సుదూర బంధం
దొండపాటి కృష్ణ
జాగింగ్ చేసొచ్చి మెట్లపై అలసట తీర్చుకుంటున్న బిడ్డకు కాఫీ ఇచ్చింది శ్యామలాదేవి.
"థాంక్స్ అమ్మ. నాన్నగారు కనిపించడం లేదు ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళారు?" స్విప్ చేస్తూ అడిగాడు సుప్రీమ్.
"ఇంత పొద్దున్నే ఇంకెక్కడికి వెళ్తారు. పొలం మీద ప్రేమెక్కువ కదా! ఒకసారి చూసి రావడానికి వెళ్ళు౦తారు" కొడుకు పక్కనే కూర్చుంటూ బదులిచ్చింది శ్యామల.
"అవునా! వయస్సు పెరుగుతున్నా ఇంకా మానుకోలేదా ఆయనా?" అన్నాడు కాఫీ ని పూర్తి చేస్తూ. శ్యామలాదేవి నవ్వి ఊరుకుంది. "సరే! విమల పిన్ని ఇల్లంతా బోసిగా పాడుబడిపోయిన బంగ్లాలాగా కన్పిస్తుందేంటి?" అడిగాడు సుప్రీమ్.
"ఒకసారి వెళ్లి చూసి రాకపోయావా?" అడిగింది తల్లి.
"చెల్లిని దత్తత తీసుకున్న దగ్గర్నించి వెళ్లాలనిపించడం లేదమ్మా. ఆమెకు నా మీద ప్రేమ కుడా తగ్గిపోయిందిలే" బూట్ల లేసులు విప్పుకుంటూ చెప్పాడు సుప్రీమ్.
"అలా మొండికేసి కూర్చుంటే ఎలా కుదురుతుందిరా, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదు. ఒకసారి బాబాయ్ ను కలిసిరా!" పొలం నుండి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ చెప్పాడు సత్యం.
"ఇక ఈ జన్మలో వెళ్ళాను నాన్నగారు. మీరేం అనుకోవద్దు" తన నిర్ణయాన్ని చెప్పాడు సుప్రీమ్.
"నువ్వన్నది నిజమేలే! ఈ జన్మలో ఆమెను కలవడం ఇక కుదరదులే. అందుకే ఇప్పుడెల్ల్లి బాబాయ్ ను కలిసిరా ప్రాయశ్చిత్తం అవుతుంది" చెప్పాడు తండ్రి.
"పొద్దు పొద్దున్నే ఆ విషయాలేందుకు కానీ వెళ్లి బ్రష్ చేసిరా, టిఫిన్ చేద్దువుగాని" అంటూ పురమాయించింది ఇల్లాలు.
"అది కాదు, నాన్నగారేదో అన్నారు ఏంటది?" మళ్ళి మళ్ళి అడుగుతున్నా కొడుకు చేతిని పట్టుకొని "విమల గురించి తర్వాత మాట్లాడుకుందాం గాని ముందు నువ్వెళ్ళు" లోపలికి పంపించింది తల్లి. ముగ్గురికీ టిఫిన్ పెట్టింది.
"సుప్రీమ్! ఒకసారి పిన్ని వాళ్ళింటికి వెళ్ళు" చెప్పాడు సత్యం.
"లేదు నాన్నగారు, పిన్నికి నా మొహం చూపించడం ఇష్టం లేదని చెప్పానుగా, ప్లీజ్" అన్నాడు సుప్రీమ్.
"అలా అనకు! పిన్ని ఎలాగూ లేదులే. ఇక మళ్ళీ చూసే భాగ్యం కుడా లేదులే. వెళ్లి బాబాయ్ ను పలకరించి రా ఆయనుకూ కొంచెం ధైర్యం ఉంటుంది" అని చెప్పి ప్లేట్ తీసుకొని కిచెన్ లోకి వెళ్ళిపోయాడు సత్యం.
"ఏంటమ్మా! నాన్నగారు ఉదయం నుంచి కొంచెం అదోలా మాట్లాడుతున్నారు. పిన్నికేమైనా అయ్యిందా?" తన అనుమానాన్ని అడిగాడు సుప్రీమ్.
"తినేటప్పుడు కూడా పిన్ని సంగతేనా? ముందు తినొచ్చు కదా!" గద్దించింది తల్లి.
"అడిగిన వాటిని అలా పక్కదోవ పట్టిస్తావెందుకు?" ప్రశ్నించాడు సుప్రీమ్.
"రాత్రే వచ్చావ్. మేము ఎలా ఉన్నామో కనీసం మాటవరసకైనా అడిగావా? పిన్ని గురించి మాత్రం ప్రేమ లేదంటూనే ఆమె గురించి అడుగుతున్నావ్!" కొంచెం కోపాన్ని ప్రదర్శించింది తల్లి.
"విమల లేదనే విషయాన్ని చెప్పలేక ఇలా మాట్లడుతుందిరా మీ అమ్మ" అన్నాడు సత్యం టవల్ తో తుడుచుకుంటూ. ఆ మాట విన్న సుప్రీమ్ చేతులు ప్లేట్ లోనే ఉన్నాయి కాని అవి నోట్లోకి వెళ్ళడం లేదు.
"మీరు ఆపుతారా! వాడిని తిననివ్వండి." భర్తపై కోప్పడింది శ్యామలాదేవి.
"ఎప్పటికైనా తెలియాల్సిందేగా. అందుకే చెప్పాను. నా మీద అరుస్తావెందుకు? వాడికేం కావాలో చూడు" అంటూ బయటకెళ్ళి పోయాడు సత్యం.
"ఏంటమ్మా! నాన్నగారు చెప్పేది నిజమేనా? నా మీద ఒట్టేసి చెప్పు!" తల్లి కళ్ళల్లోకి చూస్తూ ఆమె చేతిని తన నెత్తిపై పెట్టుకొని అడిగాడు సుప్రీమ్.
"ఏమని చెప్పాను బాబు. నిజాన్ని చెప్పడం కూడా బాధే! మీ పిన్ని మూడు నెలల క్రితమే చనిపోయిందన్న విషయాన్ని నీకెలా చెప్పనురా?" అంటూ కన్నీరు కార్చింది తల్లి. స్తబ్డుదయ్యాడు సుప్రీమ్. ప్లేట్ లోనుండి చేతులు బయటకొచ్చేసాయి. నోటిలోని ఇడ్లీ గొంతులోకి దిగలేక మద్యలోనే ఆగిపోయింది. తల్లితోపాటే తనకీ కళ్ళవెంట కన్నీరు బయటకొచ్చింది.
"మూడు నెలలవుతున్నా నాకెందుకు చెప్పలేదమ్మా?" బావురుమంటూ అడిగాడు సుప్రీమ్.
"జాబ్ లో చేరాక సంవత్సరం వరకూ బ్యాంకు వాళ్ళు సెలవులు ఇవ్వరని ఎప్పోడో చెప్పావుగా. అందునా విమలంటే నీకు ప్రేమెక్కువ. ఎక్కడ పరిగెత్తికోచ్చేస్తావో అని మీ బాబాయ్ అయోధ్య చెప్పోద్దన్నారు. ఇంకా మేమేం చేయగలం బాబు?" బాధపడుతూ చెప్పింది తల్లి.
"అయ్యో! కొన్నాళ్ళ పాటు ఇంటికి రాకూడదనుకొని చెప్పిన అబద్దం చివర చూపు లేకుండా చేసిందమ్మా! నా మాట నమ్మి విషయం నాకు చెప్పకుండా నన్ను చివరి చూపుకు దూరం చేసారు కాదమ్మా! పిన్నంటే ఇష్టం లేదని చెప్తున్నా లోపల ఇంకా ఇష్టం తగ్గలేదని ఇప్పుడే తెలుస్తుంది." అంతో బాధగా గదిలోకెళ్ళి గడియ పెట్టి మంచంపై పడుకున్నాడు సుప్రీమ్.
పిన్నంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. కాని సుప్రీమ్ కు అమ్మ కన్నా పిన్నె ఎక్కువ. ఆమెంటే అదే ప్రేమ, అదే అనురాగం, అదే ఆప్యాయత. ఏవో చిన్న మనస్పర్ధలు వచ్చాయని ఆమెనేప్పుడూ మానసికంగా దూరం చేసుకోలేదతను. తనని తానె అసహ్యించుకుంటున్నాడు. తన బుద్ది హీనత్వం తోనే పిన్ని చివర చూపుకి రాలేదని బాధ పడుతున్నాడు. మనిషే లేనప్పుడు పశ్చాత్తాప పడితే మనోవేదన తగ్గడం మినహా ప్రయోజనం ఏమీ లేదు. బాబాయ్ అయోధ్య ను కలవడానికి బయలుదేరాడు. వెంట తల్లి కూడాను.
* * * * * *
ఒకప్పటి ఇంటి ముందర ప్రభాత వేళలో రంగరించియున్న రంగవల్లికలు ఇప్పుడు లేవు. తనువంతా విరబూసుకొని తమ ఆనందాన్ని చెప్పుకునే చెట్లు ఇప్పుడు మూగబోయాయి. మమతల పరిమళాలు గాలిలో కలిసి ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం కానరావడం లేదు. లోపలికి వెళ్ళాలంటేనే భయం వేసి గుమ్మం ముందే నిలబడిపోయాడు సుప్రీమ్. సుదూరంగా కుర్చీలో కూర్చొని ఉన్న అయోధ్య బాబు, సుప్రీమ్ ను చూసి బయటకొచ్చి లోపలికి రమ్మని ఆహ్వానించాడు.
భావోద్వేగాలను ఆపుకోలేక ఆడవాళ్ళు కన్నీళ్ళ రూపంలో తెలియజేస్తారు. అది మగవాళ్ళలోనూ ఉంటుందని గ్రహించిన క్షణం అది. విమలతో పాటు అటు ఇటూ ఇల్లంతా తిరిగి సందడి చేసే అయోధ్య నోరు ఇప్పుడు మాట్లాడడం లేదు. కన్నీరే అతని తోడుగా కన్పిస్తుంది. సుప్రీమ్ ది అదే పరిస్థితి. వాళ్ళ అవస్థను చూసి శ్యామల ఓదార్చే ప్రయత్నం చేసింది. ఓదార్చితే తగ్గిపోవడానికి తగిలింది శారీరిక గాయం కాదది మానసిక గాయం. మనోవేదనై ఖాళీగా ఉన్నప్పుడల్లా నేనున్నానంటూ గుర్తుచేసి ఏడిపిస్తుంది. విమల ఎంత క్షోభించుంటుందోనని తలుచుకొని బాధపడుతున్నాడు. అంతలా బాధపడదానికి వాళ్ళ మధ్యనున్నది సుదూర బంధం. తీరానికి అలకు మధ్యనున్న సుదూర బంధంలాంటిది. ఎప్పటికీ ఒకే అంశ కాదు - అలా అని వేరు కాదు.
"బాధపడకురా, మళ్ళీ తిరిగి రాదుగా" మందస్వరంతో అన్నాడు అయోధ్య.
"బాధపడకుండా ఎలా ఉండను బాబాయ్, అమ్మ కన్నా పిన్నె ఎక్కువగా చిన్నప్పుడు అంతా ఇక్కడే తిరిగేవాడిని కదా, పిన్ని ప్రేమకు దాసోహమయ్యాను. మీ పిచ్చి ప్రేమకు బానిసై ఏం చేసినా మందలించరని చాలా తప్పులు చేసేవాడిని. అవెంత తప్పులో నాకిప్పుడు అర్ధమవుతుంది బాబాయ్. నేనలా తప్పులు చేయకుండా బుద్దిగా చదువుకున్నట్లయితే పిన్నికి దూరం అయ్యేవాడిని కాదు బాబాయ్" అంటూ కన్నీళ్ళు తుడుచుకున్నాడు సుప్రీమ్.
"విమలకు నీమీద ఎప్పుడూ ప్రేమేరా! కాకపొతే మా ప్రేమ వలన నువ్వు చెడిపోతున్నానని పుకార్ల కారణంగా నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది. అయినా ఈ విషయాలు ఇప్పడు ఎందుకులేరా?" అన్నాడు అయోధ్య.
"నన్ను దూరం పెట్టడం అంటే రంజనిని దగ్గర చేసుకోవడమా బాబాయ్?" ప్రశ్నించాడు సుప్రీమ్.
"నువ్వు కళ్ళెదురుగా ఉంటున్నా ప్రేమగా నాలుగు మాటలకు నోచుకోని మేం తట్టుకోలేక మీ పెద్దమ్మ సుశీలాదేవి చిన్నమ్మాయి రంజనిని దత్తత తీసుకున్నాం. ఆమెకిద్దరూ ఆడపిల్లలేగా. ఒకరిని తీసుకుంటే కొంచెం కష్టం తగ్గుతుందని. అలా చేయడమే మా కొంప ముంచిందిరా, ఘోర తప్పిదం చేశాం" కోపాన్ని సంతరించుకుంది అయోధ్య మొహం.
"అదేంటి బాబాయ్! మీరందరూ చాలా ప్రేమగా ఉండే వాళ్ళు కదా! చెల్లి గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి?" అయోధ్యను సమీపిస్తూ ఆశ్చర్యంగా అడిగాడు సుప్రీమ్.
"ఏం చెప్పమంటావ్ రా, పెళ్లి అయ్యెంతవరకే నువ్వు చెప్పింది నిజమే. పెళ్లి అయ్యాకే వాళ్ళ అసలు రంగు బయటపడింది. నా ఇంటి దీపాన్ని తీసుకెళ్ళిపోయింది" బాధపడ్డాడు అయోధ్య.
" అసలేం జరిగింది బాబాయ్? పిన్నిని రంజని ఏమన్నా అన్నదా?" ఓదార్పుగా అడిగాడు సుప్రీమ్.
"మరిదిగారు! జరిగింది తలుచుకొని మాటి మాటికి ఇలా బాధ పడడం ఎందుకన్నా పనికొచ్చిందా? కాస్త ఊరుకోండి. సుప్రీమ్ నువ్వు రా, మనం ఇంటికి వెళ్దాం. అన్నీ గుర్తు చేసి బాబాయ్ ను బాధ పెట్టకు" అంటూ వారించి సుప్రీమ్ ను చేయిపట్టుకొని తీసుకెళ్తుంది తల్లి శ్యామల.
"అదేంటమ్మా! అలా లాక్కొస్తావ్? అసలేం జరిగిందో తెలుసుకోనివ్వు. ప్లీజ్ అమ్మా!" అంటున్నా వినిపించుకోకుండా ఇంటికి తీసుకోచ్చేసింది శ్యామల. ఇంటి దగ్గరే ఉన్న సత్యం అసలేం జరిగిందో చెప్పడం ప్రారంభించాడు.
* * * * * *
"ఎవరూ ఊహించనిదే జరిగిందిరా. రంజనికీ వయస్సు పెరిగే కొద్దీ ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. కన్నతల్లి సుశీలాదేవి కూతురికేవో నూరిపోస్తుందనే వార్తలూ వచ్చాయి. రంజనీ పెళ్లి బాధ్యత కూడా పిన్ని బాబాయ్ ల మీదే వేశారు. వాళ్ళు సంతోషంగా ఘనకార్యాన్ని వాళ్ళ బుజాన వేసుకున్నారు. పిల్లలు లేకపోయినా కన్నా పిల్లలకే పెళ్లి చేస్తున్నామన్న ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. పెళ్లి సంబంధాన్ని కుదిర్చింది మీ పెద్దమ్మ వాళ్ళే. అందుకే ఎవరూ ఎదురు చెప్పలేక పోయారు. కట్నాలు, కానుకలు, ఆడపడుచు కట్నాలు అన్నింటినీ సంతోషంగా పెట్టారు. దత్తత కూతురైనా సొంత కూతురిలా చేశావని ఊళ్ళో వాళ్ళు అంటుంటే చాలా ఉప్పొంగిపోయారు వాళ్ళు. నువ్వప్పుడు హైదరాబాదు లో కోచింగ్ తీసుకుంటున్నావు. పెళ్ళికి రమ్మన్నా ఇష్టం లేదని రాలేదు. సంవత్సరం పాటు అంతా బానే ఉన్నారు. రంజని మగ బిడ్డకు జన్మనిచ్చింది. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. పురుడు పోసిన ఐదు నెలలకు మెట్టినింటికి పంపారు. రెండు నెలల తర్వాత వికాస్ ను తీసుకొని రంజని ఇక్కడికి వచ్చింది, వెంటనే మీ పెద్దమ్మ కూడాను. తర్వాతే అసలు గొడవ మొదలైంది" అంటూ ఆపేశాడు సత్యం.
"పిన్ని ఎంతైనా బంధాలకు బానిస నాన్నగారు. చూశారా బంధాన్ని పోగొట్టుకోలేదు. ఆమెను దూరం చేసుకోవడం నా దురదృష్టం. చెప్పండి నాన్నగారు తర్వాతేమైంది?" అడిగాడు సుప్రీమ్.
"ఏవో కాగితాలు పిన్ని బాబాయ్ ల ముందు పెట్టారు. ఏంటని అడిగితే వాళ్ళ పేరు మీదనున్న రెండున్నర్ర ఎకరాల మెట్ట భూమిని వికాస్ పేరుమీద కానీ రంజని పేరుమీద కాని రాయమని, అందుకు సంబంధించిన కాగితాలపై సంతకాలు పెట్టమని అడిగారు. పైపెచ్చు వీళ్ళు కాలం చేశాక ఇల్లు కూడా స్వాధీనం చేసుకుంటారంటా, వీళ్ళ ప్రమేయమేమీ లేనట్లు మాట్లాడారు!" చెప్పింది తల్ల్లి.
"ఇదేమి చోద్యం! వీళ్ళు వాళ్ళనేమన్నా కన్నారా? వీళ్ళకు ఇష్టముంటే రాస్తారు లేకపోతె లేదు, అయినా కట్నం బాగానే ఇచ్చారన్నారుగా మళ్ళీ ఇదేంటి?" ప్రశ్నించాడు సుప్రీమ్.
"ఇచ్చిన కట్నం సరిపోలేదంట అల్లుడిగారికి" అంది తల్లి.
"అదేదో ముందే చెప్తే సంబంధం కలుపుకునే వాళ్ళో కాదో నిర్ణయించుకునే వాళ్ళు కదా?" అడిగాడు సుప్రీమ్.
"నువ్వన్నది నిజమే! పిన్ని కూడా ఆ మాటే అంది. అలా అడిగినందుకు వాళ్లకు రోషం పొడుచుకొచ్చింది. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని తెచ్చిన సంబంధానికే వంకలు పెడతారా అంటూ కోప్పడ్డారు" బదులిచ్చాడు తండ్రి.
"మరి పొలం గురించి అడిగితే మనకు రాదా రోషం. రోషం వాళ్ళ సొంతం అనుకుంటున్నారా ఏంటి? ఉన్న ఆ ఒక్క పొలాన్ని చేసుకునే వాళ్ళు బ్రతుకుతుంటే దానికీ ఎసరు పెట్టారా?" అన్నాడు సుప్రీమ్.
"అయోధ్య కూడా ఒప్పుకోలేదు. పెళ్లి అయి కనీసం రెండు సంవత్సరాలు కూడా అవ్వకుండా ఇప్పుడే ఆస్తుల మీద ప్రేమ పెంచుకున్న వీళ్ళు తర్వాత సాధ్యం కానిదేదైనా అడిగితే ఏం చేయాలన్న అనుమానం వచ్చి బాబాయ్ ఒప్పుకోలేదు" చెప్పాడు తండ్రి.
"మరి పెద్దమ్మ ఏమంది?" అడిగాడు సుప్రీమ్.
"అసలు సూత్రధారి ఆమె. పెట్టాల్సిన తగలాటం పెట్టి నాకేమి తెలియదు మీ ఇష్టం మీరే తేల్చుకోండని ఓ చోట కూర్చొని చోద్యాన్ని చూసింది. మా అక్క అని చెప్పుకోవాడానికి సిగ్గేస్తుందిరా. డబ్బు కోసం నానా గడ్డి కరుస్తుంది" ఆవేశపడింది తల్లి.
"పిన్నేమంది? చివరకు ఏమైంది? పొలాన్ని వాళ్ళ పేరుమీద రాసేశారా?" అనుమానంగా అడిగాడు సుప్రీమ్.
"ఆడది, సున్నిత మనస్కురాలు. ఆమె మాత్రం ఏమంటుంది. అలా జరిగినందుకు చాలా బాధపడింది. పొలం రాసివ్వడం కుదరదని చెప్పేసింది." అన్నాడు సత్యం.
"అది. తిక్క కుదిరింది. లేకపోతే వాళ్ళకెలా ఇస్తారనుకున్నారు! అంతా బానే ఉంది కాని బాబాయ్ ఏంటి పిన్ని చెల్లి వల్లనే చనిపోయింది అంటున్నాడు" అసలు పాయింట్ దగ్గరకొచ్చాడు సుప్రీమ్.
"ఇదంతా జరిగే సరికి పొలం వాళ్ళ చేతికి రాదని అర్ధమైపోయింది. అప్పటిదాకా నాకు సంబంధం లేదన్నట్లు ఉన్న మీ పెద్దమ్మ విమలపై విరుచుకుపడింది. 'పిల్లలు కావాలి కావాలి అని తమ పిల్లను దత్తత తీసుకున్న దానివి వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతే ఎందుకు? ఎక్కడికన్నా వెళ్లి చావు. ఇంత కఠినమైన దానివి కాబట్టే నీకు పిల్లలు పుట్టలేదు, గోడ్రాలివయ్యవు. నీకు రోగం రాను. పిల్లల ఉసురు తీసుకుంటావు' అంటూ విమలను తిట్టింది. మేము అడ్డుపడితే మమ్మల్ని కూడా తిట్టింది. అంత చేస్తున్నా కూతురు కాని అల్లుడు కాని ఏమి మాట్లాడలేదు. ముందే అనుకోని రావడం వలననుకుంటా మిన్నుకుండి పోయారు. 'గోడ్రాలి' అన్న పదానికి పిన్ని బాగా నలిగిపోయింది. వికాస్ అయితే రంజనిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పొలం కాగితాలు తీసుకొని వస్తేనే ఏలుకుంటానని చెప్పేశాడు. రంజని ఇక్కడే ఉంటూ పిన్నిని సూటిపోటి మాటలతో హింసించేది. ఊరిపెద్దలు ఎమన్నా అడిగితే వాళ్ళపై కోప్పడేది. పంచాయితీ పెట్టిద్దామంటే విమల ఒప్పుకోలేదు. 'పొలం రాస్తే సరిపోతుందా?' అని ఒకరోజు మీ పిన్ని అడగడం ఆలస్యం వెంటనే వికాస్ ను మీ పెద్దమ్మను పిలిచేసింది ఆనందంగా. వాళ్ళ కోరిక నేరవేరుతున్నందుకు ఎంతో సంతోషించాడు" అన్నాడు సత్యం.
"అదేంటి! వాళ్లకు పొలం రాయడమేంటి? మొదట్లో ఒప్పోకోనిది తర్వతేలా ఒప్పుకుంది. అల్లా చేయడం నాకేం నచ్చలేదు నాన్నగారు" అసహనాన్ని చూపాడు సుప్రీమ్.
"పొలం వాళ్లకు రాసానని నాన్నగారేం చెప్పలేదే" షాకిచ్చింది శ్యామల.
"అవునా! మరేం జరిగిందారోజు?" ఆత్రుతగా అడిగాడు సుప్రీమ్. చెరో కప్పు టీ అందించింది శ్యామలాదేవి.
"స్టాంప్ పేపర్స ను వాళ్ళ ముందు పెట్టి సంతకాలు చేయమన్నారు. 'పొలం ఇచ్చాక ఇంకేమి మా దగ్గర్నుంచి ఆశించనని మాటివ్వండి' అని విమల అడిగేసరికి వాళ్ళందరూ తెల్లమొహం వేశారు. అదసలు వాళ్ళు ఊహించనిది. వాళ్ళ మనస్సుల్లో ఏముందో ఏమో గాని అలా అడిగేసరికి మౌనమే వారి సమాధానం అయింది. ఓ పది నిమిషాలపాటు ఇంట్లో అంతా నిశబ్ధం. నిశబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిందప్పుడే. మళ్ళీ పిన్నె మాటందుకొని 'దీన్ని బట్టి చూస్తుంటే మీ మనస్సుల్లో ఇంకేదో ఉందని అర్ధమవుతుంది. ఆ బంజరు భూమిని కూడా ఆశిస్తారేమోనన్న నా అనుమానాన్ని నిజం చేశారు. ఎన్ని ఇచ్చినా మీకు సంతృప్తి ఉండదని అర్ధమైపోయింది. అటువంటప్పుడు ఇది కూడా మీకివ్వడమెందుకు?' అంటూ బాబాయ్ ను పిలిచింది. వీలునామాను తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు అయోధ్య. అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు, మేము కూడా! మీ అమ్మకు నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అలా ఎందుకు జరిగిందో ఊహించలేకపోయాం.
రంజని ఏడుపు లంకించుకుంది. 'ఇన్నాళ్ళు పెంచుకున్న నన్ను కాదని అంతా వాడి పేరు మీద రాసేస్తావా? మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోయిన వాడంటే ఎందుకంత ప్రేమ. వాడికేం సెంటిమెంట్ లు ఉండవ్. గాలిగా తిరిగేవాడికేమో ఇస్తావు నాకు మాత్రం అన్యాయం చేస్తావా?' అంటున్న మీ చెల్లిని పిన్ని వారించింది. 'ఎవర్ని గాలి వెధవ అంటున్నావ్? వాడి గురించి నీకేమి తెలుసు, వాడి ప్రేమ గురించి నీకేమి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయ్' అంది విమల. దానికి రంజని ఒప్పుకోలేదు. 'గోడ్రాలివి ఇంత కుట్ర పన్నుతావు అనుకోలేదు. ఎప్పుడో నీతో ఉన్న వాడేమో కావాలి ఇన్నాళ్ళు పెంచుకున్న నేనేమో పోవాలి అందుకేగా నువ్వు ఈ పని చేసింది. ఇన్ని కుట్రలు పన్నుతావు కాబట్టే నీకు పిల్లలు పుట్టలేదు. నువ్వు నన్ను పెంచిన తల్లివి కాదు నన్ను పీక్కుతినే దయ్యానివి. వీళ్ళందరి ముందు నా కుటుంబాన్ని అవమానించాడానికేగా మమ్మల్ని పిలిపించింది. కన్న తల్లి కన్న తల్లే - పెంచిన తల్లి పెంచిన తల్లే అని నిరూపించావ్. నిజంగానే నువ్వు గోడ్రాలివి. ఈ సమాధుల్లాంటి ఇంట్లో నేనుండలేను, నేనుండను' అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడి బావి దగ్గరికెళ్ళి బిందెతో తలమీద నీళ్ళు పోసుకొని తన బిడ్డను, భర్తను తీసుకొని వెళ్ళిపోయింది" చెప్పాడు సత్యం.
"అంత పని చేసిందా చెల్లి. నమ్మలేకపోతున్నాను. బిందెతో నీళ్ళు పోసుకోవడమంటే వాళ్ళు చనిపోయినట్లు లెక్క గట్టినట్లేగా?" అన్నాడు సుప్రీమ్.
"అంతేగా మరి. ఊళ్ళో ఎంత మంది గోడ్రాలన్న బాధపడని మీ పిన్ని, సుశీలాదేవి, రంజని అదే మాట అనే సరికి తట్టుకోలేకపోయింది. నెత్తిమీద నీళ్ళు పోసుకోవడం అనేదానికి మరింత బాధపడింది. తలుచుకొని తలుచుకొని ఏడ్చేది. ఎవ్వరితోనూ కలిసేది కాదు. ఇంట్లోంచి బయటికి వచ్చేది కాదు. అలా కొన్నాళ్ళకు మంచం పట్టింది. నిన్ను చూడాలనేది. కానీ నువ్వో దారి అవుతున్నావని, తెలిస్తే బాధపదతావని బాబాయ్ చెప్పలేదు, మమ్మల్నీ చెప్పనివ్వలేదు. దాక్టర్సకు చూపించి మందులు తీసుకుంటున్నా మనోవేదన ముందు మందులెం పనిచేస్తాయి చెప్పు. ఆ బాధ బాధతోనే చనిపోయింది. అందుకే రంజనిపై విపరీతమైన కోపం, అసహ్యం పెరిగాయి" అంటూ చెప్తుండగా తన సెల్ ఫోన్ మోగడంతో ఆపేసి పక్కకెళ్ళాడు సత్యం.
అప్రయత్నంగానే సుప్రీమ్ కన్నీళ్లు కార్చాడు. వాటిని తుడుచుకుంటూ "అమ్మా! 'వాడు' అంటే ఎవరూ? అదే పొలం ఎవరి పేరు మీద రాసింది పిన్ని?" అడిగాడు సుప్రీమ్.
"తన యావదాస్థికి వారసుడివి నువ్వేనని రాసిందిరా పిన్ని" చెప్పింది శ్యామలాదేవి. షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.
"నీకు అంటే నాకా అని అర్ధం" నమ్మలేక అడిగాడు సుప్రీమ్.
"అవును సుప్రీమ్! పిన్ని తన పొలం మొత్తం నీకేనని, తన నగలు అన్నీ నీ భార్యకు తన కానుకలని రససి పెట్టింది" చెప్పింది తల్లి.
"అదేంటమ్మా! నాకు రాయడమేంటి? నేనంటే ఇష్టం లేదనుకున్నాను కాని ఇంత ప్రేమ ఇంకా ఉందా? నమ్మలనిపించని నిజం అమ్మ ఇది. అంత ప్రేమను ఎందుకు దాచిపెట్టిందో కనుక్కోవాలి. లే ..." అంటూ విమల ఇంటికి పరిగెత్తాడు.
* * * * * *
సుప్రీమ్ రాకను అయోధ్య గుర్తించాడు. అయోధ్యను గట్టిగా కౌగిలించుకున్నాడు సుప్రీమ్. "అంతా తెలిసింది బాబాయ్. మీ ఆస్థిని నాకు రాయడమేంటి బాబాయ్?" అడిగాడు సుప్రీమ్.
"నీ మీద మా ప్రేమ వేలకట్టలేనిదిరా. మీ అమ్మా నాన్నల కన్నా ఒక్కప్పుడు మేమే ఎక్కువ నీకు. చనువు ఎక్కువ అవడంతో పరిస్థితులు మారాయంతే. నువ్వు బాగుపడాలనే దూరం పెట్టాం కాని నీదేదో తప్పుందని కాదురా. మేం అనుకున్నట్లుగానే బాగుపడ్డావ్. ఉద్యోగం సంపాదించావ్. కాని నిన్నిలా తపించిన అదిప్పుడు లేదు. అదే నా బాద. నువ్వెప్పుడూ మయు దూరం కాదు" ప్రేమగా జుట్టు నిమురుతూ చెప్పాడు అయోధ్య.
"ప్రేమనంతా పంచేసి ప్రేమే కరువై పిన్ని చనిపోయింది బాబాయ్. ముందు నాకెందుకు చెప్పలేదు బాబాయ్?" ప్రశ్నించాడు సుప్రీమ్.
"మా కలహాల వలన నువ్వు నిగ్రహం కోల్పోకూడదని. నీ ధ్యాసంతా భవిష్యత్ మీదే కాని మా పిచ్చి ప్రేమ కాదు. మా విషయం తెలిస్తే అన్నీ మరిచిపోయి నువ్వు వచ్చేస్తావని మాకు తెలుసు. విమల, నువ్వు ఒక్కటే. సున్నిత మనస్కులు. ఎంత కోపమున్నా వెంటనే కరిగిపోతారు, కలిసిపోతారు" అన్నాడు అయోధ్య.
"నన్ను పిన్ని సమాధి దగ్గరికి తీసుకెళ్ళు బాబాయ్ ప్లీజ్" అన్నాడు సుప్రీమ్. అతని మాటను కాదనలేక సమాధి దగ్గరికి తీసుకెళ్ళాడు అయోధ్య.
శ్రద్దాంజలి ఘటించాడు సుప్రీమ్. భావోద్వేగాలు నిలుపుకోలేని ఇంకో వ్యక్తీ అయ్యాడు. బాగా రోదించాడు. కాని వినే వారెవరు! కనిపించక వినిపించే ఆవిరైన నీటి జలాల సంఘర్షణలలో కలిసిపోయాయి అతని అరుపులు. అవి సరాసరి విమలకు మాత్రమే చేరతాయి. సుప్రీమ్ బుజం మీద చెయ్యి వేశాడు అయోధ్య.
"జంతువులైనా, పక్షులైనా తమ బిడ్డలను కొన్నాళ్ళే సాకి వదిలేస్తాయి. స్వయంగా బ్రతకమని జీవన విధానాన్ని నేర్పిస్తాయి. కాని మనుషులు మాత్రం పోషిస్తూనే ఉండాలి. పెళ్ళైనా తల్లీదంద్రులే లేక పెద్దవాళ్ళో చూడాలంటే వాళ్ళ జీవితాలేందుకు? రెండు కాళ్ళు, రెండు చేతులు సవ్యంగా ఉన్నా పెద్దోళ్ళ సంపాదనే ఆసరా అంటే వాళ్ళకెందుకు కాళ్ళూ చేతులూ? అంగవైకల్యం ఉన్నవాళ్ళే వాటిని మర్చిపోయి వారి ఉనికిని చాటుకుంటున్న ఈ రోజుల్లో కూడా అన్నీ ఉండీ లేనట్లే ప్రవర్తించే ఇలాంటి వాళ్ళను ఏమనుకోవాలి సుప్రీమ్. చెప్పు నువ్వే చెప్పు కొంచమైనా విజ్ఞత ఉండకర్లేదా! నీలా కష్టపడలేరా?" అంటూ రంజని కుటుంబంపై ఆవేశాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు అయోధ్య. మౌనమే సుప్రీమ్ స్పందన. పరిస్థితులు అలా ఎలా మారిపోతాయో సుప్రీమ్ కు అంతు చిక్కడం లేదు. ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు.
'భర్త మీద ప్రేమా లేక పిల్లల భవిష్యత్ కోసమా లేక ఆశలు రేపిన అత్యాశా! దేని గురించి ఇలా ఆలోచిస్తారీ ఆడవాళ్ళు. వాళ్ళను అడ్డం పెట్టుకొని మగవాళ్లే౦దుకు పిచ్చిగా ప్రవర్తిస్తారో. మగాడు తన సౌఖ్యం కోసం ఆడదాన్ని వివాహమాడితే ఆడది మాత్రం సమాజంలో తన ఉనికిని కాపాడుకోవాడానికి మగాడికి తలోంచుతుందని పూర్వికులు చెప్పిన మాటకు విరుద్ధంగా జరుగుతుంది వర్తమానం. బ్రూణ హత్యలు జరగడం దీనికి తార్కాణమేమో' అనుకుంటూ అయోధ్యను అనుసరించాడు సుప్రీమ్.
******
No comments:
Post a Comment