ముకుందమాల (తెలుగులో ) - అచ్చంగా తెలుగు

ముకుందమాల (తెలుగులో )

Share This

ముకుందమాల (తెలుగులో )

రావి కిరణ్ కుమార్ 


 ఓ  ముకుందా  
శ్రీవల్లభ  వరదా  భక్తప్రియా  దయాసాగరా
నాధా , జగన్నివాసా , శేషశయనా
ప్రతి  దినం  అమృతమయమైన  ని  నామాలను
స్మరించు  వివేచన  కలిగించు
దేవకీనందన  దేవాధిదేవ  జయము  జయము
వృష్టి  వంశ  ప్రదీప  జయము  జయము
నీల మేఘశ్యామ  జయము  జయము
ధర్మ రక్షక  జయము  జయము
ఓ  ముకుందా
శిరము  వంచి  ప్రణమిల్లి  మిమ్ములను  యాచిస్తున్నాను    
నా  రాబోవు  జన్మలెట్టివైనను  మి  పాద పద్మములను
మరువకుండునటుల  మి  దయావర్షం  నాపై  అనుగ్రహించుము
ఓ  హరి !
కుంభిపాక  నరకములనుండి , 
జీవితపు  ద్వంద్వముల  నుండి రక్షించమనో ,
మృదువైన లతల  వంటి  శరీరంతో  కూడిన  
రమణీమణుల పొందుకోరి నిన్ను  ఆశ్రయించలేదు
 చావు  పుట్టుకల  చక్రబంధం  లో  చిక్కుకున్న  నా  మదిలో
జన్మ  జన్మకు  ని   పాదపద్మములు  స్థిరంగా  వుండునట్లు
అనుగ్రహించుము  చాలు
ఓ  దేవాధి దేవా !
నేనెంత   నిరాసక్తుడైనప్పటికి  పూర్వ కర్మల  వాసనా బలం  చేత
ధర్మాచరణ , భోగ  భాగ్యాల  అనురక్తి  నను  విడకున్నవి
కాని  నేను  నిన్ను  కోరే  గొప్పదైన  వరం  ఒక్కటే , జన్మ  జన్మలకు
కూడా  ని  చరణారవిన్దాలు   సేవించుకునే  భాగ్యం  కల్పించు .
ఓ  నరకాసుర  సంహార !
 దివి , భువి  లేక  నరకం  నీవు  నాకు  ప్రసాదించే
నివాసమేదైనప్పటికిని , మరణ  సమయంలో
శరత్కాలపు  నిర్మల  సరోవరంలో  వికసించిన
నవ  కమలములవంటి  నీ  పాదములు 
 నా  మనో  నేత్రంలో  నిలుపు  చాలు
  
కృష్ణా ! నా  మనసనే  సరోవరంలో
  రాజహంసవలె  విహరించు . ప్రాణ దీపం
 కోడగడుతున్నవేళ   కఫావాత పిత్తాలతో  
  నిండిన  జ్ఞానేంద్రియాలు  నిన్నెలా  తలచగలవు
  కనుక  ఇప్పటినుండే  నీ  పాద  పద్మాలను
  నా  హృదయంలో  నిల్పెద
తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం వోలె
మా  మనస్సులను  రంజింపజేయు   మందస్మిత వదనార  విందా
పరమ  సత్యమైనట్టివాడ  నంద గోప తనయా  నారదాది  
మునింద్రులచే  కీర్తించబడు  హరీ  ఎల్లప్పుడూ  నిన్నే   తలచెదను
నీ  కర  చరణాలనే  పద్మాలతో  నిండి
చల్లని  వెన్నల  బోలు  చూపులను  ప్రసరించు నీ  
 చక్షువులే  చేప  పిల్లలుగా  కల  హరిరూపమనే  
 సరోవరం లో  కొద్ది  జలాన్ని  త్రాగి  జీవనయానపు  
బడలిక  నుండి  పూర్తిగా  సేద తీరెదను  
  
కలువ పూల వంటి  కనులతో , శంఖు చక్రాల  తో  
విరాజిల్లు  మురారి  స్మరణ    ఓ మనసా ! ఎన్నటికి  
మరువకు  అమృతతుల్యమగు  హరి  పాద పద్మాలను  
తలచుటకన్నను  తీయని తలంపు  మరి  లేదు  కదా
ఓ  అవివేకపూరితమైన మనసా ! 
నీ   స్వామి  శ్రీధరుడు  చెంత  నుండగా  
 మృత్యువు గూర్చి  నీవొనరించిన  
పాపకర్మల ఫలితాన్ని గూర్చిన చింత  ఏల ?.
 ఇంకను  ఆలస్యమేల?   
తొందరపడు  అత్యంత  సులభుడైన   నారాయణుని
 పాదాలను నీ  భక్తి  తో  బంధించు  నీ  బంధనాలు  తెంచుకో
  
జనన మరణాలనే  రెండు  ఒడ్డుల  కూడిన  సాగరం లో  
వచ్చిపోయే  కెరటాల  వలె  నానా  జన్మల  పాలై
రాగ  ద్వేషాలనే  సుడిగుండంలో  చిక్కుకుని
భార్యా  పుత్రులు , సంపదలనే  వ్యామోహపు  మకరాల
కోరలకు  చిక్కి  చితికిపోతున్న  నాకు  మత్స్యరూపధారి   హరీ  నీవే   దిక్కు .
దాటశక్యం కాని  సంసార  సాగరం  చూసి
దిగులు  చెందకు  ఆందోళన  విడుము
నిర్మల  ఏకాగ్రచిత్తంతో  ధ్యానించు
నరకాసుర సంహారి  నావలా  మారి  నిన్నావలి  తీరం  చేర్చగలడు
కోరి  వరించిన  భార్య  తత్ఫల  సంతానం
సంపదలనే  మూడు  భంధనాలపై  మదనుడి
మోహబాణపు   తాకిడికి  పెంచుకున్న  వ్యామోహంతో
జనన , జీవన  మరణాలనే  మూడు  సరస్సులలో  పలుమార్లు
మునకలేస్తున్న   నాకు  ముకుందా  నీ   భక్తి  అనే  పడవలో
కొద్ది  చోటు  కల్పించు  
 ముకుందా!  నీ  కడగంటి  చూపు తో
పృథ్వి  ధూళి  రేణువు  సమమవ్వును
అనంత  జలధి  ఒక్క  బిందు  పరిమాణమయ్యే  
బడబాగ్ని  చిన్న   అగ్నికణం  గా  గోచరిస్తుంది
ప్రచండమైన  వాయువు  చిరుగాలి  లా  ఆహ్లాదపరుస్తుంది
అంచులేరుగని   ఆకాశం  చిన్న  రంధ్రమై  చిక్కపడుతుంది
సమస్త  దేవతా  సమూహం  బృంగ  సమూహాలను  మరిపిస్తుంది
కృష్ణా  సమస్తము  నీ  పాద  ధూళి   లోనే  ఇమిడియున్నది  కదా  
యాజ్ఞావల్క్యాది   మహర్షులచే  తెలియజేయబడిన
జరా  వ్యాధి  మరణాల  నుండి  ముక్తి  కలిగించు
దివ్యోషధం  జనులారా  మన  హృదయాలలో  అంతర్జ్యోతి
వలె , కృష్ణ  నామం  తో  ఒప్పారుచున్నది . ఆ  నామామృతాన్ని
త్రావి  పరమపదం  పొందుదాం
దురదృష్టమనే  అలలతో  కూడిన  సంసార సాగరంలో
అటునిటు  త్రోయబడుచున్న నరులార!  చిరుమాట  వినండి
జ్ఞానఫలం  కోసం  నిష్ఫల యత్నాలు  వీడి
ఓం  నారాయణా  నామజపం  తో  ముకుందుని  పాదాల  మోకరిల్లండి
ఎంత  అవివేకులము  సుమీ  !
పురుషోత్తముడు  ముల్లోకాలకు  అధిపతి
శ్వాసను  నియంత్రించిన  మాత్రాన  అధినుడగునట్టివాడు  
స్వయంగా  మన  చెంతకు  రానుండగా ,
 తనవన్ని  మనకు  పంచనుండగా
అధములైనట్టి  రాజులను  యజమానులను
అల్పమైన  కోర్కెల   కోసం  ఆశ్రయించుచున్నాము
ముకుళిత  హస్తాలతో  వినమ్రతతో  వంగిన  శిరస్సుతో
 రోమాంచిత  దేహంతో  గద్గద  స్వరంతో  కృష్ణ  నామాన్ని  
పదే  పదే స్మరిద్దాం  సజల  నేత్రాలతో  నారాయణుని  వేడుకుందాం
ఓ  సరోజ పత్ర  నేత్రా  …..ఎర్ర  తామరలను  బోలిన  నీ  పాదద్వయం  నుండి
జాలువారు అమృతం  సేవించుచు మా జీవనం  కొనసాగించు  భాగ్యం  కలిగించు
కృష్ణా  నీ పాదధూళి  తో  పునీతమైన
శిరము  జ్ఞానదీపమై  ప్రకాశించుచున్నది
 హరిని కాంచిన కనులు  మాయ పొరలు వీడి
తారలవలె  కాంతులీనుతున్నవి  
 మాధవుని చరణారవిందాలపై లగ్నమైన మది
పండు వెన్నెల వలె , పాంచజన్యపు  తెల్లదనం వలె  స్వచ్ఛమై ఉన్నది
 నారాయణుని  గుణగణాల  కీర్తన తో  తడిసిన  నాలుక
సుధారస  ధారలు  కురిపించుచున్నది
ఓ  నాలుకా ! కేశవుని కీర్తనలు  ఆలాపించు
ఓ  మనసా ! మురారి  స్మరణలో  మునకలేయుము
ఓ  చేతులారా ! శ్రీధరుని  సేవలో  నిమగ్నమవ్వుడు
ఓ  చెవులారా  ! అచ్యుతుని  లీలలను  ఆలకింపుడు  
ఓ  కనులార  ! కృష్ణుని  సౌందర్య  వీక్షణలో  రెప్పపాటు  మరచిపోండి
ఓ  పాదములారా ! ఎల్లప్పుడూ  హరి  ఆలయమునకే  నను  గోనిపొండి
ఓ  నాశికా  ! ముకుందుని  పాద ద్వయంపై  నిలచిన  పవిత్ర  తులసి  సువాసనలను
                  ఆస్వాదించు
ఓ  శిరమా  ! అధోక్షజుని  పాదాల  ముందు  మోకరిల్లు
ముకుందా ! నీ పాదస్మరణ  లేని
 పవిత్ర నామ  ఉచ్చారణ  అడవిలో  రోదన  వంటిది
వేదకార్యాల  నిర్వహణ  శారీరిక  శ్రమను  మాత్రమే  మిగుల్చును
యజ్ఞాయాగాదులు  బూడిదలో  నేయి  కలిపిన చందము
పుణ్యనది  స్నానం  గజస్నానం  వలె  నిష్ఫలము
కనుక  నారాయణా  నీకు  జయము  జయము
మురారి  పాదాలకు  పీటమైనట్టి   నా  మదిని  
మన్మధుడా ! వీడి  మరలి పొమ్ము
హరుని  కంటిచుపులో  కాలిపోయిన  నీకు
హరి  చక్రపు  మహోగ్ర  తీక్ష్ణత తెలియకున్నది
శేషతల్పం పై పవళించు నారాయణుడు  మాధవుడు
దేవకీ దేవి ముద్దుబిడ్డ  దేవతా సముహలచే
నిత్యం కొలవబడువాడు సుదర్శన చక్రమును
సారంగమను వింటిని ధరించినట్టివాడు
లీలచే  జగత్తును ఆడించువాడు  జగత్ప్రభువు
శ్రీధరుడు  గోవిందుడు అగు హరి స్మరణ  మనసా
ఎన్నటికి  మరువకు . స్థిరంగా  హరిని  సేవించుటకన్నను  
నీకు  మేలు కలిగించు దారి మరేదిలేదు
  మాధవా  ! నీ పాదపద్మాలపై  నమ్మిక లేనివారి  వైపు
                                               నా  చూపులు  తిప్పనివ్వకు
నీ  కమనీయ గాధా విశేషాలు తప్ప ఇతరములేవి నా చెవి చేరనియకు
నిన్ను  గూర్చిన  ఆలోచన లేనివారి తలంపు నాకు రానీయకు
నీ  సేవా భాగ్యమునుండి  ఎన్ని జన్మలెత్తినా నను దూరం చేయకు
ఓ  లోకనాధా  ! నీ  పాదదాసుల  యొక్క  సేవక  సమూహానికి
సేవకులైన  వారి  సేవకులకు  నన్ను  సేవకుడిగా  పుట్టించు
మధు  కైటభులను  నిర్జించిన  హరీ  ! నీ నుండి  నే కోరు వరము
నా  జీవితానికి అర్ధమొసగు ఫలము అదియే  సుమా
ఓ  నాలుకా  ! చేతులు  జోడించి వేడుకోనుచుంటిని
తేనే  వలె చవులురించు పరమ సత్యమైన పలువిధముల
నారాయణ  నామామృతాన్ని  పదే  పదే  చప్పరించు
మనసుకు ఆహ్లాదాన్ని కలిగించు
నారాయణా  ! నీ  పాద పంకజమునకు  నా  నమస్సులు
నారాయణా  ! సదా  నీ  పూజలో  పరవశించేదను  
నారాయణా  ! నీ  నిర్మల  నామాలను నిత్యం  స్మరించెదను
నారాయణా  ! నీ  తత్వాన్నే  ధ్యానించేదను  
శ్రీనాధా   నారాయణా  వాసుదేవా
శ్రీకృష్ణా  భక్త ప్రియా  చక్రపాణి
శ్రీ పద్మనాభ  అచ్యుతా  కైటభారి
శ్రీరామ  పద్మాక్షా  హరీ  మురారీ
 అనంత  గోవర్ధనగిరిధారీ   ముకుందా  కృష్ణా
గోవిందా  దామోదరా  మాధవా
ఎట్టివారలమైనను ఎ ఒక్క  నామమైనను
స్మరించవచ్చు  కాని  ఏది  స్మరించలేక
 ప్రమాదముల వైపు  పరుగెడుచున్నాము
భక్తుల  అపాయాలనే సర్పాల పాలిట  గరుడమణి
ముల్లోకాలకు  రక్షామణి  
గోపికల కనులను ఆకర్షించు చాతకమణి
సౌందర్య  ముద్రామణి  
కాంతలలో  మణిపూస యగు రుక్మిణి  కి  భూషణ మణి
అగు దేవ శిఖామణి  గోపాలా !  మాకు  దోవ చూపు
  శత్రువులను  నిర్మూలించు మంత్రం
  ఉపనిషత్తులచే  కీర్తించబడిన మంత్రం
  సంసార భందాలను త్రెంచివేయు మంత్రం
  అజ్ఞాన అంధకారం తొలగించు మంత్రం
  సకల ఐశ్వర్యాలు  ప్రసాదించు మంత్రం
  ఈతి బాధలనే  పాముకాట్లనుండి  రక్షించు మంత్రం
  ఓ  నాలుకా  ! పదే  పదే  జపించు  జన్మసాఫల్యత నొసగు  
  మంత్రం  శ్రీకృష్ణ మంత్రం
 వ్యామోహం నుండి చిత్తశాంతి  నొసగు  ఔషధం  
ముని పుంగవుల చిత్త  ఏకాగ్రత నొసగు  ఔషధం
దానవ  చక్రవర్తులను నియంత్రించు  ఔషధం
ముల్లోకాలకు  జీవమొసగు  ఔషధం
భక్తులకు హితమొనర్చు  ఔషధం
సంసార భయాలను తొలగించు  ఔషధం  
శ్రేయస్సు నొసగు  ఔషధం  
ఓ మనసా  ! తనవితీరా  ఆస్వాదించు
శ్రీకృష్ణ  దివ్యౌషధం
ఓ మనసా ! నారాయణుని కీర్తించు
ఓ శిరమా ! ఆయన పాదాల మోకరిల్లు
ఓ హస్తములార ! ప్రేమతో అంజలి ఘటింపుడు  
ఓ ఆత్మా! పుండరీకాక్షుడు నాగాచలం పై
శయనించివున్నవాడు , పురుషోత్తముడు
పరమసత్యమైనట్టి  నారాయణుని శరణాగతి కోరుము
ప్రభు జనార్ధనుని లీలామయగాధలు విను తరుణాన
దేహం రోమాంచితం కానిచో , నయనాలు ఆనంద
భాష్పములనే సుమాలను రాల్చకున్నచో మనసు  పరవసించకున్నచో
అట్టి  నా జీవితం  వ్యర్ధమే కదా
ఈ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది
కండరాలు అరిగి నొప్పికి గురి అవుతాయి
ఏదో ఒకరోజు పండుటాకులా రాలిపోతుంది
ఓ  అమాయకుడా ! నయం చేయలేని నానా రకాల మందుల
వెదుకులాట మానుకో  దివ్యమైన అమృతమయమైన  
శ్రీకృష్ణ  నామౌషధాన్ని  మనసారా  త్రాగుము
 మనుష్యులెంత  చిత్రమైనవారు
అమృతాన్ని వదిలి  విషాన్ని  పానం చేస్తున్నారు
నారాయణ నామస్మరణ  మాని  నానారకముల
వ్యర్ధ పలుకులను ఆసక్తి  తో  చెప్పుచున్నారు
బంధు మిత్రులు  నన్ను  త్యజించినారు
పెద్దలు గురువులు  నన్ను నిరాకరించినారు
అయినప్పటికీ  పరమానందా  గోవిందా  !
నీవే  నాకు  జీవితము
ఓ  మనుజులారా ! ఎలుగెత్తి  సత్యం  చాటుతున్న
ఎవరు అనుదినం  రణం లోను మరణం లోను
ముకుందా  నరసింహా  జనార్ధనా  అని  నిరంతరం
ధ్యానిస్తువుంటారో  వారు  తమ  స్వకోర్కెల  గూర్చి
చింతించటం  రాయి  వలె  ఎండుచెక్క  వలె  వ్యర్ధం
చేతులెత్తి  బలమైన  గొంతుకతో  చెబుతున్న
ఎవరు  నల్లని  గరళము  వంటి  జీవితము  నుండి
తప్పించుకోజూస్తారో   అట్టి  జ్ఞానులు  ఈ  భవసాగరాన్ని
తిరస్కరించుటకు నిత్యం  ఓం నమో నారాయణాయ  అను
 మంత్రం వినటమే  తగిన  ఔషధం  
ఎట్టి  కారణం చేతనైనను  ఒక్క  నిమిషమైనను
కృష్ణుని  దివ్య పాదారవిందాల స్మరణ మానిన
అట్టి  క్షణమే  ప్రియ మిత్రుల బంధువుల గురువుల
పిల్లల ఆక్షేపణలతోను, నీచపు ఆలోచనల విహారంతోను
గాలి వార్తలతోను మనసు  విష పూరితమగును  
కనుక  కృష్ణా  నీ  ప్రేమామృతం  చాలు
కృష్ణుడు జగద్గురువు  కృష్ణుడు  సర్వలోక రక్షకుడు
కనుక ఎల్లప్పుడూ కృష్ణుని పాదాలని ఆశ్రయించేదను  
లోకం లోని మన శత్రువులను నిర్జించి కృష్ణుడు మనలను  
కాపాడును .కృష్ణా  నీకు నమస్కారము
కృష్ణుని నుండే అన్ని  జగములు పుట్టుచున్నవి
జగములన్నియు  క్రిష్ణునిలోనే  ఇమిడియున్నవి
కృష్ణా ! నేను  నీ  దాసుడను
ఎల్లప్పుడూ  నా  రక్షణాభారం వహించు
హే  గోపాలక  ,హే  కృపా జలనిదే ,హే  సింధు కన్యా పతే
హే  కంసాంతక  ,హే  గజేంద్ర  కరుణాపారీణా , హే  మాధవ
హే  రామానుజ  ,హే  జగత్త్రయ గురో  ,హే  పుండరీకాక్ష
హే  గోపీజన వల్లభా  నాకు  తెలుసు నీవు తక్క వేరెవ్వరు లేరు
కనుక ఎల్లప్పుడూ నన్ను రక్షించు
క్షీర సాగరుని కుమార్తె నీ అర్ధాంగి
ముల్లోకాలు సృష్టించు బ్రహ్మ నీ కుమారుడు
నిన్ను గూర్చిన స్తుతులే  పవిత్ర వేదాలు
సకల దేవతా సమూహము నీ సేవక పరివారము
ముక్తి  నోసగుటయే నీవు  ఆడు  ఆట
దేవకీ  నీ  తల్లి
శత్రువులకు అభేద్యుడగు అర్జునుడు నీ మిత్రుడు
ఇంత  మాత్రమే నాకు తెలుసు  ( నీవు తప్ప తెలుసుకోదగినది వేరేది  లేదు కదా )
 ముకుందునకు  ప్రణమిల్లుటయే  శిరస్సు యొక్క ఉత్తమ కర్తవ్యము
పూవులతో అర్చించుటయే  ప్రాణశ్వాస యొక్క  కర్తవ్యము
దామోదరుని  తత్వ చింతనమే మనసు యొక్క  కర్తవ్యము
కేశవుని కీర్తనమే  వాక్కు యొక్క  కర్తవ్యము
ఓం నమో నారాయణా అని స్మరించినంత మాత్రాన
పాపులు కూడా ఉద్దరించబడుతున్నారు  . అట్టిది
పూర్వ  జన్మలలో  ఎన్నడు  నారాయణుని  నామ స్మరణ  
చేయకుంటినేమో  ఇప్పుడు  గర్భావాసపు  దుఖాన్ని భరించవలసివచ్చే
హృదయ మధ్యమున  పద్మపత్రంలో  
అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు ని నిలిపి
సదా ధ్యానించు వారలకు సకల భయాలు
తొలగి విష్ణుపదం సన్నిహితమవుతున్నది
ఓ  హరీ ! ఓ పురుషోత్తమా ! ఓ విష్ణు
నీవు దయా సముద్రుడవు
పాపులకు మరల మరల ఈ  భవసాగరమే  గతి అగుచున్నది
నీ దయావర్షం  నాపై కురిపించి
నన్ను ఉద్దరించు ముకుందా
పాల కడలిలో అలల తుంపరలు దేహాన్ని తాకుతూ
నీలాకాశాన తారకలు వలె మెరుయుచుండగా
శేషతల్పం మీద సుఖాసీనుడవైన  మాధవా
మధుసంహారీ నీకివే నా మనఃపూర్వక  ప్రణామములు
కృష్ణ  కృష్ణ  అన్న నామాలు చాలు  
జీవిత కర్మఫలాలు దూరంగా నెట్టి వేయబడటానికి
ముకుందుడి  పై ఎనలేని ప్రేమభావమున్న
సిరి సంపదలు  మోక్ష ద్వారం  అందుబాటులో వుంటాయి
నా  మిత్రులు జ్ఞాన మూర్తులు
కవిత్వ సామ్రాజ్యంలో రారాజులు
ద్విజోత్తములు . నేను కులశేఖర చక్రవర్తి  ని
ఈ  పద్య  కుసుమాలు  పద్మాక్షుని  చరణాంబుజములకు  
భక్తి ప్రపత్తులతో  సమర్పితం

(పరమ పూజ్య కులశేఖరాళ్వార్  విరచిత   ముకుందమాల భావ వివరణా ప్రయత్నం)

No comments:

Post a Comment

Pages