సింహాద్రి నారసింహ శతకము - గోగులపాటి కూర్మనాథ కవి
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం
గోగులపాటి కూర్మనాథ కవి క్రీ.శ. 1750 కాలమునాటి కవి అని శతక చరిత్రకారుల అభిప్రాయము. ఇతని ఇతర గ్రంధముల వలన ఇతడు ఆపస్తంబసూత్ర, ముద్గల గోత్ర ఆరువేల నియ్యోగి బ్రాహ్మణుడు. తల్లి గౌరమాంబ, తండ్రి బుచ్చిమంత్రి. వెంకన్న కామన్న సోదరులు. ఈతని తాత సూరనార్య్డు. శ్రీతిరుమల పెద్దింటి సంపత్కుమారవేంకటాచార్యుని శిష్యుడు.
ఈ విషయంలను మృత్యుంజయవిలాసము నందు కవి చెప్పుకొన్నవాడు.
ద్వి. శ్రీ సింహభూధర శ్రీరామతీర్థ! భాసురస్థలముఖ్యబాహు దేశములకు నాచార్యు లుభయవేదాంతరహస్య! ధీచాతురాత్ములు తిరుమలవంశ కలశాంబురాశి రాకాచంద్రమూర్తి! సలలిత పద్దింటి సంపత్కుమార శ్రీవేంకటార్య దేశికుల శిష్యుఁడను! పావన గౌరమాంబా బుచ్చిమంత్రి వరపుత్రుఁడను సూర్యవరుని పౌత్రుఁడను! ఇరువొంద గాశిరామేశ్వరముఖ్య సరసదివ్యక్షేత్ర సంచార్భవ్య! కరులైన వెంకన్న కామన్న యనెడు ననుజన్ములనుగూడి యలరినవాడ శ్రీకూర్మదాసాఖ్యఁ చెందినవాడ!
ఈకవి యవ్వన కాలమున విజయనగర సంస్థానమునందలి శ్రీరామతీర్థము, పద్మనాభము, సింహాచలము మొదలైన క్షేత్రములందు దేవస్థానాధికారిగా ఉండెడివాడు. తరువాత, గజపతినగరమునకు సమీపమున ఉన్న దేవులపల్లి గ్రామమున ఉండి అచ్చటనే మృత్యుంజయవిలాసము అను కావ్యాన్ని రచించెను.
ఈ కవి రచించిన నాలుగు గ్రంధములు అందుబాటులో ఉన్నాయి. 1. లక్ష్మీ నరసింహ సంవాదము (పద్యకావ్యము) చోరసంవాదము మని కూడా మారుపేరు., 2. మృత్యుంజయవిలాసము (యక్షగానము) 3. సింహాద్రి నారసింహశతకము. 4. సుందరీమణి శతకము
శతక పరిచయం:
"వైరిహరరంహ సింహాద్రినారసింహ" అనే మకుటంతో రచించిన ఈ శతకం భక్తి, అధిక్షేప భరిత సీసపద్య శతకం.
ఈకవికాలమున తురుష్కులు దేశములోని హిందు దేవాలయాలను ముట్టడించి అందున్న సర్వమును కొల్లగోట్టుచుండిరి. అట్లు వారు సింహాచల దేవాలయమును ముట్టడించినప్పుడు ఈ కవి ఆవేశమున చెప్పినదే ఈశతకము. ఈ తురుష్కుల దౌర్జన్యమును కళ్ళారాచూసిన కలిగిన ఆవేశంలో శతకము ఆరంభించి, దేవుడిని ఉద్దేశించి మాట్లాడి, బ్రతిమాలి, నిందించి పరిహాసము చేసి పద్యములు చెప్పెను.
ఈశతకము గురించి ఒక కథ కూడా చెప్పుతారు. ఈశతకంలో కొన్ని పద్యములు చెప్పగానే ఎచ్చటినుండియో కొన్ని లక్షల తేనెటీగలు వచ్చి మహమ్మదీయులను చీకాకు పరచి వారిని పారిపోయినట్లు చేసినవి అని, ఆపైన దేవుని లీల వలన జరిగిన ఈ అద్భుతాన్ని కీర్తిస్తు మిగిలిన పద్యములను చెప్పి శతకం పూర్తి చేసినట్లుగా తెలుస్తున్నది. అందుకే శతకంలో మొదటి 67 పద్యములు భగవంతుని బ్రతిమాలుతు, నిందిస్తు, పరిహసిస్తు చెప్పినవి ఐతే 68 వ పద్యము నుండి దేవుని లీలలను పొగడుతు, చెప్పినవి.
ఈ కవి రచనలు మృదుపద గుంభితములు. ఈశతకమునందు యుక్తియుక్తములగు సామెతలు, మృదుమధురమగు మాటల పొందిక ప్రతి పద్యంలో చూడవచ్చును. మచ్చుకి కొన్ని పద్యాలను చూద్దాము.
అధిక్షేపణ చేయటంలో ఈ కవి ప్రజ్ఞ కి ఉదాహరణలు చూడండి.
శీ. మొగిసి రక్కసుని బొండుగఁ జించునీగోళ్లు, చితిలెనో సిరికుచశిఖరి దాఁకి
యరులపై భగభగలాడుకోపజ్వాల, లారెనో శ్రీకటాక్షామృతమునఁ
బరవీరగర్భము ల్పగిలించుబొబ్బ ప, ల్కదో రమానందగద్గదికచేత
ఖలుల దండింపగాఁ గఠిన మౌనీగుండె, కరఁగనో శ్రీలక్ష్మి సరసకేళి
తే. నహహ నీభీకరోద్వృత్తి నల్పు లనక
యవనరాజుల నడఁచి వ్రేయంగ వలయు
పిన్నపాముకైనను పెద్దదెబ్బ
వైరిహరరంహ సింహాద్రి నారసింహ!
సీ. పాశ్చాత్యుల నమాజుపై బుద్ధిపుట్టెనో, మౌనులజపముపై మనసురోసి
యవనులకందూరియం దిచ్చ చెందెనో, విప్రయజ్ఞములపై విసువుబుట్టి
ఖానజాతిసలాముపై నింపుబుట్టెనో, దేవతాప్రణతిపై భావ మెడలి
తురకలయీదునందు ముదంబు గల్గెనో, భక్తనిత్యోత్సవపరత మాని
తే. వాండ్రు దుర్మార్గు లయ్యయో వ్రతము చెడ్డ
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరఁగఁదోలు
పారసీకాధిపతుల పటాపంచలుగాను
వైరిహరరంహ సింహాద్రి నారసింహ!
దశావతారవర్ణనతోనే అధిక్షేపిస్తున్న ఈ చాతుర్యం అద్భుతం
సీ. సముద్రగ్ర మగుసముద్రముజొచ్చి యీఁదుటో, కొండ నెత్తినిఁ బెట్టుకొంట యొక్కొ
ధరణీస్థలి ద్రవ్వి తల నెత్తుకొంటయో, గొబ్బున సింగంపుబొబ్బ యిడుటొ
యడిగిడి త్రైలోక్యమాక్రమించుట యొక్కొ, వేయిచేతులవాని వేయుటొక్కొ
యొకశరాగ్రమ్మున నుధధి నింకించుటో, కరిపురంబెల్ల బెగల్చుటొక్కొ
తే. కరుణ జగములఁ బ్రోచుటో తురగమెక్కి
ఘనరిపుల గొట్టుటో తురుష్కవధ యెంత
కొండయెక్కెదు బ్రతిమాలుకొనినకొలఁది
వైరిహరరంహ సింహాద్రి నారసింహ!
ఆనాటి తురుష్కుల దుండగాలు వర్ణిస్తూ చెప్పిన పద్యాలు
సీ. ఎలమితో సోమయాజుల పెద్దఝూరీలు, గుడిగుడీలుగఁ జేసికొనెడువారు
యజ్ఞవాటికలలో నగ్నిహోత్రంబుల, ధూమపానము జేసి త్రుళ్ళువారు
యాగపాత్రలుదెచ్చి హౌసుగావడిలుడి, కీచిప్పలుగ జేసి కేరువారు
స్రుక్స్రువముఖ్యదారుమయోపకరణము ల్, గొనిపోయి వంతపొయి నిడుకొనెడువారు
తే. నగుచు యవనులు విప్రులఁ దెగడుచుండ
సవనభోక్తవు నీ విట్లు సైఁపదగునే
తినఁ దినఁగ గారెలైనను కనరువేయు
వైరిహరరంహ సింహాద్రి నారసింహ!
సీ.నీరుహుక్కా పకడోరె గద్దాయని, యాహితాగ్నుల నెత్తు లణఁచకుండ
పాముధోనేకు తుం పాని లారే యని, తివిరి శ్రోతీయుల మర్ధింపకుండ
ఘూసులారె అరే గాండూ యనుచు శిష్ట, తతులపైఁ బడి పడుఁ దన్నకుంద
కులితీ పకావురే జలిదీ యటంచు మా, ధ్వుల మెడ వడిఁ బట్టి త్రోయకుండ
తే. బహులహాలామదావిలపరుషయవన
రాజి నిర్జింపు నీవంటి ప్రభువు గల్గ
బ్రాహ్మణులకిట్టి పాట్లు రారాదు గాదె
వైరిహరరంహ సింహాద్రి నారసింహ!
సీ. గ్రామంబు లన్నియుఁ గాల్చి దీపారాధ, నలు చేసి రౌర యానందముగను
వడి సాధుజనుల సర్వస్వమ్ముఁ గొని శఠ, గోపంబు బెట్టిరి గురుతరముగ
పటఘటాదులు పోవఁ బ్రతిమాలువారి కే, మియ్యక ఘంతవాయించి రహహ
పెద్దలకడ దుడ్డుపెట్టి ప్రసాదంబు, వడ్డించి తగ పరవశులఁ జేసి
తే. రవుర యవనార్చకులు నీకు నాప్తులైరి
భూసురులు సేయు పూజలు పొసఁగ వొక్కొ
అకట యిది యేమి పాపమునకు వెఱువవు
వైరిహరరంహ సింహాద్రి నారసింహ!
ఇలా చెప్పుకొంటు పోతే చక్కని అధిక్షేప పద్యాలు అనేకం చూడవచ్చు
మూందు చెప్పిన కథలో వలె మహమ్మదీయులపై గండుతుమ్మెదల దాడిని ఈ కవి 68వ పద్యంలో వర్ణించాడు.
సీ. కారుణ్యదృష్టిచేఁ గనిమమ్ము రక్షింప, నీరజేక్షణ నేఁడు నీవుబంపఁ
బారసీకుల దండుపైఁ గొండలో నుండి, గండుతుమ్మెదలు నుద్దండలీల
గల్పాంతమున మిన్ను గప్పి గంభీరమైన, కారుమేఘంబులు గవిసినట్లు
దాఁకిభోరున రక్తధారలు గురియగా, గఱ నెత్తురుపీల్చి కండలెల్ల
గీ. నూడిపడ నుక్కుమూతుల వాఁడి మెఱసి
చించి చెండాడి వధియించెఁ జిత్రముగను
నొక్కొక్కని చుట్టుముట్టిబల్ మిక్కుటముగ
వైరిహరరంహ సింహాద్రి నారసింహ!
ఆపైని పద్యాలలో భక్తిరస సీసపద్యాలలో భవత్ప్రార్థన అత్యంత మనోహరంగా చేసినాడు. చక్కని మృదుమధురమైన శబ్దాలతో, సామెతలతో, సంభాషణలవంటి వాక్యాలతో, సున్నితమైన పరిహాసముతో, కఠువైన అధిక్షేపణలతో ఈ కవి తనదైనశైలిలో భగవంతునికి అర్పించిన ఈశతకం శతకసాహిత్యంలో ఒక గీటురాయి. అందరు చదివి ఆకళించుకోవలసిన శతకం. మీరు చదవండి అందరిచే చదివించండి.
***
No comments:
Post a Comment