యాదగిరీంద్ర శతకము - అచ్చంగా తెలుగు

యాదగిరీంద్ర శతకము - తిరువాయిపాటి వెంకటకవి

పరిచయం :దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం:
తిరువాయిపాటి వెంకటకవి తెలంగాణాలోని నల్లగొండ మండలమున కొలనుపాక నివాసి. సాతాని వైష్ణవుడు. ఈ శతకాంతమునందు తనను గురించి తాని ఈ విధంగా చెప్పికొనినట్లు
శ్రీతిరువాయిపాటి కులశేఖరుడౌ మణివాళజియ్యరుం
డాతనిపుత్రుఁడౌ వరపరాంకుశ సూనుఁడ వేంకటాఖ్యుఁడన్
శ్రీతరిణీశ నీకథలఁ జేసి ధరాతలమందు భూజనుల్
జేతమునన్ బఠించునెడఁ జేకొన యాదగిరీంద్ర మ్రొక్కెదన్
అంతండ్రి పరాంకుశుడు. తాత మణివాళజియ్యరు. తల్లినామధేయం పేర్కొనలేదు.
ఈ కవి యాదగీరీంద్ర శతకము, యాదగిరినరసింహ శతకము అను కందపద్య రచించినట్లు తెలుస్తున్నది. యాదగిరి నరసింహ ఇప్పుదు దొరుకుతలేదు. ఇతర రచనలు ఏమైన చేసినను వెలుగుకి రాలేదు. ఈ కవి దాదాపు క్రీ.శ. 1840 ప్రాంతము వాడని చరిత్రకారుల నిర్ణయము.

శతకపరిచయం:

యాదగిరీంద్ర శతకము " యాదగిరీంద్ర మ్రొక్కెదన్" అనేమకుటంతో వ్రాసిన చంపకోత్పలమాల వృత్త శతకము. భక్తిరసప్రధానమైన ఈశతకంలో 108 పద్యాలున్నాయి. వావిళ్ళ వారు ఈశతకాన్ని తమ భక్తిరస శతక సంపుటం మూడవభాగంలో ప్రప్రథమంగా ప్రకటించారు. చక్కనిసరళమైన బాషలో వ్రాసినది అక్కడక్కడ దోషాలున్నాయి. శైలి అంతప్రోఢిగా లేదు.
కొన్ని పద్యాలను చూద్దాము.
ఉ. ఎంతని వేడుకొందు నిఁక నేమని కోరుదు నిందిరేశ నీ
కెంతకు రాకయుండె దయ హీనుఁడు వీఁడని యెంచినావ నీ
చెంతకు రాక యన్యులను జేరను నీవిఁకఁ ద్రోవఁజూపుమా
సంతతభోగితల్పగుణసాగర యాదగిరీంద్ర మ్రొక్కెదన్
ఉ. కంటిని పాదపద్మములు కంటిని జంఘలు మధ్యదేశముం
గంటిని శంఖచక్రములఁ గంటిని నీ కనుదోయి కర్ణముల్
గంటిని నీదుపల్వరుసఁ గంటిని నీ ముఖతేజమున్ మదిన్
గంటి కిరీటమస్తకము గావవే యాదగిరీంద్ర మ్రొక్కెదన్
ఉ. చూచెద ఫాలమందుఁ దిరుచూర్ణపురేఖలు కోరమీసముల్
చూచెద నీదునాసికము సొంపగు శ్రీపతకంబు హారమున్
జూచెద హాటకాంబరము చోద్యపుగంటలు గజ్జెలందెలున్
జూచెద నీదువైభవముఁ జూపవె యాదగిరీంద్ర మ్రొక్కెదన్
తన సొంతవారినే నమ్ముకొని చెడిపోయినట్లుగా ఈ కవి చెప్పుకొన్నాడు
ఉ. తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ దమ్ములనన్నల మేనమామలన్
గొల్లగ బంధువర్గములఁ గూరిమిభార్యను మేనబావలన్
ఉల్లములోన నమ్ముకొనియున్ జెడిపోయితి నిన్నుగానకే
కల్లలుగావు నీకృపను గావవె యాదగిరీంద్ర మ్రొక్కెదన్
తాను చేసిన దుష్కర్మలను ఏకరువుపెట్టి తనను కాపాడమని అర్థించిన ఈ పద్యాలను చూడండి.
ఉ. భూమిని దుష్టచిత్తమున భూరిగఁజేసితి పాపసంఘముల్
ఏమని విన్నవింతు మఱి యేవిధమియ్యది నిర్వహింతు శ్రీ
స్వామి పరాత్పరాయనుచు సన్నుతిఁజేయక మోసపోయితిన్
బ్రేమదలంచికావు మిక వేగమె యాదగిరీంద్ర మ్రొక్కెదన్
ఉ. నిక్కము నీదుదాసులను నిందలు జేయుచునుంటి దాతలున్
జక్కఁగ దానమియగను జయ్యన వద్దని సంతసించితిన్
గ్రక్కున దేవ భాహ్మణులకార్యము లన్నిటి నెత్తిగొట్టితిన్
ఎక్కువ పాపి వీఁడనక యేలవె యాదగిరీంద్ర మ్రొక్కెదన్
ఉ. నీరజనేత్ర నామనవి నీచెవి సోకఁగ విన్నవించెదన్
జారుఁడఁబాపసంచయుఁడ చాలదురాత్మదురంతకర్ముఁడన్
గ్రూరుఁడఁ జోరుఁడన్ గఠిన కుత్సితుఁడన్ దొసఁ గెంచఁబోక నన్
నేరుపుతోడఁ జూచి కరుణింపవె యాదగిరీంద్ర మ్రొక్కెదన్
ఈ శతకంలో దశావతార వర్ణన చేసారు. కొన్ని పద్యాలను చూద్దాము.
ఉ. ఆది వరాహరూపమున నాకనకాక్షుని బట్టిత్రుంచియున్
మోదముతోడ భూమి భయముం దొలఁగించిన జాణవయ్య దు
ర్వాదులయందు నిగ్రహము వారక చూపియుఁబ్రేమమీఱఁగాఁ
బేదలగాచి బ్రోచితివి వేడ్కను యాదగిరీంద్ర మ్రొక్కెదన్
ఉ. తాటకఁ ద్రుంచి యాగమును దక్షణమే మునుగాచి ఱాతినిన్
బోటిగ వేగఁజేసిచని భూమిసుతం దగఁబెండ్లియాడి బ
ల్కటకుఁడైన రావణుని గ్రక్కునఁ ద్రుంచి యయోధ్యఁ జేరు నీ
సాటి యుదారు లేరి బుధసన్నుత యాదగిరీంద్ర మ్రొక్కెదన్
దశావతారవర్ణన తరువాత ఈ కవి ఇరువదినాలుగు పద్యాలలో సంపూర్ణ శ్రీరామ చరితము చెప్పారు. శ్రీరామ జననము మొదలుగా తాటకవధ, యాగరక్షణ, సీతాపరిణయము, అరణ్యవాసము, రావణవధ, స్రీరామ పట్టాభిషేక విషెషాలను మనోహరంగా చంపకోత్పలమాలవృత్తాలలో వర్ణించారు.
శ్రీరామ చరితము ముగింపు తరువాత పదహారు పద్యాలలో స్రీక్రిష్ణ చరితము అని బాలగోపాలుని లీలలను గానం చేసారు. మంగళ, హెచ్చరిక, లాలి జోల పద్యాలతో శతకము సంపూర్ణమయింది.
మనకు ఉన్న అనేక శతకాలలో చాలావరకు ప్రస్తుత కాలంలో అంతరించిపోతున్నాయి. దొరికిన వాటిని జాగ్రత్తచేసుకొని అందరికి పంచుకోవటం సహిత్యాభిలాషుల కర్తవ్యమ్. మీరుకూడా చదవండి ఇతరులచేత చదివించండి.

No comments:

Post a Comment

Pages