ప్రేమతో నీ ఋషి – 21 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 21

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తుండగా,  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో మాట్లాడాలని కోరుతుంది. ఇక చదవండి...)
ఒక గంట తర్వాత తన గదికి చేరుకున్న ఋషి కూడా, అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసి, స్నిగ్ధ లాగే షాక్ లోనే ఉన్నాడు. ఇంతవరకు అతను అప్సర ఇంట్లో చూసిన విశ్వామిత్ర పెయింటింగ్ ను గురించి, అతనికి మాత్రమే తెలిసిన కొన్ని కారణాల వల్ల, అతనికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాని, కొత్తగా గార్డెన్ హోటల్ లో అసలు పెయింటింగ్ బయట పడడంతో, అప్సర ఇంట్లో అతను చూసిన పెయింటింగ్ నకిలీదని రుజువుచేసింది.
క్షణాలు అతను ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో మౌనంగా ఉండిపోయినా, త్వరగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆపరేషన్స్ మేనేజర్ కు ఫోన్ చేసి, రెండవ సారి ఆ పెయింటింగ్ ను చూడాలని కోరాడు. అతనూ వివేకం కల వ్యక్తిగా, వెంటనే అతని అభ్యర్ధనను మన్నించాడు. అప్పుడే స్నిగ్ధ అతనికి ఫోన్ చేసింది. తనను హాల్ లో కలవమని ఋషి చెప్పాడు.
ఋషి స్నిగ్ధ మానసిక స్థితిని అవగాహన చేసుకున్నాడు. మొదట ఆమె ఋషి చెప్పినదాన్ని నమ్మలేకపోయింది. కాని, ఇప్పుడు అసలు పెయింటింగ్ ను చూసాకా, ఆమె కూడా గత కొద్ది రోజులుగా జరిగిన సంఘటనలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
స్నిగ్ధ ఋషిని హాల్ లో కలిసింది, ఋషి ఆమెను చూసి నవ్వాడు, ఇద్దరూ కలిసి ఆపరేషన్స్ మేనేజర్ వద్దకు వెళ్ళారు. అతను వారిని పోర్త్రైట్స్ ఉంచిన హాల్ లోకి తీసుకువెళ్ళాడు. ఋషి, స్నిగ్ధ మరొకమారు ఆ పెయింటింగ్ ను మరింత నిశితంగా పరిశీలించసాగారు.
“కాని, ఇవన్నీ అసలైన పెయింటింగ్స్ అని మీరు ఎలా నిర్ధారిస్తారు ?” ఋషి ఇప్పుడు విషయాన్ని మూలాల నుంచి నిర్ధారించుకునేందుకు నిశ్చయించుకున్నాడు. మహేంద్రకు విషయం చెప్పేముందు అతను ఒకటికి రెండుసార్లు ఖాయం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అతని సందేహం ఏమిటంటే – ఈ పెయింటింగ్ ఎందుకు నకిలీది కాకూడదు, అప్సర వద్ద చూసింది అసలు పెయింటింగ్ ఎందుకు అయ్యుండకూడదు, అని.
మొదట, ఆపరేషన్స్ మేనేజర్ ఋషికి విశ్వామిత్ర పెయింటింగ్ కు సంబంధించిన ప్రామాణిక పత్రాలను అందించాడు. ఈ మూల పత్రాల్లో ఆ చిత్రం యొక్క మూలం, యజమానుల చరిత్ర, అది సృష్టించబడిన  సాంఘిక, ఆర్ధిక, చారిత్రక నేపధ్యాలు ఉంటాయి. అవి ఈ చిత్రం యొక్క ప్రామాణికతను తెలుసుకునేందుకు సహకరిస్తాయి.
స్నిగ్ధ ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, తాము కొన్న చిత్రం యొక్క పత్రాలు పూర్తి విభిన్నంగా ఉండడాన్ని గుర్తించింది.
ప్రామాణిక పత్రాలు మాత్రమే కాకుండా , మామూలుగా చిత్రం యొక్క విశ్వతనీయతను నిర్ధారించేందుకు ఎన్నో శాస్త్రీయ పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఉదాహరణకు, ఆ ఆర్టిస్ట్ మామూలుగా వాడే రంగుల పొరలను పరిశీలించి, అవి ఈ చిత్రాలతో సరిపోతున్నాయా అని, నిర్ధారిత సమయంలో వారు విశ్లేషించిన వర్ణద్రవ్యాలు ఉన్నాయా అని చూస్తారు.
“మేము హోటల్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా హోటల్ లోని ఆర్ట్ వర్క్స్ ప్రాజెక్ట్ లో ఉండగా, మేము అన్ని పెయింటింగ్స్ పై అందుబాటులో ఉన్న శాస్త్ర పరీక్షలన్నిటిని  జరిపాము. “ వివరించాడు మేనేజర్. అలా చెబుతూ ఉండగానే, వారు మరొక పెద్ద పెయింటింగ్ వద్దకు చేరుకున్నారు. అది రాముడి కవలలు అయిన ‘లవ కుశల’ పెయింటింగ్. అందులో లవకుశలు వాల్మికి మహర్షి ఆశ్రమంలో ఆడుకుంటూ ఉండగా, సీతమ్మ వారిని చెట్టు చాటు నుంచి చూస్తున్నట్లు, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో రామాయణం రాస్తున్నందున ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నట్లు చిత్రీకరించబడింది. మనోజ్ఞమైన ఆశ్రమ చిత్రణతో అది వెంటనే చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతి సూక్ష్మమైన అంశం గురించి చిత్రకారుడు తీసుకున్న శ్రద్ధ అందులో కనిపిస్తోంది.
ఆ పెయింటింగ్ ను చూపుతూ, ఆపరేషన్స్ మేనేజర్ ఋషితో ఇలా అన్నాడు,” మొదట ఈ పెయింటింగ్ కూడా ప్రద్యుమ్న వేసాడని భావించారు. కాని మా ఆర్ట్ కన్సల్టెంట్ లు ఇదొక నకిలీ పెయింటింగ్ అని నిర్ధారించారు. కారణం – ఆ కాలంలో ఉన్న ప్రద్యుమ్న చిత్రాలకున్న లక్షణాలు దీనికి లేవు – సూటిగా ఉండే  గీతలు, స్పష్టత, బిగువు, ధోరణిలో వైవిధ్యాలు వంటివి ప్రద్యుమ్న చిత్రాలకు హాల్ మార్క్స్ గా భావించవచ్చు, అవిందులో లేవు. “
అతను చెప్పే సూక్ష్మ భేదాలన్నీ ఋషికి అర్ధం కాకపోయినా, స్నిగ్ధ మొత్తం సంభాషణను అత్యంత శ్రద్ధగా వినసాగింది. ఆపరేషన్స్ మేనేజర్ మాట్లాడిన ప్రతి మాటను ఆమె అభినందించగలదు. కేవలం నిపుణుల పరిశీలన మాత్రమే ఒక చిత్రం యొక్క ప్రామాణికతను తెలుపగలదు.
“ప్రద్యుమ్న మామూలుగా చాలా తక్కువ రకం ఆర్ట్ పేపర్ ను వాడేవాడని మా కన్సల్టెంట్ లు గుర్తించారు. కాని, ఈ పెయింటింగ్ కోసం, తాజాగా బ్లీచ్ చేసిన తెల్లటి నాణ్యమైన పేపర్ ను వాడారు. దాన్నిబట్టి వారు ఈ పెయింటింగ్ 1950 కి ముందుది కాలేదని నిర్ధారించారు, కాని దానికి చాలా ఏళ్ళ ముందే ప్రద్యుమ్న ప్రముఖ చిత్రకారుడిగా పేరు పొందారు.
అంతలో ఒక సేవకుడు నారింజ రసంతో ఆ గదిలోకి అడుగుపెట్టాడు. ఋషి ఒక్క ఉదుటన దాన్ని అందుకుని, ఒక్క గుక్కలో తాగేసాడు. మిగతా రోజుని శక్తివంతంగా గడిపేందుకు అతనికి అప్పుడది ఎంతో అవసరం. స్నిగ్ధ కూడా మరొక గ్లాస్ ను తీసుకుంది.
ఋషి నారింజ రసం తాగుతూ ఉండగా, పునరుద్ధరణ ప్రాజెక్ట్ లో భాగంగా కన్సల్టెంట్ తమకు అందించిన, ప్రద్యుమ్న పెయింటింగ్ యొక్క ప్రామాణికత రిపోర్ట్ ను మేనేజర్ అతనికి ఇచ్చాడు. అందులో పెయింటింగ్ మీద జరిపిన వివిధరకాల శాస్త్ర పరీక్షల విశ్లేషణలు ఉన్నాయి. ప్రద్యుమ్న వేసినవని భావించిన 8 పెయింటింగ్స్ లో 2 కావని తిరగగొట్టారు, అందులో ఒకటి ఈ లవకుశ పెయింటింగ్. మరొకటి ఝాన్సి రాణి పెయింటింగ్. x –రే విధానం ద్వారా సైంటిస్ట్ లు దీనిపై పనిచేసారు. x –రే ద్వారా తీసుకున్న చిత్రాలు, ఈ చిత్రం వెనుక మరొక స్త్రీ చిత్రం ఉండడాన్ని గమనించారు. ఆ అవుట్ లైన్ ను ఉపయోగించి, కాన్వాస్ పై నకిలీ చిత్రాన్ని సృష్టించారు.  ప్రద్యుమ్న చనిపోయిన తర్వాత కనుగొన్న తెల్లటి కొత్తరకం పెయింట్ ను కూడా ఆ చిత్రంలో వాడినట్లు ఈ పరీక్షల ద్వారా తెలిసింది. పైనున్న పెయింట్ ఆధునికమైనదని, అసలు పెయింటింగ్ స్వభావం పోకుండా దాన్ని వాడారని కూడా తెలిసింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత, అది నకిలీదని వారు నిర్ధారించారు.
విశ్వామిత్ర పెయింటింగ్ కు సంబంధించి, x –రే విధానం ద్వారా ఏ ఫలితాలు రాలేదు. డిజిటల్ ఇమేజ్ గణాంకాల విశ్లేషణను కూడా వాడారు. ఆర్ట్ లో ఉన్న నకిలీ చిత్రాలని గుర్తించేందుకు అత్యాధునిక విధానం ఇది. ‘వేవ్ లెట్ డికంపోసిషన్ ‘ అనే విధానం ద్వారా చిత్రాన్ని సూక్ష్మ భాగాలుగా, కొన్ని పట్టీలుగా విభజిస్తారు. ఈ పట్టీలను విశ్లేషించి, ఉపరితలం, ఒక్కో పట్టీకి తగిన పౌనఃపుణ్యాన్ని నిర్ధారిస్తారు. నీలాకాశం వంటి విశాలమైన స్ట్రోక్స్ తక్కువ పౌనఃపున్యం కల బ్యాండ్( పట్టీ) లను సృష్టిస్తే, గడ్డి కొసల వంటి పదునైన గీతలు ఎక్కువ పౌనఃపున్యం కల బ్యాండ్ లను సృష్టిస్తాయి. . ఈ ‘వేవ్ లెట్ డికంపోసిషన్ ‘ విధానం ద్వారా ప్రద్యుమ్న యొక్క 8 పెయింటింగ్స్ ను పరీక్షించారు. విశ్వామిత్ర చిత్రం ఈ పరీక్షల్లో అసలుదని తేలితే, లవకుశ, ఝాన్సీ రాణి చిత్రాలు ఇందులో నకిలీవని తేలిపోయాయి.
“కృష్ణ ,సత్యభామ ‘ పెయింటింగ్ విషయంలో పునరుద్ధరణ టీం ఒక ఆసక్తికరమైన అంశాన్ని కనుగొంది. భారతీయ చిత్ర చరిత్రకారులంతా ప్రద్యుమ్న ఒక్కడే చిత్రాలను పెయింట్ చేసేవాడని నమ్మేవారు. కాని,  ‘వేవ్ లెట్ డికంపోసిషన్ ‘  విధానం ఆ చిత్రానికి  కనీసం నలుగురు ఆర్టిస్ట్ లు పనిచేశారని తేల్చింది.
ఈ పరీక్షలన్నిటి తర్వాత, విశ్వామిత్ర పెయింటింగ్ ను “ప్రామాణికమైనది” గా అధికారికంగా నిపుణులు నిర్ధారించారు. దాని కాపీ నే ఇప్పుడు ఋషి, స్నిగ్ధ చేతుల్లో ఉంది.
వారు మున్ముందు తీసుకోవాల్సిన నిర్ణయాల్ని ఆ పెయింటింగ్ స్పష్టం చేసింది. అప్సర ఇంట్లో ఉన్న పెయింటింగ్ నకిలీదని తేలిపోయింది. ఋషి మేనేజర్ కు కృతఙ్ఞతలు చెప్పి, స్నిగ్ధతో కలిసి, అతని రూమ్ వైపుకు కదిలాడు.
అతను తన గది తలుపు తీసి, లోనికి వెళ్ళాడు, ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది. అతను అభ్యంతర పెట్టలేదు. ఆమె ముఖంలో కనిపిస్తున్న  పశ్చాత్తాపాన్ని అతను గుర్తించాడు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages