ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య ప్రణీత -మను చరిత్రము (కళా ఖండానికి ఒక పామరుడి ప్రశంస)
బాలాంత్రపు వేంకట రమణ
ఓం నమో విఘ్నేశ్వరాయనమః సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యే సిద్ధిర్ భవతుమే సదా !
శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్థానంలో 'భువన విజయ' సభామండపాన్నిఅలరించిన అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దనామత్యునిది అగ్రస్థానం. ఆయన 'అంధ్ర కవితా పితామహ'* బిరుదాంకితుడు. నందవరీక బ్రాహ్మణుడు. తండ్రి పేరు చొక్కన. బళ్ళారి ప్రాంతం లోని దోసపాడు పరగణాలోని దోరాల ఇతని నివాస స్థలం. "మనుచరిత్రము" గా ప్రసిద్ధి గాంచిన "స్వారోచిష మనుసంభవము" అనే ప్రబంధం ద్వారా తెలుగు భాషామతల్లి మకుటంలో కల్కి తురాయిగా నిలిచాడు. పెద్దనామాత్యుడు "మనుచరిత్రము" కాక "హరికథాసారము" అనే ప్రబంధాన్ని కూడా రచించి తన గురువైన శఠకోపయతికి అంకితం చేశాడు.
మార్కండేయ పురాణంలో ఉన్న "స్వారోచిష మనుసంభవం" అన్న కథని రాయలవారే పెద్దనకి సూచించారు. "....భవచ్చతుర రచన కనుకూలంబున్" - "నీ రచనా స్వభావానికి ఈ కథ అనుకూలంగా ఉంటుంది" అని రాయల సూచన. "మనుసంభవ మరయ రసమంచిత కథలన్ విననింపు" అనేది పై సూచనకి హేతువు. రసవత్కథలు ఉన్నాయి. నీది రసవద్రచన. కాబట్టి అనుకూలిస్తుంది అని రాయల వారి ప్రోత్సాహం.
పెద్దన గారి ప్రత్యేకతలని చెబుతూ రాయల వారే -
హితుడవు చతురవచోనిధి
వతుల పురాణాగమేతి హాస
కథార్థ స్మృతియుతుఁడ వాంధ్ర కవితా
పితా మహుఁడ వెవ్వరీడు పేర్కొన నీకున్ (మనుచరిత్ర, పీఠిక)
*"ఆంధ్రకవితాపితామః" అన్న బిరుదు పెద్దన కంటే ముందు ఇద్దరికీ (శివదేవయ్య క్రీ. శ. 1260, కొఱవి సత్తేనారన క్రీ. శ. 1400 ) పెద్దన తరవాత కాలంలో మరో ఇద్దరికీ (ఉప్పు గుండూరి వేంకట కవి క్రీ.శ. 1600, ఎనమండ లక్ష్మీ నృసింహ కవి క్రీ.శ. 1680 ) ఇవ్వబడింది. కానీ ఒక పెద్దన యందే ఈ బిరుదు స్థిరంగా నిలిచిపోయింది.
ఇందులో పురాణ-ఆగమ-ఇతిహాసాలు అన్నీ తెలుసు అనడం వాటిలో ఉండే కథల పరమార్థాలను నీవు ఎరుగుదువు అనడం. ఇది పెద్దన గారి పాండిత్యానికి సూచకం. "హితుడవు" అనేది వ్యక్తిత్వానికి కితాబు. "చతుర వచోనిధివి" (నిపుణమైన వాక్కులకు గనివి) అనేది కవితాశక్తికి నివాళి. "నీతో సరితూగేవారు లేరు" అన్నాడు రాయలు.
రాయలవారి ఈ ప్రేరణతో ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనామాత్యుడు "స్వారోచిషమనుసంభవం" అనే ప్రబంధాన్ని కడు రమణీయంగా తీర్చిదిద్దాడు. ఇది "మనుచరిత్రము" గా ప్రసిద్ధి చెందింది. తెలుగు పంచమహాకావ్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది. తెలుగులో "పంచ మహా కావ్యాలు"గా పరిగణింపబఢు తున్న గ్రంధాలు: 1) పెద్దనామాత్యుని "మనుచరిత్రము" 2 ) నంది తిమ్మన గారి "పారిజాతాపహరణము" (దీని స్థానంలో శ్రీనాథుని శృంగార నైషధం చెబుతారు) ౩) శ్రీ కృష్ణదేవరాయ విరచిత "ఆముక్తమాల్యద" 4) తెనాలిరామకృష్ణుని "పాండురంగమాహత్మ్యము " 5) రామ రాజభూషణుని "వసుచరిత్రము"
ఈ ఐదు కావ్యాలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే తెలుగు భాష సంపూర్ణంగా వచ్చేస్తుందని పెద్దల ఉవాచ. పెద్దన గారంటే రాయలవారికి అపరిమితమైన గౌరవం. ఎంతటి గౌరవం అంటే "ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి కేలూత యొసగి ఎక్కింఛుకొనేవా"డట. స్వయంగా కాలికి గండపెండేరం తోడిగాడట. మనుచరిత్రం కృతి స్వీకరించినప్పుడు తాను కూడా పల్లకి మోసాడట! అంతటి గౌరవం, మర్యాద. పెద్దన తన సమకాలీన కవులచేత కూడా అంతగానూ గౌరవింప బడ్డాడు. అందరికీ ఎవో వంకలు పెట్టి కొంటె కోణంగి అనిపించున్న కవి చౌడప్ప కూడా తన వెక్కిరింపు స్వభావాన్ని మానుకొని:
పెద్దన వలెఁ గృతి సెప్పిన
బెద్దనవలె, నల్ప కవినిఁ బెద్దనవలేనా?
ఎద్దనవలె మొద్దనవలె
గ్రద్దనవలెఁ గుందవరపు గవి చౌడప్పా!
అని పెద్దనార్యుని గూర్చి తన మెప్పుని వెల్లడించాడు.
మనుచరిత్రము - కథా సంగ్రహం
అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు అరుణాస్పదపురం. ఆ ఊళ్ళో ప్రవరుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడుండేవాడు. చూడ్డానికి అత్యంత సుందరుడు. “మన్మధుడు, చంద్రుడు, ఇంద్రకుమారుడైన జయంతుడు, నలకూబరుడు మొదలైన జగన్మోహనాకారులు ఇతనిముందు తీసికట్టు” అనిపించేటంతటి అందగాడు. ఎంతటి అందగాడో అంతకుమించిన సుగుణాలరాశి. ఎన్నడూ ధర్మమార్గం తప్పని వాడు. తరుణవయస్సులో ఉన్నావాడు. వేదవేదాంగ పండితుడు. యౌవనమందే యఙ్ఞయాగాలు చేసిన ఘనుడు. అతడు నిజంగా బ్రాహ్మణకుల దీపకుడు. పైగా ధనవంతుడు. అతనికి పుష్కలంగా పండే మాన్యక్షేత్రాలున్నాయి. ఏ రాజుగారైనా అన్నివిధాలా దానం ఇవ్వడానికి ఇతడే అర్హుడు అని ఎంచి దానం ఇవ్వబోతే, దానం స్వీకరించడం కూడా పాపం అని భావించి పరిగ్రహించేవాడు కాడు. దానంపుచ్చుకుంటే దానికో ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. ఒక్క సాలగ్రామ దాన స్వీకరణకే ఏ పాపం అంటుకోదట. ప్రవరాఖ్యుడు దాన్ని కూడా స్వీకరించేవాడు కాడు. అంటే అంతటి ధర్మ నిష్ఠాగరిష్టుడు.
అతని భార్య సోమిదమ్మ, అతనికి అన్నివిధాలా అనుకూలవతి. ఎంతో భక్తిశ్రద్ధలతో అతన్నీ, అత్తమామల్నీ సేవిస్తూ ఉంటుంది. వెయ్యిమంది అతిథులు అర్థరాత్రి సమయంలో వచ్చినా సరే, చిఱునవ్వుతో వారికి వండి పెట్టి సంతుష్టుల్ని చేస్తుంది.
ప్రవరుడి తలిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల్లాగా ఉండి, ఇంటి పనీ, బయట పనీ చక్కగా చూసుకుంటూఉంటారు. వారు వృద్ధులు. ప్రవరుడు వాళ్ళని నిత్యం ఎంతో భక్తిప్రపత్తులతో సేవించుకుంటూ ఉంటాడు.
ప్రవరుడికి అతిథిపూజ అంటే పరమానందం. అంతేకాదు, తీర్థయాత్రలన్నా, తీర్థయాత్రలు చేసివచ్చిన పుణ్యమూర్తులన్నా ఎంతో భక్తి. అటువంటివారు వస్తున్నారని తెలిస్తే, ఎంతదూరం అయినా వాళ్ళకి ఎదురేగి, పాదాలకి నమస్కరించి ఇంటికి ఆహ్వానించి, భక్తితో ఆతిధ్యమిచ్చి, వాళ్ళకి ఇష్టమైన భోజన పదార్థాలని వండించి, వడ్డించి, సంతృప్తులుగాచేసి, వాళ్ళు భుజించి కూర్చున్నాకా వాళ్ళని సమీపించి వాళ్ళు వెళ్ళి వచ్చిన, చూసిన ప్రదేశాల గురించి, తీర్థ క్షేత్రాల గురించీ అడిగి తెలుసుకొనేవాడు. అవి తనఊరినుంచి ఎంతెంత దూరంలొ ఉన్నాయో అడిగి తెలుసుకొనేవాడు. ఆయా ప్రదేశాలకి తాను వెళ్ళలేకపోతున్నానే అని చింతిస్తూ, నిట్టూర్పులు విడుస్తూ ఉండేవాడు. వెళ్ళాలని ఉబలాటపడేవాడు. కానీ నిత్యాగ్నిహోత్రి, పితృసేవాతత్పరుడు అయిన ప్రవరుడు తన నిత్యకృత్యాలయిన అనుష్టాలని వదిలి ఒక్క రోజు కూడా ఉండడానికి ఇష్టపడకపోని కారణం వలన అరుణాస్పదపురాన్ని విడిచి ఎక్కడికీ వెళ్ళేవాడు కాడు.
ఇలా ఉండగా ఒకనాడు ప్రవరుని ఇంటికి ఒక సిద్ధుడు హఠాత్తుగా వచ్చాడు. యధావిధిగా ప్రవరుడు అతనికి అర్ఘ్యపాద్యాలిచ్చి, సకలోపచారాలు చేసి, మంచి భోజనం పెట్టి, అతను విశ్రాంతి తీసికొన్న తరవాత చెంతచేరి "మహాత్మా! మీరు ఎక్కడ నుండి ఎక్కడికి వెళుతూ ఇలా నా ఇల్లు పావనం చేసారు? మీరు ఏయేదేశాల్నీ, ఏయే పర్వతాల్నీ చూశారు? ఏయే తీర్థాలలో స్నానాలు చేశారు? ఏయే ద్వీపాలు, ఏయే పుణ్య స్థలాలు, ప్రదేశాలు సందర్శించారు?" అని అడిగాడు తన ధోరణిలో.
అందుకు ఆ సిద్ధుడు "నేను మెట్టని గుట్ట, సేవించని తీర్థం, క్షేత్రం, చూడని ప్రదేశమూ లేవు" అంటూ తాను ఆసేతు హిమాచలం ఏమేమి వింతలూ, విడ్డూరాలూ చూశాడొ చెప్పుకొచ్చాడు. అదంతా విని ప్రవరుడు ఆశ్చర్యచకితుడయ్యడు, ఆపైన కొంచెం అనుమానమూ కలిగింది. "స్వామీ, మీరు వర్ణించినవన్నీ సందర్శించి రావాలంటే ఏళ్ళూ పూళ్ళూ పడుతుందికదా, మీరు చూస్తే అంత వయసు ఉన్నవారిలా కనపడ్డంలేదు, అదెలా సాధ్యమయింది?" అని ప్రశ్నించాడు అనుమానంగా.
దానికి ఆ సిద్ధుడు నవ్వి "నువ్వన్నది నిజమే, నడకే ఆధారం గలవారికి ఇది పొసగనిదే, కాని నా దగ్గఱ ఈశ్వరకృపవల్ల ఒక పాదలేపనం ఉంది. ఆ పసరు ప్రభావంతో ఎంత దూఱమైనా లిప్తమాత్రంలో పోగలను. ఆకాశంలో సూర్యుడి రథాలు ఎంత వేగంగా ప్రయాణించగలవో భూమి మీద నేనూ అంత దూరమూ, అంతే వేగంగా అలసట లేకుండా ప్రయాణించగలను" అని చెప్పాడు.
ప్రవరుడికి ఎంతోకాలంగా తీరకుండా ఉండిపోయిన తన తీర్థాయాత్రా సందర్శనాభిలాష తీరే మార్గం దొరికింది. ఇలా వెళ్ళి అలా వచ్చేయ్యగలిగితే తన నిత్యకర్మలకీ, అనుష్టానాలకీ, తలిదండ్రుల సేవకీ ఏమీ అంతరాయం కలగదుకదా మరి. అతను వెంటనే ఆ సిద్ధుడికి భక్తిశ్రద్ధలతో అంజలిఘటించి, తన చిరకాల వాంఛ తీర్చమని ప్రార్థించాడు. సిద్ధుడు ప్రసన్నుడై, తన బుట్టలోంచి పసరు తీసి, దీని పేరు ఇదీ అని చెప్పకుండా, ప్రవరుడి పాదాలకి దాన్ని పూసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ పసరుపూసి అతడలా వెళ్ళగానే ప్రవరుడు తన మనసులొ "హిమవత్పర్వతాన్ని చూడాలి" అని సంకల్పించాడు. మరుక్షణంలోనే అతడు హిమగిరిశిఖరం మీదికి పోయి నిలిచాడు.
* * *
కన్నుల పండువలాగా సొగసులొలికే హిమగిరిపై ప్రవరుడు అనేక రమ్యమైన స్థలాల్ని చూశాడు. ఎన్నో పవిత్రమైన ప్రదేశాలని చూశాడు. నరనారాయణులు తపస్సు చేసిన బదరీ వనాన్ని సందర్శించి పులకించిపోయాడు. భగీరధుడు తపస్సు చేసినచోటు, ఆకాశగంగ భువికి దిగిన చోటు, పార్వతి పరమేశ్వరునికి శుస్రూష చేసిన ప్రదేశము, మన్మధుడు శివుని మూడవ కంటిమంటచే బూడిదయి జాలిగలిగించు ప్రదేశం, అగ్నిదేవుడు సప్తర్షుల కాంతలపై మోహం చెందిన ప్రాంతం, కుమారస్వామి జననం చెందిన ఱెల్లుదుబ్బులనూ మొదలైన ఎన్నో దివ్యమైన, మనోహరమైన ప్రదేశాలనీ, సుందరమైన లోయలనీ, గుహలనీ, సెలయేళ్ళనీ చూసి పరవశించిపోయాడు. హిమాలయ పర్వత ప్రకృతి సౌందర్యం ప్రవరుణ్ణి ముగ్ధుణ్ణి చేసింది.
ఆ అందాలకి ఎంత ముగ్ధుడైపోయినా, పరమ నిష్ఠాగరిష్టుడైన ప్రవరుడు, "నిత్యం అనుష్టించే కర్మకలాపాలకి వేళ దాటి పోతోంది. ఈ చోటులగల చోద్యాలని రేపు మళ్ళీవచ్చి ఆస్వాదిస్తాను" అనుకొని “ఇంటికి చేరాలి” అని సంకల్పించాడు. కానీ ప్రయోజనం కలగలేదు. తీరాచూస్తే ఏముంది, పాదాలకి పూసుకున్న పసరు మంచు వలన కఱిగిపోయింది! ప్రవరుడి గుండెలో రాయిపడినట్ట్లయింది. "అయ్యో! ఇక ఇక్కడి నుండి నాకు విముక్తి లేదు. నా జీవితం ఇక్కడే క్షుద్రమార్గంలో అంతమైపోతుంది కాబోలు. ఆ పసరు ప్రభావాన్ని పరీక్షించడానికి, నేను ఏ కాశీయో, గయో, కురుక్షేత్రమో, ప్రయాగో వెళ్ళకుండా, నరమానవులెవరూ అగుపించనిదీ, క్రూరమృగాలు విశేషంగా సంచరించేదీ అయిన ఈ మంచుకొండకే ఎందుకొచ్చాను? ఓ దైవమా, నా నిత్యానుష్టాలకి దూరంచేసి, తీసుకొచ్చి ఇలా మిన్నులుపడ్డచోటున – అంటే ఆకాశం భూమిని తాకేలాగా ఉన్న దూర ప్రాంతంలో పడేశావు కదయ్యా!" అని పరిపరి విధాల చింతించాడు.
కొంచెంసేపటికి తేరుకొని "ఈ హిమగిరి మునీంద్రులకి నిలయం. నన్ను ఇల్లు చేర్చగల మహాత్ముడు ఒక్కడైనా ఇక్కడ కనిపించకపోడు" అని ధైర్యం తెచ్చుకొని ముందుకి సాగాడు. అలా వెళుతూ ఉండగా, అతనికి ఒక గానం వినిపించింది. వెంటనే అతని హృదయంలో ఒక అశాజ్యోతి వెలిగి నట్లయింది. "అక్కడేదో ముని ఆశ్రమం ఉన్నట్లుంది, ఇక నేను రక్షింపబడతాను" అనుకుంటూ ఆ పాట వినవచ్చిన దిక్కుగా త్వర త్వరగా వెళ్ళాడు. అక్కడ మధురంగా పాడుతూ, వీణ వాయిస్తూఉన్న ఒక అధ్భుతమైన సౌందర్యవతి అతనికి కనిపించింది.
ప్రవరుడు ఆమెను సమీపించి "ఓ సుందరీ, తోడు లేకుండా ఒంటరిగా చరిస్తున్న నీవు ఎవతెవు? నేను బ్రాహ్మణ్ణి. నన్ను ప్రవరుడంటారు. దారి తప్పి ఉన్నాను. నా ఊరు చేరేమార్గం చెప్పి పుణ్యం కట్టుకో, నీకు శుభమౌతుంది" అన్నాడు.
అతను తనని సమీపిస్తూండగానే అతనిని గమనించి, అతని రూపలావణ్య తేజోవిలాసాలకి ముగ్ధురాలై, అతని మీద మనసు తగులుకొన్న ఆ గంధర్వాంగనకి, ప్రవరుడి అమాయక పలుకులు విని నవ్వు వచ్చింది. అతనితో ఇలా అంది. "చెంపకి చారడేసి కన్నులు పెట్టుకొని, ఎవరినయ్యా దారి అడుగుతున్నావు? ఒంటరిగా ఉన్న జవరాల్ని పలకరించే నీ దుందుడుకుతనం ఇకచాలు. నువ్వు వచ్చిన త్రోవ ఇంతలోనే మర్చిపోయావా. ఇంకమాటలేమిటికి?
“నా పేరు వరూధిని. గంధర్వకాంతని. రంభ, తిలోత్తమ, ఘృతాచి, హరిణి, హేమ మొదలైన అప్సరసశిరోమణులు నాకు ప్రాణసఖులు.
“ఓ అపరమన్మధాకారా! నీ మేను ఎండతాపానికి ఎంత కందిపోయిందో చూడు. ముద్దులొలికే నీమోము వాడిపోయింది. నా ఆతిధ్యాన్ని స్వీకరించి, నా ఇంట విశ్రమించి, బడలిక తీరినతరువాత వెళుదువుగానిలే. తొందరేమీ లేదు" అంది.
అతని మీద ఎంతో మోహితచిత్త అయిన వరూధిని, తన మనోభావాన్నంతటినీ ఈ మాటల్లో వెల్లడించాననుకుంది. కానీ ఆ వైదిక బ్రాహ్మణుడికి ఇలాటి అర్థాలే తెలియవు. అతని హృదయ దర్పణం అమూల్యమైనది. నిరుపమానమైనది. అది ఉన్న రూపాన్ని ఉన్నట్టే గ్రహిస్తుంది.
అతను "ఈ పడుచు పాపం మర్యాద తెలిసినది. బ్రాహ్మణులయందు, అతిథులయందు భక్తి శ్రద్ధలుగల ఆస్తికురాలు" అనుకున్నాడు. వరూధిని తనని చూడగానే తత్తరపాటుతో లేవడం, ఆమె ఒళ్ళంతా కంపించడం, ఓరచూపులూ, మోహన్ని ప్రకటించే హావ భావ చేష్టలు అవేమీ అతనికి పట్టలేదు. అవన్నీ పర పురుషుల్ని చూసినప్పుడు స్త్రీలకి కలిగే సహజసిద్ధమైన లజ్జాచేష్టలనుకున్నాడు.
అతను ఆమెతో "రమణీలలామా! నువ్వు చూపించిన ఆదరణే చాలు. అగ్నిహోత్రాదికములైన కర్మకాండము నెఱవేర్చవలచిన సమయం సమీపించింది. వేళ అతిక్రమించిపోతోంది. మీ గంధర్వులకి అసాధ్యమైనది ఏదీ లేదు. త్వరగా నన్ను నా ఊరు చేర్చు" అన్నాడు.
వరూధిని చిఱునవ్వునవ్వి "ఓయి వెఱ్రిబ్రాహ్మడా! ఊరో, ఊరో అంటావు, నీ ఊరెక్కడికి పోతుంది? ఇంతలో నీ ఇల్లెక్కడికి పోతుంది? ఈ మణిమయాలైన గుహలు, చక్కటి ఈ ఉద్యానవనాల్లోని మంచి గంధపుచెట్ట్లూ, ఇక్కడి గంగానదిఒడ్డున ఉన్న ఇసుకతిన్నెలూ, వెన్నెలతీగల పొదరిళ్ళూ, ఇవేవీ నీ కుటీరానికి సరితూగవా ఏమిటి? ఇంక చల్లకి వచ్చి ముంత దాచడం ఎందుకు? నీ మీద నాకు పట్టరానంత మోహం కలిగంది. మదనుడు నన్ను నీకు కన్యాదానం చేశాడు. నన్నేలుకొని ఈ స్వర్గసుఖాలన్నిటినీ అనుభవించు" అని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేసింది.
అగ్నిహోత్రుడిలాగ పవిత్రమైనవాడు, పరమ నిష్ఠాగరిష్టుడు, సచ్ఛీలుడు అయిన ప్రవరుడు, ఆమె పలుకులు విని నిశ్చేష్టుడైపోయాడు. అతని గుండె గుభిల్లుమంది. "అయ్యో! ఇదెక్కడికర్మరా!" అనుకొని, ఆమెతో "కాంతా! నీవు వెఱ్రిదానివి. వ్రతినై కర్మకాండలతో దినాల్ని గడిపే నన్ను ఏమని కామించావు? సంగతి సందర్భాలు, ఎదుటివారి మానమర్యాదలూ అవీ గమనించనక్కఱలేదా? నాకిలాటివేవీ తెలియవు. అగ్నిహోత్రానికీ, దేవతార్చనకీ వేళ అతిక్రమించిపోతోంది. నా తలిదండ్రులు వృద్ధులు. ఆకలితో ననకలాడుతూ నారాకకోసం ఎదురుచూస్తూఉంటారు. నేను సమయానికి ఇల్లు చేరకపోతే సమస్తధర్మాలూ చెడిపోతాయి. ఇక నా ఎదుట నీ పిచ్చి కలాపాలు కట్టిపెట్టి, చేతనైతే ఇల్లుచేరడానికి నాకు సాయం చెయ్యి" అని తన ధృడనిశ్చయాన్ని తెలియజేసాడు.
ఊహించని, ఎదురుచూడని ఈ నిరాదరణకి వరూధిని హృదయం జల్లుమంది. ఎందరో యక్ష గంధర్వ కిన్నెర కింపురుష యువసుందరులు ఆమె కడకంటిచూపుకోసం పరితపించడమే ఆమెకి తెలుసు కానీ, ఇలా ఒక సాధారణ మనవుడి నిరాకరణ ఆమెకి మింగుడుపడలేదు. అంతవరకూ ఉన్న గుండెధైర్యం తొలగిపోయింది. అయినా తేరుకొని ఎన్నోవిధాలుగా తన పాండిత్యమంతా ఉపయోగించి, హొయళ్ళూ, టక్కులూ ప్రదర్శించి, ఎన్నో ప్రలోభాలుచూపించి అతన్ని వశపరచుకోవాలని ప్రయత్నించింది.
"మీ మానవులు అన్ని ఆపసోపాలూ, అష్టకష్టాలూ పడి తపస్సులూ, యఙ్ఞాలూ అవీ చేసేది స్వర్గసుఖాలనీ, మాలాటి అప్సరసల సంభోగాలనీ అనుభవించడానికేగదా! అయాచితంగా నా అంతటనేను నీకు లభిస్తూ ఉంటే కాదంటావేమిటి? గంధర్వాంగనల పొందుకాదని సంసారకూపంలో పడతానంటావేమిటి?" అంది.
"నీ యందు మరులుగొని, మన్మధబారినిపడి హింసపడుతున్నాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది" అని బెదిరించింది.
"ఓ దయారహితుడవైన బ్రాహ్మణుడా, ఎందుకు చెడతావు? హృదయం దేనిమీద లగ్నం ఔతుందో, ఇంద్రియాలు దేనివల్ల సుఖిస్తాయో, అదే పరబ్రహ్మము. అదే ఆనందోబ్రహ్మ. దాన్ని ఊహించుకో!" అని మెట్టవేదాంతం బోధించబోయింది.
ఇలా వరూధిని శతవిధాలా ప్రయత్నించినా, ప్రవరుడు చలించలేదు. బ్రహ్మవాదులకు ఐహిక ఇచ్చలపట్ల ఉండవలసిన వైముఖ్యాన్నీ, వైదిక కర్మలయొక్క ధర్మపరత్వాన్నీ, బ్రహ్మవర్చస ప్రభవాన్నీ వివరించాడు. వాటిముందు నువ్వు చెప్పిన సుఖాలన్నీ తుచ్చమైనవి అన్నాడు. నాకు నా ఆరణులు, అగ్నులూ, ధర్మకర్మలూ మాత్రమే ముఖ్యమైనవి అన్నాడు. ఇలా ధర్మం తప్పి చరిం చటానికి నా మనస్సు సుతరామూ అంగీకరించదు ఆని స్ఫష్టంగా చెప్పాడు.
అయినాసరే వరూధిని వదలకుండా అతనిమీదపడి కౌగలించుకోడానికి ప్రయత్నించింది. ప్రవరుడు "హరి, హరీ" అని 'పో' అంటూ ఆమెను త్రోసివేసాడు. ఆమె పరాభవంతో సిగ్గుపడి, ఆ వెంటనే మితిమీరిన దుఃఖంతో "దయలేనివాడా, ఇలా మోటుగా గెంటేస్తే సౌకుమార్యులైన ఇంతులు తట్టుకోగలరా? చూడు నీగోరు ఎలాగీసుకుపోయిందో" అంటూ చనుకట్టు చూపి, అవ్యక్తమధురంగా ఏడ్చింది.
"ఓ సుందరాకారా, పరాశరుడు దాసకన్యతో క్రీడించలేదా? అతన్ని మీ బ్రాహ్మణులు వెలివేసారా? మేనకతో చుట్టరికం సాగించిన విశ్వామిత్రుడికి కులంలో వన్నెతక్కువయిందా? అప్సరసా మేళంతో భోగించినందుకు, మాందకర్ణి తన మహిమని కోల్పోయాడా? అహల్యాజారుడైన ఇంద్రుణ్ణి దేవతలు స్వర్గలోకాన్ని ఏలనీయం అన్నారా? వారందరికన్నా నువ్వు గొప్పవాడివా? ఇనుపకచ్చడాలు కట్టుకున్న మునిమ్రుచ్చులందరూ మా తామరసనేత్రల ఇండ్ల బందాలు కారా?" అని ప్రశ్నించింది.
పరమపవిత్రుడైన ప్రవరుడు ఆ మాటలకి బదులైనా ఇవ్వకుండా, ఆమె తనపైబడినప్పుడు తనవంటికి అంటుకున్న జవ్వాది మొదలైన సుగంధద్రవ్యాల్ని ఆ ప్రక్కనే ఉన్న కోనేటి నీటితో కడుక్కొని, శుచియై, అగ్నిహోత్రుణ్ణి ఇలా ప్రార్థించాడు.
"ఓ హవ్యవాహనా! వహ్నిదేవుడా! దాన-జప-అగ్నిహోత్రములయందు నేను పరతంత్రుడనైతే, ఎల్లప్పుడూ త్రికరణశుద్ధిగా నీ యొక్క పాదపద్మాల ధ్యానమందే నేను భక్తిగలవాడనైతే, ఇతరులయొక్క భార్య-ధనాదులను నేను ఎన్నడూ కోరనివాడనైతే, నన్ను సగౌరవంగా, సూర్యుడు పశ్చిమాద్రిని క్రుంకకముందు ఇంటికి చేర్చు, తండ్రీ!" అని ప్రార్థించాడు.
ప్రవరుడలా ప్రార్థించగానే, అగ్నిదేవుడతని దేహంలో ఆవహించి, అతనికి అమితమైన తేజోబలాల్ని కలిగించాడు. అంతట అధ్భుతంగా ప్రవరుడు వాయువేగమనోవేగాలతో తన ఇల్లు చేరి, తన నిత్యకర్మలని సక్రమంగా నిర్వర్తించుకుంటూ జీవనం సాగించాడు.
ఔరా! ప్రవరా! సర్వసంగపరిత్యాగులైన మహామునీశ్వరులు కూడా సాధించలేని ఇంద్రియనిగ్రహాన్ని మామూలు సంసారివి అయిఉండీకూడా సాధించి "భళా" అనిపించుకున్నావు!
(ఇక్కడ భర్తృహరి సుభాషితాల్లో ఒక పద్యం జ్ఞాపకం చేసుకుందాం :-
వనదళవాతముల్ మెసవువారు పరాశర కౌశికాదు, లా
ఘనులును సుందరీజనులఁ గన్గొని మోహితచిత్తులైరి; హె
చ్చిన ఘృత పాయసాన్నము భుజించెడి వారలన్ మనోజయం
బు నెగడునేని వింధ్యము సముద్రజలంబులఁ దేలి యాడదే?
(నీరు-ఆకులు-గాలి భుజించే గొప్ప మునీస్వరులైన పరాశరుడు, విశ్వామితుడు మొదలైన మహానుభావులు కూడా ఆడవారిని చూచి ఎప్పుడో ఒకప్పుడు మోహం పొందారు. నెయ్యి, పాలు, అన్నము ఎక్కువుగా తినే సాధారణమైన మనుష్యులకు మనోనిగ్రహం కలిగితే, వింధ్యపర్వతం సముద్రజలాల్లో తేలియాడదా?)
* * *
(మిగతా భాగం వచ్చే నెలలో...)
No comments:
Post a Comment