గోత్రములు , ఋషులు - 3 - అచ్చంగా తెలుగు
demo-image

గోత్రములు , ఋషులు - 3

మంత్రాల పూర్ణచంద్రరావు 


గౌతమ మహర్షి 

గౌతమ మహర్షి సప్తర్షులలో ప్రసిద్ధుడు. శ్రుతులననుసరించి గౌతమ వంశమున జన్మించిన ఒక మహర్షి. గౌతమ ధర్మ సూక్త ఈ గౌతముడే మొదట విష్ణుమూర్తి మోహినిరూపము ధరించి, త్రినేత్రుడను, దేవతలు రాక్షసులను సంతసింపచేయగా వారందరూ చప్పగా తలపోసిరి. అప్పుడు అధిక ప్రయత్నమున అఖిల లోక మొహనముగా అహల్య అను మోహనాంగిని సృష్టించి నైష్టిక బ్రహ్మ చర్యమున తపస్సు చేయుచున్న గౌతముని దగ్గర విడిచి ఈ మహర్షికి శుశ్రూష చేయుమని కోరెను. అహల్య అందులకు అంగీకరించి హోమాది క్రుత్యములందు అతనికి సహకరించు చుండెను.
కొంతకాలము తరువాత అహల్య యవ్వనము పొంది మరింత సౌందర్యముగా అలరారు చున్నది. అప్పుడు గౌతముడు ఆమెను తీసుకువెళ్ళి బ్రహ్మ దేవునకు అప్పగించెను.  బ్రహ్మ ఆమెను గౌతమునకే ఇవ్వ నిచ్చయించుకోనెను,  అప్పటికే ఆమె అందము చుసిన ఇంద్రుడు మొదలగు దేవతలు తమకే ఇవ్వమని అడిగెను. అప్పుడు బ్రహ్మ భూ ప్రదక్షణము చేసి ఎవరు ముందు వత్తురో వారికే ఇచ్చునని చెప్పెను.ఇంద్రాది దేవతలు, మునులూ భూ ప్రదక్షణకు వెళ్ళిరి, గౌతముడు నెమ్మదిగా లేచి అక్కడనే ఉన్న గోమాతకు ప్రదక్షణ చేసి ఇది భూ ప్రదక్షణ తొ సమానమే అని బ్రహ్మతో చెప్పగా, బ్రహ్మ దేవుడు కూడా ఇది సత్యమే అని అహల్యను గౌతమునకు ఇచ్చి వివాహము చేసెను. ఇంద్రాది దేవతలు గౌతముని మహాత్యమునకు మెచ్చి, అసూయతో వెడలిపోయిరి.
గౌతమ మహర్షి అహల్యా సమేతుడై దండకారణ్య మునకు వెళ్లి బ్రహ్మ దేవుని గూర్చి తపము చేసెను, అంత బ్రహ్మ ప్రత్యక్షమవ్వగా బ్రహ్మ దేవా నేను విత్తిన విత్తనములు ఒక్క ఝాములో పరిపక్వము అవునట్లు వరమివ్వమని కోరెను, బ్రహ్మ అట్లే అని అంతర్ధానమయ్యెను. అంతట గౌతముడు అహల్యతో కూడి "శతశృంగగిరి" కి వెళ్లి పర్ణశాల నిర్మించుకొని బ్రహ్మవరమున అతిధులు అందరికీ భోజన వసతి సదుపాయములు కూర్చు చుండెను. అహల్య కూడా ఆయనకు అన్నీ విధాల సహాయపడుచుండెను .
ఇట్లుండ ఆ రాజ్యములో మహా కరువు కాటకములు సంభవించి ప్రజలు చనిపోవటం మొదలయింది.
ఇట్లుండగా అనేక మునులు, బ్రాహ్మణులు గౌతమునకు అతిదులయిరి..తన తపశ్శక్తిచే వచ్చిన వారందరినీ గౌతమ దంపతులు  సంతృప్తి పరుస్తున్నారు.అది తెలిసి కరువున పడ్డ ప్రజలు కూడా తండోప తండాలుగా రావటం వలన గౌతమిని ఆశ్రమము వేయి యోజనములు మించిపోయినది.
ఇలా గౌతముని కీర్తి దేవలోకమునకు కూడా పాకినది.ఇంద్రుడు, నారదుడు కూడా వచ్చి గౌతముని ఆశ్రయము చూసి కీర్తించి నారు,  ఇది విని ఆదిదంపతుల పుత్రుడు అయిన విఘ్నేశ్వరునకు అసూయకలిగి తనుకూడా ముని వేషధారి అయి అచటనే ఉండిపోయెను. ఆ దినములలో గౌతముని ఆశ్రమము భూలోక స్వర్గము అయ్యెను.నిరంతరమూ అహల్యా గౌతములకు అతిధుల సేవే దినచర్యగా మారిపోయెను
ఇట్లుండగా తొల్లి విఘ్నేశ్వరుడు తన తల్లికిచ్చిన మాట ప్రకారము శివ జటా జూటమున గల గంగను భువికి పంపుటకు ఈ గౌతముడే సరి అని ఆలోచించి తనప్రయత్నములు తను చేయుచుండెను. ఒకనాడు విఘ్నేశ్వరుడు బ్రాహ్మణులు అందరిని కూర్చోపెట్టి మనమందరమూ ఈ ఆశ్రమము వీడి పోదాము అని చెప్పెను, అది తెలిసిన గౌతముడు వారిని పిలిచి మీరు ఇచ్చటనే ఉండి ఆశ్రమమును పవిత్రము చేయుము అని ప్రార్ధించెను.మాయా బ్రాహ్మణుడు విఘ్నేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి చెలికత్తెను ఒకరిని పిలిచి నీవు మాయా గోవు అయి ఇచట మేయుము, అప్పుడు గౌతముడు ఏమి చేసినా నీవు మరణించు అని ఆజ్ఞాపించెను. ఆమె అట్లే గోవుగా మరి ఆశ్రమమున మేయుచుండగా గౌతముడు అది చూసి అదిలించి ఒక దర్భ గోవు మీదకి విసిరెను, అంతట గోవు మరణించెను.గౌతముని మీద అసూయ కలిగిన బ్రాహ్మణులు అందరూ గోహత్యా పాతకుడు  గౌతముడు అని అక్కడినుండి వెడలిపోవుటకు ఉద్యుక్తులయ్యెను.మాయా బ్రాహ్మణ రూపమున ఉన్న గణపతి కూడా వారితో బయల్దేరెను.అసూయతో ఉన్న స్త్రీలు కూడా అహల్యను నిందిన్చుచూ బయటకు పోవుటకు సిద్ధమయ్యేను.
అందులకు అహల్యా గౌతములు చాలా విచారించి ఆ బ్రాహ్మణులను బ్రతిమిలాడెను.అప్పుడు అచటనే కల మాయా గణపతి శివుని గూర్చి తపము చేసి ఆయన జతాజూటమున  గల గంగను ఇక్కడ ప్రవహింప చేయుము అని పల్కెను. ఈ లోపులో కుంభవృష్టి కురిసి కరువు కాటకములు తగ్గిపోగా ఆశ్రమమున ఉన్న ప్రజలు కూడా వారి వారి స్థానములకు వెళ్ళెను.గౌతముడు తనకిట్టి తప్పిదము ఏల కలిగెను అని దివ్యదృష్టిని చూడగా విఘ్నేశ్వరుడు పన్నిన వ్యూహము కనపడెను.అసూయాగ్రస్తులయిన బ్రాహ్మణులు తనను తిట్టినండులకు వారిని పాషాణులు..కండి అని శపించెను. ఈ సంగతి తెలిసి బ్రాహ్మణులు అందరూ వేడుకొనగా కొంతకాలము పిదప  శ్రీ కృష్ణుడు వచ్చినప్పుడు మీకు శాప విమోచనము కలుగునని చెప్పెను.
 గణపతి తనకు చెప్పిన పని చేయుటకు అహల్యా సహితుడయి హిమవత్పర్వతమునకు పోయి అక్కడ ఒకచోట ఒంటి పాదము పై నిలబడి శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను,  ఆతని తపస్సునకు శివుడే ఆచ్చర్యము పొంది ప్రత్యక్షమయ్యెను, గౌతముడు శివుని పరి పరి విధముల స్తుతించి వచ్చిన పని చెప్పెను.శివుడు అనుగ్రహించి గంగాదేవిని భూమి మీదకు వదలగా ఆ గంగ గోవు చనిపోయిన చోట ప్రవహించి గోమాతను బ్రతికించి భూమిని పవిత్రము చేసెను. ఇది తెలిసి గౌతమిని నిందించిన బ్రాహ్మణులు కూడా స్నానము చేసి తరింప వలెనని అక్కడకు వచ్చిరి వారిని చూసి గంగ అంతర్ధానమయ్యెను.తరువాత గౌతముడు ఎంతో ప్రార్ధించగా గంగ ఆ బ్రాహ్మణుల సంగతి తెలిపెను. అప్పుడు గౌతముడు వారిని క్షమించి నీవు తిరిగి భూమి పై ప్రవహింపుము అని కోరెను.  గంగ అంగీకరించి మరల భూమి పై ప్రవహించి, గౌతముని కోరిక వలన వచ్చుటచే  " గౌతమి " అనియు, గోవును కాపాడుటచే " గోదావరి " అని పిలువబడుచున్నది.
అహల్యా గౌతములు అన్యోన్యముగా కాపురము చేయుచుండిరి, అహల్య బ్రహ్మర్షి గౌతమిని మనసుతెలుసు కొని ఆతనికి  సుశ్రూషలు చేయుచు మహా పతివ్రతగా మెలగుచుండెను. ఇట్లు  పవిత్ర ధర్మములతో తనకు సేవలు చేయుచున్న అహల్యను మెచ్చి గృహస్థు ధర్మము చేయ దలచి ఆమెను ఏది అయినా వారము కోరుకొమ్మనెను, ఆమె కొడుకును అనుగ్రహింపుమని అడిగెను. గౌతముడు ఆమె వాంఛ తీర్చగా ఆమె గర్భవతి అయి శతానందుడు అను కుమారుని కి జన్మ ఇచ్చెను, ఆ పిల్లవాడు తపోజీవనము ఆరంభించ తలచి తల్లిదండ్రుల అనుజ్ఞ పొంది అడవులకు పోయెను, అతడే శరద్వందుడు అని పిలవబడి గొప్ప తపస్సంపదుదయ్యేను.కాలక్రమమున ఈతని వీర్యమునుండియే కృపి, కృపాచార్యుడు ఉద్భవించెను. మరియొక పర్యాయము కామవాంఛ అయిన అహల్యకు గౌతముని అనుగ్రహమున అంజన అను కుమార్తె కలిగెను.ఈ అంజన పితృ వాత్సల్యము చె పిత్రుని వద్దే ఉండెను, ఈమె కుమారుడే ఆంజనేయుడు. మరికొంత కాలమునకు గౌతముని కృప వలన అహల్యకు మరియొక కుమార్తె కలిగెను. ఈమెను గౌతముడు తన శిష్యుడగు ఉదక మహామునికి నవ యౌవనము ఇచ్చి తన కుమార్తెనిచ్చి వివాహము చేసెను.
అహల్య వివాహమయినప్పటి నుండి ఇంద్రుడు ఆమె అందమునకు దాసుడయి ఆమె పొందు కోరుచుండెను.ఒకనాడు ఇంద్రుడు తనకోర్కే తీర్చుకొనుటకు ఉపాయము ఆలోచించి కోడి అయి గౌతమాశ్రమము  చేరి నడి రేయి కూయసాగెను, ఇది విని గౌతముడు కాలకృత్య నిర్వహణకు నదికి పోయెను. ఈ అవకాశమును ఉపయోగించి ఇంద్రుడు గౌతముని వేషమున అహల్య దగ్గర చేరి సంగమించుటకు ఉద్యుక్తుదయ్యను.ఆమె ఈ ద్రోహము తెలియక భర్తే అని సహకరించెను. నదికి వెళ్ళిన గౌతముడు ఇంకనూ చాలా పొద్దు ఉన్నది అని గ్రహించి తిరిగి వచ్చి వారిని చూసెను. అహల్య ఆచ్చర్యపోయి మహాత్మా ఇది ఏమి రెండు రూపములు దాల్చితిరి అని అడుగగా, ఆతని కోపమేరిగి ఇంద్రుడు వణికి పోయి పిల్లి రూపమున పారిపో చూసేను, ఓరీ నీ స్వరూపము చెప్పనిచో నిన్ను భస్మము చేయుదును అని చెప్పగా ఇంద్రుడు భయకంపితుడయి తన నిజ రూపము ధరించెను
అహల్య ఆచ్చర్యము చెంది మహాత్మా ఈ మోసము నేనెరుగను, మీరే మరలివచ్చి .పొండుకోరారు అని తలచి నాను, ఇంతకు మించి పంచభూతముల సాక్షిగా నాకేమియు ఎలియదు అని చెప్పెను, అప్పడు ఆశరీర వాణి కూడా అహల్య పతివ్రత తనకేమియు తెలవదు అని చెప్పెను. నేవు తెలిసి చేసిననూ తెలియక చేసిననూ తప్పు తప్పే, కావున నీవి చేతనము లేని శిలవయి పడి ఉండుము అని శపించెను.
ఇంద్రుని చూచి దుర్మార్గా దేవేంద్రా శచీపతివి అయి ఉండియు నీ కామ వాంఛలకు అంతు లేకున్నది, మహా పతివ్రత అగు ముని పత్నినే  మోసగించితివి. కావున నీ అండములు ఊడిపడి, శరీరమంతయు ఉపస్థులు అయి, రాజ్యము పోగొట్టుకొని నిత్య దుఃఖము అనుభవిం పుము అని శపించెను.
అంత అహల్య గౌతముని పాదముల పై పడి శాప విముక్తి అనుగ్రహింపుము అని వేడుకొనెను, అంత గౌతముడు నిదానించి నీవు శిలవయి  ఎండావానలకు ఓర్చి నిరాహారివై రామస్మరణ చేయుచు వేయి సంవత్సరములు పడి ఉండుము, అప్పుడు ఈ ప్రాంతమునకు రాముడు వచ్చును ఆయన పాద స్పర్శచే నీకు శాప విముక్తి కలుగును అప్పుడు నీవు పవిత్రవయి నా వద్దకు రావచ్చును అని పలికెను.అంత ఇంద్రుని చూచి మహర్షుల కోపము నీటిమీద వ్రాతలవంటివి నీ ఉపస్థు లు ఇతరులకు కన్నుల వలె కనపడును, నీ రాజ్యము కూడా కొద్ది కాలము పిదప నీ చేతికి వచ్చును పొమ్మని పలికెను.అహల్య తదుపరి శ్రీ రామ స్పర్స చె శాప వోమోచానము చెంది గౌతముని చెంతకు చేరి మహా పతివ్రతగా వెలసెను.
గౌతమ మహర్షి లోకమునకు ప్రసాదించిన వాటిలో గౌతమ ధర్మసూత్రములు మొదటిది, రెండవది అయిన న్యాయ శాస్త్రమును వ్యాసుడు ఖండించగా గౌతముడు తన పాదమునందు నేత్రము సృష్టించుకుని వ్యాసుని చూచెను,అందుకే గౌతముడు  " అక్షపాదు " డు అని పిలువబడుచున్నాడు. ఈ గౌతమ న్యాయ శాస్త్రము ఐదు అధ్యాయములుగా ఉన్నది  మూడవది గౌతమ సంహిత గొప్ప జ్యోతిస్సాస్త్ర గ్రంధము.
ఈ గౌతముని పేరున  " గౌతమ" గోత్రము ఉన్నది.
ఈ గోత్రములు ఆన్నిటికి చివర "స" అను అక్షరము మొదటినుండియు లేదు, తదుపరి " స" కారము మంచిది అని చేర్చినట్లు తెలియు చున్నది.
(వచ్చే నెల మరొక ఋషి గురించి తెలుసుకుందాము.)
Comment Using!!

Pages