సుబ్బుమామయ్య కబుర్లు!
గురువుగారు
అన్న ఈ శ్లోకం మీరు ఇంట్లోనో, స్కూల్లోనో వినుంటారు కదూ! గురువు అంటే మనకు చదువు చెప్పేవాడు. చక్కగా చదువుకుంటేనే మనం జీవితంలో పైకి వస్తాం.
గురువంటే కాషాయవస్త్రాలు కట్టుకుంటాడని, పెద్ద గడ్డం ఉంటుందని..అంతేగాక ఆశ్రమాల్లో పిల్లల చేత విద్యాభ్యాసం చేయిస్తూ ఉంటాడని అనుకుంటున్నారు అవునా? నిజమేలే మీరు కథల్లో అలా విని ఉంటారు. లేదా టీవీల్లో, సినిమాల్లో చూసి ఉంటారు.. కదా! కానీ మీకు స్కూల్లో తెలుగు, లెక్కలు, సామాన్యశాస్త్రం మొదలైన సబ్జెక్ట్స్ చెబుతారే వాళ్లుకూడా గురువులేనర్రా! అందుకే మనం సెప్టెంబరు అయిదవ తేదీని గురుపూజాదినోత్సవంగా జరుపుకుంటాం. అన్నట్టు ఆ రోజు డా సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మించిన రోజుకూడా (ఆ మహానుభావుడి గురించి అమ్మను, నాన్నను అడిగి తెలుసుకోండి)!
గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు. అంటే ఓ పద్ధతి ప్రకారం, మెళకువలతో, సూత్రాలతో, సులువులతో విద్య నేర్పేది గురువుగారే! అందుచేత మనం తరగతిలో ఆయన చెప్పే పాఠం అల్లరిచేయకుండా శ్రద్ధగా వినాలి, ఆకళింపు (అర్థం అమ్మానాన్నల్ని అడగండి) చేసుకోవాలి.
దేవతల గురువేమో బృహస్పతి..మరి రాక్షసులకు? శుక్రాచార్యుడు. అవతార పురుషులకి కూడా గురువులున్నారర్రా! శ్రీరాముడికి వశిష్ఠుడు, శ్రీకృష్ణుడికి సాందీపని గురువులే! అందుకే వాళ్లు మానవావతారమెత్తిన మహానుభావులయ్యారు. అర్జునుడు విలువిద్యలో అంత గొప్ప సవ్యసాచి కావడానికి కారణం ఎవరనుకున్నారు? ద్రోణాచార్యుడే! తనకు విద్య నేర్పనన్నాడని, ద్రోణాచార్యుడి మట్టిబొమ్మను పెట్టుకుని విలువిద్య నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. ఏకాగ్రతతో గొప్పకార్యాన్ని సాధించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.
పరమానందయ్యగారనే ఓ మహాపండితుడైన గురువుకు ఏడుగురు తెలివి తక్కువ శిష్యులుండేవారు. వాళ్లతో ఆయన ఎన్ని తిప్పలు పడ్డాడో పగలబడి నవ్వుతూ చూడాలంటే, పరమానందయ్య శిష్యులకథ సినిమా చూడాల్సిందే! మీ పెద్దవాళ్లనడిగి ఓ ఆదివారంనాడు ఆ సినిమా తప్పక చూడండి. మనం మాత్రం అలా ఉండకూడదే! ఏరోజు పాఠాలు ఆరోజు చదువుకుంటూ, చక్కని ఆటలు ఆడుతూ శరీరాన్నీ, మనసును చురుగ్గా ఉంచుకోవాలి. మెదడుకెప్పుడూ పజిల్స్, తికమకలెక్కలు, సుడొకులతో మేత అందించాలి. అప్పుడే అది పాదరసంలా ఉంటుంది. అందరిలో మనకు తగిన గుర్తింపు తీసుకువస్తుంది.
మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవోభవ అన్నది ఆర్యోక్తి. తల్లి, తండ్రి తర్వాత గురువులనూ దైవసమానంగా పూజించాలని మన సంస్కృతి చెబుతోంది. వచ్చే మాసం స్నేహం గురించి మాట్లాడుకుందాం సరేనా? ఉంటాను మరి!
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు.
No comments:
Post a Comment