సంగీతనిధి – మంగళంపల్లి - అచ్చంగా తెలుగు

సంగీతనిధి – మంగళంపల్లి

Share This

సంగీతనిధి – మంగళంపల్లి

పోడూరి శ్రీనివాసరావు 


అది 1972 వ సంవత్సరం. అప్పుడు నేను ఆంధ్రాబ్యాంకులో కేషియర్ గా విశాఖపట్నం జిల్లాలోని డాబాగార్డెన్స్ బ్రాంచిలో పని చేసేవాడిని.
          విశాఖపట్నంలో 1969-70 లలో విశాఖమ్యూజిక్ అకాడమీ ప్రారంభించబడింది. శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, కచేరీలు నిర్వహిస్తూ, విశాఖ ప్రవాసులకు సంగీత ప్రపంచంలో ఓలలాడిస్తూ ఉండేవి. నాకు బాగా గుర్తు...ప్రతీనెలా ఒక సంగీతకచేరీ, సంవత్సరంలో ఒకసారి ‘ఏన్యువల్ ఫెస్టివల్’ పేరిట నాలుగు రోజుల కార్యక్రమాలు...మొదటి మూడు రోజులు సంగీత కార్యక్రమాలు. నాలుగవ రోజున నృత్యకార్యక్రమం (భరతనాట్యంగానీ,కూచిపూడిగానీ) తర్వాత విశాఖమ్యూజిక్ అకాడెమీ కాస్తా విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీగా మారింది.
          నేను నా ముఖ్యమైన స్నేహితుల్లో ఒకరైన శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాళ్ళం. కుర్రవాళ్లు అవడంవల్ల, కార్యకలాపాల్లో ఉత్సాహం చూపడంవల్ల మమ్మల్నిద్దర్నీ కూడా ‘కార్యవర్గసభ్యులు’గా తీసుకున్నారు.
          డాబాగార్డెన్స్ లో గల ‘హోటల్ ఊటీ’ ప్రొప్రయిటర్ (పేరు నాకు గుర్తు లేదు) ఈ అకాడెమీకి అధ్యక్షులుగానో / సెక్రటరీగానో ఉండేవారు. హోటల్ ఊటీ సరస్వతీ జంక్షన్ దగ్గ్గర ఉండేది. మా బ్రాంచి పక్కనే సందు, రోడ్ కి అటు ప్రక్క ఊటీహోటల్.. అంటే సుమారుగా ప్రక్కప్రక్క బిల్డింగ్ లే – మధ్యలో సందు.
          కచేరికై ఏ విద్వాంసుడు వచ్చినా, హోటల్ ఊటీ లోనే బస ఏర్పాటు ఉండేది. ప్రక్కనే, నేను ఉండే వాడిని కాబట్టి, ఎవరు వస్తున్నా – స్టేషన్ కి వెళ్లడం, ఆ ప్రముఖ విద్వాంసుడిని /విద్వాంసురాలిని రిసీవ్ చేసుకోవడం, హోటల్ లో వారిని దించడం అన్నది, నా నిత్యకృత్యాల్లో ఒక భాగమై పోయింది. ఆ విధంగా ఎంతో మంది వాగ్గేయకారుల, ప్రముఖ విద్వాంసుల కచేరీలు వినడం, మిగాతావారికన్నా కొద్ది క్షణాలు నేను ఎక్కువసేపు గడపగలగడం – నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తాను. నేను ఆ రోజుల్లో, అక్కడ ఉన్నది తక్కువరోజులే అనుకోండి. సుమారు ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉన్నాను. ఎందుకంటే 1973 అక్టోబర్ నెలలో, బదిలీపై కాకినాడ వెళ్ళిపోవడం జరిగింది.
          ఆ ఉన్న కొద్దిరోజుల్లో – నా చెవులు చేసుకున్న పుణ్యం – ఈ క్రింద తెలియబరచిన ప్రముఖుల గానామృతం, వారి వాయిద్యాల మధురిమలు – వినడం భౌతికంగా నేను పూన్డిన ఆనందం, అంతా ఇంతా కాదు. కాని వయస్సులో కాస్త చిన్నవాడినవడం వల్ల, సంగీతంపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల, నేనేదో గొప్ప కార్యక్రమంలో భాగమయ్యానని, ఆ సమయంలో తెలియకపోవడం వల్ల... యువకుడిగా, కుర్ర్రవాడిగా ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకున్న ఆనందమే గానీ, అటువంటి ఉద్దండ కళాకారుల గానామృతాన్ని విని, అస్వాదించిన ఆనందం, అంత అర్ధమైంది కాదు. అదే కాస్త జ్ఞానం వచ్చాక, కాస్త వయసు పెరిగాక, సంగీతమంటే ఏమిటో దాని గొప్పతనమేమిటో, ఆరంగంలో నిష్ణాతులుగా పేరొందిన వారి నోటి వెంట ఆ కీర్తనలు వింటూంటే కలిగే తాదాత్మత ఏమిటో- తెలుసుకున్ననాడు... అర్ధం చేసుకున్ననాడు- నా పరిస్థితి,స్పందన మరోలా ఉండేది.
          ఆ సమయంలో, కొద్దిసమయంలో నేను విన్న కొందరు ప్రముఖుల కచేరీలు: శ్రీ చెంబైవైధ్యనాథ భాగవతార్; శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ;శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి; శ్రీమతి ఎమ్మెల్ వసంతకుమారి;శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్; శ్రేమతి రాజ్యలక్ష్మి;శ్రీ రంగం గోపాలరత్నం;శ్రీ మెండలిన్ శ్రీనివాస్; శ్రీ ఈమని శంకరశాస్త్రి; శ్రీ(వీణ)చిట్టిబాబు; లాల్ గుడి జయరామన్; శ్రీ రమణి(ఫ్లూట్); శ్రీ ఎల్లా వెంకటేశ్వర్లు; పద్మాసుబ్రమణ్యం(డాన్స్)....ఇవి కొన్ని మాత్రమే...నాకు గుర్తున్నవి...కాని విని నేనానందించినవి(నాకు ప్రస్తుతం గుర్తురానివి...సుమారు 45 సంవత్సరాల (క్రితం మాట కదా) ఇంకా ఎన్నో---ఎన్నెన్నో...
          వీటి అన్నిటిలోనూ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం అనండి, అనుబంధం అనండి- నేను మరచిపోలేనిది. నన్నమితంగా ఆకట్టుకున్నది –ఆయన వయసు తారతమ్యం లేకుండా అందరితో కలసి పోవడం, ఆయన మనస్తత్వం. చాలా చిన్నపిల్లవాడిలా, చిన్న విషయానికి ఎంతో సంతోషపడిపోతారు. కొందరు ఆయనకు గర్వమని, అహంభావమని అంటారు కానీ, అటువంటిదేమీ నాకు గోచరపడలేదు. అలాగే శ్రీ చిట్టిబాబుగారితో కూడా ...నాకు మధుర జ్ఞాపకాలున్నాయి.
          ఇక ప్రస్తుతానికి వస్తే.............
          అది 2015 వ సంవత్సరం బహుశా జూన్ నెలనుకుంటాను. శ్రీ బాలమురళీకృష్ణగారు, రవీంద్రభారతిలో ప్రోగ్రాం ఇవ్వడానికి వచ్చి, లకడీకాపూల్ గల సెంట్రల్ కోర్టు హోటల్ లో బసచేసారనీ, సాయంత్రం 5 గంటలకల్లా వస్తే, ఆ మహానుభావుణ్ణి కలుద్దామని, సోదరి శాంతి గారి ఫోను. మనసు ఆనందంతో ఎగిరి గంతులువేసింది. ఎలాగైనా ఈసారి వారిని కలవాలి, కొన్నిక్షణాలు అయినా వారి సాన్నిధ్యంలో గడపాలి....వారితో ఫోటోలు తీసుకోవాలి...వారి ఆటోగ్రాఫ్ తీసుకోవాలి....ఎన్నో ఆలోచనలతో బుర్ర గజిబిజి అయిపొయింది. వారితో (అవకాశముంటే) ఎక్కువసమయం గడపాలని, నిశ్చయించుకుని, సాయంత్రం 4 గంటలకల్లా బయలుదేరాను. తలుపుతీసి బయటకు రాగానే, అడుగు బయట పెట్టకముందే, మా డైరెక్టరుగారు, వారి బంధువుతో ప్రత్యక్షం. తప్పదురా బాబూ! అంటూ లోపలికి వేనుతిరిగాను. వారి పనిపూర్తయ్యాక, హడావుడిగా బయల్దేరి లక్డీ కపూల్ లోని సెంట్రల్ కోర్టు హోటల్ కి వెళ్ళాను. ఈ లోపల శ్రీమతి శాంతిగారు ఫోను చేస్తూనే ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? ఎంతవరకు వచ్చారు? అని తెలుసుకోడానికి. ఆఘమేఘాల మీద, పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయే అభిమన్యుడిలా, ట్రాఫిక్ ను చేదించుకుంటూ, ప్రమాదాలు తప్పించుకుంటూ హోటల్ ఇన్ గేట్ లోకి కారు పోనిచ్చాను కానీ, బేడ్ లక్... నాకన్నా వేగంగా దురదృష్టం తరుముకొచ్చి, నాకన్న ముందే హోటల్ లో బైటాయించింది. నేను ఇన్ గేట్ లోంచి లోపలకు ఎంటర్ అవుతుండడం... అవుట్ గేట్ లోంచి శ్రీ బాలమురళీకృష్ణగారి కారు బయటకు వెళుతుండడం ఒకేసారి జరిగాయి. లోపలికి వెళ్ళాక శ్రీమతి శాంతిగారు చెప్పారు. ఇప్పుడే బాలమురళీకృష్ణగారు వెళ్ళిపోయారనీ, అప్పటికీ తన ఫ్రెండ్ వస్తున్నాడు, ఒక్క 5 నిముషాలు వెయిట్ చేయమనీ... కానీ ఆర్గానైజర్స్ హడావుడి పెట్టడంతో వారికి బయలుదేరక తప్పలేదు. ఏది ఏమైనప్పటికీ శ్రీ బాలమురళీకృష్ణగారిని కలవలేకపోయినందుకు నేను దురదృష్టవంతుడ్ని. శ్రీమతి శాంతిగారు నన్ను ఊరడిస్తూ అన్నారు, “పోనీలెండి! శ్రీనివాసురావు గారూ! మనమొకసారి చెన్నై వెళ్ళి బాబాయిని (శ్రీ బాలమురళీకృష్ణగారిని) కలుద్దాము.” కానీ, ఆ అవకాశం కూడా ఇవ్వకుండా శ్రీ బాలమురళీకృష్ణగారు , తుంబుర నారడులకు పోటీగా సురగణానికి తన గానమాధుర్యం అందివ్వడానికి దివికేగారు. ఇంద్రలోకంలో కూడా దేవాతలకు తుంబురనారదుల గానం విని వినీ బోర్ కొట్టిందేమో! శ్రీ బాలమురళీకృష్ణగారి సంగీత సాగరంలో హాయిగా విహరించడానికి, వారిని తమ వద్దకు పిలిపించుకున్నారు.
          శ్రీ బాలమురళీకృష్ణగారు కారణజన్ముడు. నవరాగాలస్రష్ఠ. సంగీతసరస్వతి వారిని పెనవేసుకుంది. సంగీతంవేరు... శ్రీ బాలమురళీకృష్ణ వేరు కాదు. సంగీతమే – బాలమురళీ, బాలమురళీయే –సంగీతం. వారు మన మధ్య భౌతికంగా లేకపోయినా, వారి గళం, గాత్రం- సంగీతాభిమానుల చెవుల్లో చావులూరిస్తూనే ఉంటుంది. భారతీయుడిగా శ్రీ బాలమురళీకృష్ణగారి జన్మించడం. భరతమాత చేసుకున్న అదృష్టం. పూర్తిగా సమకాలీకులం కాకపోయినా – వారు జీవించి ఉన్న సమయంలో-మనం కూడా ఈ భారతావనిలో జన్మించడం, వారిని చూసి తరించడం, వారి గానామృతాన్ని గ్రోలడం....మనం చేసుకున్న పుణ్యం.
       *****

No comments:

Post a Comment

Pages