సుద్దాల అశోక్ తేజ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

సుద్దాల అశోక్ తేజ గారితో ముఖాముఖి

Share This

సుద్దాల అశోక్ తేజ గారితో ముఖాముఖి 

భావరాజు పద్మిని 


మూర్తీభవించిన సంస్కారం, అణకువతో మాట్లాడే మాట, ఆ మాటలో అద్భతమైన సంతులనం, అఖండమైన మేధస్సు, నిశిత పరిశీలన, అన్ని రకాల పాటల్ని చక్కగా పండించగల నేర్పు – కలిపితే, ‘సుద్దాల అశోక్ తేజ’ గారు. తెలుగు సినిమా పాటకు ముచ్చటగా మూడోసారి జాతీయ అవార్డును సంపాదించి పెట్టిన సినీ రచయత అశోక్ తేజ గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...
నమస్కారమండి. ముందుగా మీ నాన్నగారి ప్రభావం మీపై ఎంత ఉందో చెబుతారా ?
నమస్కారమమ్మా, తప్పకుండా.  మా నాన్నగారు సుద్దాల హనుమంతు గారు. సుద్దాల అనేది నిజానికి మా ఊరి పేరు. ఇది జనగాం జిల్లా లో ఉంది. వారు స్వాతంత్ర్య పోరాటం తర్వాత తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులు. ఆయన ప్రజల్లో తన బుర్రకధలు, పాటలు, గొల్ల సుద్దుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేవారు. ‘పల్లెటూరి పిలగాడు,’ ‘వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ’ వంటి పాటలు అందులో కొన్ని. మా ఇల్లు ఒక సామాజిక వికాస కేంద్రంలా ఉండేది. మా ఇంట్లో కళాత్మక వాతావరణం ఉండేది.
మా నాన్నగారు RMP వైద్యులు. 5,6 ఊళ్లు కాలి నడకన తిరిగి వైద్యం చేసేవారు. అమ్మ కుట్టుమిషను కుట్టేది. వారు జీవితంలో ఎన్నో ఎగుడుదిగుళ్ళను చూసారు. ఉద్యమానికి పిల్లలుంటే అడ్డమని, చాలా రోజులు వద్దనుకుని, తర్వాత ఆలస్యంగా కన్నారు. మా నాన్నగారికి 49 ఏళ్ళప్పుడు నేను పుట్టాను. ఆయన ప్రతిరోజూ రాత్రి ఒక కందిలి (లాంతరు)పట్టుకుని, ఊళ్ళో ఉన్న గుడి అరుగుమీద బాటసారులు ఎవరైనా ఉన్నారా అని చూసి, ‘వారు ఆకలితో ఉన్నారా, వారికి పడుకోడానికి చాపుందా,’ ఇవన్నీ కనుక్కుని వచ్చి, ఎవరైనా ఆకలితో ఉంటే వెంటతీసుకుని వచ్చి, భోజనం చేసేవారు. కళాకారులు ఎవరైనా ఇంటికి వస్తే, వారిని ఆయా కళలలోని విశేషాలు అడిగి తెలుసుకునేవారు. చివరికి ఆయన కాన్సర్ తో చనిపోయారు. నా మీద ఆయన ప్రభావం ఎంతో ఉంది.
మీరు ఏ వయసు నుంచి రచనలు ప్రారంభించారు ?
నాకు తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడు ఒక పాట రాసాను. అది అమ్మకి వినిపించాను. ఆవిడది నాన్నకు చూపిస్తే, ఆయన నాకేం చెప్పకుండా, నేరుగా ఆయన మిత్రుల్ని పిలిచి, వాళ్ళముందు పాడించారు. అది జండా మీద రాసిన పాట వారు నా పాట విని, వారి చప్పట్లతో నా మనసు మీద బలమైన ముద్ర వేసారు. అది ఎంత బలీయమైన ముద్రంటే, ఢిల్లీ లో జాతీయ అవార్డు తీసుకుంటుంటే, జనం కొట్టిన చప్పట్లలో నాకు ఆ రోజున నాన్న స్నేహితులు కొట్టిన చప్పట్లే వినిపించాయి.
ఈ చప్పట్లనే ప్రోత్సాహం ద్వారా నాన్న నాకు జీవితకాలానికి నిచ్చెనను ఇచ్చారు. కాని, ‘ చిన్నప్పటి నుంచి రాస్తే నీలోపలి శక్తి అంతా అయిపోతుంది, అందుకని ముందు నువ్వు బాగా పుస్తకాలు చదువు’ అని చెప్పారు. మా అమ్మ చదవని పుస్తకం లేదు. ఆవిడ మిషను కుడుతూ నన్ను పుస్తకాలు చదివి, వినిపించమనేది. అమ్మ ద్వారా పుస్తకాలకు దాసోహమయ్యాను. ప్రతిరోజూ బడి నుంచి రాగానే, అమ్మ దగ్గర కూర్చుని, నిన్న చదవడం ఆపిన భాగం నుంచి కొనసాగించి, వినిపించేవాడిని. అమ్మ వేరే పన్లో ఉంటే, ‘అమ్మా, నిన్న ఆపిన దగ్గర్నుంచి చదివి వినిపిస్తాను, రా’ అంటూ లాక్కొచ్చేవాడిని. ఆ తర్వాత అమ్మ కోసం ఆగకుండా నేనే చదివేసుకునే వాడిని. ఇలా నా పదో తరగతి పూర్తయ్యేసరికి శరత్, చలం, కొమ్మూరి వేణుగోపాలరావు, తెన్నేటి హేమలత గార్ల రచనలన్నీ చదివేసాను. తెన్నేటి హేమలత గారు మహిళా లోకానికి మణిపూస వంటివారు. వారి రచనల్లో స్త్రీని సమున్నతంగా చిత్రించే విధానం ఎంతో బాగుంటుంది.
ఇలా క్లాసు పుస్తకాల కంటే, ఈ పుస్తకాలే ఎక్కువ చదివాను. నేను 8 వ తరగతిలో ఉండగా మిల్టన్ రాసిన పాఠం మొత్తం ఒక పాటగా రాసాను. టీచర్లు, స్టూడెంట్స్ ఎంతగానో మెచ్చుకున్నారు. అప్పటి నుంచి నేను పాటని వదలలేదు. నా జీవితంలోకి  పాటోచ్చాకా పాట నన్ను వదలలేదు.
బాగుందండి, ఆ తర్వాత మీ పాటల ప్రస్తానం ఎలా కొనసాగింది ?
నేను యాకత్పుర లో ఇంటర్ చదువుతూ ఉండగా, మా కాలేజీ ప్రిన్సిపాల్ అప్పారావు గారు, ఓ సరికొత్త పోటీ పెట్టారు. అది కొత్త పాటని రాసుకొచ్చి, పాడే పాటల పోటీ. అప్పుడు నాకు 16,17 సం. ఉంటాయేమో. ఆ పోటీకోసం పాట రాసేందుకు నేను ‘మెహెంది’ అనే వేశ్యా వాడకు వెళ్లాను. వయసు పైబడ్డ ఒక పెద్దావిడ నా వెంట పడితే, పరుగెత్తాను. చివరికి ఆమెతో ‘ నేనో పాట రాసేందుకు ఇటు వచ్చాను, అందుకోసం నాకు ఎవరిదైనా ఇంటర్వ్యూ కావాలి పెద్దమ్మా,’ అని అడిగి, అప్పుడు నా సిన్సియారిటీ గమనించి, నాముందే కూర్చుని మాట్లాడాలని చెప్పింది ఆమె. అది ‘వెలయాలివా సంఘం వెలివేసిన వెలదివా, ‘అనే పాట. ఈ పాటకి నాకు మొదటి బహుమతి వచ్చింది.
ఇలా చదువుకుంటూ ఉండగానే అనేక చిరుద్యోగాలు చేసాను. ఇంటర్ చదివేటప్పుడు నేను ఒక మేస్త్రి దగ్గర ఎండల్లో తాపీ పని చేసాను. ఆ సిమెంటు తాపీ కొట్టడంలో కూడా ఒక లయ ఉంటుంది. నేను ఇలా ఏ పని చేసినా, ఆ పనిలోంచి ఒక పాట ఒచ్చేది. ఆ తర్వాత నేను కరీంనగర్ జిల్లా మేడిపల్లి అనే గ్రామంలో టీచర్ గా చేరాను.
మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
చిన్నప్పుడు 6,7 సం. వయసుండగా నేను టూరింగ్ సినిమాలు చూసి, వాటిని నాటకాలుగా రాసేవాడిని. నేనూ, నా ఫ్రెండ్స్ కలిసి, వీటిని వేసేవాళ్ళం. సినీ నటుడు ఉత్తేజ్ మా మేనల్లుడే. అతను చిన్నప్పటి నుంచి మా నాటకాలను చూసేవాడు. అతని మీద నా ప్రభావం ఎంతో ఉంది. సినిమాల్లోకి రమ్మని, వాడే నన్ను ప్రోత్సహించాడు. ఒకసారి వాడిచ్చిన అవకాశం కోసం వెళ్తే, భరణి గారు నా పాటలు విని, కన్నీళ్లు పెట్టుకుని, ఆయన రాస్తున్న ‘నమస్తే అన్న’ అనే సినిమాలో ఒక శృంగార, హాస్య, జానపద గీతాన్ని నాతో రాయించడంతో నా సినీ జీవితానికి తొలిఅడుగు పడింది. ఆ తర్వాత దాసరి గారు శ్రీరాములమ్మ సినిమాలో 7 పాటలు రాయించారు. అలాగే నాగార్జున గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. నిన్నే పెళ్ళాడతా సినిమాలో నేను రాసిన అట్లతద్ది పాట చాలా హిట్ అయింది. వీరందరి మంచితనం, ప్రోద్భలం వల్లనే ఈనాడు ఈ స్థితికి చేరుకోగలిగాను.
ఈ రంగంలోకి వచ్చాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
ఎవరికైనా మొదటి సినిమా రావడం ఒకెత్తు, ఆ తర్వాత నిలదొక్కుకోవడం ఒకెత్తు. అర్ధాకలితో ఎన్నో రోజులు పడుకున్నాను. అయినా నామీద నాకొక మొండి నమ్మకం. నా భార్యా పిల్లల్ని ఊర్లోనే ఒదిలేసి, ఇక్కడే ఉండేవాడిని. నా భార్య బీడీలు కట్టి, మిషను కుట్టి, కుటుంబం నడుపుతూ పిల్లల్ని పోషించి, పెద్ద చేసేది. తన కష్టం చూడలేక, ఎప్పుడైనా తన కష్టం చూడలేక వెనక్కి వచ్చేస్తానని అంటే, ‘నువ్వొచ్చినా ఏం చేస్తావ్, సండే చికెన్ తెస్తావు, పండక్కి పిల్లలకి కొత్త బట్టలు కొంటావు, అంతేగా. నువ్వు లేకపోయినా నేనివన్నీ వాళ్లకు తక్కువ కాకుండా చూసుకుంటా. ప్రయత్నం మాని, వెనక్కి మాత్రం రావద్దు’ అనేది ఆమె. నా భార్య నిర్మల దన్ను నన్ను ఈ స్థితికి చేర్చింది. హైదరాబాద్ రమ్మని పిలిస్తే, సొంత ఇల్లు కొంటే, వస్తానని చెప్పింది. చెప్పినట్లే నేనిక్కడ ఇల్లు కట్టాకా, పిల్లలతో తనొచ్చింది.
మీరు ఠాగూర్ సినిమాకు రాసిన ‘నేను సైతం’ అనే పాటకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఎలా అనుభూతి చెందారు ?
శ్రీశ్రీ గారికి ‘తెలుగు వీర లేవరా’ అనే పాటకు జాతీయ అవార్డు వచ్చిన 16 సం. తర్వాత వేటూరి గారికి ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ అన్న పాటకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత పదేళ్లకు నాకొచ్చింది. ఈ అవార్డు అందుకున్న మూడవ తెలుగు సినీగేయ రచయతను కావడం, అదీ బి.సి. కమ్యూనిటీ నుంచి తొలి వ్యక్తిని కావడం నాకు ఎంతో ఆనందదాయకం. 40 వ పడిలో జాతీయ అవార్డు అందుకున్న రికార్డు కూడా నాకే దక్కింది. నిజానికి ఈ పాట పల్లవి శ్రీశ్రీ గారు రాసింది, చరణాలను నేను రాసాను. అది కేవలం 10-15 నిముషాల్లో పూర్తైన పాట. దైవానుగ్రహం వల్ల అలా కుదిరింది.
ఎన్నడూ ఏ అవార్డు తీసుకొని గద్దర్ గారు, స్వీకరించిన ఒకేఒక్క అవార్డు – సుద్దాల హనుమంతు అవార్డు. దీన్ని మీరెలా భావిస్తారు ?
గద్దర్ నిజానికి మా నాన్నగారికి నిజమైన వారసుడు. ప్రజలకి జీవితం అంకితం చేసినవాడు. నాన్న పోరు తత్త్వం నాకు ఎందుకో రాలేదు, గద్దర్, గోరేటి వెంకన్న గార్లు నాన్నగారి నిజమైన వారసులు. నేను నాన్నగారి అవార్డు గద్దర్ గారికి ఇస్తానని చెప్పగానే ఉత్తరక్షణం ఆలోచించకుండా ఒప్పుకున్నారు. అది తనకొక గొప్ప గౌరవంగా భావిస్తానని అన్నారు. ఆ తర్వాత ప్రతి ఏడాది, ఈ అవార్డును విశిష్టమైన వ్యక్తులకు ఇస్తూ వచ్చాము. ఒకసారి మహా టీవీ లో బ్రెయిన్, చచ్చుబడి కదలలేని ఒకమ్మాయి ఇంటర్వ్యూ చూసాను. ఆమె దేహంలో పాదాలు తప్ప ఏమీ కదలవు. ఆమె కాళ్ళతో కవిత్వం రాస్తుంది. ఆమెకు నన్ను చూడాలని ఉందని విని, మేమే ఆమెను చూసేందుకు వెళ్ళాము. అమ్మాయి రాసిన కవిత్వం చూసి, నాన్న అవార్డు ఇచ్చాను. ఆమే కవితల పుస్తకాన్ని అచ్చు వేసాము. దాన్ని సినారె గారు ఆవిష్కరించారు. ఆమె గుర్తించిన తర్వాత తెలంగాణా ప్రభుత్వం కూడా ఆమెను గుర్తించి నెలనెలా ఆమెకు భత్యం అందజేస్తోంది. అలాగే వంగపండు ప్రసాద్ గారు ఆర్ధిక బాధల్లో ఉన్నారు. మేము గుర్తించాకా, నిరంజన రెడ్డి గారు వారికి లక్ష రూపాయిల సాయం చేసారు. ఇలా గుర్తింపుకు నోచుకోని అపురూపమైన కళాకారులను ఈ అవార్డు ద్వారా సత్కరించి, వెలుగులోకి తేవడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది.
అలాగే మా అమ్మగారైన ‘జానకమ్మ’ గారి పేరు మీద ప్రతి ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి, జనవరి 31 వ తేదీ వరకు పిల్లల్ని కన్న తల్లులకు, మా సొంత ఊరైన సుద్దాలలో తల్లీ పిల్లల్ని కూర్చోబెట్టి బట్టలు పెడతాము. ఇటువంటివి మనసుకి తృప్తిని కలిగిస్తాయి.
‘వీర తెలంగాణా’ చిత్రం కోసం మీ నాన్నగారి పాత్రధారికి ‘వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ’ అని మీ నాన్నగారు రాసిన పాటను పాడారు కదా. అప్పుడెలా అనిపించింది?
ఇది నా అదృష్టంగా భావిస్తాను. అలాగే రాజన్న సినిమా కూడా నాన్నగారి జీవితం ఆధారంగా తీసినదే ! దీనికి విజయేంద్రప్రసాద్ గారు, అంటే రాజమౌళి నాన్నగారు దర్శకులు. అందులో ఒక ఘట్టంలో ఆయుధాలు లేకుండా జనంలో తిరుగుబాటు రేపే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశ చిత్రీకరణను ఆయన రాజమౌళికి అప్పగించారు. అదొక విచిత్ర యోగం. ఆ సన్నివేశానికి నాన్నగారు గతంలో రాసిన పల్లవికి నేను చరణాలు రాయడం, నాన్న పాటనే తిరిగి రాయడం ఒక మధురానుభూతి.
మీరు టీవీ లో గోరేటి వెంకన్న గారు, చంద్రబోసు గార్లతో కలిసి పాటల ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు కదా. వారితో పంచుకున్న ప్రత్యేకమైన అనుభవాలు చెప్తారా ?
ఆ సమయంలో వచ్చిన మగధీర చిత్రంలో చంద్రబోసు ఒక పాటను రాసారు. ‘పంచదార బొమ్మ బొమ్మా’ అనే పాట అది. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను ఆ పాటను ప్రశంసిస్తూ ‘పంచభూతాలు బ్రతికున్నప్పుడే తోడుంటాయి, నేను నీ చితిలో కూడా తోడొస్తాను’ అని మహా గొప్పగా రాసవయ్యా, అని వ్యాఖ్యానించాను. ఆ తర్వాత 24 గం. లోపల ఎయిర్టెల్ మేనేజర్ ఒకరు నాకు ఫోన్ చేసి, ‘సర్, మీరు ఆ పాట గొప్పతనం టీవిలో చెప్పాకా, కొన్ని లక్షల మంది ఆ పాటను రింగ్టోన్ గా పెట్టుకున్నారు’ అని చెప్పారు. మామూలుగా సినిమా వాళ్ళు పాట రచయతల గురించి పబ్లిక్ గా కాదు, ప్రైవేట్ సంభాషణల్లో కూడా చెప్పరు. కాని, నేనలా కాదు. ఎవరైనా ఏదైనా మంచి వాక్యం రాస్తే, వాళ్ళను మెచ్చుకునే దాకా నిద్రపట్టదు. అది భాస్కరభట్ల కావచ్చు, అనంత శ్రీరాం కావచ్చు, సీతారామ శాస్త్రి గారు కావచ్చు, నేను ఒక్కోసారి ఇంటికెళ్ళి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ 17 జనవరి 2017కి సినిమాతో నాది 23 ఏళ్ళ సుదీర్ఘమైన ప్రయాణం అవుతుంది. ఇందులో ఇక్కట్లున్నాయి, ఉద్విగ్నతలు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి. చివరికి సినీ రచయతగా ఒక మంచి స్థానంలో ఉండి, నంది అవార్డు తీసుకునేందుకు నేను, నా భార్య సిటీ బస్సు లో వెళ్తుంటే, ఆవిడ ‘ఎన్నాళ్ళండీ మనకీ కష్టాలు’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
‘తెలుగోడు’ అనే సినిమా కోసం ‘తేట తేనియ తెలుగు’ అంటూ అన్ని తెలుగు కళలను మేళవించిన ఒక పాటను బంజారా భాషలో రాసారట కదా !
అవునమ్మా, నా పరంగా తెలుగు నేల మీదున్న ప్రతి కమ్యూనిటీ తెలుగు వాళ్ళే. బంజారా, లంబాడీ, ఉప్పు అమ్మేవారు వీరంతా తెలుగువాళ్ళే. భాష అనేది మతాలకి, తెగలకి అతీతమైనది. ఈ సినిమా కోసం దర్శకుడిని ఒప్పించి ‘బంజారే బంజారా’ అంటూ పాట రాయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే సినిమా పాట గ్రామర్ వేరు. అందుకు కావలసినవి లేకపోతే సారీ అంటారు. సమ్మక్క – సారక్క సినిమాలోని పాటల్లో కూడా నేను దాసరి గారిని ఒప్పించి, బంజారా పదాలను వాడటం జరిగింది. వీరవిహారం సినిమాలో కూడా లంబాడి పాట రాసాను.
ఒకసారి నేను ఒక లంబాడి వనిత గుండె నిండా బిడ్డకు పట్టేందుకు పాలుండి, కారిపోతున్నా, అవి పట్టకుండా కల్లు తాగించడం చూసాను. ఎందుకని అడిగితే ‘నేను పొద్దుట పనికి పొతే రాత్రికి ఒస్తాను, పాలు తాగితే వీడు బతికుంటాడో లేదో సారూ. కాని, కల్లు తాగితే కనీసం బతికైనా ఉంటాడుగా సారూ. ‘ అంది. ఆ మాటలకి గుండె కరిగి ‘ఆలో ఆలో’ అన్న పాట రాసాను. ఆలో అంటే లాలి అని అర్ధం. ఇదే పాటని కమలి సినిమాలో వాడారు.
అలాగే రెండు రాష్ట్రాలు వేరైనా, ఇరువురూ నాకు సమాన గౌరవం ఇస్తారు. 97 లో చంద్రబాబు గారికి జన్మభూమి పాటను రాసాను. ‘కదులుదాము రండి మనం జన్మభూమికి’ అనే పాట అది. ఈ పాట 25 లక్షల కాసెట్లు అమ్ముడు పోయాయి. అలాగే ఈ మధ్య అమరావతి మీద కూడా ఒక పాట రాసాను. కె.సి.ఆర్ గారికి తెలంగాణా ఉద్యమ తొలిదశలో 10 – 20 పాటల దాకా రాసాను.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
ఏమీ లేవమ్మా. ఇప్పటికే నాకు దేవుడు చాలా ఇచ్చాడు. ఇంకా కోరుకుంటే అది దురాశ అవుతుంది. గీతం యూనివర్సిటీ వారు నాకు డాక్టరేట్ ప్రదానం చేసారు. జాతీయ అవార్డు, నంది అవార్డు, వంటివి చాలా అవార్డులు వచ్చాయి. మోది గారు దేశవ్యాప్తంగా ఉంచిన స్వచ్చ్ భారత్ బ్రాండ్ అంబాసిడర్ల లో నేనూ ఒకడిని. పాటల విషయంలో మానవీయ సంబంధాలను పొందుపరచి రాయడం, నావంతుగా సమాజానికి ఏమైనా ఇవ్వడం ఇవే నేను చెయ్యబోయేవి.
చాలా సంతోషమండి, చాలా చక్కటి విశేషాల్ని తెలిపారు. నమస్కారం.
నమస్కారం.
శ్రీ సుద్దాల గారు తెలుగువారు గర్వించదగ్గ మరెన్నో పాటల్ని రాసి అఖండమైన విజయాలు సాధించాలని మనసారా ఆశిస్తోంది 'అచ్చంగా తెలుగు.'
****

No comments:

Post a Comment

Pages