శ్రీ రామకర్ణామృతం - 14
డా.బల్లూరి ఉమాదేవి
నామస్తోత్ర పవిత్రిత త్రిభువనం నారాయణాష్టాక్షరం
నాదాంతేందుగళత్సుధా ప్లుత తనుం నానాత్మ చిత్రాత్మకం
నానా కోటి యుగాంతభానుసదృశంరామం భజే తారకం
తెలుగు అనువాదపద్యము.
శా:నాదాంతేందు గళత్సుధాప్లుత తనున్ నానాత్మ చిన్మాత్రకున్
వేదోదారుసమస్తూహృదయావిష్టున్ విభున్ గల్పకా
లాదిత్యాయుతకోటితుల్యు పరమాత్మాష్టాక్షరీ మంత్రగున్
శ్రీదున్విశ్వ పవిత్రనాము వరదున్ శ్రీరాముసేవించెదన్.
భావము:సమస్త భూతముల హృదయపద్మగృహమందు నివాసము గలిగినట్టిరామనామ మనెడి ప్రకాశమానమగు నలంకారము గలిగినట్టి,నామమును స్తుతించుటచే పవిత్రము చేయబడిన ముల్లోకములు గలిగినట్టి నారాయణాక్షర మంత్రస్వరూపుడైనట్టి నాదమధ్యమందున్న చంద్రుని వలన జారుచున్నయమృతముచే తడుపబడిన శరీరము కలిగినట్టి అందరియాత్మలందు జ్ఞానరూపుడైనట్టి ప్రళయకాలకోటి సూర్యులతో సమానుడైనట్టి తారకరాముని సేవించుచున్నాను.
32.శ్లో :ఖశ్యామం ఖగవాహనం ఖరరిపుంఖద్యాదిభూతాత్మకం
ఖాతీతం ఖగమంత్ర తత్పరపదం ఖద్యోతకోట్యుజ్జ్వలమ్
ఖావాచ్యం ఖగకేతనం ఖగమనం ఖర్వాట శృంగాలయం
ఖారాధ్యం చ ఖరంధ్రపీఠ నిలయం రామం భజే తారకమ్.
తెలుగుఅనువాదపద్యము.
మ:ఖరవైరిన్ ఖగవాహనున్ రవినిభున్ ఖర్వాట శృంగాలయున్
పరమార్థాంచిత మంత్ర తత్పరు వియద్భ్రాజిష్ణుఖారాధ్యు సు
స్థిర వేదాంతమయున్ విచిత్ర గమనున్ శ్రీపంచ భూతాత్మకున్
వరసత్యోక్తు సుషుమ్న మధ్యగతు శ్రీవాసున్ బ్రశంసించెదన్.
భావము.
ఆకాశమువలె నల్లనైనట్టిగరుడవాహనుడైనట్టి ఖరఅసురుని శత్రువైనట్టి ఆకాశాది పంచభూతుడైనట్టి ఆకాశము నతిక్రమించినట్టి ఖేచరముద్రా మంత్ ములందు నాసక్తి గలవారికి స్థానమైనట్జి కోటిమెరుపులవలె ప్ కాశించుచున్నట్టి ఆకాశమువలె చెశ్పశక్యముకానట్టి గరుడధ్వజము కలిగియున్నట్టి ఖర్వాటపర్వతశిఖరమందు నివాసముకలిగినట్టి ఆకాశములా బట్టబయలుగా నా ఆధింప దగినట్టి ఇఐద్రియపీఠమగు మనస్సు నందుస్థానము గలట్టి తారకరూపు రాముని సేవించుచున్నాను.
33.శ్లో :వేద్యం వేదగురుం విరించిజనకం వేదాంత మూర్తిం స్ఫుర
ద్వెధం వేదకలాపమూల మహిమాధారాంతకందాంకురం
వేదశృంగసమాన శేషశయనం వేదాంత వేద్యాత్మకం
వేదారాధిత పాదపంకజ మహం రామం భజే తారకం.
తెలుగుఅనువాదపద్యము.
శా:వేదధారు సమస్తవేదగురునిన్ వేదాంత వేద్యున్ లస
ద్వేదారాధిత పాదపంకజ యుగున్ వేదాంత మూర్తిన్ మహా
వేదభ్రాజిత వేద్యు బ్రహ్మజనకున్ వేదాంత భావోల్లస
ద్వేదాగ్రేసర తల్పు రాము మహిమాధారున్ బ్రశంసించెదన్.
భావము.
తెలియగలిగినట్టి వేదములుపదేశించునట్టిబ్ హ్మనుగన్నట్టి వేదాంతరూపుడైనట్టి ప్రకాశించుచున్న వేదములు కలిగినట్టి వేదసముదాయము యొక్క ప్రధానమహిమకాధారమైన దుంప యొక్క మొలకయైనట్టి వేదశిఖరములతో సమానమైన శేషునియందు శయనించినట్టి వేదాంతములచే తెలియదగిన రూపము గలిగినట్టి వేదములకారాధింప దగిన పాదపద్మములు గలట్టితారకుడైన రాముని సేవించుచున్నాను.
34.శ్లో :మూలాధార ధనంజయ స్ఫుటపటుజ్జ్వాలా సమాలింగితం
మూర్ధన్యాంత శశాంక మండల గతం క్షీరాభిషేకం ప్రియమ్
ముక్తాశోభిత మౌళిభిర్మునివరై రారాధితం భావయే
ప్రఖ్యాతై స్త్రీగణై ర్ధనాధిపగణైశ్శాఖామృగైర్దైవతైః.
తెలుగుఅనువాదపద్యము.
మ:ప్రకటాధారమునన్ ధనంజయశిఖాభాస ప్రభాయుక్తు మ
స్తక పూర్ణ ద్విజరాజ మండల సుధా ధారాభిషేకప్రియున్
సుకళాశోభిత మౌని వానర మహాక్షోణీశ్వర ప్రావృతున్
సకలాత్మున్ ద్రిగణార్చితున్ గొలుతు భూజాతా విభున్ రాఘవున్.
భావము.
మూలాధారచక్రమందలి యగ్నియొక్క స్ఫుటమైన గొప్ప జ్వాలలచే జుట్టుకోబడిన సహస్రార చక్రమధ్య మందలి చంద్రమండలమును పొందినట్టి పాలయభిషేకమునందిష్టము కలిగినట్టి
ముత్యములచేత ప్రకాశించుచున్నట్టి శిఖలుగల మునులచేత నారాధింప బడునట్టి ప్రసిద్ధములైన రాజులు వానరులు దేవతలు అనుమూడుగణముల చేతపూజింపబడునట్టిరాముని సేవించుచున్నాను.
35.శ్లో :తారాకార విమాన మధ్య నిలయం తత్త్వత్రయారాధితం
తత్రాధీశ్వర యోగ నిర్గుణమహా సిద్ధైః సమారాధితం
తత్సంగం తరుణేందు శేఖర సఖం తారాత్రయాంతర్గతం
తప్త స్వర్ణ కిరీట కుండల యుగం రామం భజే తారకం.
తెలుగుఅనువాదపద్యము.
మ:తారకార విమానమధ్యనిలయున్ దత్త్వత్రయారాధితున్
సారాచార విశిష్టసిద్ధముని సంస్తవ్యాంఘ్రి తత్సంజ్ఞికున్
దారాద్రీశ్వర సంతతాప్తు బరమున్ దారాత్రయాంతర్గతున్
శ్రీరామున్ మకుటాంగదాభరణు సంసేవింతు నిష్టాప్తికిన్.
భావము.
నక్షత్రాకారమైన విమానమధ్యమున నున్నట్టి జీవుడుప్రకృతిఈశ్వరుడు అనుమూడుతత్త్వముల చేతనారాధింపబడునట్టి అందు ప్రధానమైన యోగముచేత నిర్గుణులైనగొప్పసిద్ధులచేత పూజింపబడుచున్నట్టి తత్పదము యొక్క సంగమము గలిగినట్టి యీశ్వరుని స్నేహితుడైనట్టి నేత్రత్రయ మధ్య భాగమైనభ్రూమధ్యమందున్నట్టి పుటమువేసిన బంగారముయొక్క కిరీటకుండలపు జోడును కలిగినట్టి తారకరాముని సేవిం చుచున్నాను.
36.శ్లో :తారం తారకమండలోపరి లసజ్జ్యోతిస్ఫురత్తారకా
తీతం తత్త్వమసీతి వాక్యమహిమాధారం తటిత్సన్నిభమ్
తత్త్వజ్ఞాన పవిత్రిత త్రిభువనం తారాసనాంతర్గతం
తారాంత ధృవమండలాబ్జ రుచిరం రామం భజే తారకమ్.
తెలుగుఅనువాదపద్యము.
శా:తారున్ దారక మండలోపరి ప్రసిద్ధ జ్యోతివిద్యున్నిభున్
తారాంత ర్ధరువ మండలాబ్జ రుచిరున్ దారాసనాంతర్గతున్
దారాతీతు సుధీ పవిత్రితుని సీతానాథు సత్కీర్తి వి
స్తారున్ దత్త్వమసీతి వాక్య మహిమాఫధారున్ భజింతున్ మదిన్.
భావము:--
తరింపజేయునట్టి నేత్రమండలమునకు పైన ప్రకాశించుచున్న సహస్రారము నతిక్రమించినట్టి 'నీవు పరబ్రహ్మవైతివి'అనువాక్య మహిమ కాధారమైనట్టిమెరుపులతో సమానుడైనట్టి బ్రహ్మజ్ఞానముచే పవిత్రముచేయబడిన మూడు లోకములుకలిగినట్టి ముత్యాలపీఠము మధ్యను పొందినట్టి నక్షత్రములపై నుండు ధ్రువ మండలమునందు పద్మముచే శోభించుచున్నట్టి తారకరాముని సేవించుచున్నాను.
37.శ్లో :కస్తూరీ ఘనసార కుంకుమ లసచ్ఛ్రీ చందనాలంకృతం
కందర్పాధిక సుందరం ఘననిభం కాకుత్ స్థ వంశధ్వజమ్
కల్యాణాంబర వేష్టితం కమలయా యుక్తం కళావల్లభం
కల్యాణాచల కార్ముఖ ప్రియసఖం కల్యాణ రామంభజే.
తెలుగుఅనువాదపద్యము.
మ:శితికంఠాప్తు మృగీ మదాను మిళిత శ్రీ చందనాలంకృతున్
క్షితిపుత్రీ సహితున్రఘనాఘన నిభున్ శ్రీరాము పీతాంబరున్
దతసౌందర్య జితస్మరున్ ప్రవిలసత్కాకుత్ స్థ వంశధ్వజున్
హితవిద్యాధికు రామభద్రు మది నేనెంతున్ కృపాకాంక్షినై.
భావము.
కస్తూరి కర్పూరం కుంకుమంమంచిగంధం అనువానిచే నలంకరింపబడినట్టి మన్మథుని కంటె సుందరుడైనట్టి మేఘముతో సమానుడైనట్టి కకుత్స వంశమునప్రధానుడైనట్టి బంగారుబట్ట కట్టుకొన్నట్టి లక్ష్మీదేవితో కూడినట్టి శాస్త్రములయందిష్టుడైనట్టి ఈశ్వరునకిష్ట స్నేహితుడైనట్టి మంగళరూపుడైనట్టి రాముని సేవించుచున్నాను.
38.శ్లో :మజ్జీవం మదనుగ్రహం మదధిపం మద్భావనం మత్సుఖం
మత్తాతం మమ సద్గురుం మమవరం మోహాంధ విచ్ఛేదనమ్
మత్పుణ్యం మదనేకబాంధవ జనం మజ్జీవనం మన్నిధిం
మత్సిద్ధిం మమసర్వకర్మసుకృతం రామంభజే తారకం.
తెలుగుఅనువాదపద్యము.
ఉ:మాకు గురుండనుగ్రహుడు మజ్జనకుండు విభుండు జీవమున్
మాకు విమోహవర్జితుడు మత్సుకృతంబు సుఖంబు భావమున్
మాకు సమస్త బాంధవజనంబు ధనంబుసుకర్మసిద్ధియున్ మాకు సమస్త తారకము
మారఘురాముడటంచు నెంచెదన్.
భావము.
నాప్రాణము నాయందనుగ్రహముకలవాడు నాయేలికనాధ్యానరూపుడు నా సౌఖ్యము నాతండ్రి నాగురువు నాపరమాత్మ నాయజ్ఞానాంధకారము పోగొట్టువాడు
నాపుణ్యరూపుడు నాకు బహుబంధు రూపుడు నాప్రాణాధారమైనవాడు నానిధి నాతపస్సిద్ధి నాసమస్తకర్మల పుణ్యము నైన తారకరాముని సేవించుచున్నాను.
39.శ్లో :నిత్యం నీరజ లోచనంనిరుపమం నీవారశూకోపమం
నిర్భేదానుభవం నిరంతరగుణం నీలాంగ రాగోజ్జ్వలమ్
నిష్పాపం నిగమాగమార్చితపదం నిత్యాత్మకం నిర్మలం
నిష్పుణ్యం నిఖిలం నిరంజన పదం రామంభజేతారకం.
తెలుగుఅనువాదపద్యము.
శా:నిత్యున్ నిర్దురితున్ సరోజనయనున్ నీలాంగ రాగోజ్జ్వలున్
నిత్యాత్మున్విమలున్ నిరంతరగుణున్ నిర్భేదునిష్పుణ్యునిన్
సత్యున్ సూక్ష్మునిరంజను న్నిరుపమున్ సర్వాత్ము యోగీంద్ర సం
స్తుత్యున్ నిర్గుణు రాము దారకు భజింతున్ సత్కృపాకాంక్షినై.
భావము.:
నిత్యుడు పద్మములవంటి కన్నులు కలవాడు
ఉపమానము లేనివాడునివ్విరిగింజ ముల్లువలె సూక్ష్మ రూపుడు అభేదానుభవస్వరూపుడు
ఎడతెగనిగుణములు కలవాడు నల్లని శరీరశోభచే ప్రకాశించువాడు పాపశూన్యుడు వేదశాస్త్రములచే పూజింపబడు పాదములుగలవాడు నిత్యుడు నిర్మలుడు సర్వస్వరూపుడు అజ్ఞానశూన్యుడు నైనతారక రాముని సేవించుచున్నాను.
40.శ్లో :ధ్యాయే త్వాం హృదయాంబుజే రఘుపతిం విజ్ఞాన దీపాంకురం
హంసోహం సపరం పరాది మహిమాధారం జగన్మోహనమ్
హస్తాంభోజ గదాబ్జ చక్రమతులం పీతాంబరం కౌస్తుభం
శ్రీవత్సం పురుషోత్తమం మణినిభం రామం భజే తారకమ్.
తెలుగుఅనువాదపద్యము:
మ:హృదయాబ్జంబున గొల్చెదన్ రఘుపతిన్ హేమాంబరున్ నిస్సమా
ను దయాళున్ ధృతకౌస్తుభున్ హరి జగన్మోహున్ గదాధ్యాయుధున్
ద్రిదశేంద్రాంశ నిభున్ మహామహిమునిన్ శ్రీవత్స వక్షస్స్థలున్
విదితాత్మున్ పరహంస రూపు బురుషున్ విజ్ఞాన దీపాంకురున్.
భావము:జ్ఞానదీపుడవైన రఘువంశశ్రేష్ఠుడవైన నిన్ఙు హృదయ పద్మమందు ధ్యానించుచున్నాను.పరమ హంసరూపుడైనట్టి ఉత్కృష్ట మహిమకాధార మైనట్టి జగత్తులనుమోహింప చేయునట్టి చేతియందు శంఖ చక్ర గదలు కలిగినట్టి పీతాంబరము కలిగి నట్టి కౌస్తుభమణి శ్రీవత్సము కలిగిన పురుషశ్రేష్ఠు డైనట్టి నీలమణితో తుల్యుడైనట్టి తారకరామునిసేవించుచున్నాను.
(వచ్చే నెల తర్వాతి శ్లోకాలు )
No comments:
Post a Comment