు) తుత్తునియలైపోతాయి (శకలీభూత). బాణసమూహంతో - బాణపరంపరతో (శరఘటా) అశ్వాలు శల్యాయమానమైపోతాయి.  గుచ్చుకున్న బాణపు ములుకులతో వాటి శరీరాలు నిండిపోతాయి.  పదాతి - గజ - రథ - అశ్వ సైన్యాలతో బలిసివచ్చిన శత్రుసంఘం సాత్యకి చేతిలో ఇట్టే నాశనమైపోతుంది.
పద్య నిర్మాణంలో సమతూకం సాధించడం అనేది ఒక రచనా శిల్ప కళ.  తెలుగు ప్రాచీన సాహిత్యంలో గొప్ప సమతూకం సాధించిన పద్యాలను ఉదహరించేటప్పుడు నాచన సోమనాథుడు రాసిన పై పద్యాన్ని చెబుతారు పండితులు.
ఇందాకా మనవి చేశాను. సోమన గారి ప్రభావం పోతనగారి రచనలో కొన్నిచోట్ల కనిపిస్తుంది అని.  ఇదిగో ఈ పద్యం మరొక ఉదాహరణ.
శరవిచ్చన్న తురంగమై పటుగదా సంభిన్న మాతంగమై
యురుచక్రాహత వీర మధ్య పద బాహు స్కంధముఖ్యాంగమై
సురభిత్యైన్యము దైన్యముం బొరయుచున్ శొషించి హైన్యంబుతో
హరి మ్రోలన్ నిలువంగ లేక పరచెన్ హాహా నినాదంబులన్
భాగవతం నరకాసుర వధ కథలో - దేవతల్ని కూడా గడగడలాడించిన నరకాసురుడి సైన్యం,  శ్రీకృష్ణుని శర-గద-చక్ర ప్రహారాలతో చెల్లాచెదరైపోయిన  దీనావస్థను పోతన గారు వర్ణిస్తున్నాడు.
ఈ పద్యం నాచన సోముని "వికల వ్యూహ విధా విహస్త భటమై..." పద్యాన్ని తలపించడం లేదూ?  రెండూ మత్తేభ వృత్తంలోనే సాగాయి.
సరే, ప్రస్తుతానికొస్తే జనార్దనుడు చెప్పినదాన్ని హంసుడు లెక్క చేయలేదు.  తీసి అవతల పాడేసాడు.
కలుద్రావంబని, బూని యాదవులు ఖడ్గాఖడ్గి వాదింతురే
కలగం బాఱుట గాక; పంతములకుం గంసారి సైరించినం
గలనం బ్రాణముతోన పట్టువడు, నింకన్ సాత్యకిన్ గీత్యకిన్
బలభద్రున్ గిలభద్రు నా యెదుర జెప్పం జొప్ప దప్పుంజుమీ!
ఏంటయ్యా జనార్దనా, ఆ యాదవుల గురించి అంత గొప్పగా చెబుతున్నావు! ఆ యాదవులకు కల్లు త్రాగటం ఒక్కటే పని. వాళ్ళు పూనుకొని మాతో యుద్ధం చేయడమే !?   వాళ్ళు కత్తికి కత్తి దూసి జవాబు చెబుతారా, భయపడి పారిఫొతారు గానీ!  యాదవూల్లోకెల్లా మహావీరుడు, కంసుణ్ణి చంపిన కృష్ణుడు అంటున్నావే, ఆ కృష్ణుడు (కంస+అరి)  ఆ అహంకారంతో  ఒకవేళ పంతానికిపోతే (పంతమునకున్ సైరించినన్), రణరంగంలో (కలనన్) ప్రాణాలతో సహా పట్టుబడిపోతాడు.  అంతటి కృష్ణుడిపనే ఇలా అయితే ఇక సాత్యకి - గీత్యకి, బలభద్రుడు-గిలభద్రుడు అంటూ వాళ్ళ మాటే నా దగ్గర (నా యెదురన్) చెప్పవద్దు.  వాళ్ళ ఊసెత్తితే చొప్పు తప్పుతుంది సుమా - అంటే  ఔచిత్యభంగం ఔతుంది సుమా అన్నాడు.
జనార్దనుడు ఎంత వారించినా వినకుండా హంస హంసడిభకులు అతన్ని  శ్రీకృష్ణుడి వద్దకు రాయబారానికి  పంపించారు “ మేము రాజసూయం చేస్తున్నాం నువ్వు యాగానికి కావలసిని ' ఉప్పు ' ని  కప్పంగా పంపించు”  అని సందేశం పంపించారు .   ఈ జనార్దనుడు కృష్ణ భక్తుడు. తాను దర్శించాలని చాలా కాలంగా కోరుకుంటున్న శ్రీకృష్ణుడి దగ్గరికే తన ప్రభువు పంపుతున్నాడు. తీర్థమూ-స్వార్థమూ కలిసివచ్చాయి.   జనార్దనుడి మనసు పరవశించిపోతోంది.  ద్వారకకి వెళుతూ అతను తనలో తాను ఇలా అనుకున్నాడు:
యదుకులాంబుధి చంద్రు నానందమున జూచు  
     రామాది హితచకోరములలోన
దనుజారి పారిజాతము జేరి పొదిగొన్న
     రాజన్య రాజకీరములలోన
వసుదేవసుత సరోవరములో నోలాడు
     సనకాది దివ్యహంసములలోన
గోపాల నవపుష్పగుచ్చంబు మూగిన
     పరిచారికా ద్విరేఫములలోన
గలయ దొలు బాము నోములు గలవు గాన
సెలవులేక జన్మంబులు చెడియె నాకు
మీద జన్మంబు గలుగ నిర్మించెనేని
కమలజుని పేర దాపటి కాలి బొమ్మ.
 యదువంశం అనే సముద్రానికి చంద్రుడు శ్రీకృష్ణుడు.  పున్నమి నాడు సముద్రం ఉప్పొంగుతుంది.  శ్రీకృష్ణుడివల్ల యదువంశం పెంపు వహించింది.  “యదుకులాంబుధి చంద్రుడు"  శ్రీకృష్ణుడు.  అతన్ని నిత్యం ఆనందంతో చూస్తున్నారు, చూసి అనందిస్తున్నారు బలరాముడు మొదలైన హితులు (ఇష్టులు) వాళ్ళు చకోరాలు. హిత చకోరాలు.  ఆ చకోరాల్లొ నేనిప్పుడు కలవబోతున్నాను.
దనుజారి (దనుజ + అరి) రాక్షస సంహారకుడైన శ్రీకృష్ణుడు ఒక పారిజాతం - ఒక కల్పవృక్షం.  అతణ్ణి చేరి చుట్టూ పరివేష్టించి ఉంటారు రాజన్యులు.  ఆ రాజన్యులే రాచిలుకలు (రాజకీరము = శ్రేష్టమైన చిలుక)  వారిలో నేనూ ఒక రాచిలుకగా కలవబోతున్నాను.
వసుదేవుని సుతుడు శ్రీకృష్ణుడు. ఆయన ఒక సరోవరం వంటి వాడయితే అందులో సనక-సనందాదులు దివ్యహంసల లాగా ఓలలాడుతుంటారు.  ఆ హంసల్లో నేనూ కలవబోతున్నాను.
గోపాలుడు ఒక కొత్తరకం పూలగుత్తి (నవపుష్పగుచ్చము) పరిచాకలు అనే తుమ్మెదలు దానిచుట్టూ మూగి ఉంటాయి.  నేనూ ఒక తుమ్మెదగా వారిలో కలవబోతున్నాను. ఆ పూలగుత్తిని ఆస్వాదించ బోతున్నాను.
ఇంతగొప్ప అవకాశం నాకు లభిస్తోందంటే దానికి కారణం తొలిజన్మలో (తొలిబాము) నేను నోచిన మంచి నోములు, వ్రతాలు  ఏవో ఉండటమే.  ఇప్పటికి ఈ అవకాశాన్ని అందించడం వల్ల నా పూర్వ జన్మలన్నీ చరితార్థమైనట్లే. ఇప్పుడు శ్రీకృష్ణ సందర్శనంతో ఈ జీవుడికి జన్మ సాఫల్యం సిద్ధిస్తోంది.   కనక రాబోయే జన్మలన్నీ నిరుపయోగమే.  నిష్ప్రయోజనమే.  ప్రయోజనం, ఉపయోగం లేకపోవడంతో (సెలవు లేక) నాకు భవిష్యజ్జన్మలు నశించిపోయినట్టే.    కృష్ణదర్శనంతోనాకు జన్మరాహిత్య స్థితి వచ్చేస్తుంది.
ఒకవేళ బ్రహ్మదేవుడు నాకు మళ్ళీ జన్మ కలిగేట్టు  చేస్తే (మీద జన్మంబు గలుగ నిర్మించెనేని) ఆ బ్రహ్మదేవుని పేరుతో (కమలజుని పేర) నా ఎడమకాలికి (దాపటి కాలికి) బొమ్మ వేసుకుంటాను.  అతడి పేరు వ్రాసి బొమ్మవేసి నా ఎడమ కాలికి కట్టుకుంటాను. (ఆ కాలంలో రాజులు తాము జయించిన శత్రురాజుల బొమ్మల్ని తమ ఎడంకాలిమీద పచ్చబొట్ట్లు  పొడిపించుకునేవారట. గండపెండేరాలమీద చెక్కించి కాలికి తొడుక్కొనేవారట.)
'ద్విరేఫము’  అంటే రెండు రేఫలున్న(రకారాలు) పదం.  అది  “భ్రమర"  శబ్దం.  భ్రమరమంటే తుమ్మెద, ద్విరేఫము అంటే తుమ్మెద.
జనార్దనుడు కతిపయ దినములు పయనించి, ద్వారక చేరుకున్నాడు.  శ్రీ కృష్ణ దర్శనం అయింది.
కనియెం గౌస్తుభరత్న భూషణు వలత్కర్పూర హారావళీ
వనితా చాలిత తాళవృంత  పవన వ్యాధూత చేలాంచలున్
మనుజాధీశ కిరీటకోటి పరిషన్మధ్యస్థ సింహాసనాం
కునిఁ దేజః ప్రసర ప్రభాత తరణిన్ గోపాలచూడామణిన్
కనియెన్ - గోపాల చూడామణిన్. శ్రీకృషుణ్ణి దర్శించాడు అనడంకన్నా దర్శించాడు శ్రీకృష్ణున్ని అనడంలో దర్శనానికి ప్రాధాన్యం.  కృష్ణ భక్తుడైన జనార్దనుడి తపనకూ వేదనకూ ఆరాటానికీ - వీటన్నింటి సఫలతకూ అనువైన అభివ్యక్తీకరణ.
అతడు దర్శించిన శ్రీకృష్ణుడు ఆ సమయంలో ఎలా ఉన్నాడంటే.  నిండు కొలువులో సభ తీర్చి ఉన్నాడు. మిరుమిట్లు కొలిపే కౌస్తుభరత్నాన్ని భూషణంగా ధరించి ఉన్నాడు.  స్వామి సింహాసనంమీద సమాసీనుడై ఉన్నాడు.  ఇరువైపుల నిలిచి వ్రేలాడుతున్న (వలత్) కర్పూర హారావళులు ధరించిన వనితలు ఒయ్యారంగా వీవనలు (తాళవృంతాలు) వీస్తున్నారు. ఆ చిరుగాలులకు శ్రీకృష్ణుని పీతాంబరాల అంచులు సుతారంగా అల్లల నాడుతున్నాయి. ఆ వనితలు పొడుగైన కర్పూరహారావళులు ధరించి ఉన్నారు. అవి వేలాడుతున్నాయి (వలత్).  వనితలతో వీవనలు కదిలించ బడుతున్నాయి (చాలిత తాళవృంత)   . కర్పూరసుగంధంనిండిన పిల్లగాలులతో శ్రీకృష్ణుని పీతాంబర చేలాంచలాలు అల్లల నాడింపబడుతున్నాయి. (పవన వ్యాధూతచేలాంచల). అటువంటి చేలాంచలం కలిగి ఉన్నాడు శ్రీకృష్ణుడు.   సింహాసనం చుట్టూ సామంతరాజులు (మనుజాధీశ) సాష్టాంగ పడి నమస్కరిస్తున్నారు.  వారి కిరీటాగ్రభాగాల సముదాయం మధ్య సింహాసనం ఉంది.  ఆ సింహాసనం అధిష్ఠించి కూర్చున్నాడు స్వామి.  దశదిశలా ప్రసరిస్తున్న తేజస్సు చూస్తే ఉదయకాల భాస్కరుడిలాగా (ప్రభాత తరణి) ఉన్నాడు.  కౌస్తుభం, పట్టు పీతాంబరాలు, సామంత రాజుల కిరీటాలు, నవరత్నఖచిత  సింహాసనం, వీటన్నిటినీ మించి స్వతస్సిద్ధమైన ఆయన తేజస్సు – ఇవన్నీ కలిపి ప్రభాత సూర్యుడిలాగా కనిపించాడు - ఆ గోపాలచూడామణి.
సభలో బలరాముడు, సాత్యకి, ఉగ్రసేనుడు ఉన్నారు.  దూర్వాసమహర్షి, నారదుడు కూడా ఉన్నారు. గంధర్వగానం, అప్సరసల నాట్య వినొదాలు ఒక పక్క జరుగుతున్నాయి.   మరొకపక్క వందిమాగధులు స్తోత్రాలు చేస్తున్నారు.  వేద పండితులు  సామవేద పారాయణం చేస్తున్నారు.  పురప్రముఖులూ తక్కిన సభాసదులందరూ శ్రీకృష్ణుడివైపే చూస్తూ ఆనంద రసధారలలో తేలియాడుతున్నారు. అందరూ తమ తమ ఉచితాసనాల్లో సుఖాసీనులై ఉన్నారు.
జనార్దనడు సమీపించి తన ప్రవర చెప్పుకుని శ్రీకృష్ణుడికీ తదిర పెద్దలందరికీ నమస్కరించాడు.  రాజసభల్లో దూతలకోసమని కొన్ని ఆసనాలు కేటాయించి ఉంటాయి.  కృష్ణుడు సైగ చెయగా జనార్దనుడు ఆసనాన్ని అలంకరించాడు. అప్పుడు ఆ మురాంతకుడు ఇలా సంభాషణ ప్రారంభించాడు.
అనఘ! మీ రాజు బ్రహ్మదత్తునకు గుశల
మానరేంద్రకుమారులు హంసడిభకు 
లధిక భవ్యులెవరములు హరునిచేత
గొన్నవారట - కుశలంబు గొఱత గలదె!
"అనఘ" అని సంబోధన. నువ్వు పవిత్రుడివే, మంచివాడివే. నీ వల్ల ఏ అపరాధమూ, పాపమూ లేదని హెచ్చరిక.
మీ రాజు బ్రహ్మదత్తుడికి క్షేమమేనా! రాకుమారులు హంస డిభకులు అధిక భవ్యులేనా? అధిక కుశలమా అనడంలో ఎకసక్కెం.  వారిద్దరూ ఈ మధ్య శివుడి నుంచి ఏవో వరాలు సంపాదించారట గదా - ఇక కుశలానికి లోటేమి ఉంటుందిలే!
ఇంకా మీ తండ్రి మిత్రసహుడు కుశలమా? రాజు మిమ్మల్ని గౌరవిస్తున్నాడా, ప్రజలు సుఖంగా ఉన్నారా అని కుశలప్రశ్నలు వేసి ఎం పనిమీద వచ్చావు చెప్పు అన్నాడు.
జనార్దనుడు "ఆహా, విశ్వపతీ మేమంతా కుశలమే.  హే శ్రీకృష్ణా నువ్వు మొత్తం విశ్వానికే పతివి.  అయినా, నేను వచ్చిన పని గోవిందా ! నీకు సర్వమూ విదితమే. నేను ప్రత్యేకంగా విన్నవించుకోవాలా? నేను వచ్చిన పని గోవింద - అంటే విఫలమై పోతుంది,  అని సూచన. తాను కృష్ణ భక్తుడు. ఇప్పుడు హంసడిభకుల  దూతగా వచ్చాడు కనుక మనవి చేయకతప్పదు.
ఉండుట తప్పు వారికడ ఉండమి, తప్పిట రాక తప్పు రా
కుండుట తప్పు, తప్పులకు నొప్పులకున్ గతి నీవ దేవ! యే
నొండొకరుండనే; పలుకకూరక నేరక యుండజేయు వీ
ఱిండి తనంబుచేత నిసిఱింతలువాఱెడి జిత్తమిప్పుడున్
వీఱిడితనము అంటే వెఱ్ఱితనం.  ఇసిఱింతలువాఱుట అంటే కంపించటం.
పరమాత్మా! వారిదగ్గర ఉండటమూ తప్పే.  ఉండకపోవడమూ తప్పే.  ఇక్కడికి రావడమూ తప్పే, రాకపోవడమూ తప్పే.  ఈ తప్పులకీ ఒప్పులకీ అన్నింటికీ నువ్వే గతి.  నువ్వే దిక్కు.  నేను వేరొకడినా!  నేను మాత్రం నీ భకుడినే తప్ప మరొకటి కాదు.
పలుకక అంటే ఏమీ మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి కల్పిస్తున్న - ఉండనేరకజేయు - ఒక వెర్రితనంవల్ల నా మనస్సు ఇప్పటికీ కంపిస్తూనే ఉంది. అలజడి చెందుతూనే ఉంది.
పలుకకూడని పలుకులు పలుకవలసి వస్తోంది. ఎందుకు దూతగా వచ్చానా అని మనస్సులో బాధపడుతున్నాను, అని అతని భావం.  మరి ఎందుకు వచ్చావయ్యా? అంటే రాక తప్పదు.  అక్కడ ఇతడు  మంత్రి. హంసడిభకులకు బాల్యమిత్రుడు.  పోనీ కొలువు  వదిలిపెట్టవచ్చుగదా అంటే, కుదరదు. తాత తండ్రుల  కాలంనుంచీ ఉన్న అనుబంధం.  విద్యుక్త ధర్మం.
ఈ ఉపోద్ఘాతంఅంతా ఎందుకు అంటే తాను చెప్పబోయే మాటలకి శ్రీకృష్ణుడు తనని అపార్థం చేసుకోకుండా, అలగకుండా ప్రశాంతంగా వినడానికి.
ఆ జనార్దనుడు  పడుతున్న గుంజాటనని గుర్తించాడు ఈజనార్దనుడు.  భరోసా అస్తున్నాడు.
అనుడు జనార్దనుండను జనార్దనుతో - విను దూతకృత్యముం
బనివడి పూని యేలికల ప్రల్లదమైనను జెప్ప జెల్లు, ద  
ప్పని పలుకైన బోలు విన, బంతము జల్లకు వచ్చి ముంత దా
చిన గతి నింత మాటువడజేసిన గార్యము గానవచ్చునే
జనార్దనా! ఒక మాట చెబుతాను. విను. వాళ్ళు చెప్పమన్నది చెప్పడం, మేము చెప్పేది తీసుకువెళ్ళడం - ఇంతే దూతగా నీ పని.  అంచేత చెప్పడానికి సంశయింఇచవలసిన పనిలేదు.  వాళ్ళు చెప్పేది ప్రల్లదమైనా, అంటే తప్పుడుమాటే అయినా దాన్ని చెప్పడం నీ తప్పు అవదు. మేం దాన్ని వినాలి.   చల్లకోసం వచ్చి ముంతదాచుకున్నట్టు, నువ్వు మొహమాటపడి వారి పలుకుల్ని దాస్తే ప్రయోజనం లేదు. కాబట్టి పల్చబరచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు - అన్నాడు.
రావలదే పంచిన పని
సేవకులకు, బాముకాటు సీర దుడిచినం
బోవునె? వారేమనిరో
నీవేలా దాచె, దేమి నేరమి నీకున్ ?
ప్రభువులు ఆజ్ఞాపించిన పనిమీద సేవకులకు రాక తప్పదు గదా!  పాముకాటుని గుడ్డతో తుడిచేస్తే పోతుందా!  వారు అంటే ఆ హంస డిభకులు ఏమన్నారో, నువ్వెందుకూ దాచడం? ఇందులో నీ తప్పేముంది?
వారి దగ్గర ఉండటం తప్పు, ఉండకపోవడం తప్పు. వారి దూతగా  ఇక్కడికి రావడం తప్పు రాకపోవడం తప్పు - అంటూ జనార్దనుడు మాట్లాడిన అంశాన్ని శ్రీకృష్ణుడు అవుననలేదు, కాదనలేదు.  దాని ఊసు తప్పించేసాడు.  వర్తమానం గురించీ, రావడం గురించీ మాత్రమే ప్రస్తావించాడు.  అందులోనూ దూతను పట్టుకుని "సేవకులకు" అన్నాడు.   నువ్వు పాముకాటుకి గురి అయ్యావు, ఇప్పుడు చీరతో తుడుచుకుని యేమి లాభం? అంటున్నాడు.
హంస డిభకుల స్వభావం జనార్దనుడికి బాగా తెలుసు.  ఏనాడో వారి కొలువు విడిచిపెట్టెయ్యాలి. కనీసం దూర్వాసుణ్ణి అవమానించినప్పుడయినా తాను వారితో తెగతెంపులు చేసుకొని ఉండాల్సింది.  శ్రీకృష్ణుని దగ్గరకి వెళ్ళిపోయి ఉండాల్సింది.  అలా చెయ్య లేకపోవడానికి వాళ్ళు కలిపిస్తున్న రాజభోగాలు కూడా ఒక కారణం కావచ్చు.  వాటిని వదులుకోలేకపోయాడు.  అంటిపెట్టుకుని తిట్టుకుంటూనే అక్కడే ఉండిపోయాడు.  పాముకాటుకి గురి అయ్యాడు.  ఇప్పుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి అది తప్పు, ఇది తప్పు అంటూ బడాయి పోతే ఎలాగ?  అందుకని శ్రీవారు రెండు చురకలు వేసారు.  అయినా భావగ్రాహీ జనార్దనః అన్నారు కనుక, ఈ జనార్దనుడి అంతరంగంలో ఉన్న భక్తిని ఆ జనార్దనుడు గ్రహించి ఊరికే చురకలతో వదిలేసాడు అనుకోవాలి.
నువ్వు దాచడమెందుకు? నీ తప్పు ఏముంది కనక, నిర్భయంగా చెప్పు అని స్వామి అనడంతో జనార్దనుడు అసలు విషయం బయటపెట్టాడు.
అనుడు నతండు - హంసడిభకానుమతంబున రాజసూయమున్
జనపతి సేయబూని, భుజసారమునన్ సడిసన్న రాజులన్
ధనములు చాల దెండని, పదంపడి దేవర యున్న చోటికిన్
నను బనివంపె, నిన్ను యజనంబున మున్నిడి చేయువాడుగాన్
రాజు బ్రహ్మదత్తుడు హంసడిభకుల అభిమతంతో, ప్రేరణతో రాజసూయ యాగం చెయ్యడానికి పూనుకున్నాడు.  భుజ పరాక్రమంలో ప్రసిద్ధికెక్కిన రాజుల్ని చాలా ధనాల్ని  తెమ్మని వర్తమానం పంపించాడు.  పదంబడి, అంటే ఆ తరువాత నీ వద్దకు నన్ను నియోగించాడు. పనివంచు అంటే నియోగించడం.  బహుశః ఆ యజ్ఞంలో నిన్ను అగ్రపీఠం మీద కూర్చోబెట్టి - మున్ను ఇడి - చేస్తాడు కాబోలు!
హంసడిభకులు "ఇట చనుదెమ్మనుమతని యజ్ఞ సమయంబునకున్" అని మాత్రమే చెప్పారు.  "నిన్ను యజనంబున మున్నిడి చేయువాడుగాన్" అనేది జనార్దనుడి ఊహాజనితం.  బహుశః ఈ మాట కృష్ణుణ్ణి మెప్పించడానికో, బ్రహ్మదత్తుడి పేరుమీద హంసడిభకుల్ని తప్పించడానికో అయి ఉంటుంది.
ఇంకా జనార్దనుడు ఇలా చెబుతున్నాడు.
అప్పుడా హంసడిభకులిట్లనిరి - మనకు
లవణమెంతేని నడుగు యాదవులచేత
వేగ రమ్మను శౌరి నియ్యాగమునకు
నావుడుం బనిపూనితి దేవదేవ!
దేవదేవా! బ్రహ్మదత్తుడి ఆజ్ఞ మీద నేను నీ దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు హంసడిభకులు - యాదవుల్ని లవణము ఎంతేని అడుగుము - అన్నారు.  ఈ యాగానికి శౌరిని వేగం రమ్మను అన్నారు.  అప్పుడు నేను ఈ దౌత్యానికి పూనుకున్నాను. అన్నాడు.
లవణము ఎంతేని అడుగుము అనడంలో రెండుమూడు భావాలు  స్ఫురిస్తాయి.  కప్పంగా అనే మాట రాలేదు.  యజ్ఞానికి వచ్చే ప్రజానీకానికి భోజనాల ఏర్పాట్లు ఉంటాయికదా.  కాబట్టి దానికి ఉప్పు కావాలనడం.  "ఎంతేని" అంటే చాలా అని అర్థం.  యాదవులచేత  అనడంచేత కప్పం అనే భావం అందులో దాగి ఉంది.  ఇప్పుడు "ఎంతేని" అంటే లాంఛనప్రాయంగా ఏదో రెండు మూడు ఉప్పురాళ్ళు కప్పంగా అని నిగూఢార్థం.   వాళ్ళు అంతకన్నా ఇంకేమి ఇవ్వగలరులే! ఆని ఒక వ్యంగ్యం.  మనకి అన్నీ ఉన్నాయి.  వాళ్ళని ఏదో లాంచానప్రాయంగా రెండు ఉప్పు రాళ్ళు తెమ్మను ఆని భావం.
"వేగరమ్మను శౌరి నియ్యాగమునకు" అనే మాటలో ఈ యాగానికి అని ఒక అర్థం; ఈ ఆగమునకు - ఆగము అంటే అల్లరి.  ఆగస్ అనే శబ్దం ఒకటి ఉంది.  దానికి  పాపం, తప్పు, కిల్మిషం అని అర్ధాలున్నాయి.   అంటే హంస డిభకులు మేము చేసే ఈ అల్లరికి, పాపకార్యానికి నిన్ను రమ్మన్నారు స్వామీ - అని అంతరార్థమట.  ఇది ఒక శబ్ద చమత్కారంగా పెద్దలు చెబుతారు.
ఇలా లోతొగా పోతే ఈ కథ చాలా సేపు పడుతుంది.  అందుకని వీలయినంత క్లుప్తంగా ముగిస్తాను.
శ్రీకృష్ణుడితో సహా యాదవ వీరులందరినీ హంసుడు  తూలనాడిన విషయాన్ని జనార్దనుడు ప్రస్థావించలేదు.  అది దూతగా అతని సందేశంలో భాగం కాదు.  అది తనూ, తన ప్రభవూ అంతరింగికంగా మంచి చెడ్డలు చర్చించుకున్న విషయాలు.  అంచేత వాటిని ప్రస్థావించవలసిన అవసరం జనార్దనుడికి లేదు.  దూతగా వచ్చి ఆ పని చెయ్యకూడదు.
అభీష్టం ఎలా ఉన్నా విధినిర్వహణలో తేడా రాకూడదు.  సాధ్యమైనంత సుకుమారంగా చెప్పి అంగీకారయోగ్యంగా పలికి జనార్దనుడు ఉత్తమ దూత అనిపించుకోవడంతో పాటు తన స్వామి భక్తిని కూడా ప్రకటించుకున్నాడు.
అయితే ఈ మాటలకి శ్రీకృష్ణుని స్పందన తీవ్రంగానే ఉంది.  దూర్వాస మహర్షి కూడా అక్కడే ఉన్నాడాయె.
అనుటయు వాసుదేవుండు రోసంబునకు మూలంబైన హాసంబు చేసి యిట్లనియె :
రాజసూయకర్త బ్రహ్మదత్తుండట్టె
రభస మెసగ - హంసడిభకులట్టె
చేయబంచువారు, చెల్లబో! లవణంబు
మోచువాడు కాక మురవిరోధి.
వాసుదేవుడు రోషానికి మూలమైన హాసం చేసాడు. చులకనగా పరిహాసోక్తులు పలుకుతున్నాడు.  వీర రసానికి ఉద్దీపకాలు.
రాజసూయం చేసేవాడు బ్రహ్మదత్తుడా!  రభసము ఎగసన్ అంటే అర్భాటంగా చేయించేవారు హంసడిభకులా! చెల్లబో అంటే భళా! ఇంక ఈ కృష్ణుడు ఉప్పుమోసేవాడే కాక తప్పదు మరి !
ఉప్పు కప్పంగా చెల్లించాలి అనేదాన్ని తాను ఉప్పు మొయ్యడంగా చిత్రించాడు. ఇలా తనమీదకి సవాలుగా తీసుకోవడంవల్ల అనుచరులైన యాదవ మహావీరుల్లో రోషమూ, హంసడిభకులపట్ల  ఆగ్రహమూ ప్రజ్వరిల్లుతాయి.  తనకు తాను మురవిరోధి అని చెప్పుకోడంలో "మురాసురిడిలాంటి వాణ్ణే అనాయాసంగా సంహరించిన వాడిని - నాకు ఈ హంస డిభకులు ఒక లెక్కా! అనే ధ్వని. ఇది తన గొప్ప తాను చెప్పుకోడం కాదు.  దీన్ని అర్ధాంతర సంక్రమిత వాచ్య ధ్వని - అంటారు.  రామాయణం లో కూడా ఒక చోట నిరహంకారి, వినయశీలి అయిన శ్రీ రామచంద్రుడు కూడా  “రామో అస్మి సర్వం సహ - నేను  రాముణ్ణి - కనుక భరిస్తాను” అన్నాడు. అక్కడా ఇదే ధ్వని.
ఇంక హాస్యపు ధోరణి కట్టిపెట్టి గంభీరంగా రోషావిష్కరణం చేస్తున్నాడు.  కావ్యం చదివేటప్పుడు పాత్రల మొహంలోనూ, కంఠంలోనూ వచ్చే మార్పుల్ని ఊహించుకుంటూ చదివితే  ఆ రసం బోధపడుతుంది.
 అప్పన మెంతగావలె నహంకరణంబు దొఱంగి యిచ్చినన్  
గప్పముపేర, నేడు నొడికారితనంబున మోసపుచ్చగా
నుప్పులుదెత్తురే!  సమరయోగ్య తలంబున వైరికోటితో
నుప్పన బట్టె లాడునెడ నుప్పులు దెత్తురు గాక యాదవుల్ !
వ్యక్తిత్వాన్ని  చంపుకుని (అహంకరణంబు దొఱంగి) కప్పం అని చెల్లించినట్టయితే  ఆ కానుక  (అప్పనము) ఎంతటిది కావాలేమిటి?  ఉప్పురాయి ఇచ్చినా మేరు పర్వతం ఇచ్చినా ఒక్కటే.  కప్పం కప్పమే.  అవతలవారి సార్వభౌమత్వాన్ని అంగీకరించినట్టే, వ్ర్యక్తిత్వాన్ని చంపుకున్నట్టే.
"శౌరిని ఇయ్యాగమునకు వేగరమ్మనుము, యాదవులచేత లవణమెంతేని నడుగుము"  అని పదాలు జాగ్రత్తగా పేర్చుకుని కప్పం అనే మాట రాకుండా, ఇంత అని చెప్పకుండా, శత్రుత్వం స్ఫురించకుండా - మాట నేర్పరితనంతో (నుడి-నొడి కారితనంబునన్) మాయచేస్తే (మోసపుచ్చగాన్) ఉప్పు తీసుకువస్తారా మా యాదవులు? తీసుకురారు!  సమయానికి యోగ్యమైన ప్రదేశంలో శత్రుసమూహంతో ఉప్పనబట్టెలాడేటప్పుడు తప్పకుండా ఉప్పును తీసుకువస్తారు .
ఉప్పన బట్టెలాట అనేది తెలుగువారి గ్రామీణ క్రీడ.  ప్రతిపక్షంవారిని తప్పించుకుంటూ వారికి పట్టుబడకుండా అవతలి గడిలోంచి గుప్పెడు ఇసుక తెచ్చి తమ గడిలో కలుపుకుంటే గెలిచినట్టు.  ఇసుక తీసుకు రావడాన్నే ఉప్పుతీసుకురావడం అంటారు.    ఇది జయానికి సంకేతం.
హంసడిభకులతో యుద్దమంటే మాకు ఉప్పనబట్టెలాట లాంటిది.  ఉత్సాహం ఉరకలు వేస్తుంది.  వాళ్ళ బలాలూ, వాళ్ళ వరాలూ మాకు లెక్క లేదు. మమ్మల్ని భయపెట్టవు. ఆ ఉప్పన బట్టెలాటలో మేం తప్పకుండా ఉప్పు తీసుకువస్తాం - అంటే గెలిచి తీరుతాం!
"ఉప్పన బట్టెలాటని" ప్రస్థావించడంవల్ల యాదవువీరుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది.  వీర రస స్థాయి కుదురుకుంటుంది.  ఇప్పుడు శ్రీకృష్ణుడు వారితో ఇలా అంటున్నాడు.
అనిపలికి యాదవలోకంబు నాలోకించి –
కలరా ఇంతకు మున్ను యాదవులచే గప్పంబు దెప్పింపగా
గల రారాజులు మున్న, గాజులుం దొడవుగా గల్పించిరా, కాకులం
కలకంఠంబుల జేసెనా కటకటా గౌరీశ్వరుం, డేమి కా
గలవారో యిటమీద హంసడిభకుల్ గర్వాంధకారంబునన్
యాదవవీరులారా! చరిత్రలో ఎప్పుడయినా యాదవులతో కప్పం కట్టించుకున్న రారాజులు - చక్రవర్తులు - ఉన్నారా? లేరు.  అంటే వారంతా గాజులు తొడుక్కున్నవారేనా!  తొడవులు అంటే భూషణాలు.  ఇంతకాలానికి ఈ హంసడిభకులు బయలుదేరారు - మగవాళ్ళు - మనతో కప్పం కట్టించుకోడానికి!
గౌరీశ్వరుడు వరాలిచ్చి కాకుల్ని కోయిలలు చేసాడా!  కటకటా, అయ్యయ్యో!  వరాలవల్ల కలిగిన గర్వాంధకారంతో పెట్రేగిపోతున్నారు. పాపం హంసడిభకులు ఏమయిపోతారో!  సర్వనాశనం అవుతారని తాత్పర్యం.
హాస్యవీరాల సాహిత్య రసపోషణ ఇది.
హంసడిభకులకి నోటిచొరవ ఎక్కువ.  అ చొరవతోనే శివుణ్ణి వరాలడిగారు.  ఆ చొరవతోనే మునిల్నీ, అందునా దూర్వాసుణ్ణి అవమానించారు.  ఆ చొరవతోనే మనల్ని  కప్పం కూడా అడిగారు.  ఆ చొరవకారణంగానే అంతం కాబోతున్నారు.  అంటున్నాడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడలా అనగానే, యాదవవీరులు పరస్పరం చేతులు చరచుకుంటూ ఇలా ఆట పట్టిస్తున్నారు.
యాదవులుప్పు మోవక మురారికి సోలలు మోవ కింక బో
రాదు, హలాయుధుం గొలువ రమ్మనరై రటుగాని యాగముం
గాదట చేయ హంసడిభక క్షితిపాల కుమారులంచు, నా
బీదలకేల పోగుబడి బెద్దఱికంబును బెట్ట బీరమున్
అవునండీ! యాదవులకు ఉప్పు మొయ్యకా తప్పదు, శ్రీకృష్ణుడికి సోలలు మొయ్యకా తప్పదు.  ఈ కాలం వారికి తెలియదు కానీ, మా చిన్నతనంవరకూ  కొలమానాలు సోలలు, వీసెలూ,  కుంచాలు వగైరా ఉండేవి.  అందుకే అంటున్నారు. మనకి ఉప్పు బస్తాలు మోయకా తప్పదు, శ్రీకృష్ణుడికి సొలలతో ఆ ఉప్పుని కొలుస్తూ అక్కడ పొయ్యకా తప్పదు. తప్పించుకోలేంరా బాబూ - అని అర్ధం.
ఇంకా నయం - బలరాముణ్ణి కూడా సేవకు రమ్మన్నారు కాదు. అలా అయితేగానీ హంసడిభకులు యాగం చెయ్యడం పూర్తికాదుట పాపం!  అంటూ యాదవ వీరులు అపహసిస్తున్నారు. మరికొందరైతే  "ఆ అల్పులకి ఎందుకయ్యా పోగుబడి పెద్దఱికము, అంటే  తెచ్చిపెట్టుకున్న పెద్దరికమూ, బెట్టబీరమున్, అంటే మహా పరాక్రమమూనూ.
ఇలా యాదువవీరులందరూ చేతులూ, జబ్బలూ చరుచుకుంటూ హంసడిభకుల్ని అపహాస్యం చేశారు.
శ్రీకృష్ణుడు కూడా వారితో వంతకలిపి  గలగలా నవ్వి, దూతగా వచ్చిన జనార్దనుడు వినేలా గంభీరంగా  ఇలా పలికాడు.
అరి గరమున నే దాల్చిన
నరి గరము నగేంద్రధీరు డయినం జెడడే
యరి దిరమై నన్నడుగుట
యరిది రమైకాభిలాషులగు నృపతులకున్
అరి అంటే చక్రము, శత్రువు, కప్పము అని అర్ధాలు.  కరము అంటే చేయి, మిక్కిలి; తిరము అంటే స్థిరము. అరిది అంటే అరుదైన.
సుదర్శన చక్రాన్ని చేతిలో నేను ధరిస్తే శత్రువు మిక్కిలి ధీరుడైనా - మహా పర్వతంలాంటి ధీరుడైనా సరే నాశనమైపోడా!
కప్పం చెల్లించమని ధీమాగా - తిరమై - నన్నడగడం, తమ సంపద నిలుపుకోవాలనుకునే రాజులకి చాలా అరుదైన విషయం సుమా.
రమా+ఏకలాభిలాషులగు నృపతులు  -  తమ రాజ్యాన్నీ, తమ సంపదనీ నిలుపుకోవాలనుకునే రాజులు ఎవరూ నన్ను కప్పం అడగరు. అడిగి, బ్రతికి బట్టకట్టారు.   హంసడిభకులు ఆడిగారు అంటే నాశనం కోరుకుంటున్నారు.
శ్రీకృష్ణుడు కొనసాగిస్తున్నాడు.
వెదకంబోయిన తీవ కాల దవిలెన్, వేయేల దుర్వాసుచే
మొదటన్ సంచకరంబు హంసడిభకోన్మూల క్రియాకేళికిం 
గుదురైయున్నది, సాటిగాక యిట మత్కోదండ కాండోదర
ప్రదర ప్రావరణాంబుద ప్రకట శంపాకంప శాత్కారముల్
శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటున్నాడు.  వెదకబోయిన తీగ కాలికి తగిలింది.  వెయ్యేల! హంసడిభకుల ఉన్మూలనక్రియ - పెకిలించి వెయ్యడం అనే కేళికి దూర్వాసుడు ముందే బయానా (సంచకరంబు – అంటే బయానా; వస్తువుల బేరసారాల్లో ముందుగా ఇచ్చే రొక్కం).  అంతకు పూర్వం హంసడిభకులు ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు మునులను అవమాన పరిచారు కదా.  వారిలో దూర్వాసమహర్షి కూడా ఉన్నాడు.  ఆయన తన తపోశక్తితో వారిని భస్మీపటలం చేయకుండా వెళ్ళి శ్రీకృష్ణుడితో చెప్పాడు.  శ్రీకృష్ణుడు హంసడిభకులని శిక్షిస్తానని దూర్వాసమహర్షికి అప్పుడే వాగ్దానం చేశాడు.
అందుకే ఇప్పుడు శ్రీకృష్ణుడు జనార్దనుడితో అంటున్నాడు.  సంధించిన బాణంతో నా ధనుస్సు ఒక మేఘం.  దానినుంచి ఉరుముల్లా ధ్వనిచేస్తూ (శాత్కారము) మెరుపుల్లా (శంపా) బాణాలు వెలువడటమొక్కటే తరువాయి.
ఉప్పు కప్పంగా అడిగి మమ్మల్ని అవమానించినందుకు కాదు. దూర్వాసాది మునిపుంగవుల్ని అవమానించినందుకు ఈ శిక్ష - అని.
“మత్కోదండ కాండోదర ప్రదర ప్రావరణాంబుద ప్రకట శంపాకంప శాత్కారముల్” అంటున్న శ్రీకృష్ణునిలో రౌద్రం స్ఫురిస్తోంది.
జనార్దనుడు వెళ్ళి హంసడిభకులకు ఏమి చెప్పలో, ప్రతిసందేశం వివరిస్తున్నాడు.
వారలతో నిట్లనుము.
ఈశు వరముచేత నెవ్వడే నిప్పాట
శూరుడైన - దువ్వుజూచి నక్క
యొడలు గాల్చికొన్న వడువున మీరింత
లావు మాటలాడ లజ్జగాదె!
జనార్దనా! వాళ్ళతో ఇలా చెప్పు.  శివుడిచ్చిన వరంతో ఎవడైనా ఇలా మహావీరుడే కావచ్చు.  కానీ అలాంటివాణ్ణి చూసి మీరిలా లావుమాటలు అంటే పెద్ద పెద్ద మాటలు, వీరాలాపాలు -  పలకడం సిగ్గు సిగ్గు.  పులిని చూసి నక్క తన ఒళ్ళంటా వాతలు పెట్టుకున్నట్టుగా ఉంది మీ వ్యవహారం.
హరి గదావిహార మల్లంత దోచిన
వరము మిమ్ము గాన వలతి యగునె! 
వెఱ్ఱివార!  పిడుగు వ్రేసిన దలటొప్పి
యాగునే!  వివేకమైన వలదె !
ఈ శ్రీకృష్ణుడి గదావిహారం అల్లంత దూరంలో కనిపించిందంటే చాలు, వరం గిరం పారిపోవలసిందే.  అది మిమ్మల్ని కాపాడగలుగుతుందా! వలతి అంటే సమర్ధము.
వెర్రిమొహల్లారా.  పిడుగు పడితే తలటొపీ ఆగుతుందా.  ఆ మాత్రం వివేకమయినా ఉండవద్దా మీకు!  బలపరాక్రమాలు లేకపోతే లేకపోయాయి, కనీసం వివేకమయినా ఉండవద్దా! అని ఎగతాళి.
అగునో కావో వరములు
డిగ విడువగ రాదు హంసడిభకుల, నన్నున్
మొగరించిన హరునైనను
జగమెఱుగగ దోలి తమ్ము జంపెద ననుమీ!
వరాలు ఉన్నయో, లెవో - అవి కాపాడతాయో కాపాడవో అది వేరే సంగతి.  హంసడిభకుల్ని మాత్రం వదలను. వదలరాదు.  సాక్షాత్తూ ఆ శివుడే వచ్చి నాతో తలపడితే - మొగరించినన్ - లోకమంతటికీ తెలిసేలాగా పారద్రోలి హంసడిభకుల్ని  వధిస్తానని చెప్పు.
యుద్ధం ఎక్కడ కావాలి? మధురా పట్టణమో, ప్రయాగయో, పుష్కరస్థలమో - ఎక్కడంటే అక్కడ, ద్వంద యుద్ధమా? ఏ అయుధాలయినా సరే! వారు కోరుకున్న ఆయుధాలతో - ఆ ఎంపిక కూడా వారిదే - ఆని శ్రీకృష్ణుడు హంసడిభకులకు ప్రతి సందేశం పంపించాడు.
శ్రీకృష్ణుని ప్రతిసందేశాన్ని తీసుకుని  జనార్ధనుడు తిరిగి వెళ్ళి హంస డిభకులకు  అంతా చెప్పాడు. అంతేకాదు  జనార్దనుడు శ్రీ కృష్ణుని గూర్చి, అతని వైభవం గురించి, అతని సభని గురించి, అతని భక్తులగురించి ఉపన్యసించగా, హంసుడు కోపించి అతనితో ఇలా అంటున్నాడు.   ఇది నాచన సోమనాథుని  గారి మరొక  రసవత్తరమైన పద్యం
 నిను రప్పింపకమున్న వేడ్కపడి పూనెన్ శార్ ఙ్గ కౌమోదకీ 
వనమాలాంబుజ జక్ర భూమికలుఁ  గైవారంబు జేయించె నే
లిన నాగారులచేత యాదవుల నోలిం గొల్చి కూర్చుండఁగాఁ
బనిచెన్ గేశవుఁడైంద్రజాలికు గతిం బ్రాతయ్యె నీకంతటన్
ఓరి పిచ్చివాడా!  కృష్ణుడుదేవుడూ  కాడు గీవుడూ  కాడు.    చెప్తాను విను.   ఆ  విల్లు (శార్ఙ్గ) , గద (కౌమోదకి),   మెడలోవేసుకున్న వైజయంతీమాల (వనమాలా), చేత్తొ పట్టుకున్న కలువపువ్వు  (అంబుజం),  సుదర్శనచక్రం   -అవన్నీ అతనికి సహజమైనవి కావు.    ఆ ఆయుధాలూ అవీ సభలో కూర్చున్నప్పుడు ఊరికే అలంకారప్రాయంగా ధరిస్తాడు.    దర్శనానికి వచ్చిన వారు చూసి హడిలిపోడానికి. ఉత్త హంగు, ఆర్భాటం, అంతే.
నువ్వు రావచ్చు అని కబురు పంపే ముందు అతడు  సభ తీర్చి, అందరినీ కూర్చోబెట్టి అలంకారాలు చేసుకొని, వంధి మాగధులని నిలబెట్టి పెద్ద పటాటోపం చేశాడు.  అదంతా చూసి నువ్వు పరమేశ్వర లక్షణ మనుకొన్నావు.
నిను రప్పింపకముందు అనడంలో వేషం పూర్తికాక ముందే వాడిని రానీకండి అని పడే తొందఱ వ్యంగ్యమౌతోంది.  వేగ పడి అనడంలో, తొందఱ తొందఱగా వేషం వేసుకుని.
వేడ్కపడి - అతని కది ఒక వేడుక.  అది సామర్థ్యము కాదు, శక్తీ కాదు.
సార్ఙ్గ-కౌమొదకీ...అనే సమాసం అంతా వ్యంగ్య సూచకమే.
ఏలిన నాగారుల చేత - తన పాలనలోని గరుత్మంతుడు నాగ + అరి - పాములకు శత్రువు. నాగారి కి బహువచనము నాగారులు.   ఇది ఆక్షేపణ కోసం.   ఎందుకూ పనికి రాని వాడిని "అబ్బ!  వచ్చారండీ దొరగారు " అన్నట్టు.    దీనిలో ద్వేషము వ్యంగము, నిరాదరణ వ్యంగము.
ఓలిం బిల్చి - వరుసగా పిలిచి యాదువలని పేరు పేరునా పిలిచి కూర్చోపెట్టాడట.
ఇదంతా హంసుడు ఊహించిన వ్యవహారం.  సర్వం కృష్ణుని యందు తిరస్కార భావం చూపిస్తుంది.
ఇదంతా ఆ కృష్ణుడు ఇంద్రజాలికుడిలా చేశాడు.    ఇంద్రజాలికుడు లేనిచోట ఉన్నట్టు కనిపించేలాగ చేస్తాడు.
ప్రాతయ్యె నీకంతటన్.   ప్రాతి అంటే ఆధిక్యము - గొప్ప.    అది నీకు గొప్పగా కనిపించింది.    అతని మాయలో పడిపోయి నువ్వు ఆ కిటుకుని గ్రహించలేకపోయావు. అన్నాడు హంసుడు.
ఆ తరవాత పుష్కర క్షేత్రంలో శ్రీకృష్ణుడికీ హంస డిభకులకీ మధ్య  ఘోర సంగ్రామం జరిగింది.   శ్రీ కృష్ణుడు హంసుడిని ఒక పెద్ద మడుగులో తొక్కి చంపేశాడు .  అప్పుడు తమ్ముడు డిభకుడు ఇలా విలపిస్తున్నాడు.
నా యెల్లినీడలోన నరలోకమేలుదు నను
    లావు వఱితి పాలయ్యెనన్న
దేవేంద్రునకునైనఁ దేఱి చూడఁగ రాని
    గర్వోన్నతి నీటఁ గలసెనన్న
పార్వతీ పతి చేతఁ బడసిన దివ్యాస్త్ర
    భూరి సంపద వెల్లిబోయెనన్న
వలరాజునకునైన వర్ణింపగాఁ దగు తనూ
    విలాసం బేఱు గొనియెనన్న
యన్న నీ యట్టి యన్న నన్ననుదినంబుఁ
గారవింపఁగ నుండ నే కరదు నింక
నింక జాల నెవ్వ గలచే నిచట నిలువ
నాకు నేల - నీ తోడిదే లోకమన్న   
అన్నగారి చావుకు తమ్ముడు  ఏడ్చిన  ఏడుపిది.
ఎల్లి అంటే రేపు, గొడుగు అని అర్ధాలు.  నా గొడుగు నీడలో ఈ లోకమంతా ఏలుతానన్న ఓ  అన్నా,  నీ  లావు, బలం కాస్తా వరదపాలయింది కదా.
దేవేంద్రుడైనా తేరిపార చూడలేని నీ గర్వోన్నతి నీటిలో కలిసిపోయింది కదా అన్నా.
పరమశివుడి చేత పొందిన గొప్ప దివ్యాస్త్ర సంపద అంతా ప్రవాహంలో కొట్టుకుపోయింది కదా ఓ అన్నా. వెల్లి అంటే ప్రవాహం. వెల్లి వచ్చింది, వెల్లువొచ్చింది అంటాం కదా.
మన్మధుడితో పోల్చదగిన నీ సుందరమైన రూప లావణ్యాన్ని ఏఱు తీసుకుపోయింది, ఏటిలో కొట్టుకుపోయింది కదా అన్నా.
ఒరేయ్ అన్నయ్యా నన్ను ఎంతో గారం చేస్తూ ఉండేవాడివి, ముద్దు చేస్తూ ఉండే వాడివి.  ఇంక అలాంటిదెవీ లేకుండా ఉండిపోయాను. ఇంకా నేనెందుకు ఇక్కడ ఉండాలి.  నాకు నీ తోడిదే లోకంరా అన్నయా - అని విలపించాడు.
వఱితి పాలయ్యెను, నీట గలసెను, వెల్లిబోయెను, ఏఱు గొనియెను - ఈ మాటలకు నశించిపోయింది అని తాత్పర్యం.  శ్రీకృష్ణుడు హంసుణ్ణి మడుగులో తొక్కి చెంపేశాడు. కాబట్టి వాచ్యర్థం.  వాచ్యార్థం, తాత్పర్యార్థం రెండూ కలిసేలాగ పదాలు కూర్చాడు కవి.
ఆ రోషంతో వెళ్ళి డిభకుడు శ్రీకృష్ణుడితో తలపడ్డాడు.  శ్రీ కృష్ణుడు అతన్ని కూడా సంహరించి దుష్ట శిక్షణ చేశాడు.
పరమ శివుడిచే పొందిన దివ్యాస్త్రాలు గానీ, వరాలు గానీ హంస-డిభకుల్ని రక్షించలేకపోయాయి.
ఇదండీ - శ్రీమత్సకల భాషా భూషణ, సాహిత్య రస పోషణ, సంవిధాన చక్రవర్తి, సంపూర్ణ కీర్తి, నవీన గుణసనాథ, నాచన సోమనాథ ప్రణీతంబైన "ఉత్తర హరివంశం" బను  గ్రంథంబు నుండి హంస డిభకుల వృత్తాంతం - టూకీగా.
తెలుగు కవిత్వాన్ని తేజో వంతం చేసిన కవుల్లో నాచ సొమన్న ఒకడు.  అందుకే "సోముడు భాస్కరుండు, వెలిగింపన్" అన్నాడు రామరాజ భూషణుడు.
స్వస్థి ! సర్వేజనా స్సుఖినో భవంతు !!

No comments:

Post a Comment

Pages