అజావరం - అచ్చంగా తెలుగు

అజావరం

కలవల రమేష్ (కౌండిన్య )


అది చోళ సామ్రాజ్యం. పదకొండవ శతాబ్దం...
ఆ సామ్రాజ్యం లోని ఒక రాజ్యనికి రాజధాని వేంగికొండ. ఆ రాజ్యానికి రాజు గారైన కర్ణేంద్ర చోళడు ధీరాధి ధీరుడు. ఆయన లాంటి ధీరుడు ఆ రాజ్యంలోనే లేరు అంటే అతిశయోక్తి కాదు, ఎవరూ ఆయనకు సాటి రాలేరు. రోజూ తెల్లవారు జామున మూడు గంటలకు కోడి కూయగానే లేచి, అమ్మవారికి శక్తిని ప్రార్థించమని నమస్కరించి కసరత్తుతో మొదలు పెట్టి, కర్రసాము, కత్తిసాము, విల్లు విద్యలు, ఖడ్గాలు, గుర్రపు స్వారీ, కుస్తీ, మరెన్నో విద్యలు రోజూ తన గురువు గారైన శోమేశ్వర పండితులు దగ్గర అధ్యయనం చేస్తారు. తన స్వహస్తాలతో ఎదుటి వారిని పిండి చేయగల సామర్థ్యం ఆయనది. విశాలమైన బాహువులు గల ఛాతీ. పిడిగుద్దులు గుద్దినా అదరని శరీరం. ఓ చేత్తో నలుగురిని అవలీలగా మట్టికరింపించగల ఆజానుబాహుడు.ఏ ఆభరణాలు ధరించని ఆయన శరీరాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఆ నిండు ఆభరణాలతో గనక చూస్తే వాటి మెరుపుతో ఆ ధీటైన నడకతో, ఒంటిమీద ఉన్న ఆభరణాల చేసే శబ్ధాలతో  శత్రువైతే భయంతో వణకాల్సిందే, ఎదుటివారు ఇంకెవరైనా అయితే మైమరిచి కన్నర్పకుండా నోరు తెరిచి చూడాల్సిందే. ఆయన సభలో కూర్చుంటే ఆ ఠీవే వేరు. గళం విప్పి సభలో మాట్లాడితే కంచు మ్రోగినట్లే, సభంతా కిక్కురమన కుండా వింటారు. ఆయన వాక్చాతుర్యం చాలా గొప్పది, అమోఘమైనది. రాజ్యంలో ఆయన మాటకు తిరుగులేదు. ఏదైనా కార్యం నిశ్చయ్యిస్తే ఆ పని పూర్తి అయ్యేదాకా వెనుదొగ్గే ప్రసక్తి లేదు, అన్నీ కార్యాలు విజయవంతంగా పూర్తిచేయగల కార్యసాధకుడు. రాజు గారి అశ్వం పేరు విజయకర్ణి. అది తొమ్మిదడుగుల ఎత్తు, మూడడుగల వెడల్పుతో కర్ణేంద్ర చోళ రాజుగారి కు సరైనజోడు. దాని మీద స్వారీ చేస్తూ ఆయన వస్తూంటే అది చూసి భయంతో చిందరవందై తొక్కిసలాట జరుగుతుంది. విజయకర్ణి ఘీంకారానికి ఎదుటి వాటి ఆయుధాలను విడిచి శరణుకోరడమే భావ్యమని తలుస్తారు.ఆయనకు విద్యలు నేర్పిన గురవుగారు శోమేశ్వర పండితుడు కూడా మంచి శక్తిసామర్థాలు కలవారు. నున్నటి నునుపైన గుండు, నుదుట పెద్దగా ఎర్రటి తిలకం, ధోవతి, ఒంటి పైభాగం లో పలుచటి కండువా, పెద్ద ఛాతీ, బలమైన కాళ్ళు, చేతిలో దండం తో పెద్ద పెద్ద అడుగులతో నడిచే ఆయనగూడా శక్తి పరుడే. గురువు గారంటే కర్ణేంద్ర చోళ రాజుగారికు అపారమైన అభిమానం. కొన్ని ఏళ్ళ క్రితం కర్ణేంద్ర చోళ రాజుగారితో ఓ సామాన్య ప్రజానికుడుని రాజుగారంతటి ధీరుడిని చేసి మీ ముందుకు తీసుకొస్తానని ప్రమాణం చేసారు గురువు గారు శోమేశ్వర పండితులు. రాజు గారు కొట్టి పారేశారు.
 శోమేశ్వర పండితులు ఓ రోజూ సభకు వెళ్ళే దారిలో వీధులలో దుమారం రేగింది. ఆ రేగిన ధూళి కి తట్టుకోలేక శోమేశ్వర పండితులు గారు కూర్చున్న పల్లకిని కిందకి దింపారు భటులు. తెరతీసి ఆ దుమ్ము ధాటికి మళ్ళీ తెర వేసేసారు శోమేశ్వర పండితులు గారు. భటులను పిలిచి అడిగారు సంగతి. వాళ్ళు ఓ యువకుడు పెద్ద ఎద్దులాంటి పొట్టేలు మీద స్వారీ చేస్తూ అటు వెళ్ళడంతో ఆ వీధిలంతా దుమారం రేగిందని వివరించారు. "అజావరం..." అంటూ పలికాయి అప్రయత్నంగా ఆయన పెదవులు. పొగరుపట్టిన పొట్టేలును సైతం లొంగదీసుకునే సత్తా ఉన్న ధీరుడిని అలా అంటారని, ఆయన విని ఉన్నారు. ఈలోగా అటు తన మేకల మందతో వెళ్ళే ఆయన్ని చూసారు శోమేశ్వర పండితులు గారు. ఆయనను పిలిపించి అటు పొట్టేలు స్వారీ చేస్తున్న యువకుడు గురించి అడిగారు. ఆయన ఆ కుర్రవాడు తన కొడుకేనని, తప్పు చేసినందులకు మన్నించమని ప్రాథేయ పడ్డాడు. ఆయనను కంగారు పడవద్దని చెప్పి ఆ యువకుడిని భటులతో తనను దగ్గరకు తీసుకొని రమ్మని చెప్పారు. భటులు ఆ పొట్టేలు మీద స్వారీ చేస్తున్న యువకుడిని పట్టుకోవడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. మొత్తానికి ఆ యువకుడిని ఆపి జరిగింది చెప్పారు. ఆ పొట్టేలుని తీసుకొని శోమేశ్వర పండితులు గురువు గారి దగ్గరకు బయలు దేరాడు. ఆ యువకుడి తండ్రిగారు మేకల కాపరి కూడా అక్కడే ఉన్నారు. శోమేశ్వర పండితులు తీక్షణంగా చూసారు ఆ యువకుడిని. చిరుకండలు తిరిగి బలిష్టంగా ఉన్నాడు. అతన్ని పేరు అడిగాడు శోమేశ్వర పండితులు గారు. ఇంతలో ఆ పొట్టేలు ఉన్న పళంగా వేగంగా పరిగెత్తడం మొదలు పెట్టింది. ఆ యువకుడు చిరుతపులంత వేగంగా పరిగెత్తి దాని కొమ్ములను పట్టుకొని ఎగిరి దాని మీదకుఎక్కి దానిని స్వాధీన పరుచుకొని స్వారీ చేస్తూ  తిరిగి అక్కడకు వచ్చాడు. శోమేశ్వర పండితులు గారితో క్షమించమని అడిగాడు. తన పేరు తక్షకుడు అని చెప్పాడు. గురువుగారు అలా ఎద్దులాంటి మేక వాహనాన్ని ఏమంటారో తెలుసా అని అడిగారు. తెలియదని సమాధానం ఇచ్చాడు. శోమేశ్వర పండితులు గారు "అజావరం" అని చెప్పారు. తక్షకుడిని నువ్వు నాతో వస్తున్నావు రాజుగారి దగ్గరకు అన్నారు. ఇప్పటినుండీ నువ్వు 'తక్షజేయుడు' అని పిలవ పడతావు అన్నారు. ఆ దిగులుగా ఉన్న మేకల కాపరి తండ్రికి ధైర్యం చెప్పి గురువుగారి పల్లకీ వెనుక అజావరం మీద బయలుదేరాడు తక్షజేయుడు. రాజుగారు కర్ణేంద్ర చోళడు దగ్గరకు తీసుకు వెళ్ళాడు. ఆయన తన భటులు ఓ కొత్త అశ్వాన్ని స్వాధీన చేసుకోవడానికీ నానా తంటాలు పడుతుంటే ఆ సన్నివేశం చూస్తూ పక పకా నవ్వుతున్నారు. వచ్చిన గురువు గారికి ప్రణామం చేసి యోగక్షేమాలడిగారు కర్ణేంద్ర చోళ రాజుగారు. ఆ భటులు పడుతున్న తంటాలు చూసి తన పొట్టేలును అక్కడ చెట్టుకు కట్టీ రంగంలోని దిగాడు తక్షజేయుడు. ఎగ్గిరి దాని మీదకెక్కాడు, కొన్ని క్షణాలలోనే ఆ అశ్వాన్ని ఆధీనం లోకి తెచ్చాడు. అది చూసి రాజుగారు భళా అని హర్ష్యం వ్యక్తం చేసారు. ఇంతలో గురువుగారు రాజుగారికి కొన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసారు. తక్షజేయుడు ని చూపించి మీఅంతటి ధీమంతుడుని చేసే అవకాశం ఇవ్వమని కోరారు. కర్ణేంద్ర చోళడు తక్షజేయుడున్ని దగ్గరకు పిలిరించాడు.  అతడిని చూసి గురువు గారితో అసాధ్యమన్నారు. శోమేశ్వర పండితులు గారు మూడేళ్ళ గడువు అడిగారు. మూడు కాదు ఐదేళ్ళు తీసుకోండి కానీ అతడు తనంతటి ధీరుడు కాలేడని తిరిగి కొట్టిపారేశారు. గురువు గారు రాజు గారి వద్ద సెలవు తీసుకొని తన భవంతి కు తీసుకొని వెళ్ళి తక్షజేయుడుని రానున్న మూడేళ్ళు అన్నీ మరచి తనదగ్గరే ఉండాలని, అతడిని ధీమంతుడు గా తీర్చిదిద్దే భాధ్యత తనదే నని చెప్పి అక్కడ రాజప్రాసాదం లో వసతి చూపించమని భటులను ఆజ్ఞాపించి పంపారు. తక్షజేయుడు ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడు.
 మరుసటి రోజు శోమేశ్వర పండితులు గారు కర్ణేంద్ర చోళడి అభ్యాసం పూర్తి అయిన తరువాత తక్షజేయుడుకి శిక్ష ప్రారంభించారు. గురువు గారు  తక్షజేయుడికి తను అప్పటి వరకూ నేర్చుకున్నవన్నీ మరిచిపొమ్మని చెప్పారు. కొత్తగా అభ్యాసం మొదలు పెట్టారు. ప్రతీ రోజూ ఏమి చేయాలో వివరించారు. తల్లతండ్రులను మూడు నెలలకు కానీ చూడటానికి వీలు ఉండదనీ, తను తీసుకోవాలిసిన చర్యలు, ఆహార నిబంధనలు, విద్య నేర్చుకొనే పద్దతి, ఏకాగ్రత ఎలా నిలపాలో, విద్యల మీద గురి ఎలా పెంచుకోవాలో అన్నీ వివరించారు. తక్షజేయుడి తల్లి తండ్రులకు సమాచారం పంపారు. వారికి  రాజప్రాసాదం నుంచి కానుకలు పంపించారు గురువు గారు. తల్లితండ్రులు తన బిడ్డ అదృష్టానికి చాలా సంతోషించారు. దిన దినాన తక్షజేయుడి పురోగతి ను చూస్తూ ధీరుడిగా తీర్చిదిద్దడం లో నిమగ్నమై ఉన్నారు శోమేశ్వర పండితులు గారు అటు రాజుగారి పనులతో పాటు. మూడు నెలలు గడిచాయి. తక్షజేయుడు తన తల్లితండ్రులతో కొన్ని రోజులు గడిపి మళ్ళీ రాజప్రాసాదంలో తన వసతికి తిరిగి వచ్చాడు. పొద్దున్నే లేచి తనుకూడా ఒక్కొక్క విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు. గురువు గారు చెప్పినవి పాటిస్తూ తన కండలను పెంచుతూ బలశాలీగా తయారు అవుతున్నాడు. శోమేశ్వర పండితులు గారితో రాజ్యంలో ఉన్న బహు గట్టి పొట్టేళ్ళను తెప్పించమని మనవి చేశాడు. అశ్వాలతో పాటు వాటిని కూడా స్వాధీనం చేసుకుంటూ వాటి మీద స్వారీ చేస్తూనూ, అశ్వాల మీద స్వారీ చేస్తూ విద్యలు నేర్పుకుంటున్నాడు. శోమేశ్వర పండితులు గారు తనకు తెలిసిన రోగ నివారణ మూలికలు, శరీర పటిష్టతకు బలమైన ఆహారం, రోజు పుష్టికి చిక్కటి పాలు పెరుగులతో బలంగా తీర్చిదిద్దుతున్నారు. రెండేళ్ళు ఇట్టే అయిపోయాయి. తక్షజేయుడికి తన మీద తనక ఉన్న విశ్వాసానికి, తన ధృఢ సంకల్పానికి, గురు భక్తికి చాలా సంతోషపడుతూ ఆ విద్యలన్నింటి లోనూ శ్రేష్ఠమైనవి వాటి మెలుకువలు బోధించడం ప్రారంభించాడు. తక్షజేయుడి కి తన లక్ష్యం గురించి పదే పదే గుర్తుచేస్తూ ఆ పంథాలో వేగంగా పయనించేలా అస్త శత్ర విద్యలు నేర్పించారు శోమేశ్వర పండితులు గారు. సమయం ఆసన్నమైయ్యింది రాజుగారికి తన శిష్యుడి ప్రతిభ చాటి చెప్పటానికి.
 ఓ రోజు కర్ణేంద్ర చోళ రాజు గారికి తన అభిప్రాయం వ్యక్తపరిచారు గురువు గారైన శోమేశ్వర పండితులు గారు. రాజుగారు చాలా ఉత్సాహం గా ఉన్నారు. కర్ణేంద్ర చోళ రాజుగారు గురువు గారితో తక్షణం ప్రదర్శన  ఏర్పాటు చేయించమని ఆదేశించారు. శోమేశ్వర పండితులు రాజుగారి దగ్గర సెలవు తీసుకొని తక్షజేయుడి వసతి గ్రుహానికి బయలు దేరారు ఆ శుభవార్త తన శిష్యుడికి విన్నవిద్దామని. ప్రదర్శన ఏర్పాటు చెయ్యబడింది... అన్ని విద్యలలోనూ అసమాన ప్రతిభను చాటాడు తక్షజేయుడు.
లోకంలో రెండు రకాల నాయకులు ఉంటారు... ఒకరు రాజులైతే, మరొకరు రాజులనే సృష్టించేవారు. చాణక్యుడి వంటి గురువులు రెండవ కోవకు చెందుతారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికితీసినట్లు,  ఒక మామూలు పిల్లవాడిలో ఒక దేశాన్ని పరిపాలించే సమర్ధుడైన రాజును గుర్తించి శిక్షణ ఇచ్చిన తన గురువుగారైన శోమేశ్వర పండితుల పాదాలకు మోకరిల్లి, తన వినమ్రతను చాటుకున్నాడు రాజు.
 ****

No comments:

Post a Comment

Pages