రేపటి కథ
పి.వి.ఆర్. గోపీనాథ్
తెలుసమ్మ గారూ. బాక్సు బాగుంటేనూ..
అంటే..... ఛ. కొత్తవీ, ఖరీదైనవీ మీకు వేయడం నాదే బుద్ది తక్కువ. విసుక్కుంటూ అంట్లు పడేసి వెళ్ళింది. సుజాత.
నవ్వుకుంటూ నిష్క్రమించింది రంగి సారీ రంగమ్మ.
మునపటిలా వారిని రంగీ గంగీ అసే ఉసే అంటే అదేదో చట్టం కింద....
*****
ఆంటీ జీ....రంగమ్మ కూతురు పిలుపు విని దాని సంబోధనకు నవ్వుకోలేక, కోప్పడలేక (మరి దాని వయసు పదేళ్ళే) బయటకు వచ్చి ఏమిటమ్మా అన్నది.
ఇయేళ మా అమ్మి రాదంట. టీవీలో ఏదో ట్రేనింగుందంటగా...
అట్టా అంటే. అదేదో వచ్చేవారం చూడొచ్చుగా. అవతల చుట్టాలున్నారు కదా తల్లీ... కొంచెం వెటకారం ధ్వనింపజేసింది. ఆ పిల్లకెలాగూ అర్థం కాదన్న ధీమాతో...
ఏమో. తాను రాదంట అంటూనే తుర్రు మన్నది. ఇక్కడో సంగజ్జెప్పాలి. ఇటీవలే పనిమనుషులపై ఒత్తిడి పెరిగిపోతోందంటూ కొందరు గగ్గోలెత్తిపోవడంతో వీరికి అంట్లు తోమడంలో మెలకువలు నేర్పే సంఘం ఒకటి బయల్దేరింది. వారి ప్రోగ్రామ్ వారం వారం టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతూ ఉంటుంది మరి.
అయితే ఆ యాంకరమ్మా, నేర్పే అమ్మా కూడా ముందుగా ఎంచుకున్న వారి ఇండ్లకు పోయి....
ఆ ప్రకారంగా ఎవరినో పట్టుకుంటే ఈ వారం రంగమ్మగారి వంతు వచ్చిందన్న మాట.
*****
“ పిన్నీ మా బౌలు మీ ఇంటికి వచ్చిందా....? ”
“ లేదే .. కామాక్షి నడిగి చూడు. అన్నట్లూ విశాలా నిన్న మా కంచం మీ ఇంట్లో పడేశానంది రంగమ్మ. కాస్త చూడమన్నాను చూడలేదా...?”
“లేదు పిన్నీ చూస్తా.”
సంగతేమంటే... శిక్షణ విజయవంతంగా ముగించుకున్నవారికి మెషిన్ కొనుక్కోవడానికి లోన్లిప్పిస్తున్నారు. రంగమ్మ గారు సైతం. పూర్వం రజకులు ఇంటింటికీ తిరిగి దుస్తులు సేకరించి తమకు మాత్రమే తెలిసేలా మార్కులు వేసి తికిన తర్వాత సాయంత్రానికల్లా ఎవరివి వారికి మడతలు పెట్టి మరీ ఇచ్చేవారు. ఇప్పుడు వారు మరో పని చూసుకోవలసి రాగా, ఆ రకమైన డ్యూటీ ఈ రంగమ్మలాంటి వారికి..అనగా కాంపవుండులోనే అందరి గిన్నెలూ ఓ చోట చేర్చి తోమి ఇచ్చేస్తున్నారు. దీని వలన సమయమూ నీరూ గట్రా కలసి వస్తాయట కదా..
******
“ వామ్మో దీన్నిండా ఇంతింత గాట్లేమిటీ...?” అన్నం గిన్నెను అటూ ఇటూ తిప్పి చూస్తూ... ఆందోళనా, కోపం కలిపేసి డిగింది సుజాత.
“ ఏదీ ఇదా..వమ్మో. ఇది మీది కాదాంటీ కామాంటీ గారిది.” రంగమ్మగారి తోడికోడలి జవాబు. ఇవేళ రంగమ్మ క్యాజువల్లీవు మరి.
“ మరి మాదేదీ.. ?” “ అది, అదీ...”
“ ఆఁ. ఏమిటీ. దాంతో మీ అక్క వండుతోందా....” కాస్త కోపంగానే అడిగింది.
“ సారీ ఆంటీ. రేపు కమీసను రాంగానే బాయ్య కొత్తది తెత్తానన్నాడు. అది మీకిత్తానమ్మా...”
“ ఏం కమీషనే. ?” గొంతులో కాస్త కుతూహలం. వీలైతే తనూ కలవచ్చేమోననే ఆలోచన.
“ ఏమో. ఆరి సంగతులేమీ తెలవ్వాంటీ. “ అప్పటికే తాను నోరు జారానని గ్రహించి తమాయించుకుని నాలుక మడతేసింది చిన్ని.
సంగతేమంటే... ఇలా కొట్టేసిన గిన్నెలూ, బౌల్సూ వగైరా దుకాణాలకు తోల్తారు. అక్కడ కమీషను వస్తుంది. అదైనా అంత త్వరగా రాదు. వీరు గుర్తుకోసం పెట్టే గాట్లు అన్నీ సాపుజేసి ఇవ్వాలి. అప్పుడు శాల్తీని బట్టి. పైగా దాని మీద కొననవారి పేరుంటే అసలేమీ రాదు సరికదా, కేసులేకుండా చూసుకోవాలంటూ ఎదురు పిండుకుంటారు. తర్వాత తామే ఆ పేరు గీకేస్తారంటే అది వేరే విషయం.
రంగీ కాలింగూ....గోలెత్తిన సెల్లు నోరు నొక్కి ఏమిటీ ఇంకా రాలేదేం... అని అడగబోయేంతలో
“ అమ్మగారూ మీరోపాలి అరిజెంటుగా కామాచ్చమ్మ గారింటికి రండీ. !”
వినతీ, డిమాండూ కాదు. ఏకంగా ఆర్డరే. ఏమయిందో అనుకుంటూ పతి దేవుడికి నిద్రాభంగం లగకుండా డూప్లికేట్ చెవి తీసుకుని తలుపులేసి పక్క బ్లాకువైపు నడిచింది సుజాత.
“ చెప్పండమ్మా. ఈ గిన్ని ఎవురిదీ ?”
పరిశీలించింది. గిన్నెకు రెండు పెద్దగాట్లు. వొహటి కె.ఇంకోటి యస్. ఆకారంలో.
వాటి విషయం తర్వాత. ముందా గిన్నెను సొంతం చేసుకోవాలని
“ అవును. మాదే కదా. కంచర్ల సుజాత అంటే నేనేగా “ అంది.
“ కంచరా లేదూ, పంచరూ లేదూ. కామాక్షి సుంకర అని మాదే ఆ గిన్నె. “
ఛాన్సు దొరకింది కదాని సుజాత అత్తింటిని వెక్కిరించింది.
“ ఏయ్. ఏంటీ, గాడిదంటావా నన్నూ..” అంటూ సుజాతా తగాదాకెల్ళింది.
“అబ్బే. దాన్నిందుకు అవమానిస్తానూ ?” ఇంకాస్త రాజేసింది కామాక్షి.
మాటా మాటా కలిసింది. గిన్నీ, బిందీ వొహటైపోయాయి. దానికో సొట్టా, దీనికో చిల్లీ.వాకర్లందరూ సినిమా చూడ్డానికి వచ్చేస్తున్నారు. ఇహ లాభం లేదనుకున్న సుజాత భర్తా, కామాక్షి మొగుడూ కూడా రంగంలోకి వచ్చేసి దారినపోయే పోలీసులు ఇటే చూస్తున్నారనడంతో అంతా గప్ చుప్పయిపోనారు. చివరకు బిందీ, గిన్నే కూడా రంగమ్మగారి ఇలాకాలోకే.
మర్నాడు రంగమ్మను ఆరా తీస్తే వాటిని తమ పెనిమిటి సరి చేయిస్తానని పట్టుకుపోయాడంది. వెంటనే బల్బు వెలిగనట్లయి కమీసను ఏమిటని అడిగితే అది తత్తరపడ లేదు సరికదా మొగోడన్నాక సవాలచ్చ ఉంటాయనీ అయన్నీ అడక్కూడదనీ హితవు చెప్పింది. మంట నెత్తికెక్కినా చేసేదేమీ లేక ఊరుకుండి పోవాల్సి వచ్చింది.
*******
“ అమ్మగారో. రేపటాలనుంచి నేను రాడం పడదండే.!” డిక్లేర్ చేసింది రంగమ్మ. జీతం రసీదు అందుకుంటూ...
(ఓ పాఠకా ఇటురా...
ఇటీవలి వత్సరాలలో పిరజ్ఞానం అంతటా పరిఢవిల్లడంతో పనిమనుషులు సారీ గృహ సహాయకులు తమ వేతనాలను ఎదురు చూడనవసరము లేకుండా యజమానులే తీగె మీద పంపుతున్నారు. యావన్మందికిన్నీ నిధి ఖాతాలు తెరుచుకున్నాయి . కదా. అలా పంపిన పిదప అట్టి లావాదేవీకి సంబందించిన రసీదులకు నకళ్ళను తీసి ప్రతి నెలా మూడే తేదీలోగా వారికిచ్చి వారి నుంచి బదులు రసీదులు తీసుకుని సిద్ధం చేసుకావాలి. లేకపోతే వ్యయానికి పన్ను కట్టాలి. అనగా వారికో నకలు ఇచ్చి తమ వద్ద మరొకటి ఉంచుకోవాలన్నమాట.)
రంగమ్మ పేల్చిన బాంబుకు బెదిరిన లేడి లా కాదు లేడీయే కదా...
“ ఇంత సడెన్గా చెపితే ఎలాగమ్మా ?”
(కోపంలో కూడా మర్యాద కోల్పోకూడదు మరి)...అంటూ ఆగ్రహాందోళనలు మిళాయిస్తూ, ఇప్పుడుమాకు కొత్తగా ఎవరు దొరుకుతారూ.....
“ ఆగండాగండమ్మా. అంతా తొందరే మీకూ.. మానేస్తున్నానని యవరు సెప్పారూ.?!”
“ మరి. ?”మరింతగా మతి పోయింది సుజాతకు.
“ రోజూ పొద్దుగాలే మా పాప (బొట్టిగారు పెద్దదైంది మరి) వచ్చి అందరి తానా గిన్నెలు పట్టుకొస్తాది. డ నేను మిసనులో తోమించి తిరిగి సాయంత్రం పమ్మిస్తాన్న మాట.”
తాను పడిపోవాలో వద్దో సుజాత ఆలోచించుకునే లోపునే అదెల్ళిపోయింది.
ఆ మద్యాహ్నమే కాంప్లెక్స్ మహిళలంతా చేరారు. సుదీర్ఘ చర్చల తర్వాత తామే సొసైటీ తరఫున కొన్ని డిష్ వాషర్లు కొనాలనే నిర్ణయానికి వచ్చారు.
కొసమెరుపు ఏమిటంటే...ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలిసిన రంగారావుగారు కాంప్లెక్స్ పెద్దలతో ఇంకెవరితోనో మాటాడించి వీటి కాంట్రాక్టు చేజిక్కించుకున్నాడు. సదరు వాషర్ల కాంట్రాక్టర్ అయిన రంగారావు స్వయానా రంగమ్మగారి పెనిమిటికి దూరపు చుట్టం కావడం చేతను వాటి ఆలనా పాలనా బాద్యత తిరిగి రంగమ్మగారికే దఖలు పడింది. ఇప్పుడు తీరికగా మూర్చపోవాల్సిన భారం సుజాతా అండ్ ఫ్రెండ్స్ పై పడిందని చెప్పక్కర్లేదు కదా...
.. .. .. .. .. .. .. .. .. సమాప్తం .. .. .. .. .. .. .. .. ..
No comments:
Post a Comment