విరహమొ సంభోగంబుల వేడుక శృంగారమొ యిది
-డా.తాడేపల్లి పతంజలి
సరసిజముఖిఁగని ప్రాణము జల్లనఁ గలఁగెడినే
కుటిలాలకి మైఁబూసిన కుంకుమగంధపు రసములు
చిటిపొటి చెమటలఁ బెనఁగొని చిప్పిలి రాలఁగను
విటరాయని యలరమ్ములు వీఁపున వెడలఁగ నాఁటిన
తొట తొటఁ దొరిగిన నెత్తురుతోఁ దులదూఁగెడినే
మృగలోచన చనుఁగవపై మెత్తిన కమ్మని తావుల
మృగమదమంటినచోట్లు మెఱుఁగులు వారెడిని
చిగురాకున మరుఁడేసిన చిచ్చరబాణంబులచే
ఎగసిన పొగలై తోఁచీ నేమని చెప్పుదునే
యోగవియోగంబులచే నొనగూడిన యీ చెలియకు
నాగరికంబుల చేఁతలు నటనలు మీరఁగను
శ్రీగురుఁడై చెలువొందిన శ్రీవేంకటగిరి నిలయుని
భోగించిన పరిణామపు పొందులు దెలిపెడినే
(సం: 05-079)
తాత్పర్యము
అన్నమయ్య ఒక చెలికత్తెగా మారి అలమేలుమంగమ్మను చూసి మాట్లాడుతున్నాడు.
పల్లవి
ఇది విరహంలో శరీరంలో పుట్టిన మార్పులా? ! లేక సంభోగముల వేడుకతో కలిగిన శృంగారమా ? తెలియటం లేదు.
మొత్తానికి పద్మముఖిని చూసిన తరువాత నా ప్రాణము జలదరిస్తూ చెల్లాచెదరగుచున్నది. (చలించుచున్నది.)
1.వంకరైన వెంట్రుకలు కలిగిన ఈ పద్మముఖి తన శరీరముపై పూసిన కుంకుమ ము, మరియూ గంధాల రసాలు అల్పమైన చెమటలలో మెలితిరిగి కలిసిపోయి,లోపలినుండి పైకి ఉబికి రాలుతుండగా విటశ్రేష్ఠుడయిన వేంకటేశ్వరుని పుష్పబాణములు వీపున తెలతెలబోవునట్లు నాటుకొని తొటతొటమని కిందకు జారుచుండగా – అవి(ఆ ఎర్రటి పూలు) నెత్తురుతో సమానమవుతున్నాయి.
2.జింకవంటి కన్నులు గల ఆమె స్తనముల జంటపై కమ్మని వాసనలతో పూసిన కస్తూరి అంటిన చోట్లు స్వామివారి నఖక్షతములతో మెరుపులు పరుగెత్తుతున్నాయి. చిగురాకుతో మన్మథుడు ప్రయోగించిన అగ్ని బాణములచే ఎగసిన పొగలా అనిపిస్తున్నాయి. ఏమని చెబుతానే.
3.సంయోగము, వియోగములు కలిగిన ఈ చెలియకు నాజూకైన, సున్నితమైన చేష్టలు(నాగరికంబుల చేఁతలు) నటనలు అతిశయించగా లక్ష్మీదేవికి గురువైన అందమైన శ్రీవేంకటేశ్వరునితో భోగించిన పరిణామపు పొందులు తెలుపుతున్నాయి.
విశేషాలు
పల్లవి
అలమేలు మంగమ్మను చూసిన తరువాత ప్రాణము జలదరిస్తూ చెల్లాచెదరవటం ఏమిటి?
అన్నమయ్యకు అలమేలుమంగమ్మ మీద విపరీతమైన ప్రేమ. అభిమానం. ఆమె శరీరంలో కలిగే మార్పులను చూసి కవిగారి ప్రాణము జలదరిస్తూ చెల్లాచెదరయింది.
తల్లికి కష్టము వస్తే బిడ్డకు బాధ కదా ! అదే బాధ ఈ పల్లవిలో కవి తెలియచేసాడు.
1వ చరణం
నాయిక శరీరముపై పూసుకొన్న ఎర్రటి కుంకుమ చెమటబిందువులతో కలిసి ఆమె వీపుపై బుడగలు బుడగలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సంభోగంలో నాయిక జుట్టు చెదరి పోవటం వల్ల నాయిక తల్లోని ఎర్రటి పూలు వీపు మీద జారుతున్నాయి. జారుతున్నఆ ఎర్రటి పూలు ఎర్రటి కుంకుమ బుడగలతో సమానమవుతున్నాయని కవి అద్భుతంగా తుల్య యోగితాలంకారంలో చెప్పాడు.
2.
నాయిక స్తనాగ్రముపై నల్లని కస్తూరి నలుపు. పొగ నలుపు. ఈరెండింటిని కవి ఈ చరణంలో పోల్చాడు.
స్తనాగ్రము గోటి గిచ్చుళ్లతో విచినప్పుడు ఎర్రటి మంటలాంటి మెరుపు ఛాయ.
మంట ఉన్నప్పుడు పొగ ఉండాలి కదా !
చిగురాకుతో మన్మథుడు ప్రయోగించిన అగ్ని బాణములచే ఎగసిన పొగలా నలుపు ఎరుపు కలిసిన స్తనాగ్రముల రంగు అనిపిస్తోందట .
3
ఈ చెలియ లక్ష్మి (అలమేలుమంగ) సంయోగము, వియోగములు కలిగినది.
నాజూకైన, సున్నితమైన చేష్టలు(నాగరికంబుల చేఁతలు) నటనలుకలిగినది. అటువంటి లక్ష్మీదేవికి గురువు. శ్రీవేంకటేశ్వరుడు.
శిష్యురాలికంటె గురువు గారు కాస్త ఎక్కువ కదా !
అంటే నాజూకైన, సున్నితమైన చేష్టలు , నటనలు లక్ష్మీదేవికంటె కాసింత ఎక్కువని కవి వాక్కు.
శ్రీగురుఁడై చెలువొందిన శ్రీవేంకటగిరి అను పదములో రెండు సార్లు శ్రీ అనే అక్షర ప్రయోగము గమనార్హం.
పెళ్లి కాకమునుపు రామచండ్రుడు.
సీతతో (శ్రీ) పెళ్లయిన తర్వాత శ్రీ రామచంద్రుడు.
అలాగే లక్ష్మీదేవి (శ్రీ) కళలన్నీ తనలో కలిగినవాడు అని చెప్పటానికి శ్రీ వేంకటేశ్వరుడు.ఇద్దరూ అభేదమని వ్యంగ్యోక్తి.
శ్రీవేంకటేశ్వరునితో భోగించిన పరిణామపు పొందులు లక్ష్మీదేవిలో కనబడుతున్నాయని కవి కీర్తన ముగించాడు.
అన్నమయ్యా ! నీపాటలో అందమయిన పదాల పరిణామాలు కలిగిన కవిత్వపు పొందులు కనబడుతున్నాయని మేమంటున్నాం. కాదా !
*****
No comments:
Post a Comment