"అన్నమయ్య కౌముది" పుస్తక సమీక్ష
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
కొన్ని పుస్తకాలు అరల్లో అమర్చబడి ఇంటికి అందం చేకూర్చుతాయి. మరికొన్ని మనసు అరల్లో చోటుచేసుకుని, జ్ఞాపకం వచ్చి నెమరేసుకున్నప్పుడల్లా మధురనుభూతుల్నందిస్తాయి. అలాంటి పుస్తకాలు ఆచంద్రతారార్కం నిలిచి ఉంటాయి. రచయితల కీర్తి చంద్రికలను విశ్వవ్యాప్తం చేస్తాయి. ఎన్ని పుస్తకాలు రాశారన్నది కాదు, ఎలాంటి సాహిత్యాన్ని రచయితలు సృజియించారన్నది ముఖ్యం. అలాంటి ఉత్తమ విలువలతో వెలువడి, ఎప్పటికీ చదువరుల హృదయాల్లో కొలువుండే రచన డా||| తాడేపల్లి పతంజలిగారి "అన్నమయ్య కౌముది".
ప్రతి ఇంట్లోకీ అన్నమయ్య తన కీర్తనలతో చొచ్చుకుపోయాడన్నది జగద్విదితం! తన సంసృత కీర్తనలతో శ్రీ వేంకటేశ్వరుణ్ని మెప్పించి తరించాడు. అలవోకగా పాడగలిగే అన్నమయ్య గీతాలను గానగంధర్వులెందరో తమ గాత్రాలతో మన మనసులకు చేరవేశారు. మనం కూడా ’అదివో అల్లదివో శ్రీహరి వాసము’ ’కులుకక నడవరో కొమ్మలాలా’ ’జోఅచ్యుతానంద జోజో ముకుంద’ ’బ్రహ్మమొకడే..’ లాంటి పాటలు పాడుకుంటూ శ్రీనివాసుని యందు గల భక్తిని ప్రకటితం చేసుకుంటాం. అయితే ఆ కీర్తనల్లోని పదాలు మనకు అంతుపట్టవు..అర్థం కావు. శ్రీ తాడేపల్లి ఎంతో శ్రమకోర్చి అన్నమయ్య కీర్తనల్లోని పదాలను విశ్లేషించి, అర్థ తాత్పర్యాలు, విశేషాలు మనకందించారు.
మొత్తంగా 90 కీర్తనలను సమగ్రంగా మనకు పరిచయం చేశారు.
మనకు తెలుసనుకున్న కొన్ని పదాల వివరణ చదివితే అసలు అర్థం సంపూర్ణంగా తెలుసుకుని మురిసిపోతాం.
ఉదాహరణకు-
- దేనిచేత భక్తి వ్యక్తం చేయబడుతుందో దానిని అంజలి అంటారు. ‘దోసిలిపట్టి నమస్కారం చేయడం అంజలి’ అని పారమార్థిక పద కోశం.
- ఒక అవసరం కోసం ప్రత్యేకంగా నిలువ చేసిన ధనమును నిధి అంటారు.
- గరుడః= రెక్కల చేత ఎగిరేవాడు
ఇలాంటివి కో కొల్లలు.
ఇహ అర్థ తత్పర్యాలే కాకుండా గీతాలు మనకు సులభగ్రాహ్యమవడానికి అందించిన విశేషాలకొస్తే-
- యతులు వారిలోని రకాలు (పుట 23)
- పరమాత్మ అర్థాలు (పుట 26)
- బడబాగ్ని కథ (పుట ౩౦)
- వేదాలు, ఉపనిషత్తుల వివరణ (పుట 35)
- పురుషసూక్త వివరణ (పుట 40)
- కర్మ వివరణ (పుట 61)
- రావి చెట్టును కౌగిలించుకుంటే కోరికలు ఎలా తీరుతాయి? (పుట 69)
- శరణాగతి ఎన్ని రకాలు? (పుట 75)
- మూర్ఛనలంటే ఏమిటి? (పుట 77)
- పూరీ జగన్నాథుని కథ (పుట 82)
- ప్రళయం లోని రకాలు (పుట 107)
- తెలుగు ప్రాంతాల్లోని నరసింహస్వామి క్షేత్రాలు (పుట 113)
- శ్రీరామ రామ రామేతి మంత్ర ప్రభావం (పుట 119)
- నవ నారసింహులు ఎవరు, అహోబిలం (పుట 121)
- నారాయణ శబ్ధానికి ఉన్న అర్థాలు (పుట 128)
- బౌద్ధమతం, సాంఖ్యవాదం (పుట 143)
- మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం (పుట 150)
- ముక్తి విధాలు (పుట 165)
- శృంగార నాయికలు, నాయకులు (పుట 167)
- పరాత్పర (పుట 178)
- మోక్షదాయకమైన పుణ్యనగరాలు (పుట 181)
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
విష్ణుమూర్తి నామాల వివరణ, ఆయుధాల పరిచయం, అవతారాల విశేషం, ఆలయాల విశేషాలు సందర్భానుసారం చదువరులకు అర్థం కావడానికి అందించిన కథలూ దాదాపు ప్రతి గీత వివరణతో అందించడం రచయిత సల్పిన అవిరళ కృషికి నిదర్శనం.
216 పేజీల పుస్తకం ఇన్ని విశేషాలు కలిగి ఉండడం నిజంగా గొప్ప విశేషం.
ఈ పుస్తకం ఇంట్లో ఉంటే ఆధ్యాత్మిక నిధి ఉన్నట్టే!
పుస్తకం ఆమూలాగ్రం చదివాక అలౌకికానందానుభూతిలో తేలిపోతూ, రచయితను సుజనరంజని సీతారమయ్యగారు ’అన్నమయ్య పదసేవక’ అన్న బిరుదుతో సత్కరించడం సముచితం అనిపిస్తుంది, ‘అన్నమయ్యవారి మొత్తం కీర్తనలని ఇలా సంపూర్ణార్థాలతో రచయిత మనకు అందిస్తే ఎంత బాగుంటుంది’ అన్న ఆలోచనతో పాటు, ఆ ప్రయత్నానికీ శ్రీనివాసుడు తన అనుగ్రహాన్ని అందించాలని మనఃపూర్వకంగా కోరుకుంటాం.
ఇంటింటా తప్పక ఉండి తీరాల్సిన ఈ పుస్తకం ప్రతులకు క్రింది ఈమెయిలు చిరునామాలో సంప్రదించండి.
No comments:
Post a Comment