పుష్యమిత్ర – 11 - అచ్చంగా తెలుగు

పుష్యమిత్ర – 11

- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనునితో తలపడి అతన్ని ఓడించగా,  సింహకేతనుడు నగరం వదలివెళ్తాడు. అష్టసేనానులతో జరిగిన తొలి సమావేశంలోనే మహారాజుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం స్పష్టమౌతుంది. కోటలో జరిగిన సంఘటనలు పుష్యమిత్రుని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. తన గతం గురించి చెప్తూ సుదర్శన భట్టు వద్ద సాగిన వేదవిద్యాభ్యాసం, దేవాపి ఐదు సంవత్సరాలలో సకల శస్త్రాస్త్ర విద్యలూ నేర్పించి అతనికి హిందూ ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేయమని చెప్పడం గురించి చెప్తాడుదక్షిణ దేశ వాసులు కరువు వచ్చిందని చెప్పి శిస్తులు మాఫీ చెయ్యమని అర్ధిస్తే మహారాజు నిరాకరిస్తాడు. పుష్యమిత్రుడు మహారాజును కలిసి సైనికులకు ఇచ్చే జీతంలో ప్రతినెలా కొంత కోత  బెట్టి ధనాన్ని ప్రజలకు కరువు సహాయంగా ఇచ్చే విధంగా కోరతాడు.   ( ఇక చదవండి).
ఆరోజు బృహద్ధ్రధ మహారాజు కొలువుతీరే ముందుగా మహామంత్రిని తన ఆంతరంగిక మందిరానికి పిలిచి పుష్యమిత్రుడు చెప్పిన విషయం చెప్పగా, మంత్రి మంచి సలహా అని ప్రశంసిస్తాడు దానికి ఒప్పుకుంటాడు.  మహారాజు సభకు వచ్చి అందరూ ఆశీనులైన తర్వాత "మహా మంత్రి ఈనాటి విశేషాలు ఏమిటి? " అనగానే మంత్రి లేచి "మహారాజా! దక్షిణ భారత దేశం కరువు భయంకరంగా ఉంది తమరే ఏదో విధంగా సహాయం చేయాలి" అనగానే మహారాజు పుష్యమిత్రుని సలహా అతని చేతనే చెప్పించి సైనికాగ్రహానికి గురిచేసి ఈ పధకం విఫలం చెయ్యలన్న ఉద్దేశ్యంతో.. "పుష్యమిత్రా! మీరేదైనా సలహా చెప్పగలరా? అనగానే.. పుష్యమిత్రుడు ఆశ్చర్యపోయి..ఇందులో ఏదో గూఢార్ధం ఉందన్న విషయం గ్రహించి "మహారాజా! నా జీత భత్యాలు  నెలకు వంద వరహాలు కదా నేను నెలకు పాతిక వరహాలు కరువు నిధి క్రింద చందాగా ఇస్తాను" అనగానే ప్రజలు హర్షధ్వానాలు చేసారు. "అలాగే నా సైనికుల మీద నాకు అచంచల విశ్వాసం వారి చేత నెలకు ఐదు వరహాలు ఇప్పించగలను. మొత్తం పది నెలలలో మనకు మీకు బాకీ ఉన్న ఇరవై లక్షల వరహాలు సమకూరుతాయి" అనగానే సైనికులూ.. జనం కరతాళ ధ్వనులతో మద్దతు పలికగా... మహారాజు నోటి వెంట మాట లేదు. "అలాగే కొనసాగిద్దాం" అని అనగానే పుష్యమిత్రుడు మహారాజా ఒక విన్నపం. తమరు వారి బాకీ ప్రస్తుతానికి రద్దైన విషయమూ.. తర్వాతి సంవత్సరాలలో బాకీ వాయిదాలలో చెల్లించడానికి అనుమతి పత్రం వెంటనే తమ రాజ ముద్రతో ఇవ్వాల్సింది గా ప్రార్ధన" అనగానే.. జనం "జయము జయము బృహద్ధ్రధ మహారాజా వారికి జయము జయము పుష్యమిత్రుల వారికీ” అనగానే గత్యంతరం లేక ఆ పత్రాన్ని రాయించి ఇచ్చాడు. మీరు మధ్యాహ్నం మా ఆంతరంగిక మందిరానికి రండి అని పుష్యమిత్రునికి ఆదేశించి నిష్క్రమించాడు మహారాజు.  పుష్యమిత్రుడు ఆ పత్రానికి నకళ్ళు తయారు చేయించి దక్షిణ భారత దేశం లోని గ్రామాధికార్లకు అందజేయవలసింది గా వేగులను తక్షణం పంపించి, భోజనానంతరం మహారాజు వద్దకు బయలుదేరాడు.
*  *  *
"పుష్యమిత్రా! రండి ఆశీనులు కండి! మీకో ముఖ్యమైన కార్యాన్ని అప్పజెప్పబోతున్నాను. ఈ స్వయంవరాహ్వానం చూసారా? చూడండి. ఇది దక్షిణ దేశమైన ఆంధ్ర సామ్రాజ్యం నుండి వచ్చింది చదవండి".
"మౌర్య వంశాధీశ, గండరగండ, యుద్ధ తంత్రవిశారద బృహద్ధ్రధ చక్రవర్తుల దివ్య సముఖానికి.. ఆంధ్రదేశ సామంత రాజు నరేంద్ర వర్మ చేయు విన్నపములు.  మా ఏకైక కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి  వసంతసేన కు స్వయంవరము ప్రకటించ బడినది. జ్యేష్ట శుద్ధ నవమి బుధవారం తమరు తమ రాజ్యం లో రాజార్హత గలిగిన యోగ్యులైన యువకులను స్వయంవరానికి పంపవలసిందిగా మా విన్నపం." పుష్యమిత్రుడు చదవగానే.. చూసావా.. పుష్యమిత్రా! వాని కండకావరం. నన్ను రమ్మని పిలువకుండా యోగ్యులైన యువకులకు ఆహ్వానమట! అందుకే నీ సహాయం కోరుతున్నాను. వసంతసేన అంద చందాలు లోకవిఖ్యాతాలు. అందునా ఆంధ్రులు యుద్ధ నైపుణ్యం గలవారూ అందమైనవారు అని విన్నాను.  ఆడువారు సైతం యుద్ధవిద్యలలో నిపుణులని చెప్తారు. నీవు ఆ రోజు స్వయంవరానికి నా తరఫున వెళ్ళి వారి  మదాన్ని దించి అందరినీ జయించి అలనాడు భీష్ముడు అంబ, అంబిక, అంబాలికలను తెచ్చినట్లుగా వసంతసేన ను తెచ్చి నాకు కానుకగా ఇవ్వు. నీ జీత భత్యాలు రెండింతలు చేస్తాం ఈ కార్యం నిర్విఘ్నంగా తమరు చేయగలిగితే" అన్నాడు. పుష్యమిత్రుడు నివ్వెర పోయాడు. మహారాజు గారికి ఈ వయసులో కన్య కావలసి వచ్చిందా! హతవిధీ అనుకుని, తన భావాలు తెలీకుండా, "అవశ్యం మహారాజా! తమరి ఆజ్ఞ! అని సెలవు తీసుకున్నాడు.
*  *  *
"మనం ఇలా పుష్యమిత్రుడు చెప్పినదానికల్లా తానా తందానా అంటూ ఉంటే చివరకు మన ఖజానా ఖాళీ అవుతుంది" అని శ్వేతాశ్వుడు అనగానే బృహద్ధ్రధుడు "శ్వేతాశ్వా! రాజ తంత్రం నీకు అర్ధం కావడానికి సమయం పడుతుంది" అన్నాడు. "మహారాజా నేను మీ మేనత్త కుమారుడను. ఆ చనువుతో మీకో ముఖ్య విషయం మనవి చేయాలని వచ్చాను. “సింహకేతనుని వెదకి మన నగరానికి పిలిపిద్దాం.”  "శ్వేతాశ్వా! ఎక్కువ మాట్లాడవద్దు. నీ హద్దుల్లో ఉండు. అతను మదబలగర్వం తో ఉన్నాడు. కొద్ది కాలం ఆగు. నేను దానిమీద మన బృందం తో చర్చించి నిర్ణయం తీసుకుంటాను" అన్నాడు. ఇది నాకు పుష్యమిత్రుడు ఇచ్చిన సలహా" అనగానే శ్వేతాశ్వుడు "అలా ఐతే సరే నాకు సెలవు" అని వెళ్ళిపోయాడు.
*  *  *
మూడు రోజుల అనంతరం ఒక వందమంది జనం ఉదయాన్నే పుష్యమిత్రుని భవనం వద్ద వేచి ఉన్నారు. కాలకృత్యాలు ముగించుకుని ద్వారం తీయగానే జనం చుట్టుముట్టి "పుష్యమిత్రులవారికీ జై...అని నినాదాలిస్తూ పుష్పహారాలతో ముంచెత్తారు. పుష్యమిత్రుడు ఏమిటీ హడావుడి అనగానే.."అయ్యా.. మా కష్టాలు ఎవరూ వినడం లేదని దేవుడికే చెప్పుకోవాలి అనుకున్నాం కానీ మీరు విన్నారు. మీరే మా దేవుడు. మా కష్టాలను తీర్చారు. శిస్తును రద్దు చేయించారు. మా మొర విన్న దేవుడు నైరుతి ఋతుపవనాలను పంపి మా కరువును తీర్చాడు. మాకు ఏదో విధంగా పండించుకోడానికి వడ్ల గింజలు దొరికితే చాలు. వరి పండించుకుని కరువు నుండి బయట పడతాము" అనగానే పుష్యమిత్రుడు.. మీ ప్రాంత వాసులకు ఎన్ని బండ్ల ధాన్యం అవసరం అవుతుంది" అనగానే.. "ఓ పాతిక బండ్లు ఉంటే చాలు తమరి పేరు చెప్పుకుని బ్రతుకుతాము" అనగానే మీకు ఏరువాక పౌర్ణమి నాటికి అందజేయగలను. ఏరువాక పున్నమి చాలా పవిత్రమైనది.
మంత్ర యజ్ఞపరా విప్రా సీయజ్ఞాశ్చ కర్షకా:/ గిరి యజ్ఞస్థథా గోపా: ఇజ్యోస్మాభిర్గిరిర్వనే ||
అని శ్రీకృష్ణ పరమాత్మ గోపాలురకు గిరియజ్ఞము, కర్షకులకు ఏరువాక యజ్ఞముగా, బ్రాహ్మణులు మంత్రజపమే యజ్ఞముగా చేయుదురని తెలిపాడు. విష్ణుపురాణము దీనిని ఏరువాక సీతాయజ్ఞమని చెప్పింది. కనుక భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. ఫలితం ఆ పరాత్పరునికి వదిలిపెట్టండి.  భూములు దున్నుకుని సిద్ధంగా ఉండండి" అనగానే మరలా "పుష్యమిత్రులవారికీ జై...అని నినాదాలిస్తూ సెలవు పుచ్చుకున్నారు.
*  *  *
ఓ తెల్లవారుఝామున "మహారాజా! మహారాజా! అని అతని శయన మందిరంలో కేకలు వినిపించగా లేచిన బృహద్ధ్రధుడు "ఏమైంది?" అన్నాడు. సైనికులు చేతులు కట్టుకుని తలవంచుకుని నిలబడ్డారు. "ఏమయింది? చెప్పండి?  అని మహారాజు అనగానే, "ప్రభూ! సింహకేతనుడు నివాత కవచులతో జీలం నది వద్ద తారసపడ్డారని వేగుల వలన ఇప్పుడే అందిన వార్త" అని అప్పుడే రాజమందిరం చేరిన పుష్యమిత్రుడు అనగానే ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు బృహద్ధ్రధుడు. "నివాత కవచులా? లక్షల మంది సైన్యం వారిది. వారు సామాన్యులు కాదు. పచ్చి మాంసం ఆహారంగా తీసుకుంటారు.వారు యుద్ధానికి వస్తే వారిని జయించ గలవారు ఉండరు. వాళ్ళ భాష కూడా మనకు అర్ధం కాని రీతిలో ఉంటుంది. వాళ్ళతో మనవాళ్ళు చేతులు కలపడం ఏమిటి?" అనగానే   "మీరు అనవసరంగా భయపడకండి మహారాజా! అంతవరకూ రాకపోవచ్చు. వచ్చినా మనం మన బుద్ధిని ఉపయోగించి వారిని మట్టుబెట్టవచ్చు." అనగానే "ఎందుకైనా మంచిది మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి" అన్నాడు మహారాజు. "నేటినుంచే నేను మన దేశంలోని యువకులకు సైనిక శిక్షణ ఇప్పిస్తాను. మీరు భయపడకండి. మా గురువు దేవాపి మహాయోగి నాకు   యుద్ధ తంత్రాలు అన్నీ నేర్పే పంపారు. వినండి.  యుద్ధ భూమి మొత్తం అడుగు లోతున ప్రతి మూరెడు దూరంలో కాలువలు త్రవ్వించి వాటిని మన కోట లోపల ఒక గుంటను త్రవ్వించి దానికి కలపండి. ఆ కాల్వలపై ఎండుగడ్డిని కప్పి ఉంచండి. ఈలోపు చవకగా లభించే అన్నిరకాల చమురును కొన్ని లక్షల మణుగులు నిలువ చేయండి చాలు.  ఆ కాల్వలను చమురు భూమిలోకి ఇంకి పోని విధంగా నిర్మించమని మన పని వాళ్ళకు చెప్పండి. మనం కోటలో ఆ గుంటలో పోసిన చమురు నిముషాల్లో వాలుగా నిర్మించబడిన ఆ కాలువల్లో చేరాలి ఇక్కడ నిప్పు అంటిస్తే చాలు. యుద్ధ భూమి యావత్తూ మండి వారు మలమల మాడి మసయి పోవాలి" అనగానే సంతోషంతో చప్పట్లు చరిచాడు బృహద్ధ్రధుడు. "ఇలాంటి పధకాలు ఇంకా మనం డజను పైగా ఉపయోగించవచ్చు. మన సైనికుడు ఒక్కడు కూడా చావకుండా వారందరినీ భస్మీ పటలం చెయ్యవచ్చు మహారాజా!" సెలవు అని వెళ్ళిపోయాడు.  రాబోయే స్వయంవరము లో పుష్యమిత్రుని తో వచ్చే అతిలోక సౌందర్యవతి వసంత సేనతో వివాహం జరిగినట్లుగా కలలు కనడం ఆరంభించాడు మగత నిద్రలో మహారాజు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages