బొమ్మల పెండ్లి - అచ్చంగా తెలుగు

బొమ్మల పెండ్లి (బాల గేయాలు 04 )

 టేకుమళ్ళ వెంకటప్పయ్య 


చిన్నతనంలో చక్కగా వేసవి శెలవలలో, బొమ్మల పెళ్ళిళ్ళ ఆట ఆడుకోవడమూ.. అందరినీ పిలిచి సరదాగా ఆటలాడడమూ కనుమరుగయిపోయాయి.  ఎక్కడో పల్లెటూర్లలో మాత్రమే ఆటలూ..పాటలూ నామమాత్రంగా మిగిలి ఉన్నాయి. పాట చూడండి. పెళ్ళి తంతు మొత్తం పాటలో ఉంది. వియ్యలవారి విందులు, అలకలు, మర్యాదలు అన్నీ ఉన్నాయి. భవిష్యత్తులో పిల్లలు చూడబోయే పెళ్ళి మర్యాదలు అన్నీ ఉన్నాయి. ఇవి చదవడం, పాడడం వల్ల పెళ్ళి గురించి అవగాహన ఏర్పడ్డమే గాక, మంచి తెలుగు భాషా పట్టుబడుతుంది. పెద్దలారా.. పిల్లలారా.. చదవండి.. చదివించండి... శెలవుల్లో మీ ఇంట్లోనూ బొమ్మల పెళ్ళిళ్ళు చేయండి.
  
చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగా
శ్రింగారవాకిళ్ళు సిరితోరణాలు
గాజుపాలికలతో, గాజుకుండలతో
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు
పెద్దన్న పెట్టెనే పెట్టెల్లసొమ్ము
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము
పోతునే బొమ్మ, నీకు పెన్నేఱునీళ్ళు

కట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీర
తొడుగుదునే బొమ్మ, నీకు తోపంచురవిక
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు
అత్తవారింటికీ పోయి రమ్మందు


అత్త చెప్పినమాట వినవె బొమ్మ
మామచెప్పినపనీ మానకే బొమ్మ
రావాకుచిలకమ్మ ఆడవే పాప
రాజుల్లు నీచేయి చూడవచ్చేరు...!!

ప్రధానపుంగరం పమిడివత్తుల్లు
గణగణగ వాయిస్తు గంటవాయిస్తు,
గజంబరాయడూ తల్లి రాగాను,
తల్లి ముందరనిలచి యిట్లన్ని పలికె.

అన్న అందలమెక్కి, తాగుఱ్ఱమెక్కి,
గుఱ్ఱమ్ముమీదను పల్లమున్నాది,
పల్లమ్ముమీదను బాలుడున్నాడు,
బాలుడి ముందరికి కూతుర్నిదేరె,
కూతురిసిగలోకి కురువేరు దేరె,
నాకొక్క ముత్యాలబొట్టు దేరమ్మ!
బొట్టుకు బొమ్మంచు చీర దేరమ్మ!
చీరకు చిలకల్ల రవికె దేరమ్మ!
రవికకు రత్నాలపేరు దేరమ్మ!
పేరుకు పెట్టెల్ల సొమ్ము దేరమ్మ!

చిన్నన్న దెచ్చాడు చింతాకుచీర,
పెద్దన్న తెచ్చాడు పెట్టెల్ల సొమ్ము,
రావాకు చిలకతో ఆడబోకమ్మ,
రాజుల్లు నీచెయిది చూడవచ్చేరు.

వీధిలో ముడివిప్పి ముడువబోకమ్మ,
పల్లెత్తి గట్టిగా పలుకబోకమ్మ,
పొరుగిళ్లకెప్పుడూ పోవకేబొమ్మ,
నలుగురీ నోళ్లల్లో నానకేబొమ్మ!

-0o0-

No comments:

Post a Comment

Pages