శివగానామృతపాతం - తరుణేందుశేఖరా ఆల్బం - అచ్చంగా తెలుగు

శివగానామృతపాతం - తరుణేందుశేఖరా ఆల్బం 

భావరాజు పద్మిని 


భక్తిగీతాలను ఎంతోమంది రాస్తూ ఉంటారు. కాని ఆత్మజ్ఞానం కలిగిన సత్పురుషులు, అన్నింటా ఆ దైవాన్నే దర్శిస్తారు కనుక, వారి అంతర్నేత్రం నుంచి వర్షించే పాటలు మన ఆత్మలను ఆనందడోలికల్లో తేలుస్తాయి. అటువంటి అద్భుతమైన పాటల ఆల్బం శివపదం - 10.  బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు తాజాగా బొంబాయి నగరంలో 'తరుణేందుశేఖరా' అనే పేరుతో విడుదల చేసిన ఆల్బం. ఇందులోని ప్రతి పాట, పాటల్లోని భావనాఝరి శ్రోతల మనసులను శివభక్తిలో  లీనం చేస్తుంది. ఇంతకీ ఈ పాటల ప్రత్యేకత ఏమిటో చూద్దాము.
'సుందరీ తపము ఫలంగా సిద్ధించిన శివుడా. సుందరేశా ! నమో. శూలీ మహేశా.' అంటూ మొదలయ్యే తొలి పాట, ఉమా ధ్యానంలో ఉండే దైవమైన శివుడినీ, గౌరీ ఉపాసనకు కేంద్రస్థానం అయిన శివుడినీ, శ్రీ సర్వమంగళ మాంగల్యంగా భాసిస్తున్న శివుడినీ, పార్వతీ యోగ బలమైన శివుడినీ... మహాదేవుడినీ కీర్తిస్తుంది. అమ్మ తనువులో శాశ్వతంగా నిలిచే సౌభాగ్యం పొందిన శివుడినీ, జగదంబికారాధ్య జగజ్జనకుడైన  హరుడినీ కీర్తిస్తూ చివర్లో ... 'షణ్ముఖా వన మృడా చండికా ప్రాణేశ ...శ్రీ విద్య కై చేయు శ్రీఫలము నీవే' అంటూ కీర్తనలో సామవేదం వారి ముద్ర అయిన 'షణ్ముఖ' ను భావంలో మిళితం చేస్తుంది.
ఇక రెండవ పాట... 'త్రికరణములనే పందిరి పై దివ్యభక్తి వల్లరి (తీగ)' అనే పాట. మనోవాక్కాయ కర్మలను త్రికరణాలు అంటారు. ఈ త్రికరణాలు అనే పందిరి మీద దివ్యభక్తి అనే తీగ అల్లుకుంటోంది. ఇలా  ప్రకటముగా అల్లుకోవడం ఆ సాధకుడికి మహానందాన్ని కలిగించింది . ఇది ఎటువంటి తీగ అంటే, ఈ భక్తి అనే తీగ భవకల్పక వల్లరి - ఇలలో కల్పవృక్షం వంటి తీగ, వర కల్పక వల్లరి - అన్ని వరాలను ప్రసాదించగల తీగ. పూర్వపుణ్యమనే సారంతో  పుష్టి పొందిన ఈ తీగ  జీవనవనంలోకి  శివభావన అనే వసంతమై వచ్చి, మన మనస్సును నందనవనంగా చేస్తుంది. ధ్యానగాన సమర్చనలు ఈ తీగకు తగిన దోహదములై , కొరత లేని కలిమినిచ్చే వరకల్పక వల్లరిగా ఈ తీగను మారుస్తాయి. అమ్మ అయ్యలను(పార్వతీ పరమేశ్వరులను) కొలిచే అక్షరాలే అలరులై, వాడిపోని తలపులే పల్లవ మృదు శోభలై,  గౌరీ  శంకర కృపతో క్రమముగా వర్ధిల్లుతూ, కరువుదీరా పోషించే కమనీయ వల్లరి ఈ తీగ... చూసారా, దివ్య భక్తి అనే తీగ ఎంతటి మహిమల్ని చూపగలదో ! అద్భుతమైన భావనలతో అల్లుకున్న ఈ పాటలతీగ, శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గళంలో, స్వరంలో మరింత మధురమై, మన వీనులకు విందు చేస్తుంది.
శివుడు అనంగానే మనకు స్ఫురించేది శివతాండవం. పుట్టపర్తి వారి నుంచీ ఎంతోమంది ఈ తాండవాన్ని అద్భుతంగా భావన చేస్తూ రాసారు, పాడారు. కానీ ఈ 'తాండవాడంబరా తరుణేందుశేఖరా అంబతో నటియించు హరా పరమేశ్వరా శంకరా ...' అన్న పాట వింటే నాట్యం రాని వారికి కూడా లేచి నాట్యం చెయ్యాలని అనిపిస్తుంది. ఆ శివుడి తాండవం ఎలా ఉందంటే -  మెరుపు సొగసుల లాగా,  మెరుగు చక్రము లాగా, వెలిగే కందుకము(బంతి) లాగా (అంత వేగంగా నాట్యం చేస్తున్నారన్నమాట), మెరుపు తీగలు కదులుతున్నట్లుగా ... ఇంకా ఆ నాట్యంలో మెలికలు, తిరుగుళ్ళు, ఎగయుటలు, సాగుటలు, సకల గమనమ్ములలో చైతన్యమైశివుడు కనిపిస్తారు. ఈ తాండవానికి  ... సర్వ సంగీతమూ ఒక ఆకారాన్ని దాల్చి నిలుస్తుంది, అఖిల వాఙ్ఞయ రాశి హరమూర్తి రూపంలో వెలుగుతుంది , భవ్య నాదాలు ప్రణవా కారుని(ఓంకార స్వరూపుడిని ) చేరి, చివరికి  చిత్రముగా జగమంతా శివమయమై వెలిగిపోతూ ఉంటుంది. ఇంత అద్భుతమైనది శివతాండవం. కారణజన్ములు మాత్రమే ఇంత గొప్పగా భావన చెయ్యగలుగుతారేమో !
ఈ పాట మరొక అద్భుతమని చెప్పవచ్చు - భవక్షేత్రమున కర్మలనే బీజాలు వేసి, జీవుల పంటలు పండించే తొలి రైతు - పెద్ద రైతు - శివుడట. పంటలను కంటికి రెప్పలాగ కాపాడి, జంటగ హిమవంతుడి కూతురితో, గుణములనే ఎరువులను వేసి , కంటకాదులతో కంచెలు కట్టించి మరీ ఈ పంటలను (మనల్ని) రక్షించే రైతు ఈ శివుడు. చేతికి పంట అందగానే, చెలియతో కూడి, ప్రీతితో తెగకోసి విడుస్తాడు. - లయకారుడు శివుడు. పాత దేహం జీర్ణమైతేనే కొత్తది పొందడం వీలౌతుంది కనుక, మనకు మంచి జరగాలనే తనలో లయం చేసుకుంటారు శివుడు. షణ్ముఖ నుతుడు, పంచ కృత్యములను(సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము)  చేసే రైతు. మన ఆత్మే ఈ రైతు. ఇతని పంటలము కావటం కంటే మన జన్మలకు ఇంకేమి అదృష్టం కావాలి, చెప్పండి. ఈ పాటను విన్నప్పుడు గురువుగారికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలన్న భావన కలిగింది.
చిట్టి శివుడు, చిన్ని శివుడు, బాల శివుడు ఎలా ఉంటారు? ఈ ఊహతో పుట్టిన పాటే - 'మనోహరుడు మా బలశివుడు మానసమ్మున కదలాడెను' అన్న పాట. ఇలా గురువుగారి మానసంలో కదిలిన శివుడిని అక్షరాల్లో నిక్షిప్తం చేసి మనకూ దర్శింపచేసారు. ఘనానంద రూపుడు, పరమ శుభ కారణుడీ శంకరుడు... బాలుడిగా ఆయన ఎలా ఉన్నారంటే - సిరుత ప్రాయంపు సొగసు, సిరినగవుల తళుకు మురిపెపు జడ సందులలో ముత్యపు సరమాయే శశి(ఆయన జడ సందుల్లో ముత్యాల గొలుసు వేసినట్లు ఉన్నాడట చంద్రుడు, ఎంత చక్కని భావన ) , చిరునందెల వలె అమరె చిన్ని చిలువ రాయళ్ళు (చిట్టి పాములు ) అమరాయట, అభయ హస్తంతో, వర శూలము దాల్చి నిలిచాడట ఈ శివుడు. విరిసిన మల్లె లాగ వెలుగు శుద్ధమైన వాడు(శివుడిని బొమ్మల్లో నీలపు రంగుతో చూపుతారు, కాని ఆయన శుద్ధ స్ఫటిక ఛాయతో వజ్రంలా మెరిసిపోతూ ఉంటారని, విజ్ఞులు చెబుతుంటారు), అరసి మమ్ము కాపాడే అతిసుందరుడు ఈ బాల ఈశ్వరుడు. పులితోలు ధరించి, తనువున భస్మము రాసుకుని, ఉన్న బాలశివుడు, షణ్ముఖ నుత మోహనుడు ఇతడే నాకు శరణము అంటూ ముగుస్తుంది ఈ చక్కటి కీర్తన.
ఆ తరువాతి పాట - 'పరమశివ వాచకమా పంచాక్షరీ జనని వరదాయనీ తల్లి వందనములమ్మా ...' అనే పాట. అమ్మవారిని -  సకల మంత్రాత్మికవు, సర్వ వేదాత్మికవు, శ్రీకరివి, శాశ్వతవు, చింతితార్ధ ప్రదాయినివి,  ప్రాకటమ్మున మమ్ము పాలించు జననివి,  శ్రీకంఠ కృపనిచ్చు చిన్మయివి, మోక్షదవు , పంచ కృత్యమ్ములకు పరమ కారణవు, పరమాత్మికవు జననివి, భవమూల నాశినివి పంచ భూతాత్మకవు, ప్రపంచ కారిణివి, పంచవర్ణ ప్రభవు, పరవు షణ్ముఖ వినుతా ,అంటూ స్తుతించే గొప్ప కీర్తన ఇది.
శ్రీ సామవేదం వారు కేవలం శివుడినే దర్శించలేదు. శివుడికి సంబంధించిన ప్రతి సూక్ష్మమైన అంశాన్ని ఆయన భావన చేసారంటే, వారి అంతరంగం శివునిలో ఎంతగా తాదాత్మ్యం చెందిందో మనం తెలుసుకోవచ్చు. 'రుద్రుని లీలా శక్తి ధరించిన రూపములారా నమస్సులు... భద్ర శివాయుధ దైవములారా ప్రణామములు పలు మార్లు ...' అనే కీర్తనలో శివుడి ఆయుధములైన  -సదాశివుడి సాధు హస్తమున పినాకము అనే ధనుర్దైవమును, సద్యీ కృతమైన జావల్లిని , పరశును తనకు, లోకానికి రక్షణనీయమని గురువుగారు నమ్రతతో ప్రార్ధించారు.
'నీ మ్రోల వెలుగనీ నీ మనః కళికని భావనా ధృతి ధార నిన్నే అభిషేకించి ..' అన్న పాట విషయానికి వస్తే... ప్రతి జన్మ, ఆయువున్నంత వరకూ దైవం ముంగిట దీపంలా వెలిగినప్పుడే ఆ జన్మకు సార్ధకత కదా ! సాంబ శంభో నిన్ను సాక్షాత్కారించుకునే సంకల్ప బలమీయుమా, వదల నీయక నిన్ను ఎదలోన నిలుపగల ధారణను దయచేయుమా శివా, అన్నింటినీ  నీ చెంత అర్పించుకొన గల్గు భక్తి సౌభాగ్యమిమ్మా , కావ్యగానంద కలితునిగ మురిపించు సారస్వతమ్ము నిమ్మా ... శివా అంటూ శివుడిని వేడుకుంటారు సామవేదం వారు.
పాముల్ని చూడగానే మనలో చాలామందికి ఒళ్ళు జలదరిస్తుంది. కానీ అవెంత భాగ్యాన్ని పొందాయి? శివుని మేని సీమలోన స్వేచ్చగ తిరుగాడే పావనమైన ఫణులవి. అనంత కర్కోటకాది అష్టనాగ కులములకు, ఘన శంకర జటాటవిని కదలాడే ధన్యులకు , తనివిదీర శివుని మెడను తళతళ హారమ్ములాగా మెరిసే ఫణులకు, ఘన శంభుని కరములందు కంకణముల సొగసులై అమరిన వాటికి,... హరుని కటిని మెరయునట్టి వరమేఖల శోభలైన వీటికి , పురహరు చరణాల అమరి చెలగు జిలుగుటందెలకు, పరమేశ్వర దీధితి లో ప్రకాశించు దివ్యులకు,  అరయ షణ్ముఖుని తండ్రికి ఆప్తులైన నాగజాతికి వందనములు సమర్పిస్తున్నారు పూజ్య గురుదేవులు ఈ పాటలో.
ఇక మధుర మనోహరమైన చివరి పాట... పరికించి చూస్తే, ఈ పరమేశ్వర సృష్టిలో గొప్పవారు ఎవరు ? ధనవంతులా, కీర్తివంతులా, పరపతిగల నాయకులా ? ఇవన్నీ పరమేశ్వరుడి దయాభిక్షే కనుక, వీరెవరూ కానే కాదు. మరి ?
"వారే ధన్యులు, వారే గణ్యులు వారే పుణ్యులు ముక్తులు... వారి దీవెన చాలును" ఎవరువారు ? శివభక్తాగ్రేసరులు. వారెంత గొప్పవారంటే - వారి ఎదలో శంభు దేవుడు  నిరతము ప్రకాశిస్తూ ఉంటారు,  వారి పలుకున శైవ మంత్రము పరవశమ్ముగా  మ్రోగుతూ ఉంటుంది, వారి చూపులే శివుని చూపులు -ఎంత గొప్ప భావన, శివుడెక్కడో లేడు, వీరి రూపంలోనే ఉన్నారు, కనుక  వారే మనకు మార్గము చూపుతారు. వారే శంకర చరణ దాసులు, పరశు రక్షితులనఘులు ,వారి దీవెన ఒక్కటీ మనకు చాలు. వారి  అడుగులు సోకు ధరణియే వర సుతీర్ధము క్షేత్రము (వరాలిచ్చే పుణ్య క్షేత్రం వంటిది ), వారి పలుకులు చెవుల తాకిన భస్మమై(పలుకులు చల్లని పవిత్రమైన విభూదిగా మారిపోతాయట ) చలువొసగును, వారి సన్నిదే శివుని సన్నిధి, వారి కృపయే మనకు చాలు. వారి పదముల భక్తి సంపద దొరకున అక్షయమై సదా ... వారి దీవేనే చాలును . వారి వీనులు శైవ సుకధా పానమున పావనములు, వారి హృదయమే శివాలయమగును,  వారి నడతలు శుద్ధములు , వారి సంగము నొందు వారే ఈ భవసాగరాన్ని దాటే మార్గం తెలుసుకోవడం తధ్యము, వారే షణ్ముఖ నుతుని కరుణకు పాత్రులును సుజ్ఞానులు... అట్టి శివభక్తాగ్రేసరులు అందరి పాదాలకు వినమ్రంగా నమస్కరించి, మనమూ శివకృపకు పాత్రులమై, ధన్యులమవుదాము.
మన మనసుల్ని శివభక్తి భావనలో లయం చేసే ఈ దివ్యగానామృత కీర్తనలను  టి.టి.డి మరియు కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాన్ అయిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచారు. వారు, వారి పుత్రులు గరిమెళ్ళ అనీల్ కుమార్ గారు ఈ కీర్తనలు భక్తి భావం ఉప్పొంగేలా అద్భుతంగా ఆలపించారు.
చక్కటి ఈ ఆల్బం ను మీరూ పొందాలని అనుకుంటున్నారా ? క్రింది చిరునామాను సంప్రదించండి.
Rushipeetham Publications, No - 1-19-46, HIG "A" -40, Kedaar Vardhini, ECIL Colony, Dr.A.S.Rao Nagar, Hyderabad - 500062. Ph: 040 271134557. Website : www.rushipeetham.org, email: info@rushipeetham.org.
CD వెల : 50 రూ.
***

No comments:

Post a Comment

Pages