జోశ్యభట్ల శర్మ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

జోశ్యభట్ల శర్మ గారితో ముఖాముఖి

Share This

బహుముఖప్రజ్ఞాశాలి - జోశ్యభట్ల శర్మ గారితో ముఖాముఖి

భావరాజు పద్మిని 


సంగీతం, సాహిత్యం, నాట్యం, విద్య... ఇలా ఎన్నో కళల్లో విశిష్టమైన పట్టాలు పొందిన బహుముఖప్రజ్ఞాశాలి జోశ్యభట్ల శర్మ గారు. ‘మిణుగురులు’ చిత్రం ద్వారా అద్భుతమైన పాటలు అందించిన శర్మ గారితో ప్రత్యేక  ముఖాముఖి ఈ నెల మీకోసం...
నమస్కారమండి. సంగీతంపట్ల మీకు చిన్నప్పటి నుంచే అభిరుచి ఉండేదా ? మీ ఇంట్లో సంగీత విద్వాంసులు ఎవరైనా ఉన్నారా?
నమస్కారమమ్మా. మా అమ్మమ్మ గారు భమిడిపాటి నరసమాంబ గారనీ, కాకినాడలో పెద్ద సంగీత విదుషీమణి. సంగీతంలో నాకు ఓనమాలు నేర్పింది వారే.  మా ఇల్లు లలితకళల నిలయంలా ఉండేది. మా పిన్నిగారు డాన్సర్. మా తాతగారు (నాన్నగారి నాన్నగారు ) జోశ్యభట్ల గున్నేశ్వర్రావ్ గారని, పేరొందిన కవివర్యులు.
అమ్మమ్మ దగ్గర సంగీతంలో బేసిక్స్ నేర్చుకున్నాకా, కాకినాడలో ఆకెళ్ళ ప్రభాకరమూర్తి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాను. అలాగే వెంపటి చినసత్యం గారి వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను.
ఓహో ! మరి సంగీతం, నాట్యం, విద్య ఈ మూడిటి మధ్య సమతుల్యతను సాధించడం ఎలా సాధ్యమయ్యింది? మీ విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది?
నేను ఎం.ఎ. తెలుగు, ఎం.ఎ. సంస్కృతం చేసానండి. గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చుకుని, డిప్లొమా, బి.ఎ, ఎం.ఎ, పి.హెచ్.డి  చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాను. సంగీత పరిశోధనలో నేను ఎంచుకున్న అంశం – అన్నమయ్య సంకీర్తనలు, పద వేద ఘోష అనేది. ఇందులో అన్నమయ్య కీర్తనలలో ఉన్న వేద ప్రామాణికమైన సంఘటనల గురించి అధ్యయనం చేసాను. అలాగే కూచిపూడి   నాట్యంలో ఎం.ఫిల్ చేసి, ప్రస్తుతం పి.హెచ్.డి చేస్తున్నాను. ఇందులో నేను పరిశోధనకు ఎంచుకున్న అంశం – వేదవిహిత వివాహ నృత్య రీతి – అంటే వేదంలో ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి, ఏ ఏ వివాహ పద్ధతుల వలన ఎటువంటి లాభాలు చేకూరతాయి, ఇటువంటి అంశాలపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాను.
బాగుందండి. మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది ?
చిన్నప్పటి నుంచే సినీరంగం పట్ల నాకు తెలియని ఆసక్తి ఉండేది. నేను ఈ టీవీ వారి పాడుతా తీయగా లో పాల్గొన్నాను. రామాయణం నా మొదటి చిత్రం. మాధవపెద్ది సురేష్ గారి సంగీత సారధ్యంలో మూడు పద్యాలు పాడాను. ఆ తర్వాత చాలా సినిమాలకు పాడాను. జానకమ్మ గారి ప్రోద్బలంతో రెహ్మాన్ గారివద్ద పని చేసాను. ఆ తర్వాత కాకినాడ వెనక్కి వెళ్ళిపోయి, ప్రగతి కాలేజీ లో తెలుగు డిపార్టుమెంటు హెడ్ గా కొన్నేళ్ళు పనిచేసాను.
నేను 2007 లో నారాయణ కాలేజీలో పనిచేస్తూ ఉండగా, నాకు మురళీధర్ కేసరి గారితో పరిచయం ఏర్పడింది. వారు నాకు గాడ్ ఫాదర్ అని చెప్పవచ్చు. అప్పట్లో నేను ఈ టీవీ వారు నిర్వహించిన ఒక కామెడీ షో లో ఫైనల్స్ దాకా వచ్చాను. అప్పుడాయన నా ప్రతిభను గమనించి, మొట్టమొదటగా ఈ టీవీ కార్యక్రమాలకు సంగీతం కూర్చే అవకాశం ఇచ్చారు. బ్లాక్, పరిపూర్ణ మహిళ, సౌందర్యలహరి, వంటి వాటికి నేను సంగీతం అందించాను.
అలాగే svbc వారి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమానికి కూడా సంగీతం అందించాను.
బ్లాక్ షో కు పనిచేస్తూ ఉండగా చంద్రశేఖర్ గారు నాకు ‘చందమామ కధ’ అనే సినిమాకు మొట్టమొదట సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. అందులో హీరోగా అల్లరి నరేష్ నటించారు. ఆ తర్వాత నాకు విశేషంగా పేరు తెచ్చిన చిత్రం, ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన చిత్రం – మిణుగురులు. అలాగే ఆస్కార్ లైబ్రరీ 2014 వ సం. లో ఈ కధను భద్రపరిచారు. ఇది నా చిత్రానికి దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు,
బాగుందండి. మీరు ఏ ఏ సినిమాలకు పనిచేసారు? ఈ రంగంలో ఎవరినైనా మీ గురువుగా భావిస్తారా ?
నేను ఆంధ్రా పోరి, అడవి కాచిన వెన్నెల, గోల శీను, అలెజ్జాండర్, కీచక వంటి చిత్రాలకు పనిచేసాను. సినీరంగంలో రామాజోగయ్య శాస్త్రి గారిని నా గురువుగా భావిస్తాను. నాకు ఏ ఇబ్బంది, సమస్య ఒచ్చినా వారిని సంప్రదించి, వారి సహకారం, సూచనలు తీసుకుంటాను. ఈ రంగంలో నాకు వారు మార్గదర్శి అని చెప్పవచ్చు.
ఇంతవరకూ మీ ప్రస్థానాన్ని ఒకసారి పరికిస్తే మీకు ఎలా అనిపిస్తుంది.
సినిమాల పరంగా నేను ఏ ఒక్క జోనర్ కీ పరిమితం కాలేదు. కామెడీ, హారర్, సస్పెన్స్, కుటుంబ చిత్రాలు, ప్రేమ నేపధ్యంతో సాగే సినిమాలు ఇలా అన్ని రకాల సినిమాలు చేసాను. ఇది నాకు చాలా సంతోషకరం. కొన్ని సినిమాల్లో గెస్ట్ ఆర్టిస్ట్ గా సరదాగా నటించాను కూడా.
SVBC లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని రాఘవేంద్రరావు గారి ప్రోద్బలంతో ఆరంభించి, టి.టి.డి కి సేవలు అందించి, వాటిని కేసెట్లుగా తీసుకుని వచ్చాను. ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిన అంశం.
మీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా ?
గోల శీను సినిమాకోసం ‘మీనా ‘ అనే పాటను చేసాను. దీన్ని రెహ్మాన్ గారికి పంపాను. వారు గంటలో బదులిచ్చారు. ‘చాలా బాగా చేసావు, ఈ పాట కనుక నాపేరు మీద ఒచ్చి ఉంటే, ఏడాది పాటు మారుమ్రోగేది ‘అని మెచ్చుకున్నారు. అది రామజోగయ్య గారితో నా మొదటి పాట కూడాను.
అలాగే మిణుగురులు చిత్రానికి మద్రాస్ తెలుగు అకాడమీ వారు ‘ఉత్తమ సంగీత దర్శకత్వానికి’ గాను నాకు ఉగాది పురస్కారం ఇచ్చారు. ఇది కూడా నేను మర్చిపోలేను.
మరొక మర్చిపోలేని సంఘటన, నేను నా మొదటి చిత్రానికి చేసిన చిన్న మ్యూజిక్ బిట్, చాలా రోజుల తర్వాత, ఒక చిన్న కార్ మెకానిక్ రింగ్ టోన్ గా వినిపించింది. పోగొట్టుకున్న పెన్నిధి ఏదో దొరికినట్టు, అప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది.
మీ దృష్టిలో నిజమైన సంగీతం అంటే ఏమిటి ?
నిజాయితీగా చెప్పాలంటే, ప్రతి సంగీత దర్శకుడికీ సంగీతాన్ని కూర్చేటప్పుడు తనదైన ప్రత్యేక శైలి, అవగాహన ఉంటుంది. నాకు నటనలో, సంగీత, సాహిత్య, నాట్య కళల్లో అభినివేశం ఉంది కనుక ఆయా పాత్రల్ని, సన్నివేశాల్ని బట్టి నేను సంగీతం అందిస్తాను.
ఉదాహరణకి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాటలకు బాణీలు కూర్చేటప్పుడు శృంగార పరమైన కీర్తనలకు శృంగార పరంగానే సంగీతం సమకూరుస్తాను. ‘పంతము లాడ చెల్లదు’ అనే పాటలో అలిమేలుమంగమ్మ చెలికత్తెను స్వామి వద్దకు వెళ్లి, బ్రతిమాలి తీసుకుని రమ్మంటుంది. ఇందులో పతులకు, సతులకు పంతాలు కూడదని చెప్పే చోట ఆ భావం పలికేలా బాణీ కూర్చాను. ఇప్పటిదాకా నేను 50,60 కీర్తనలు స్వరపరిస్తే, వాటిలో నేను 40 రిథమ్ పాటర్న్స్ కూర్చాను. ఇదొక రకంగా రికార్డు అని చెప్పవచ్చు, ఇన్ని రకాల రిథమ్స్ పాటర్న్స్  ఎవరూ చెయ్యలేదు.
‘చొక్కకుమీ పెండ్లినాడే’ అనే కీర్తన ఫోక్ స్టైల్ లో చేసినది. కీరవాణి గారు ఈ పాట విని, మాస్ స్టైల్ లో బీట్ వేసి, అలరింపచేసావని మెచ్చుకున్నారు. ఇలా పండిత పామర రంజకంగా బహుళ జనాదరణ పొందేదే అసలైన సంగీతం. అది మాస్ కావచ్చు, మెలోడీ కావచ్చు, ఫోక్ కావచ్చు, బీట్ ఓరియెంటెడ్ కావచ్చు, ఎక్కువ మంది మెచ్చుకుంటేనే అది పండినట్టు. ఒక క్లాసికల్ పాట వింటే వినేవారి తల ఊగుతూ ఉంటుంది. ఒక బీట్ ఉన్న పాట వింటే కాళ్ళు ఊగుతాయి. అదే ఒక మాస్ సాంగ్ పడితే కొంతమంది లేచి నాట్యం చెయ్యడం మొదలుపెడతారు. ఇలా శ్రోతలపై ఒక్కో పాటకీ ఒక్కో రకమైన ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని తీసుకుని రాగాలిగినదే అసలైన సంగీతం.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
ఇండస్ట్రీ కి వచ్చి ఆరేళ్ళు పూర్తికానుందండి. ఇప్పటిదాకా 13 సినిమాలు చేసాను. ఏ నాడు అవకాశాల కోసం ఎవరినీ వెళ్లి అడగలేదు. బహుశా ఇది నా డ్రా బ్యాక్ గా చెప్పాలేమో. కాని, దేవుడి దయ వల్ల, ఆయన చూపిన దారిలో వెళ్తున్నాను. వచ్చిన అవకాశాలని అందిపుచ్చు కుంటున్నాను. ఇలాగే ఎవ్వరినీ ఏమీ అడిగే అవసరం రాకుండా ఆ దైవం చూపిన మార్గంలో వెళ్తే చాలు. ఇంతకంటే పెద్దగా ప్రణాళికలు ఏమీ లేవండి.
చాలా సంతోషమండి. మీరు మరిన్ని విజయాలు సాధించాలని, మరిన్ని మంచి సినిమాలకు బాణీలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము. నమస్కారం.
మీకు, చదువరులకు  నా కృతజ్ఞతలు, శుభాభినందనలు. నమస్కారం.

No comments:

Post a Comment

Pages